<b>భారతీయప్రజాస్వామ్యం</b>


<b>భారతీయప్రజాస్వామ్యం</b>

భారతీయప్రజాస్వామ్యం

భారతీయప్రజాస్వామ్యం

ఆధునిక కాలంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పద్ధతి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నియంతృత్వ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, హక్కులకోసం ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు కోసం అనేక ప్రయత్నాలు చేశారు.

¤ ఇంగ్లండ్‌లో స్టువర్ట్ రాజుల నిరంకుశత్వాన్ని వ్యతిరేకించిన ప్రజలు చివరికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అనుగుణంగా, రక్తరహిత విప్లవం ద్వారా ప్రభుత్వాన్ని రూపొందించుకున్నారు.

¤ అమెరికా ఖండంలో ప్రజలు జరిపిన సమైక్య పోరాటం 1776లో లిఖితరూప రాజ్యాంగ రూప‌క‌ల్పన‌కు దోహ‌దం చేసింది.

¤ ఫ్రాన్స్ లో 14వ లూయీ నియంతృత్వాన్ని రూపుమాపి ఆ దేశ ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి ప్రాధాన్యమిచ్చిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

అనేక వలసరాజ్యాల పాలన అనంతరం ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని సఫలమైన కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి. ఎన్నో భయాలు, బెదిరింపులు, అవరోధాలు ఎదురైనా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పరిరక్షించుకోవడానికి భారతీయులు కృతనిశ్చయులయ్యారు.

ప్రజాస్వామ్యం స్వభావం

ప్రజాస్వామ్యం అనే పదానికి మూలాలు డెమోస్, క్రేషియో అనే గ్రీకు పదాలు. డెమోస్ అంటే ప్రజలు, క్రేషియో అంటే పరిపాలన అని అర్థం. ప్రజాస్వామ్యం గురించి అబ్రహంలింకన్ ప్రజల చేత ప్రజల కోసం నిర్వహించే ప్రజల యొక్క ప్రభుత్వ వ్యవస్థ అని వ్యవహరించారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజా ప్రభుత్వం అని కూడా అనవచ్చు.

ప్రజాస్వామ్యం ప్రాథమిక లక్షణాలు

ప్రజాస్వామ్యం కొన్ని ముఖ్య లక్షణాలను కలిగి ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు కింది ప్రాథమిక లక్షణాలు మూలధారాలు. అవి:

1) ప్రజా స్వేచ్ఛ: ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ చాలా ముఖ్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం ఉండదు. ప్రజలకు వివిధ రూపాల్లో స్వేచ్ఛ లభిస్తోంది. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వాతంత్య్రం, ఆలోచించే స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వాతంత్య్రం చాలా ముఖ్యమైనవి

2) ప్రాథమిక హక్కుల ప్రకటన: రాజ్యాంగం ప్రజలకు చట్టబద్ధంగా ముఖ్యమైన హక్కులను కల్పించాలి. దీనివల్ల ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థలో హక్కులను అనుభవించే అవకాశం ఉంటుంది.

3) రాజ్యాంగం అత్యున్నతమైన శాసనం: ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగబద్ధ పరిపాలన ముఖ్యమైన లక్షణం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని అత్యున్నత చట్టంగా గుర్తిస్తారు. అధికార పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులు రాజ్యాంగం ఆధారంగా పాలన సాగించాలి.

4) బాధ్యతాయుత ప్రభుత్వం: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కొనసాగించే పరిపాలనకు ప్రజల మద్ధతు ఉండాలి. బాధ్యతారహితంగా పాలించడం ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమైంది.

5) సాంఘిక సంక్షేమం: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వానికి సంక్షేమ దృక్పథం చాలా ముఖ్యం. ప్రజాస్వామ్య రాజ్యవ్యవస్థలో అన్నివర్గాల సంక్షేమం ప్రభుత్వ ముఖ్య లక్ష్యంగా చెప్పవచ్చు.

6) ప్రజా సార్వభౌమాధికారం: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యమివ్వాలి. సార్వభౌమాధికారం ప్రజల్లోనే నిక్షిప్తమై ఉంటుంది. ప్రజలు తమ ఓటు ద్వారా ప్రతినిధులను ఎన్నుకున్నా లేదా ప్రభుత్వాన్ని అధికారంలో లేకుండా చేసినా ప్రజలే వాస్తవ అధికారులు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ద్వారా అధికార మార్పిడి జరుగుతుంది.

కొందరు రాజనీతిజ్ఞులు ప్రజాస్వామ్య రాజ్యానికి, ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను గుర్తించారు. వారిలో ముఖ్యుడు హీరన్ ఫా. ఇతడు తన రచన డెమోక్రసీ ఆఫ్ ది క్రాస్ వేస్‌లో ప్రజాస్వామ్య రాజ్యానికి, ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను వివరించాడు

రాజ్యం యొక్క ఆశయాలను అమలుచేసే యంత్రాంగమే ప్రభుత్వం. రాజ్యం యొక్క ముఖ్య లక్షణాల్లో ఒకటి సార్వభౌమాధికారం.

¤ సార్వభౌమాధికారం ఒకరి చేతిలో ఉండే ప్రభుత్వాన్ని రాజరికం అంటారు.

¤ సార్వభౌమాధికారం కొద్దిమంది చేతిలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని స్వల్ప జన స్వామికం (కులీన పాలన) అంటారు.

¤ సార్వభౌమాధికారం ప్రజలందరి చేతిలో ఉండే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు.

ప్రజాస్వామ్య విజ‌యానికి కావాల్సిన ప‌రిస్థితులు

1) విద్య-విజ్ఞానం: ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే దేశ ప్రజలకు విద్య, విజ్ఞానం చాలా అవసరం. ప్రజాస్వామ్యంలో భాగస్వాములుగా పౌరులు నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతలు కూడా ఉంటాయి. పౌరులు దేశ ఆదర్శాలను, లక్ష్యాలను అర్థం చేసుకోవాలి. వర్తమాన రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. మంత్రి మండలి, శాసనసభలు, న్యాయస్థానం, రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు, ఎన్నికలు లాంటి రాజ్యాంగ వ్యవస్థల ప్రయోజనాలు తెలిసుండాలి. విద్య, విజ్ఞానం ఉన్న పౌరుల వల్ల ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది.

2) బాధ్యాతాయుతమైన పౌరత్వం: విద్య, విజ్ఞానం వల్ల పౌరుల్లో జాగృతి కలుగుతుంది. పౌరులు రాజ్యాంగపర హక్కులను, విధులను గురించి తెలుసుకుంటారు. వారు బాధ్యతతో తమ హక్కుల వినియోగానికి తగిన పరిస్థితులను ఏర్పాటు చేసుకుంటారు. ప్రజాస్వామ్యం ప్రజల దృష్టికి రావాలంటే పౌరులు నిత్యం జాగరూకులై ఉండాలి.

3) రాజకీయ చైతన్యం: ప్రజాస్వామ్య విజయానికి ప్రజల్లో రాజకీయ చైతన్యం ఉండటం అవసరం. ప్రజలు రాజకీయ సమస్యలు అర్థం చేసుకొని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే ప్రజల చర్యలను సమర్థించడంతోపాటు, ప్రజావ్యతిరేక కార్యక్రమాలను రాజ్యాంగ పద్ధతుల ద్వారా ప్రతిఘటించాలి. ప్రజల రాజకీయ చైతన్యం ఆ దేశం యొక్క ప్రజాస్వామ్య పరిపక్వతకు గుర్తు.

4) స్వేచ్ఛ: ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ ఊపిరి వంటిది. స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితం. ప్రజాస్వామ్య రాజ్యాల్లో ప్రజలకు రాజ్యాంగం చట్టబద్ధంగా పౌరహక్కులు ప్రసాదిస్తుంది. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్య్రం, ఆలోచనా స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రం చాలా ముఖ్యమైనవి. ఇలాంటి స్వేచ్ఛలు ప్రభుత్వ చర్యల పట్ల మంచి, చెడ్డల అవగాహనను పెంపొందిస్తాయి.

5) సమానత్వం: ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానులే. సాంఘిక సమానత్వంతోపాటు ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం అందరికీ సమకూరాలి. ప్రజాస్వామ్య విజయానికి సమానత్వం ఒక కొలమానం వంటిదని చెప్పవచ్చు.

6) అధికార వికేంద్రీకరణ: ప్రజాస్వామ్య విజయానికి అధికార వికేంద్రీకరణ చాలా అవసరం. ప్రభుత్వ అధికారాలు కేంద్రీకృతమైతే అక్రమాలకు అవకాశాలు ఉంటాయి. సమాఖ్య ప్రభుత్వ విధానంలో రాజ్యాంగ బద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ జరుగుతుంది. ఏక కేంద్రప్రభుత్వ పద్ధతిలో స్థానిక పాలనాసంస్థలకు కేంద్రప్రభుత్వం పాలనాధికారాలను దత్తం చేస్తుంది.

7) శాంతిభద్రతలు: ప్రజాస్వామ్య రాజ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ చాలా ముఖ్యం. శాంతిభద్రతల లోపం ప్రభుత్వ అసమర్థతకు సంకేతం. అలాంటి ప్రభుత్వం పట్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లితే దాని ప్రభావం మొత్తం ప్రజాస్వామ్యంపై పడుతుంది. అప్పుడు ప్రజలు ప్రజాస్వామ్యానికి బదులు నియంతృత్వాన్ని ఆహ్వానించడానికి వెనుకంజవేయరు.

8) నైతిక విలువలు: అవినీతి, అక్రమాలు, నల్లబజారు (బ్లాక్ మార్కెట్), లంచగొండితనం, మోసం, హింస, దోపిడీ వంటివి ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధం. నీతి, నిజాయితీ, దేశభక్తి, క్రమశిక్షణ వంటి మంచి లక్షణాల వల్ల ప్రజాస్వామ్య విలువ పెరుగుతుంది.

9) ప్రజల సహనశీలత - సమైక్యభావన: ప్రజాస్వామ్య విజయం ప్రజలపై ఆధారపడి ఉంటుంది. ప్రజలలో సహనం, సమైక్యత భావన ప్రజాస్వామ్య రాజ్య విజయాలకు దోహదపడతాయి.

10) స్వతంత్ర న్యాయస్థానం: స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయస్థానాల ద్వారా ప్రజాస్వామ్య రక్షణ జరుగుతుంది. రాజ్యాంగబద్ధ పాలన కేవలం స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయస్థానాల ద్వారానే వీలవుతుంది. రాజ్యాంగ వ్యతిరేక చర్యలను అరికట్టే న్యాయస్థానాల ద్వారా ప్రజాస్వామ్య రక్షణ జరుగుతుంది. ఇలాంటి వ్యవస్థ ద్వారా ప్రభుత్వం తన హద్దులను అతిక్రమించలేదు. పౌరులకు ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరుగుతుంది. దీని ద్వారా ప్రజాస్వామ్యం విజయవంతంగా పనిచేయడానికి అవకాశముంటుంది.

11) పటిష్టమైన పార్టీ వ్యవస్థ: క్రమశిక్షణ ఉన్న పార్టీలు ప్రజాస్వామ్య విజయానికి దోహదపడతాయి. ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలు తెలిసిన పార్టీలు నిస్వార్థంగా దేశసేవ చేయాలి. క్రియాత్మక, నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టే రాజకీయ పార్టీల ద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది.

12) సకాలంలో ఎన్నికలు: స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన, రాజ్యాంగ బద్ధమైన ఎన్నికల సంఘం ఎన్నికలను సకాలంలో నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. చిన్న చిన్న కారణాలతో ఎన్నికలను వాయిదా వేయడం ప్రజావిశ్వాసానికి విఘాతం.

13) పటిష్టమైన పరిపాలన: క్రమశిక్షణ కలిగి, విద్యుక్త ధర్మాలను నిర్వర్తించే ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. పరిపాలనలో అవినీతి, లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతం, కపటం, కుట్ర, మోసాల ద్వారా ప్రభుత్వం అప్రతిష్టపాలవుతుంది. ఇది ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్నే కోల్పోయేటట్లు చేస్తుంది.

14) సాంఘిక, ఆర్థిక భద్రత: ఆర్థిక భద్రత ప్రజాస్వామ్య విజయానికి చాలా ముఖ్యం. ప్రభుత్వం పని హక్కును కల్పించాలి లేదా ప్రజల కనీస అవసరాలైన తిండి, బట్ట, గృహ వసతులు కల్పించాలి. ప్రజలకు కనీస జీవన ప్రమాణ స్థాయిని కల్పించాలి. ఆర్థిక భద్రతతోపాటు సాంఘిక భద్రత కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి అవకాశాలు ఏర్పడతాయి.

ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు

ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రత్యక్షంగా తమ పాత్రను నిర్వహించడానికి కొన్ని పద్ధతులను రూపొందించారు. వీటినే ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు అని పిలుస్తారు. ఈ పద్ధతులు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉపయోగపడతాయి. ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు నాలుగు. అవి:

1) ప్రజాభిప్రాయ సేకరణ: ఈ పద్ధతి ద్వారా రాజ్యానికి ప్రజలకు సంబంధించిన ముఖ్య విషయాలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించడం జరుగుతుంది. ఇది రెండు రకాలు. అవి:

  1. ఐచ్ఛిక ప్రజాభిప్రాయ సేకరణ
  2. నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ

ప్రయోజనాలు:

¤ ప్రజాభిప్రాయం స్వచ్ఛందంగా తెలపడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

¤ ప్రజాభిప్రాయ సేకరణ శాసనసభలోని మెజారిటీ నియంతృత్వాన్ని అడ్డుకుంటుంది.

¤ ఒక బిల్లు విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి ప్రతిష్టంబన ఏర్పడితే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తొలగించవచ్చు.

¤ ప్రజామోదం పొందిన శాసనాలకు ప్రజలు విధేయులుగా ఉంటారు.

¤ రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనే ప్రజలు జాతీయ లేదా సామాజిక దృక్పథం ఉన్నవారుగా తయారవుతారు.

¤ ప్రజాభిప్రాయ సేకరణ శాసనసభలకు, ప్రజలకు మధ్య సంబంధాలను దృఢపరుస్తుంది.

¤ ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియలో పాల్గొనే అల్ప సంఖ్యాకులు తమ ప్రయోజనాలను కాపాడుకోగలుగుతారు.

2) ప్రజాభిప్రాయ నివేదన: ప్రజలు స్వయంగా తమ అభిప్రాయాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చే విధానమే ప్రజాభిప్రాయ నివేదన. ఈ పద్ధతిలో ప్రభుత్వ శాసనాలను ప్రజామోదానికి నివేదించాలని కూడా ప్రభుత్వాన్ని కోరవచ్చు. ఇది రెండు రకాలు. అవి:

  1. బిల్లు రూపంలో ప్రజాభిప్రాయ నివేదన
  2. బిల్లు రూపంలోలేని ప్రజాభిప్రాయ నివేదన

ప్రయోజనాలు:

¤ ప్రజాభిప్రాయ నివేదన పద్ధతిలో ప్రజలు తమకు ఇష్టమైన రీతిలో స్వయంగా చట్టాలను రూపొందించుకుంటారు.

¤ అభిప్రాయ నివేదన ద్వారా రూపొందిన చట్టాల అమలు చాలా సులభం

లోపాలు:

¤ శాసనసభ రూపొందించాల్సిన చట్టాన్ని ప్రజలే చేయడం వల్ల శాసనసభ ప్రాముఖ్యం తగ్గుతుంది.

¤ కొన్ని సందర్భాల్లో చెడు నాయకత్వం, అవినీతిపరులు అభిప్రాయ నివేదన ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తారని ప్రొఫెసర్ ఇ.ఎఫ్. స్ట్రాంగ్ భావించాడు.

3) పునరాయనం: ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇది చాలా ముఖ్యమైందని చెప్పవచ్చు. పునరాయనం అంటే వెనక్కి పిలవడం. కార్యనిర్వాహక సభ్యులు, శాసనసభ్యులు తమ విధుల నిర్వహణలో అసమర్థులు అని నిరూపణకు వచ్చినట్లయితే ప్రజలు ఒక నిర్ణీత సంఖ్యలో తీర్మానించి అలాంటి వారిని పునరాయనం చేస్తారు. పదవీచ్యుతులైన వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకుంటారు.

ప్రయోజనాలు:

¤ ఈ పద్ధతి వల్ల ప్రజాప్రతినిధులు బాధ్యతగా ప్రవర్తించి, సామర్థ్యంతో పనిచేసే అవకాశం ఉంటుంది.

¤ పరిపాలన క్రమంలో అవినీతికి, అక్రమాలకు, ఆశ్రిత పక్షపాతానికి, ప్రజాసమస్యల పట్ల నిర్లక్ష్యానికి అవకాశం ఉండదు.

లోపాలు:

¤ న్యాయాధికారులు ప్రజల మెప్పును పొందాలని ప్రజల అభిప్రాయాన్ని గమనించి తీర్పులు చెబితే న్యాయవ్యవస్థ తన సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

¤ పునరాయానికి భయపడి ప్రజాప్రతినిధులు కొన్ని సందర్భాల్లో పాలనా వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడతారు

4) ప్రజా నిర్ణయం: ఈ పద్ధతిలో రాజకీయ ప్రాధాన్యత ఉన్న సమస్యలు, ప్రభుత్వ విధానాలపై ఓటు ద్వారా ప్రజానిర్ణయాన్ని సేకరిస్తారు. ఇందులో శాశ్వత రాజకీయ పరిష్కారం సాధించే ప్రయత్నం జరుగుతుంది.

ప్రయోజనాలు:

¤ ముఖ్యమైన రాజకీయ సమస్యలపై ప్రజలు తమ తీర్పును ప్రకటించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.

¤ అత్యంత జటిలమైన దీర్ఘకాలిక రాజకీయ సమస్యలకు ఈ పద్ధతి ద్వారా శాశ్వత పరిష్కారాలను కనుక్కోవచ్చు.

లోపాలు:

¤ అధికార దాహం ఉన్న రాజకీయ నాయకులు, నియంతలు కుటిలమైన ఉపాయాలతో ప్రజానిర్ణయం సేకరించి తమ లక్ష్యాన్ని సాధించుకుంటారు.

¤ ప్రజాస్వామ్య వ్యతిరేకులైన నియంతలు తమ నియంతృత్వాన్ని సమర్థించుకోవడానికి ఈ పద్ధతి చాలా వరకు ఉపయోగపడుతుంది.

ప్రజాస్వామ్య రకాలు

ప్రజాస్వామ్యాన్ని రెండు రకాలుగా పేర్కొనవచ్చు.

అవి: 1) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం

2) పరోక్ష ప్రజాస్వామ్యం.

ప్రత్యక్ష ప్రజాస్వామ్యం

ప్రభుత్వ విషయాలపై ప్రజలే నేరుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రభుత్వ వ్యవస్థనే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు. ప్రాచీన గ్రీకు, రోమ్ నగర రాజ్యాల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతి ఆచరణలో ఉండేది. ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతి పరిమిత జనాభా ఉన్న చిన్న రాజ్యాల్లోనే సాధ్యమవుతుంది. ప్రదేశం, జనాభా తక్కువగా ఉండటం వల్ల పరస్పర సాన్నిహిత్యంతో ప్రజాకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

లోపాలు:

¤ ప్రజాభిప్రాయ సేకరణ సులభమైన ప్రక్రియ కాదు. దీని ద్వారా వాస్తవ ప్రజాభిప్రాయం వ్యక్తమవడం కష్టం. కాబట్టి దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని హెరాల్డ్ లాస్కీ, సర్ హెన్రీమెయిన్, హెచ్.ఇ. ఫైనర్ భావించారు.

¤ ప్రజాభిప్రాయ సేకరణ వల్ల శాసన నిర్మాణం అమల్లో ఎక్కువ జాప్యం జరుగుతుంది.

¤ శాసనసభలు ఆమోదించిన శాసనాలను ప్రజలు కూడా ఆమోదించాల్సిన ఆవశ్యకత ఉండటం వల్ల శాసనసభల ఆవశ్యకత, ప్రాధాన్యత తగ్గిపోతుంది.

¤ శాసనసభలు ఆమోదించే శాసనాల పట్ల ప్రజలందరికీ న్యాయశాస్త్ర పరిజ్ఞానం ఉండదు. అజ్ఞానంలో వ్యక్తం చేసే అభిప్రాయాలు అనర్థాలకు దారితీస్తాయి.

¤ బిల్లులు చట్టాలు కావడంలో అనవసర జాప్యం, దుబారా ఖర్చులు జరుగుతాయి.

పరోక్ష ప్రజాస్వామ్యం లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలు జనాభాలోనూ, విస్తీర్ణంలోనూ సువిశాలమైనవి. ప్రజలందరూ ఒకచోట చేరి వారికి ఇష్టమైన రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమస్యలను చర్చించుకోవడం కష్టం. కాబట్టి ప్రజలంతా తమ ప్రతినిధులను నాలుగు లేదా అయిదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా అభిప్రాయాలను తెలపడాన్ని పరోక్ష ప్రజాస్వామ్యం అంటారు.

పరోక్ష ప్రజాస్వామ్య లక్షణాలు

¤ ప్రజాప్రతినిధులు బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.

¤ శాసనసభ విశ్వాసం పొందినంత కాలం ప్రభుత్వం కొనసాగుతుంది.

¤ ఈ పద్ధతిలో రాజకీయ పార్టీలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా పనిచేస్తాయి.

¤ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రచార సాధనాలైన పత్రికలు, రేడియోలు, టీవీల ద్వారా ప్రభుత్వం ప్రజలకు చేరువవుతుంది. దీని ద్వారా ప్రాతినిధ్య సంస్థలన్నీ ప్రజలకు బాధ్యత వహిస్తాయి

ప్రజాస్వామ్య సమస్యలు

ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో ఉత్తమమైనప్పటికీ దీని నిర్వహణలో కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి.

¤ అపరిపూర్ణ రాజకీయ పరిజ్ఞానం, హక్కులు, విధుల గురించి తగిన అవగాహన లేకపోవడం, కొంతమంది వ్యక్తుల్లో స్వార్థం, అధికార కేంద్రీకరణ, నైతిక విలువల పతనం, ముఠాతత్వాలు, హింసాత్మక ధోరణులు వంటివి ప్రజాస్వామ్య దేశాలు ఎదుర్కొనే సమస్యలు.

¤ నిరక్షరాస్యత, అజ్ఞానం వల్ల కొన్ని ప్రజాస్వామ్య రాజ్యాల్లో పౌరుల రాజకీయ పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది.

¤ ప్రజాస్వామ్య విధానంలో రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. సాధారణంగా ఈ పార్టీల మధ్య ప్రజావసరాల ప్రాధాన్యంలో భేదాభిప్రాయాలు ఉంటాయి. అందువల్ల పార్టీల మధ్య వర్గతత్వం పెరిగి వాటిల్లో కొంతమంది సభ్యులు పార్టీ పరంగానే ఆలోచిస్తారు.

¤ శాసనసభలో అధికార, ప్రతిపక్షపార్టీలు ఉంటాయి. అధికార పార్టీలో సంఖ్యా బలం ఉన్నందున నిరంకుశ ధోరణి పెరిగే అవకాశం ఉంది. కొంతమంది ప్రతిపక్షాల వారు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ విధానాలను కేవలం పార్టీ ప్రాతిపదికపైనే విమర్శిస్తూ ఉంటారు.

¤ ప్రజాస్వామ్య విధానంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు నిర్ణయిస్తారు. వాటిని ప్రభుత్వోద్యోగులు నిర్వహిస్తారు. అయితే మనదేశం స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించినప్పటికీ పరిపాలనా రంగంలో మాత్రం బ్రిటిష్ కాలం నాటి పరిపాలనా వ్యవస్థే కొనసాగుతోంది. కాబట్టి మనదేశంలో నాటి ఉద్యోగస్వామ్యం ఇంకా ఆచరణలో ఉంది. ప్రజలు పాలితులుగా, ఉద్యోగులు పాలకులుగానే ఉండాలన్న భావన పూర్తిగా పోలేదు.

¤ ప్రజాస్వామ్య సమస్యలను ఎదుర్కోవడానికి నైపుణ్యం, స్వయం నియంత్రణ, సమాజ శ్రేయస్సు పట్ల ప్రగాఢమైన వాంఛ, సేవాతత్పరత, రాజకీయ పరిపక్వత, శాంతియుత పద్ధతుల అనుసరణ, సామరస్య వైఖరి, చిత్తశుద్ధి అవసరం.

ప్రజాస్వామ్య ప్రభుత్వాలు - రకాలు

ప్రజాస్వామ్య వ్యవస్థలో అధ్యక్ష, పార్లమెంటరీ తరహా అనే రెండు రకాల ప్రభుత్వాలు ఉన్నాయి. ఎక్కువ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పార్లమెంటరీ తరహావే. బ్రిటన్, భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొదలైనవి పార్లమెంటరీ తరహాకి ఉదాహరణలు. అమెరికా, రష్యా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లో ఉంది.

అధ్యక్ష తరహా, పార్లమెంటరీ తరహా ప్రభుత్వాల సమ్మేళనం కనిపిస్తుంది.

పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం

¤ పార్లమెంటరీ విధానంలో కార్యనిర్వాహక శాఖలోని మంత్రివర్గం శాసనసభకు బాధ్యత వహిస్తుంది. అంటే శాసనసభ విశ్వాసం పొందినంత కాలమే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఒక వేళ శాసనసభ విశ్వాసం కోల్పోయిన పక్షంలో ప్రధాని, అతడి మంత్రివర్గం రాజీనామా చేయాలి. ఇందుకు ప్రత్యామ్నాయంగా వారు శాసనసభ రద్దుకు సిఫార్సు చేసి, ఆరునెలలలోపు శాసనసభకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి.

¤ పార్లమెంటరీ విధానంలో దేశాధిపతికి నామమాత్రపు అధికారాలు, మంత్రి మండలికి వాస్తవాధికారాలు ఉంటాయి. పార్లమెంటరీ విధానాన్ని అవలంబిస్తున్న మనదేశంలో అధ్యక్షుడిని ప్రజాప్రతినిధులైన శాసన సభ్యులు ఎన్నుకుంటారు.

¤ పార్లమెంటరీ విధానంలో శాసన శాఖకు, కార్యనిర్వాహక వర్గానికి సన్నిహిత సంబంధాలకు అవకాశం కల్పించారు

¤ పార్లమెంటరీ విధానంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, పార్లమెంటు ఆమోదానికి అనుగుణంగా ఉండాలి. అందువల్ల ముందుగా పార్లమెంటు ప్రాథమిక నిర్ణయాలను తీసుకున్న తర్వాతనే కార్యనిర్వాహక వర్గం ఉత్తర్వులను జారీ చేస్తుంది. అందువల్ల ఈ విధానంలో నిర్ణయాలను తీసుకోవడంలో కొంత కాలయాపన తప్పదు.

అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం

¤ అధ్యక్ష విధానంలో కార్యనిర్వాహక వర్గం శాసన సభకు బాధ్యత వహించదు. కాని అధ్యక్షుడిపై శాసన శాఖలో నేరారోపణ జరిగి, నిరూపణ పొందినప్పుడు అతడు పదవి నుంచి తొలగిపోవాలి. అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికలు జరిగే వరకు ఉపాధ్యక్షుడే అధ్యక్ష విధులను నిర్వర్తిస్తాడు.

¤ అధ్యక్ష విధానంలో దేశాధిపతికి మాత్రమే వాస్తవాధికారాలుంటాయి. ఈ విధానాన్ని అవలంబిస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రజలే అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

¤ అధ్యక్ష విధానంలో ఈ రెండు ప్రభుత్వ అంగాలకు పరస్పర నియంత్రణ ఉంటుంది.

¤ అధ్యక్ష విధానంలో కాలయాపనకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ విధానంలో ప్రభుత్వం నిర్ణయాలను పార్లమెంటరీ విధానంలో కంటే మరింత స్వతంత్రంగా తీసుకుంటుంది. అయితే వీటిపై సెనేట్ నియంత్రణ ఉంటుంది. మన దేశంలోనూ అధ్యక్ష తరహా విధానాన్ని అనుసరించాలనే అభిప్రాయం ఉంది. కొన్ని అంశాలకు సంబంధించినంత వరకు సాపేక్షంగా ఉండే శ్రేష్ఠత వల్ల ఈ విధానం రూపొందింది. కానీ ఇది కొన్ని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేకపోయింది

ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏకకేంద్ర, సమాఖ్య తరహా ప్రభుత్వాలుగా వర్గీకరించవచ్చు. దేశమంతటికీ ఒకే ప్రభుత్వం ఉంటే దాన్ని ఏకకేంద్ర ప్రభుత్వం అని అంటారు. బ్రిటన్, న్యూజిలాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఏకకేంద్ర ప్రభుత్వాలను ఏర్పాటుచేసుకున్నాయి. జాతీయ, ప్రాంతీయ ప్రభుత్వాలుగా పనిచేస్తున్నట్లయితే దాన్ని సమాఖ్య ప్రభుత్వం అని పిలుస్తారు. అమెరికా, స్విట్జర్లాండ్, కెనడా, ఇండియా, ఆస్ట్రేలియా, రష్యా, దక్షిణాఫ్రికా లాంటి దేశాలు సమాఖ్య ప్రభుత్వాలను ఏర్పాటుచేసుకున్నాయి.

శాసన నిర్మాణం

ప్రభుత్వ వ్యవహారాలను నడపడానికి, ప్రజల అవసరాలను తీర్చడానికి రాజ్యాంగ శాసనం సరిపోదు. దేశానికి ఎప్పటికప్పుడు అవసరమయ్యే శాసనాలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవసరాన్ని తీర్చడానికే శాసన సభలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయిలో శాసనాలను నిర్మించడానికి శాసన సభలు, దేశస్థాయిలో శాసనాలను నిర్మించడానికి పార్లమెంటు ఉన్నాయి.

భారత పార్లమెంటు (కేంద్ర శాసన నిర్మాణ శాఖ)

కేంద్ర స్థాయిలో శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఈ శాసనాలను కార్యనిర్వాహక శాఖ అమలుపరుస్తుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మంత్రిమండలి కలయికతో కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. దీనికి ప్రధానమంత్రి అధిపతిగా ఉంటాడు. దీనిలో రెండు సభలు ఉంటాయి.

అవి: 1. రాజ్యసభ

  1. లోక్‌సభ

రాజ్యసభ

¤ రాజ్యాంగంలోని 80వ అధికరణ రాజ్యసభ గురించి తెలుపుతుంది. పార్లమెంటు ఎగువ సభను రాజ్యసభ అంటారు. ఇది శాశ్వత సభ.

¤ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి రాజ్యసభ పదవీకాలం 6 సంవత్సరాలు.

¤ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల సంఖ్య 245. రాష్ట్రాల నుంచి 229 మంది, ఢిల్లీ నుంచి ముగ్గురు, పాండిచ్చేరి నుంచి ఒక్కరు ఎన్నికవుతారు. సాహిత్యం, కళలు, శాస్త్ర సాంకేతిక నైపుణ్య రంగాల్లో, సామాజిక సేవలో విశిష్ఠ వ్యక్తిత్వం ఉన్న మరో 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు.

¤ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో రాష్ట్రాల్లోని శాసనసభ్యులు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వంతు మంది సభ్యుల పదవీకాలం ముగియగానే, అంతే స్థాయిలో కొత్త సభ్యులు ఎన్నికవుతారు

రాజ్యసభ అధికారాలు, విధులు

¤ రాష్ట్ర జాబితాలో పేర్కొన్న ఏదైనా ఒక అంశం జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉందని భావిస్తే ఆ అంశంపై పార్లమెంటు శాసనం చేస్తుంది. 249వ అధికరణ ప్రకారం రాజ్యసభ వంతు మెజార్టీతో ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాలి.

¤ 312వ అధికరణ ప్రకారం దేశంలో నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలంటే రాజ్యసభ తీర్మానం తప్పనిసరి.

¤ రాష్ట్రపతి ఎలాంటి అత్యవసర పరిస్థితిని విధిస్తూ ప్రకటన చేసినప్పటికీ, దాన్ని పార్లమెంటు ఆమోదించాలి. ఒకవేళ ఆ సమయంలో లోక్‌సభ రద్దయి ఉంటే, రాజ్యసభ ఆ ప్రకటనను తప్పనిసరిగా ఆమోదించాలి.

¤ ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని మొదట రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలని రాజ్యాంగంలోని 67వ అధికరణ తెలుపుతుంది.

లోక్‌సభ

¤ పార్లమెంట్ దిగువ సభను లోక్‌సభ అంటారు. ఇది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. లోక్‌సభ సభ్యుల సంఖ్యను పార్లమెంటు నిర్ణయిస్తుంది.

¤ 1951, 1952 లో పార్లమెంటు ఆమోదించిన ప్రజాప్రాతినిధ్య చట్టాలను అనుసరించి లోక్‌సభలో మార్పులు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. లోక్‌సభ పదవీ కాలం 5 సంవత్సరాలు

¤ 1952లో 498 మంది లోక్‌సభ సభ్యులుండగా ప్రస్తుతం 545 మంది సభ్యులు ఉన్నారు. రాష్ట్రాల నుంచి 530 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 13 మంది ఎన్నికవుతారు. ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నియమిస్తాడు.

¤ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో లోక్‌సభ పదవీకాలాన్ని ఏడాది వరకు పొడిగించవచ్చు.

¤ లోక్‌సభ సమావేశాలకు స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు.

లోక్‌సభ అధికారాలు, విధులు:

¤ లోక్‌సభలో సంపాదించే మెజార్టీపైనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం ఆధారపడి ఉంటుంది.

¤ కేంద్ర మంత్రిమండలిని అధికారం నుంచి తొలగించేది లోక్‌సభ మాత్రమే.

¤ అవిశ్వాస తీర్మానం, అభిశంసన తీర్మానాలు లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి.

¤ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అధికార బిల్లులు లోక్‌సభలో వీగిపోయినా లేదా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అనధికార లేదా ప్రైవేటు బిల్లులు నెగ్గినా ప్రభుత్వం రాజీనామా చేయాలి.

¤ ఒక బిల్లు ఆర్థికమైనదా? కాదా? అనే విషయాన్ని లోక్‌సభ స్పీకర్ నిర్ణయిస్తారు.

¤ ఆర్థిక బిల్లులను మొదట లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. లోక్‌సభ ఆమోదం పొందిన తర్వాత బిల్లును రాజ్యసభకు పంపుతారు. ఆ బిల్లుపై రాజ్యసభ 14 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఆ బిల్లును ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు.

¤ సాధారణ బిల్లుల విషయంలో లోక్‌సభకు, రాజ్యసభకు మధ్య వివాదాలు తలెత్తినట్లయితే రాష్ట్రపతి 108 అధికరణను అనుసరించి ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. వివాదం తలెత్తిన బిల్లుపై ఓటింగ్ జరిపినప్పుడు, లోక్‌సభ అభీష్టమే నెగ్గుతుంది.

పార్లమెంటు అధికారాలు

¤ కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అవశిష్ట అధికారాలపై పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది. కొన్నిసార్లు రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనాలు చేయవచ్చు.

¤ భారత రాజ్యాంగాన్ని మూడు పద్ధతుల ద్వారా పార్లమెంటు సవరిస్తుంది.

¤ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌లను ఆయా సభలు ఎన్నుకుంటాయి.

¤ రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, కాగ్, ఎన్నికల కమిషనర్లపై వచ్చే ఆరోపణలను విచారిస్తుంది.

¤ పార్లమెంటు శాసనబద్ధ ఆమోదం లేనిదే మనదేశంలో ఎలాంటి పన్నులు విధించరాదు.

¤ అనేక వివాదాస్పద అంశాలపై ప్రత్యేక విచారణ కమిటీలను ఏర్పాటు చేయవచ్చు.

నామమాత్రపు, యదార్థ కార్యనిర్వాహక వర్గం

మనది ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థ. ఈ వ్యవస్థలోని ప్రభుత్వం ప్రజలను బాధ్యతాయుతంగా పరిపాలించాలి. ఎందుకంటే ఇది ప్రజలచేత ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎన్నికైన ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వ వ్యవస్థలో రెండు రకాలైన కార్యనిర్వాహకులు ఉంటారు.

  1. నామమాత్రపు కార్యనిర్వాహక వర్గం
  2. యదార్థ కార్యనిర్వాహక వర్గం

రాజ్యాంగం ప్రకారం మన దేశాధిపతి రాష్ట్రపతి. ప్రభుత్వ అధికారమంతా రాష్ట్రపతి పేరు మీదే నడుస్తుంది. కాని రాష్ట్రపతి తన అధికారాలను స్వతంత్రంగా కాక, మంత్రిమండలి సలహాలపైనే చలాయిస్తాడు. యదార్థంగా పాలనాధికారం మంత్రిమండలి ఆధీనంలో ఉంటుందని అర్థం. రాష్ట్రపతి అధికారం నామమాత్రమైనదే. అందుచేత రాష్ట్రపతిని నామమాత్రపు కార్యనిర్వాహక వర్గంగా, మంత్రిమండలిని యదార్థ కార్యనిర్వాహక వర్గంగా పేర్కొంటారు.

రాష్ట్రపతి: భారతదేశ అధ్యక్షుడిని రాష్ట్రపతి అంటారు. రాష్ట్రపతి రాజ్యాధినేత కాబట్టి అతడిని దేశ ప్రథమ పౌరుడు అంటారు.

రాష్ట్రపతి ఎన్నిక: రాష్ట్రపతిని పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఒక నియోజక గణం ఉంటుంది

అది: ¤ పార్లమెంటులోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు

¤ రాష్ట్ర శాసనసభలోని సభ్యులు

¤ రాష్ట్ర శాసనమండలిలోని సభ్యులు

రాష్ట్రపతి పదవికి పోటీచేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు:

అవి:

¤ భారత పౌరుడై ఉండాలి.

¤ కనీసం 35 సంవత్సరాల వయసు ఉండాలి.

¤ లోక్‌సభ సభ్యత్వానికి అర్హత కలిగి ఉండాలి.

¤ ఆదాయం వచ్చే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండకూడదు.

రాష్ట్రపతి పదవీకాలం: భారత రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. ఒకే వ్యక్తి రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లైనా ఎన్నిక కావచ్చు. కాని రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించిన రాష్ట్రపతిని మహాభియోగం ద్వారా పదవి నుంచి తొలగించవచ్చు.

మహాభియోగం: రాష్ట్రపతి తన పదవీకాలంలో రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే పార్లమెంటు ఉభయ సభల్లో దేనిలోనైనా దోషారోపణ చేయవచ్చు. దోషారోపణ ఏ సభలో జరిగితే ఆ సభలో నాలుగో వంతు సభ్యులకు తక్కువ కాకుండా సభ్యులు దాన్ని ప్రతిపాదించాలి. ప్రతిపాదించిన 14 రోజుల తర్వాత ఆ తీర్మానంపై సభలో చర్చ జరుగుతుంది. సభలోని మూడింట రెండువంతుల సభ్యుల ఆమోదంతో ఆ మహాభియోగం రెండో సభలో చర్చకు వస్తుంది. చర్చానంతరం ఆ సభలో మూడింట రెండువంతుల సభ్యుల ఆమోదంతో దోషం రుజువైతే రాష్ట్రపతి పదవి నుంచి వైదొలగాలి. ఇప్పటివరకు మహాభియోగం వల్ల ఏ రాష్ట్రపతి కూడా పదవీచ్యుతుడు కాలేదు

రాష్ట్రపతి వేతనం, నిలయం: రాష్ట్రపతి వేతనాన్ని పార్లమెంటు నిర్ణయిస్తుంది. ప్రస్తుతం వేతనం రూ.1,50,000. అన్ని సౌకర్యాలతో కూడిన రాష్ట్రపతి భవనంలో ఆయన నివసిస్తాడు. హైదరాబాద్, సిమ్లాలలో కూడా రాష్ట్రపతి కోసం భవనాలు ఉన్నాయి. రాష్ట్రపతి పదవీ విరమణ తర్వాత కూడా వారికి పింఛను లభిస్తుంది.

రాష్ట్రపతికి ప్రత్యేక రక్షణలు: రాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తి తన పదవీ కాలంలో కొన్ని ప్రత్యేక రక్షణలు కలిగి ఉంటాడు. అతడు న్యాయస్థానాలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. పదవిలో ఉన్నప్పుడు ఆయనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోరాదు. అరెస్ట్ చేయకూడదు.

రాష్ట్రపతి అధికారాలు: భారత రాజ్యాంగం రాష్ట్రపతికి చాలా అధికారాలను ఇచ్చింది. ఈ అధికారాలను సాధారణ, అసాధారణ అధికారాలు అని వర్గీకరించవచ్చు.

రాష్ట్రపతి సాధారణ అధికారాలు

శాసన నిర్మాణాధికారాలు

¤ పార్లమెంటు ఉభయసభలను సమావేశపరచడానికి, దీర్ఘకాలం వాయిదా వేయడానికి, లోక్‌సభను రద్దుచేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉంది.

¤ పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు

¤ ఆంగ్లో ఇండియన్‌లకు ప్రాతినిధ్యం లేకపోతే ఇద్దరిని లోక్‌సభ సభ్యులుగా నామినేట్ చేస్తాడు.

¤ రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేస్తాడు.

¤ రాష్ట్రపతి ఆమోదం లేనిదే పార్లమెంట్ ఆమోదించిన బిల్లులు చట్టాలు కావు.

¤ పార్లమెంటు ఆమోదించిన బిల్లులను పునఃపరిశీలన కోసం రాష్ట్రపతి పార్లమెంటుకు పంపవచ్చు. కాని ఆర్థిక సంబంధమైన బిల్లులను పునఃపరిశీలనకు పంపే అధికారం రాష్ట్రపతికి లేదు.

¤ పార్లమెంట్ సమావేశం లేని సమయంలో దేశ క్షేమం కోసం అత్యవసర శాసనాలను జారీచేస్తాడు.

¤ రాష్ట్రపతి అనుమతి లేకుండా కొన్ని అంశాలకు సంబంధించిన బిల్లులను పార్లమెంటులో లేదా రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడానికి వీల్లేదు.

¤ రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన కొన్ని బిల్లులు చట్టాలు కావడానికి రాష్ట్రపతి ఆమోదం పొందాలి.

 

కార్య నిర్వహణాధికారాలు

¤ పార్లమెంటు రూపొందించిన చట్టాలను అమలు చేస్తారు.

¤ ప్రధానమంత్రిని, అతడి సలహాపై ఇతర మంత్రులను నియమిస్తాడు.

¤ గవర్నర్లను, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు.

¤ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ను, సభ్యులను నియమిస్తాడు.

¤ ఎలక్షన్ కమిషనర్లను, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌ను నియమిస్తాడు

¤ అటార్నీ జనరల్‌ను, సాయుధ దళాధిపతులను, విదేశాల్లో మన దేశ రాయబారులను నియమిస్తాడు.

¤ విదేశీ రాయబారాలను స్వీకరిస్తాడు.

¤ సంధులను, ఒప్పందాలను చేసుకోవడం; యుద్ధాలను ప్రకటించడం రాష్ట్రపతి అధికారమే.

¤ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా రాష్ట్రాల పాలన గురించి ఆదేశాలను జారీచేస్తాడు.

 

రాష్ట్రపతి ఆర్థిక అధికారాలు

¤ రాష్ట్రపతి అనుమతి లేనిదే ఆర్థిక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి వీల్లేదు.

¤ వార్షిక ఆర్థిక నివేదికను సిద్ధం చేయించి పార్లమెంటుకు సమర్పించాలి.

¤ ఆగంతుక నిధి, సంఘటిత నిధిపై రాష్ట్రపతికి అధికారం ఉంటుంది.

¤ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీ చేయడానికి ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడు.

 

రాష్ట్రపతి న్యాయపాలన అధికారాలు

¤ సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు.

¤ న్యాయస్థానంలో విధించే మరణ శిక్షలు, తదితర శిక్షలను రద్దు చేయడానికి, మార్చడానికి, తగ్గించడానికి లేదా తాత్కాలికంగా నిలిపివేయించే అధికారం ఉంది.

¤ రాజ్యాంగ, న్యాయ సంబంధమైన విషయాలపై రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు. ఈ సలహాలను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు

 

రాష్ట్రపతి అసాధారణ అధికారాలు

ఏదైనా ఒక ప్రాంతానికి ప్రమాద పరిస్థితి సంభవించవచ్చు. దీన్నేఅసాధారణ పరిస్థితి లేదా అత్యవసర పరిస్థితి అని అంటారు. భారత రాజ్యాంగం ప్రకారం మూడు రకాల అత్యవసర పరిస్థితులు ఏర్పడతాయి. అవి:

¤ విదేశీ దురాక్రమణ, యుద్ధం, దేశంలో సాయుధ దళాల తిరుగుబాటు, అల్లకల్లోలం మూలంగా దేశ శాంతి భద్రతలకు భంగం కలగడం.

¤ ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధంగా, ప్రభుత్వపాలన కొనసాగకపోవడం. దేశం మొత్తంపై లేదా ఏదైనా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడటం. ఈ అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవడానికి రాజ్యాంగం రాష్ట్రపతికి విశేషాధికారాలు ఇచ్చింది.

అవి:

¤ అత్యవసర పరిస్థితిని నిర్ణయించే అధికారం, ప్రకటించే అధికారం.

అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు పాలనలో కొన్ని మార్పులు జరుగుతాయి.

-> పౌరుల ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధిస్తారు.

-> రాష్ట్రాల స్వయం పాలన నిలిపేస్తారు.

-> అత్యవసర పరిస్థితి ప్రకటించిన రాష్ట్రాలకు సంబంధించిన శాసనాధికారాలు పార్లమెంటుకు ఉంటాయి.

-> కేంద్ర ప్రభుత్వానికి అసాధారణ అధికారాలు లభిస్తాయి.