1857 సిపాయిల తిరుగుబాటు
దేశానికి స్వాతంత్య్రం రావడానికి 90 ఏళ్ల ముందే సిపాయిల తిరుగుబాటు మీరట్‌లో ప్రారంభమైంది. ఆ సమయంలో లార్డ్ కానింగ్ గవర్నర్ జనరల్‌గా వ్యవహరించారు. సిపాయిల తిరుగుబాటు కాలంలో ఢిల్లీ సైనికులు మొగల్ చక్రవర్తి రెండో బహదూర్‌షాను పాదుషాగా ప్రకటించారు. సిపాయిల తిరుగుబాటు సమయంలో ఢిల్లీ ముట్టడిలో ఆంగ్లేయులు సాగించిన దారుణ హింసాకాండను గాలిబ్ అనే ఉర్దూ కవి వర్ణించాడు. సిపాయిల తిరుగుబాటుకు అయోధ్యలోహజ్రత్ బేగం నేతృత్వం వహించగా, ఝాన్సీలో లక్ష్మీబాయి, మధ్య భారతదేశంలో తాంతియా తోపే నాయకత్వం వహించారు. ఈ తిరుగుబాటును అణచి వేయడంలో ప్రముఖపాత్ర వహించిన బ్రిటిష్ సేనానులు సర్‌జేమ్స్, అవుట్రామ్, హూవ్‌లాక్, నికల్‌సన్, నెయిల్ లారెన్స్, కాంప్‌బెల్, సర్ రోజ్‌వుడ్. తిరుగుబాటుకు కారణాలు డల్హౌసీ అనుసరించిన దురాక్రమణ విధానం రాజకీయ కారణం కాగా, బ్రిటిషర్ల నూతన ఆర్థిక విధానం ఆర్థిక కారణమైంది. బ్రిటిషర్లకు హిందూమతం పట్ల ఉన్న అభిప్రాయం భారతీయుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. భారతీయులను క్రైస్తవంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారని భయాందోళనలకు గురయ్యారు. 1813 చార్టర్ చట్టానికి ముందు క్రైస్తవ మిషనరీలను దేశంలోకి అనుమతించేవారు కాదు. 1813 చార్టర్ చట్టంతో ఈ నిబంధన ఎత్తివేశారు. దీంతో అనేక మిషనరీలు భారతదేశానికి రావడం ప్రారంభమైంది. మిషనరీలు దేశంలో, ముఖ్యంగా అనేక వెనుకబడిన ప్రాంతాల్లో విద్యా సంస్థలను స్థాపించి, విద్యాబోధన చేసేవి. విద్యార్థులను క్రైస్తవ మతంలోకి మార్చడమే వీటి ధ్యేయం. మిషనరీలు స్థాపించిన పాఠశాలల్లో బైబిల్ పఠనం తప్పనిసరి. జైళ్లలో ఉన్న ఖైదీలు క్రైస్తవ మతాన్ని స్వీకరించేలా అనేక విధాలుగా ప్రలోభాలకు గురి చేసేవారు.వారికి క్రైస్తవ గ్రంథాలను బోధించేవారు. క్రైస్తవులుగా మారిన వారిని జైలు నుంచి విడుదల చేసేవారు. తక్షణ కారణం కొవ్వు పూసిన తూటాల వదంతి వ్యాపించింది. ఇది హిందూ, ముస్లిం సైనికుల మనోభావాలను దెబ్బతీసింది. దాంతో సైనిక కవాతులో పాల్గొనరాదని 1857 ఫిబ్రవరి 20న బరంపూర్‌లోని పదాతిదళం నిర్ణయించింది. 1857 మార్చి 29న 34వ దేశీయ పటాలానికి చెందిన మంగళ్‌పాండే ఆంగ్లేయాధికారిపై కాల్పులు జరిపి తిరుగుబాటుకు అంకురార్పణ చేశాడు. తర్వాత అతడిపై విచారణ జరిపి ఏప్రిల్ 8న బహిరంగంగా ఉరితీశారు. తిరుగుబాటు విఫలం కావడానికి కారణాలు విప్లవం విఫలం కావడానికి అనేక కారణాలున్నాయి. తిరుగుబాటు కొద్ది ప్రాంతానికే పరిమితం కావడం, యావత్తు దక్షిణ భారతదేశం, పంజాబ్ ఉత్తర ప్రాంతం, పశ్చిమ రాజస్థాన్, గుజరాత్, మధ్యభారతం, బెంగాల్‌లో తిరుగుబాటు ప్రభావం లేదు. ఢిల్లీ, అయోధ్య, బిహార్, రోహిల్‌ఖండ్, దాని పరిసర ప్రాంతాలకే తిరుగుబాటు పరిమితమైంది. అందువల్ల విప్లవాన్ని అణచివేయడం ఆంగ్లేయులకు తేలికైంది. 1857 తిరుగుబాటు స్వభావం సిపాయిల తిరుగుబాటు స్వభావం మీద చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొంతమంది దీన్ని సిపాయిల పితూరీ అని, మరికొందరు క్రైస్తవుల మీద జరిగిన మత యుద్ధమని లేదా తెల్లవారికి, నల్లవారికి మధ్య జరిగిన యుద్ధమని, హిందూ, ముస్లింలు కలిసి బ్రిటిషర్ల మీద పన్నిన కుట్ర అని పేర్కొన్నారు. చాలా మంది ఆధునిక భారత చరిత్రకారులు దీన్ని ‘భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం’గా అభివర్ణించారు. తిరుగుబాటు ఫలితాలు 1857 తిరుగుబాటు విఫలం కావడంతో భారతదేశ దాస్య శృంఖలాలు మరింత బిగిసిపోయాయి. తిరుగుబాటు ఒక శకాన్ని ముగించి, మరొక శకారంభానికి పునాది వేసిందని చెప్పొచ్చు. సామ్రాజ్య విస్తరణ స్థానంలో ఆర్థిక దోపిడీకి నాంది పలికింది. జాతీయ తత్వాన్ని అలవర్చుకున్న ప్రగతిశీల శక్తుల స్వభావాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు సవాల్‌గా ఎదుర్కోవాల్సి వచ్చింది. తిరుగుబాటు ఫలితంగా కంపెనీ పాలన రద్దయింది. దాని స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పాలన ఆరంభమైంది. బ్రిటన్ రాణి విక్టోరియాను భారత సామ్రాజ్ఞిగా ప్రకటించారు. 1858 నవంబర్ 1న వెలువడిన ఈ ప్రకటనను లార్డ్ కానింగ్ అలహాబాద్‌లో చదివారు. |