<b>హైద్రాబాద్ రాష్ట్రం</b>


<b>హైద్రాబాద్ రాష్ట్రం</b>

హైద్రాబాద్ రాష్ట్రం

 

బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం: స్వతంత్ర భారతదేశానికి సార్వత్రిక ఎన్నికలు తొలిసారిగా 1952లో జరిగాయి. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఈ ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ నియోజక వర్గం నుంచి గెలుపొందారు. హైదరాబాద్ రాష్ట్ర రాజ్‌ప్రముఖ్ ఉస్మాన్ అలీ ఖాన్ 1952 మార్చి 6న కింగ్ కోఠిలోని తన నివాసంలో బూర్గులతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం:

  1. బి.రామకృష్ణారావు - సీఎం
  2. బిందు దిగంబర రావు - హోం శాఖ
  3. గోపాలయ సుబ్బు క్రిష్ణ మెల్కోటె - ఆర్థిక శాఖ
  4. మర్రి చెన్నారెడ్డి - వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ
  5. దేవిసింగ్ చౌహాన్ - గ్రామీణాభివృద్ధి శాఖ
  6. సి. జగన్నాథరావు - న్యాయశాఖ
  7. అన్నారావు ఘనముఖి-పంచాయతీరాజ్
  8. పూల్‌చంద్ గాంధీ - ఆరోగ్య, విద్యాశాఖ
  9. నవాబ్‌జంగ్ బహుదూర్ - పబ్లిక్ వర్క్స్
  10. శంకర్ డియో - సామాజిక సేవలు
  11. వి.బి.రాజు - సమాచార, ప్రణాళిక, కార్మిక
  12. కె.వి.రంగారెడ్డి - అటవీ, కస్టమ్స్, ఎక్సైజ్
  13. కొరటికర్ వినాయక రావు - వాణిజ్యం, పరిశ్రమల శాఖ

హైదరాబాద్ రాష్ట్ర మంత్రివర్గ నిర్మాణ, పరిపాలనాపరమైన ముఖ్యాంశాలు:

బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే వరంగల్‌లో గైర్ ముల్కీ(స్థానికేతరులు) ఉద్యమానికి అంకురార్పణ జరిగింది.

హైదరాబాద్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వి.డి. దేశ్‌ముఖ్ (మరాఠ్వాడ సుబా). ప్రతిపక్ష పార్టీ పేరు పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్.

బి. రామకృష్ణారావు కేబినెట్‌లో పనిచేసిన ఏకైక ఆంధ్ర నాయకుడు వి.బి.రాజు. ఆయన సికింద్రాబాద్ శాసనసభ స్థానానికి ఎన్నికయ్యారు.

టి. హయాగ్రీవాచారి అధ్యక్షతన వరంగల్‌లో మొదటి విశాలాంధ్ర మహాసభ 1950లో జరిగింది. హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్రను వెంటనే ఏర్పాటు చేయాలని ఈ మహాసభలో పట్టుబట్టారు.

శ్రీశ్రీ అధ్యక్షతన 1954లో రెండో విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్‌లో జరిగింది.

1956లో ఢిల్లీలో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో బి.రామకృష్ణారావు పాల్గొన్నారు. 1956 అక్టోబర్ 31 వరకు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు.

పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. బి.రామకృష్ణారావు కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు.

స్థానికులకు ఉద్యోగాలు - ముల్కీ ఉద్యమం (1952):

1948లో పోలీసు చర్య అనంతరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. తర్వాత దాదాపు నాలుగేళ్లపాటు హైదరాబాద్ సంస్థానాన్ని స్థానికేతరులే పరిపాలించారు. రెండేళ్లపాటు సైనికపాలన ఉండగా, మరో రెండేళ్లు అధికారులు హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించారు. ఇంగ్లిష్, తెలుగు స్పష్టంగా రావనే సాకుతో ఈ కాలంలో చాలామంది స్థానికులను ఉద్యోగాల నుంచి తొలగించారు. మద్రాసు నుంచి, బయటి ప్రాంతాల నుంచి చాలా మందిని రప్పించారు. తహశీల్దార్ల నుంచి కార్యదర్శుల వరకు అనేక ఉద్యోగాల్లో స్థానికేతరులనే నియమించారు. ఇలా ఒక సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నాలుగేళ్లపాటు పరిపాలన సాగించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులు దొంగ ముల్కీ సర్టిఫికెట్‌లను జారీ చేసి బయటి వారిని ఉద్యోగాల్లో నియమించుకున్నారు. ఇక్కడి ప్రజల పట్ల గైర్ ముల్కీలు(స్థానికేతరులు) అహంభావాన్ని ప్రదర్శించి, అవమానపర్చేవారు. ఇక్కడి వారితో అవహేళనగా మాట్లాడేవారు. ఉన్నతస్థాయి అధికారుల వల్ల అనేక అవమానాలకు గురైన స్థానికుల్లో చైతన్యం పెరిగింది. 1951లో ముల్కీల నిర్వచనాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఈ సవరణ ప్రకారం వరసగా 15 ఏళ్లపాటు స్థానికంగా నివాసం ఉన్నవారంతా ముల్కీలవుతారు. దీనికి ఏవిధమైన ప్రమాణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కేంద్రం మళ్లీ ముల్కీ అర్హతను 12 ఏళ్లకు కుదించింది. దీంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

మొదటి సార్వత్రిక ఎన్నికల్లో తమ హక్కులను సాధించుకోవాలని తెలంగాణ ప్రజలు భావించారు. 1952లో అధికారంలోకి వచ్చిన బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం సంయమనాన్ని పాటిస్తూ ముల్కీల సవరణల జోలికి పోలేదు. 1952 మార్చిలో బూర్గుల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. ముల్కీ హక్కులను పునరుద్ధరించాలని, విద్యావంతులైన స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేశారు. గైర్ ముల్కీ ఉద్యమం క్రమంగా విస్తృతమైంది. ప్రజల్లో చైతన్యం పెరగడంతో హక్కుల సాధన కోసం ఉద్యమించారు.

గైర్ ముల్కీ ఉద్యమంలో ప్రధానంగా వినిపించిన నినాదం మద్రాసీ గో బ్యాక్, ఇడ్లీ సాంబర్-గోబ్యాక్. 1952 జూన్ 26న వరంగల్‌లో విద్యార్థుల నాయకత్వంలో గైర్ ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. అయిదు రోజులపాటు నిరంతరంగా కొనసాగింది. 1952 జూలై 31న విద్యార్థులంతా కలిసి ఒక తీర్మాన పత్రాన్ని ఆమోదించి, ఆందోళన విరమించారు.

తీర్మాన పత్రంలోని అంశాలు:

దొంగ ముల్కీ పత్రాలతో ఉద్యోగాల్లో ప్రవేశించిన స్థానికేతరులపై విచారణ జరపాలి. ప్రభుత్వం వారిని తొలగించి స్థానికుల నిరుద్యోగ సమస్య తీర్చాలి. ఇక మీదట సరైన రుజువు లేనిదే ముల్కీ సర్టిఫికెట్లు ఇవ్వరాదు అని ఐక్య విద్యార్థి సంఘం కోరింది.

ఈ తీర్మానాన్ని వరంగల్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ ఎ.బుచ్చయ్య ప్రవేశపెట్టారు. దానికి విద్యార్థులు అంగీకరించేలా కృషి చేశారు. ఆయన కృషి వల్లే హన్మకొండ ఉన్నత పాఠశాల విద్యార్థులు కూడా ఈ తీర్మానానికి అంగీకరించారు. ఈ విధంగా స్థానిక నిరుద్యోగ యువకులు చైతన్యవంతులై తమ హక్కుల సాధన కోసం ఉద్యమించారు. 1952 ఆగస్టు 7న ఖమ్మం ప్రాంతంలో కూడా గైర్ ముల్కీ ఉద్యమం తలెత్తింది. ఈ ఉద్యమాలన్నీ స్థానికులకు జరిగిన అన్యాయాలు, వారు ఎదుర్కొన్న అవమానాలకు వ్యతిరేకంగా జరిగినవే. నాటి తెలంగాణ సమాజంలో ఆవిర్భవించిన ఈ ఉద్యమాలన్నీ చైతన్య స్ఫూర్తితో వచ్చినవే. వీటి వెనుక ఎవరి ప్రోద్భలం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర ప్రాంతాల వారికి, ఇతర రాష్ట్ర ఉద్యోగులకు అవకాశం ఇస్తున్నందుకు ఇతర రాష్ట్ర విద్యార్థులకు ఇక్కడి పాఠశాలు, కళాశాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నందుకు నిరసనగా స్థానిక విద్యార్థులు రెండు రోజులపాటు సమ్మె చేశారు. 1952 ఆగస్టు 8న వరంగల్ జిల్లా మానుకోట (మహబూబాబాద్)లో దాదాపు వెయ్యిమంది విద్యార్థులు పాఠశాలకు, కళాశాలలకు వెళ్లకుండా ప్రదర్శనలు చేస్తూ బే ముల్కీలు వాపసు పోవాలి అని నినాదాలు చేశారు. విద్యార్థుల నాయకత్వంలో సంఘటితమై బలమైన ఉద్యమం రూపుదిద్దుకుంది. వరంగల్ విద్యార్థి సంఘం పిలుపు మేరకు ఈ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. దీంతో ముల్కీ నిబంధనలను సవరించి, కఠినతరం చేయడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉందని 1952 ఆగస్టు 10న అన్ని పత్రికల్లో వార్త వచ్చింది.