బూర్గుల రామకృష్ణారావు


బూర్గుల రామకృష్ణారావు

బూర్గుల రామకృష్ణారావు

బూర్గుల రామకృష్ణారావు

బూర్గుల రామకృష్ణారావు (మార్చి 13, 1899 - సెప్టెంబర్ 14, 1967) బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసాడు.

జననం - విద్యాభ్యాసం

జననం   (నరసింగరావు, రంగనాయకమ్మ దంపతులకు) మార్చి 13, 1899, మహబూబ్ నగర్ జిల్లా, తలకొండ పల్లి మండలం, పడకల్ గ్రామం.

మరణం  సెప్టెంబర్ 14, 1967, న గుండెపోటుతో మరణించాడు.

ధర్మపంత్ స్కూలు (హైదరాబాద్) లో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. 1915లో మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాడు. పూణె లోని ఫెర్గూసన్ కళాశాలలో బీఏ (హానర్స్) డిగ్రీ చదివాడు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ (లా డిగ్రీ) పూర్తిచేసి, హైదరాబాద్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. బూర్గుల దగ్గర పివినరసింహారావు జూనియర్ లాయర్‌గా పనిచేశాడు.

రాజకీయ జీవితం

1912లో వివాహం జరిగింది. ఆమె 1920లో మరణించడంతో, 1924లో మళ్ళీపెళ్ళి చేసుకున్నాడు. 1923లో హైదరాబాదులో న్యాయవాద వృత్తి ప్రారంభించి అగ్రస్థాయికి చేరాడు. న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయాల్లో పాల్గొనడం జరిగింది. ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, భూదానోద్యమం మొదలైన వాటిలో పాల్గొన్నాడు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారితో కలిసి పనిచేసాడు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంకు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసాడు.

హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టీ తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్రమహాసభకు బూర్గుల అధ్యక్షత వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం అనుభవించాడు. 1948లో పోలీసు చర్య తరువాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు అయి, వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యాడు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు.

బూర్గుల బహుభాషావేత్త, సాహితీవేత్త

తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, ఉర్దూ, పారశీక, సంస్కృత భాషల్లో బూర్గులకు ప్రావీణ్యం ఉంది. మహారాష్ట్రలో చదివే రోజుల్లోనే ఆంగ్లంలో కవితలు రాసేవాడు. పారశీక వాజ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల లహరీపంచకమును, శంకరాచార్యుల సౌందర్యలహరి, కనకధారారాస్తవమును తెలుగులోకి అనువదించాడు. కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శారదస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం, రెడ్డి రాజుల కాలం-మత సంస్కృతులు (పరిశోధనా వ్యాసం) మొదలైనవి ఆయన ఇతర రచనలు.ఈయన రచించిన వ్యాసాలు సారస్వత వ్యాస ముక్తావళి పేరుతో అచ్చయింది.

వానమామలై, కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డి ప్రోత్సాహంతో తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు చేసి సాహితీలోక ప్రసిద్ధుడయ్యాడు.