<b>కుతుబ్ షాహిలు తెలుగు భాష సాహిత్య వికాసాలు</b>


<b>కుతుబ్ షాహిలు తెలుగు భాష సాహిత్య వికాసాలు</b>

కుతుబ్ షాహిలు తెలుగు భాష సాహిత్య వికాసాలు

గోల్కొండ కేంద్రంగా 1518 నుంచి 1687 వరకు పాలించిన కుతుబ్‌షాహీలు పారశీక దేశీయులైనా తెలుగులో విశిష్టమైన సాంస్కృతిక సేవ చేశారు.కృష్ణా జిల్లా మొవ్వ గ్రామానికి చెందిన మహా కవి క్షేత్రయ్య ఈ యుగంలోనే వెలుగులోకి వచ్చారు. ఈయన అసలు పేరు వరదయ్య. మొవ్వ గ్రామంలోని గోపాలస్వామిపై పదాలు అల్లడం వల్ల మొవ్వ గోపాల పదాలు, క్షేత్రయ్య పదాలుగా ప్రసిద్ధి చెందాయి.,

 

కుతుబ్‌షాహీ వంశ స్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్‌షా క్రీ.శ. 1518 నుంచి 1543 వరకు పాలించారు. తెలుగు సర్దార్ల సహాయంతో ఆంధ్రదేశాన్నంతటినీ సమైక్యపరిచారు. కుతుబ్‌షాహీలు పారశీక భాషలో సనదులు రాయించారు. ఈ విషయాలను తెలుగులోనూ రాయించేవారు. తెలుగు మండలాల్లో తెలుగు ద్వారానే రాజ్య వ్యవహారాలు నిర్వహించేవారని సురవరం ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. గోల్కొండ రాజ్య స్థాపకుడైన సుల్తాన్ కులీ కుతుబ్‌షా కాలంలోనే కవులు, పండితులకు మడులు-మాన్యాలు దానం చేసే సంప్రదాయం ప్రారంభమైంది. ఈయన కాలంలో శంకర కవి తెలుగులో హరిశ్చంద్రోపాఖ్యానం రచించి ఈడూరి ఎల్లయ్య అనే పండితునికి అంకితమిచ్చారు. ఈడూరి ఎల్లయ్య కులీ కుతుబ్‌షా కాలంలో కోర్కొల గ్రామాధికారిగా పనిచేశారు.

 

క్రీ.శ. 1550 నుంచి 1580 వరకు గోల్కొండను పాలించిన ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో తెలుగు భాష ఒక వెలుగు వెలిగింది. ఈయన కవులు, పండితులను పోషించి తెలుగు కృతులను అంకితం పుచ్చుకున్నాడు. తెలుగు కవుల పద్యాల్లో ఈయనను ఇభరాముడుగా పేర్కొన్నారు. ప్రభువు మహమ్మదీయుడైనప్పటికీ కవులు ఆయణ్ని హైందవ దేవతలు రక్షింతురుగాక అని దీవించారు. అద్దంకి గంగాధర కవి తపతీ సంవరణోపాఖ్యానం కావ్యం రచించి ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితమిచ్చారు. మహమ్మదీయ ప్రభువులకు కావ్యాలను అంకితమిచ్చిన వారిలో ఈయన మొదటివారని ప్రతీతి. కందుకూరి రుద్ర కవి తెలుగులో నిరంకుశోపాఖ్యానం అనే శృంగార కావ్యాన్ని రచించారు. కందుకూరి సోమేశ్వరస్వామికి ఆ గ్రంథం అంకితమిచ్చారు. రుద్రకవి స్వస్థలం నెల్లూరు జిల్లాలోని కందుకూరు అని తెలుస్తోంది. ఈయన రచించిన సుగ్రీవ విజయం తెలుగులో తొలి యక్షగాన నాటకమని సాహిత్యకారులు పేర్కొన్నారు. ఏల, దరువు, ద్విపద సంగీతపరమైన అంశాలను రుద్రకవి ఇందులో పొందుపర్చారు. దీన్ని కరుణ-భాసుర యక్షగాన ప్రబంధంగా కవి పేర్కొన్నారు. ఈ గ్రంథాన్ని కందుకూరి జనార్ధన స్వామికి అంకితమిచ్చారు. రుద్రకవి మరో రచన జనార్ధనాష్టకం. కందుకూరి జనార్ధునిపై దేశవాళీ భాషలో అష్టకం రచించిన మొదటి కవిగా ఈయణ్ని గుర్తిస్తారు. ఇతడి సేవలను మెచ్చి సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్‌షా చింతలపాలెం గ్రామాన్ని అగ్రహారంగా దానం చేశారు. ఇది ప్రకాశం జిల్లాలో ఉంది.

 

ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో మరింగంటి సింగనాచార్యుడు తెలుగులో దశరథరాజ నందన చరిత్ర, శుద్దాంధ్ర నిరోష్ట్య సీతాకల్యాణం కావ్యాలు రాశారు. ఈయనకు ఇబ్రహీం కుతుబ్‌షా అనేక అగ్రహారాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాజనీతి రత్నాకరం పేరుతో వైష్ణవ ప్రబంధంగా పంచతంత్రం రూపొందించిన కృష్ణయామాత్యుడు ఈ కాలానికి చెందినవారే. పొన్నగంటి తెలగనార్యుడు ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో మరో ప్రముఖ కవి. తెలుగులో తొలి వ్యాకరణ గ్రంథం ఆంధ్రభాషాభూషణం మూలఘటిక కేతన రచించారు. ఇదే ఒరవడిలో పొన్నగంటి తెలగనార్యుడు యయాతి చరిత్ర రచించారు. అచ్చతెలుగులో గ్రంథం రాసిన తొలి కవిగా ఈయన గుర్తింపు పొందారు. ఈ కావ్యాన్ని గోల్కొండ ప్రాంత గవర్నర్ అమీన్ ఖాన్‌కు అంకితమిచ్చారు. అమీన్‌ఖాన్ సాహిత్య పోషకులు. పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన ఈయన తెలుగు భాషను, తెలుగువారిని ఆదరించారు.

 

గోల్కొండ-హైదరాబాద్ నగర నిర్మాత మహ్మద్ కులీ కుతుబ్‌షా 1580 నుంచి 1612 వరకు పాలించారు. ఇతడి కాలంలో గోల్కొండ కరణంగా పనిచేసిన సారంగు తమ్మయ్య వైజయంతీ విలాసం కావ్యం రచించారు. దీన్ని తన కులదైవమైన శ్రీరాముడికి అంకితమిచ్చారు. తమ్మయ్య హరిభక్తిసుధోదయం అనే ఇరవై అధ్యాయాల గ్రంథానికి సంస్కృతంలో వ్యాఖ్యానం రాశారు. దీనికి భక్తసంజీవనిగా పేరు పెట్టారు. ఈయన భాగీరథి పట్టణానికి (నేటి భాగ్యనగరం) మంత్రిగా చెప్పుకున్నారు.

 

గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలోనే క్షేత్రయ్య వెయ్యి పదాలు రాశారని తెలుస్తోంది. ఈ పద సాహిత్యం.. సంగీతం, సాహిత్యం రెండింటికీ ఉపకరించింది. గోల్కొండ సుల్తాన్లలో చివరివారైన అబుల్ హసన్ తానీషా కాలంలో కంచర్ల గోపన్న (భక్త రామదాసు) దాశరథీ శతకం రచించారు. ఇది పాటల రూపాన్ని సంతరించుకుంది. ప్రజాకవిగా పేరు పొందిన యోగి వేమన ఈ కాలానికే చెందినవారే. వేమన శతకంలోని పద్యాలు పాటల రూపంలో వాడుకలోకి వచ్చాయి. కృష్ణాజిల్లా కూచిపూడి అగ్రహారం కూచిపూడి యక్షగాన నాట్య ప్రక్రియగా రూపాంతరం చెందింది. కుతుబ్‌షాహీల కాలంలో చిత్రలేఖనం కూడా విశిష్ట స్థానం పొందింది. దక్షిణ భారత చరిత్రలోనే తొలి లఘు చిత్రాలు (మినీయేచర్ పెయింటిగ్‌‌స)గా ప్రసిద్ధి చెందాయి. షాఫాద్ షాహీ దక్కన్ గ్రంథంలో సుమారు 15 లఘు చిత్రాలు చిత్రించారు.