లక్ష్మణ్ ఏలె


లక్ష్మణ్ ఏలె

లక్ష్మణ్ ఏలె

లక్ష్మణ్ ఏలె (జూన్ 8 , 1965) ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడుమనీ మనీ, అనగనగా ఒకరోజు, సత్య, రంగీల, దెయ్యం…మొదలైన వర్మ సినిమాలకు లక్ష్మణ్‌ ఏలె పబ్లిసిటి డిజైనర్‌గా పనిచేశారు. ఈయన మోనోక్రామ్‌లు చేయటానికి యిష్టపడతారు.

పరిచయం

ఈయన యాదాద్రి - భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలం కదిరేనిగూడెంలో 1964, జూన్ 8 న జన్మించాడు. ఈయన తండ్రి మగ్గం నేసేవాడు పద్మశాలి. తల్లి కూలీపని చేసేది. వారి పెద్దనాన్నకు పిల్లలు లేకపోవటంతో చిన్నప్పుడే ఆయన్ని పెంచుకున్నారు. లక్ష్మణ్ చిన్నప్పుడు విద్యలో వెనుకబడి ఉండేవారు. యింటి పనులను చూసుకునేవారు.

విద్యాభ్యాసం

పదవ తరగతి చదవడం కోసం భువనగిరికి వచ్చారు.ఆ రూమ్‌కు దగ్గర్లో ఒక ఆర్టిస్ట్‌ బొమ్మలు గీస్తూ ఉండేవాడు. ఆ బొమ్మలను పరిశీలిస్తూ అలాగే గీయడానికి ప్రయత్నించేవారు. కళాశాలలో కాలేజీ బోర్డు రాసిపెట్టినందుకు ఇంటర్‌లో ట్యూషన్‌ ఫీజు మాఫ్‌ చేసారు ప్రిన్సిపాల్‌గారు. ఇంటర్ లో ఉన్నప్పుడు ఒక అధ్యాపకుడు ఆయనకు కార్డూన్లు గీయమని దానివల్ల మంచి లైఫ్ ఉందని సలహానిచ్చాడు. ఆయన చెప్పినట్లు కార్టూన్స్‌ ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించారు. గీసిన కార్టూన్లన్నీ ప్రతికలకు పంపేవారు. కాని ఒక్కటి కూడా ప్రచురితమయ్యేది కాదు. దానితో ఆయనకు విసుగొచ్చి ‘ఇదేదో మనకు పనికొచ్చే విషయం కాదు’ అని కార్టూన్స్‌ గీయడం వదిలేశారు. ఇంటర్మీడియేట్‌ తరువాత డిగ్రీ కోసం హైదరాబాద్‌కు వచ్చారు.

ఆర్ట్స్‌ కాలేజిలో బి.కాంలో చేరారు. డిగ్రీలో చేరడానికి ముందు హైదరాబాద్‌లోని ఒక కెమికల్‌ ఫ్యాక్టరీలో రోజు కూలీగా పనిచేశారు. ఒకవైపు డిగ్రీ చదువుతూనే మరోవైపు ఒక షాపులో సైన్‌బోర్డులు రాసే పనికి కుదిరారు. రోజు అయిదారు రూపాయలు ఇచ్చేవాళ్లు. ఆయన డిగ్రీ సెకండ్‌ ఇయర్‌లో ఉండగా ‘లే అవుట్‌ ఆర్టిస్ట్‌లు కావలెను’ అని ఈనాడులో ఒక ప్రకటన చూసి దానికి అప్లై చేసి ఇంటర్వ్యూలో ‘డిగ్రీ చదువుతున్నాను. బొమ్మలు గీయడం వచ్చు. అక్షరాలు బాగా రాయగలను’ అని చెప్పారు. గీసి చూపించమంటే చూపించారు. ‘బొమ్మలు బానే ఉన్నాయిగానీ నువ్వు చదువుకుంటున్నావు కదా. నీకు ఉద్యోగం ఎందుకు? వెళ్లి బుద్దిగా చదువుకో’ అన్నారు ఇంటర్వ్యూ చేసిన చలసాని ప్రసాదరావుగారు. ‘చదువుకోవడానికి డబ్బులు లేవు సార్‌. ఎలాగైనా సరే ఉద్యోగం ఇప్పించండి సార్‌’ అన్నారు లక్ష్మణ్. చలసాని ప్రసాదరావుగారు ఆయన మొర ఆలకించి ఉద్యోగం ఇప్పించారు.

సినీ ప్రయాణం

సినీ నటుడు ఉత్తేజ్ ఆయనకు బంధువు. అతని ద్వారా రాం గోపాల్‌ వర్మ పరిచయమయ్యాడు. ఆయన తీసిన చాలా సినిమాలకు పబ్లిసిటి డిజైనర్‌గా పనిచేశారు. వేరే సినిమాలకు కూడా బోలెడన్ని అవకాశాలు వచ్చాయి.పెయింటర్‌గా రాణించాలనేది అయన లక్ష్యం. దాని కోసమే పనిచేయాలనుకున్నారు.

తాను ఎప్పుడూ కవులు, రచయితలతో టచ్‌లో ఉండేవారు. అలా పోస్ట్‌మోడర్నిజం ధోరణుల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. స్త్రీ, దళిత వాదాలు అవగాహనకు వస్తున్న కాలంలో ఆయనలో ఒక అంతర్మథనం.

తెలంగాణ అధికారిక చిహ్నం రూప కర్త 

తెలంగాణ అధికారిక చిహ్నంను ఈయన రూపొందించారు. దీనిని భారతదేశం లోని 29 వ రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రమైన తెలంగాణకు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ సర్కారు కోసం రూపొందించిన లోగోలో దేశభక్తి, సంస్కతి, సంప్రదాయాలు, చరిత్రతో పాటు మానవ మనుగడ వంటి అనేక అంశాలు మిళితమయ్యాయి. అందరూ కోరుకునే బంగారు తెలంగాణను గుర్తుచేసేందుకు బంగారు వర్ణంతో వలయం.. నాలుగు సింహాల చిహ్నం, అశోకుడి విజయచక్రంతో పాటు అందమైన ఔటర్ లైన్లు కనిపిస్తాయి.

తెలుగు, ఉర్దూ, ఇంగ్లిషు భాషల్లో తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ సర్కార్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పదాలు స్పష్టంగా దర్శనమిస్తాయి. దిగువన సత్యమేవ జయతే అని హిందీలో కూడా పొందుపరిచారు. కాకతీయుల కళావైభవాన్ని స్ఫురించే తోరణం, ప్లేగు వ్యాధి సోకి వందలాది మంది ప్రాణాలు కోల్పోతే బతుకుకు చిహ్నంగా నిర్మించిన చార్మినార్ గుర్తులు లోగోలో నిండిపోయాయి. లోగో ఏ సైజులో ఉన్నా వీక్షించేందుకు స్పష్టత సంతరించుకుంది. ఇంక్‌తో ముద్రవేస్తే అచ్చుగుద్దినట్లే ఉండేందుకు అనువుగా దీని రూపు సంతరించుకుంది.

తెలంగాణ రాష్ట్ర చిహ్నం రూపొందించిన ఈయన తన లోగో రూఫొందించడానికి గల కారణాలను వివరించారు. బంగారు తెలంగాణ సాధించినందుకు గుర్తుగా బంగారు వలయాన్ని వేశారు. కాకతీయుల వైభవానికి చిహ్నంగా తోరణాన్ని వేసి పాడిపంటలు పండాలని అభిలషించారు. అలాగే హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి సోకి వందలాది మంది చనిపోయినప్పుడు జీవితాలను గుర్తుచేస్తూ నిర్మించిన చార్మినార్‌ను జోడించారు. ప్రతి మనిషి సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలన్నదే తన అభిమతంగా వివరించారు. లోగోలో పచ్చని రంగు డామినేట్ చేస్తుంది. అది శాంతికి గుర్తుగా భావిస్తాం. తెలంగాణ కూడా ఎల్లప్పుడూ శాంతితో వర్ధిల్లాలి. రెండు రంగులతోనే రాజముద్రను పూర్తి చేశారాయన.