<b> మహాత్మా గాంధీ</b>


<b> మహాత్మా గాంధీ</b>

మహాత్మా గాంధీ

 

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబరు 2 వ తేదీన గుజరాత్ లోని పోర్ బందర్ లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. వారిది ఆచారములు బాగా పాటించే సభ్య కుటుంబము. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాస్త నిదానముగా ఉండే బాలుడు. చిన్నతనమునుండీ అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేశాడు. 13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూర్బాయితో వివాహము జరిగింది. వీరికి నలుగురు పిల్లలు (హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ). చదువులో గాంధీ మధ్యస్థమైన విద్యార్థి. పోర్ బందర్ లోను, రాజ్‌కోట్ లోను ఆయన చదువు కొనసాగింది. 19 సంవత్సరాల వయసులో (1888 లో) న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్ళాడు. తల్లికిచ్చిన మాట ప్రకారము ఆయన మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. ఆయనకు బెర్నార్డ్ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడింది. అనేక మతాల పవిత్ర గ్రంధాలను చదివాడు. ఈ కాలములోనే ఆయన చదువూ, వ్యక్తిత్వమూ, ఆలోచనా సరళీ రూపు దిద్దుకొన్నాయి. 1891 లో ఆయన పట్టభద్రుడై భారతదేశానికి తిరిగివచ్చాడు. బొంబాయి లోను, రాజ్‌కోట్ లోను ఆయన చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు. 1893 లో దక్షిణాఫ్రికా లోని నాటల్‌ లో ఒక న్యాయవాద (లా) కంపెనీలో సంవత్సరము కాంట్రాక్టు లభించింది.ఒక సంవత్సరము పనిమీద వెళ్ళిన గాంధీ, దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు (1893 నుండి 1914 వరకు) గడిపాడు.ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ఆయన ప్రచురించాడు. సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశాడు.1914 డిసెంబర్ చివరిలో బయలుదేరి, 1915జనవరి 9 న గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది.

భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగాడు. అప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలు, సమస్యలను పరిచయం చేశాడు.1917లో బీహారు లో చంపారణ్,1918 గుజరాత్ లోని ఖేడా లోనూ ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలచాడు.

1919లో బ్రిటీషు సైనిక అధికారి జనరల్ డైయర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపడం జలియన్ వాలా బాగ్ మారణ కాండ గాంధీజీ భారత రాజకీయాల్లోకి ప్రవేశించడానికి కారణ భూతులయ్యాయి.

గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమం కైరా సత్యాగ్రహం, రౌలత్ సత్యాగ్రహం, నిరాకరణోద్యమం, శాసనోల్లంఘనం, బార్డోలి సత్యాగ్రహం, సైమన్ కమీషన్ రాకను బహిష్కరించడం, ఉప్పుసత్యాగ్రహం, దండి యాత్ర, క్విట్ ఇండియా ఉద్యమం, లండన్లో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం ఆయన అవిశ్రాంత పోరాటానికి నిదర్శనాలు. ఆయన చరిత్రలో మరుపురాని సంఘటనలు

ఏప్రిల్ 13, 1919 న అమృత్ సర్, పంజాబు లోని జలియన్ వాలా బాగ్ లో సామాన్య జనులపై జరిగిన దారుణ మారణకాండలో 400 మంది నిరాయుధులైన భారతీయులు మరణించారు.

1921 లో భారత జాతీయ కాంగ్రెస్ కు ఆయన తిరుగులేని నాయకునిగా గుర్తింపబడ్డాడు. కాంగ్రెసును పునర్వ్యవస్థీకరించి, తమ ధ్యేయము స్వరాజ్యము అని ప్రకటించాడు.

స్వదేశీ విదేశీ వస్తువులను బహిష్కరించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యనూ, బ్రిటిష్ సత్కారాలనూ తిరస్కరించడం. వీటివల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది. మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు. దేశ ఆర్ధిక వ్వవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది. ఆత్మాభిమానమూ, ఆత్మ విశ్వాసమూ వెల్లి విరిశాయి. శ్రమకు గౌరవాన్ని ఆపాదించడం ఆన్నింటికంటే ముఖ్యమైన ఫలితం.

సహాయ నిరాకరణ ఏదయితే అన్యాయమో దానికి ఏ మాత్రమూ సహకరించకపోవడం. ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదు. వారి చట్టాలను ఆమోదించరాదు. ఈ ఉద్యమానికి మంచి స్పందన లభించింది. కాని 1922 లో ఉత్తరప్రదేశ్ చౌరీచౌరా లో ఉద్రేకాలు పెల్లుబికి హింస చెలరేగింది. ఉద్యమం అదుపు తప్పుతున్నదని గ్రహించి, గాంధీ దాన్ని వెంటనే నిలిపివేశాడు.

1927 లో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తరువాత మరలా గాంధీ స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను చేబట్టాడు. అందరికీ సర్ది చెప్పి, 1928 లో కలకత్తా కాంగ్రెసులో స్వతంత్ర ప్రతిపత్తి తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. అందుకు బ్రిటిషు వారికి ఒక సంవత్సరం గడువు ఇచ్చాడు. ఆయినా ఫలితం శూన్యం. 1929 డిసెంబర్ 31 న లాహోరు లో భారత స్వతంత్ర పతాకం ఎగురవేయబడింది. 1930 జనవరి 26 ను స్వాతంత్ర్య దినంగా ప్రకటించాడు ఆ రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చును

ఉప్పు సత్యాగ్రహం (దండియాత్ర) ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి, పన్ను కట్టకుండా, సముద్రంలోంచి ఉప్పును తీసుకోవడమనే చిన్న సూత్రంపై ఇది ఆధారపడింది. మార్చి 21 నుండి ఏప్రిల్ 6 వరకు అహమ్మదాబాదు నుండి దండి వరకు 400 కి.మీ. పాదయాత్ర ఈ పోరాటంలో కలికితురాయి. దండిలోనే కాదు, దేశంలో ఊరూరా ఉప్పు సత్యాగ్రహ సంఘాలు ఏర్పడ్డాయి. మొత్తం దేశంలో 60,000 మంది చెరసాల పాలయ్యారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. 1931 లో గాంధీఇర్విన్ ఒడంబడిక ప్రకారం ఉద్యమం ఆపారు. అందరినీ విడుదల చేశారు. 1932 లో లండను లో రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెసు ఏకైక ప్రతినిధిగా గాంధీ హాజరయ్యాడు. కాని ఆ సమావేశం గాంధీని, స్వాతంత్ర్యవాదులందరినీ నిరాశపరచింది. లార్డ్ ఇర్విన్ తరువాత వచ్చిన లార్డ్ విల్లింగ్డన్ మరలా స్వాతంత్ర్యోద్యమాన్ని పూర్తిగా అణచి వేయడానికి ప్రయత్నించాడు.

1938 లో కాంగ్రెసు అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాస్ చంద్రబోసు తో గాంధీకి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. బోసుకు ప్రజాస్వామ్యంపైనా, అహింసపైనా పూర్తి విశ్వాసం లేదన్నది గాంధీ యొక్క ముఖ్యమైన అభ్యంతరం. అయినా బోసు మళ్ళీ రెండోసారి కాంగ్రెసు అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. తరువాత సంభవించిన తీవ్రసంక్షోభం కారణంగా బోసు కాంగ్రెసుకు దూరమయ్యాడు.

క్విట్ ఇండియా ఉద్యమం(1942 ఆగష్టు) :

క్విట్ ఇండియా ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది. ఊరేగింపులూ, అరెస్టులూ, హింసా పెద్ద ఎత్తున కొనసాగాయి. కాంగ్రెసులో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పొడచూపసాగాయి. ఈ సమయంలో గాంధీ చిన్నచిన్న హింసాత్మక ఘటనలున్నా ఉద్యమం ఆగదని దృఢంగా స్పష్టం చేశాడు. భారత్ ఛోడో భారతదేశాన్ని వదలండి అన్నది నినాదము. కరో యా మరో చేస్తాం, లేదా చస్తాం అన్నది అప్పటి నిశ్చయము. ప్రభుత్వము కూడా తీవ్రమైన అణచివేత విధానాన్ని చేపట్టింది.

1942 ఆగష్టు 9 న గాంధీతో బాటు పూర్తి కాంగ్రెసు కార్యవర్గం అరెస్టయ్యింది. గాంధీ రెండేళ్ళు పూణే జైలులో గడిపాడు. గాంధీ ఆరోగ్యం బాగా క్షీణించింది. అనారోగ్య కారణాలవల్ల ఆయనను 1944 లో విడుదల చేశారు. బ్రిటిష్ వారు యుద్ధము తరువాత ఇతర నాయకులనూ, లక్ష పైగా ఉద్యమకారులనూ విడుదల చేశారు. క్రమంగా స్వాతంత్ర్యం ఇవ్వబడుతుందని అంగీకరించారు.

కాని ముస్లిమ్ లీగ్ నాయకులైన ముహమ్మద్ ఆలీ జిన్నా కి పశ్చిమ పంజాబు, సింధ్, బలూచిస్తాన్, తూర్పు బెంగాల్ లో మంచి ప్రజాదరణ ఉన్నది. కావాలంటే జిన్నాను ప్రధానమంత్రిగా చేసైనా దేశాన్ని ఐక్యంగా నిలపాలని గాంధీ ప్రగాఢ వాంఛ. కాని జిన్నా దేశ విభజనో, అంతర్గత యుద్ధమో తేల్చుకోండి అని హెచ్చరించాడు. చివరకు హిందూ ముస్లిం కలహాలు ఆపాలంటే దేశవిభజన కంటే గత్యంతరము లేదని తక్కిన కాంగ్రెసు నాయకత్వము అంగీకరించింది. అయితే గాంధీ పట్ల ప్రజలకూ పార్టీ సభ్యులకూ ఉన్న ఆదరణ దృష్ట్యా గాంధీ సమ్మతించకపోతే ఏ నిర్ణయమూ తీసుకొనే అవకాశం లేదు. అంతర్గత యుద్ధాన్ని ఆపడానికి వేరే మార్గం లేదని గాంధీని ఒప్పించడానికి పటేల్ శతవిధాల ప్రయత్నించాడు. చివరకు హతాశుడైన గాంధీ ఒప్పుకొనక తప్పలేదు. కాని ఆయన పూర్తిగా కృంగిపోయాడు. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకొంటూ ఉండగా దేశవిభజన వల్ల విషణ్ణుడైన గాంధీమాత్రము కలకత్తా లో ఒక హరిజనవాడను శుభ్రముచేస్తూ గడిపాడు. ఆయన కలలన్నీ కూలిపోయిన సమయంలో హిందూ ముస్లిమ్ మత విద్వేషాలు పెచ్చరిల్లి ఆయనను మరింత శోకానికి గురిచేశాయి.1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ హే రామ్ అన్నాడని చెబుతారు.