బోనాలు


బోనాలు

బోనాలు

 

బోనాలు

బోనాలు అమ్మవారుని పూజించే హిందువుల పండుగ.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగ గా నిర్వహిస్తున్నారు

సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు.

ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది.

బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు,పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మపోచమ్మఎల్లమ్మపెద్దమ్మడొక్కాలమ్మఅంకాలమ్మపోలేరమ్మమారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.

పండుగ ఎలా జరుపుకుంటారు ?

 ఆషాఢ మాసం లో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.

 
బోనాల సందర్భంగా వనస్థలిపురంలో పొట్టేళ్ళ రథం పై అమ్మవారి ఊరేగింపు

పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.

పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.

బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము; మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు.

తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెల ను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది.

బోనాల పండుగ సందోహం గోల్కొండ కోట లోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలు గా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.

దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు; ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు.