కరెంట్ అఫైర్స్ జనవరి

కరెంట్ అఫైర్స్ జనవరి

అంతర్జాతీయం

అమెరికా దాడుల్లో ఇరాన్ జనరల్ సులేమాని మృతి
ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన నాయకుడు, ఆ దేశ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ ఖాసీం సులేమాని అమెరికా జరిపిన దాడుల్లో మృతి చెందారు. బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో జనవరి 3న సులేమాని ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై గగనతలం నుంచి డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సులేమానితోపాటు ఇరాక్‌కు చెందిన హషద్ అల్ షాబి పారామిలటరీ బలగాల డిప్యూటీ చీఫ్, ఇరాన్‌కు మద్దతుగా వ్యవహరించే కొందరు స్థానిక మిలిమెంట్లు మరణించారు.
2018లో అమెరికా ఇరాన్‌తో అణుఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ పరిణామాలతో మధ్య ప్రాచ్యానికి అమెరికా మరో 3,500 మంది బలగాలను తరలించింది.
ఎప్పుడో చంపేయాల్సింది: ట్రంప్
విదేశాల్లో నిఘా కార్యకలాపాలు నిర్వహించే ఇరాన్ అల్ ఖుద్‌‌స చీఫ్ జనరల్ సులేమానిని కొన్నేళ్ల క్రితమే చంపేయాల్సి ఉండేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాక్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాల్లో అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకి, వేలాది మంది అమెరికన్ సిబ్బంది మృతికి సులేమాని కారకుడన్నారు.
ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్
సులేమాని చంపేసినందుకు అమెరికాపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయోతొల్లా అలీ ఖమేనియా హెచ్చరించారు. ఇస్మాయిల్ ఖానీని సులేమాని స్థానంలో ఖుద్‌‌స బలగాల చీఫ్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్ గుండెకు గాయం చేసిన వారిని విడిచిపెట్టమని తమకు సహకరించే దేశాలతో కలిసి బదులు తీర్చుకుంటామని అధ్యక్షుడు హసన్ రౌహని హెచ్చరించారు.
మరో యుద్ధం భరించలేం: ఐరాస
గల్ఫ్‌లో మరో యుద్ధాన్ని ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ వ్యాఖ్యానించారు. సులేమాని మృతి నేపథ్యంలో గ్యుటెరస్ పై విధంగా స్పందించారు.
ఎవరీ ఖాసీం సులేమాని?
1955లో ఇరాన్‌లో ఒక నిరుపేద రైతు కుటుంబంలో సులేమాని 1979లో ఇరాన్ విప్లవం సమయంలో రివ్యల్యూషనరీ గార్డ్‌లో చేరారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లో కీలకమైన నిఘా విభాగం అయిన ఖుద్‌‌స ఫోర్స్‌కి 1998 ఏడాది నుంచి సులేమాని మేజర్ జనరల్‌గా ఉన్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాబల్యాన్ని పెంచడానికి, దానిని బలమైన దేశంగా నిలపడానికి చాలా ఏళ్లుగా శ్రమిస్తున్నారు. ఇరాన్ సుప్రీం నాయకుడు తర్వాత దేశంలో అంతటి శక్తిమంతుడిగా సులేమానికి పేరుంది. విదేశాల్లో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించడంలో దిట్ట అయిన సులేమాన్‌ను ఇరాన్ ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. 2017లో టైమ్ మ్యాగజైన్ ఆయనని అత్యంత ప్రభావశీలుర జాబితాలో చేర్చింది. మరోవైపు ఎన్నో దేశాల్లో మిలటరీ దాడుల వ్యూహకర్త అయిన సులేమానిని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది.

లిబియాలో వైమానిక దాడి

లిబియా రాజధాని ట్రిపోలీలోని సైనిక శిక్షణ కేంద్రంపై జనవరి 4న వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు 30 మంది మృతి చెందగా మరో 33 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులేనని లిబియా అధికారులు వెల్లడించారు. లిబియన్ నేషనల్ ఆర్మీ(ఎల్‌ఎన్‌ఏ) చీఫ్‌గా ప్రకటించుకున్న జనరల్ ఖలీఫా హిఫ్తర్, ఐక్యరాజ్యసమితి మద్దతుతో కొనసాగుతున్న ప్రభుత్వంపై దాడులు ఉధృతం చేశారు.


ఇరాన్, అమెరికాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు
ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ తమపై దాడికి తెగబడితే.. మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌లో 52 కీలక, వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించామని, తమపై దాడి చేస్తే ఆ 52 ప్రాంతాలను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తూ జనవరి 4న ట్రంప్ ట్వీట్ చేశారు. చాన్నాళ్ల క్రితం 52 మంది అమెరికన్లను ఇరాన్ బందీలుగా చెరపట్టిన ఉదంతాన్ని గుర్తు చేసేలా ఆ సంఖ్యను ట్రంప్ నిర్ధారించారని యూఎస్ రక్షణ వర్గాలు వెల్లడించాయి.
ఇరాక్‌లోని బాగ్దాద్‌లో జనవరి 3న అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి, అల్ ఖుద్‌‌స ఫోర్స్ చీఫ్ మేజర్ జనరల్ సులేమానీ మరణించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిన చేసింది.
ఇది యుద్ధ నేరం : ఇరాన్
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ‘పశ్చిమాసియాలో అమెరికా ద్వేషపూరిత ఉనికి అంతమయ్యేందుకు ఇదే ప్రారంభం. సాంస్కృతిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామనడం యుద్ధ నేరం కిందకు వస్తుంది. మా మిలటరీ ఉన్నతాధికారిని దొంగదెబ్బ తీసి చంపడం పిరికి చర్య. అది అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన అని ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారిఫ్ ట్వీట్ చేశారు. తమతో యుద్ధం ప్రారంభించే ధైర్యం అమెరికాకు లేదని ఇరాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ రహీం మౌసావి వ్యాఖ్యానించారు.
ఇరాక్ నుంచి యూఎస్ బలగాలు వెనక్కు
తమ సైనిక స్థావరాల్లో ఉన్న అమెరికా సైనికులను వెనక్కు పంపాలని ఇరాక్ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఐఎస్‌పై పోరులో సాయపడేందుకు ఇరాక్‌లో 5,200 మంది అమెరికా సైనికులున్నారు.
కెన్యా బేస్‌పై దాడి
కెన్యా తీరంలోని అమెరికా, కెన్యా సైనికులున్న స్థావరంపై సొమాలియాకు చెందిన అల్ షబాబ్ తీవ్రవాద సంస్థ జనవరి 5న దాడి చేసింది. ఈ దాడిని తిప్పికొట్టి నలుగురిని హతమార్చామని కెన్యా దళాలు తెలిపాయి.
ఇరాన్ విదేశాంగ మంత్రికి జైశంకర్ ఫోన్
యూఎస్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జనవరి 4న ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారిఫ్‌తో మాట్లాడారు. అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు ఆయనకు వివరించారు.

సాంస్కృతిక కట్టడాలను కాపాడాలి: యునెస్కో
అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం అలుముకున్న తరుణంలో ఇరుదేశాలకు యునెస్కో జనవరి 6న కీలక సూచన చేసింది. దేశాల్లోని చారిత్రాత్మక, సాంస్కృతిక కట్టడాలను ఇరు దేశాలు పరిరక్షించాలని కోరింది. ఈ మేరకు యునెస్కో డెరైక్టర్ జనరల్ ఆడ్రే అజౌల్ ఇరాన్ దౌత్యవేత్తతో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. ఇరాన్, అమెరికాలు 1972లో సంతకం చేసిన ఒప్పందం ప్రకారం సాంస్కృతిక కట్టడాలకు ఎటువంటి నష్టం చేకూర్చకుండా ఉండాలని చెప్పారు. అమెరికా బలగాలపై దాడులు చేస్తే ఇరాన్‌లోని నిర్దిష్ట ప్రాంతాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

యురేనియం నిల్వలను పెంచుకుంటాం : ఇరాన్
ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో 2015 అణు ఒప్పందంలోని ఇంధన శుద్ధిపై పరిమితులను ఇకపై పట్టించుకోబోమని జనవరి 6న ఇరాన్ ప్రకటించింది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పెంచుకుంటామని, ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విసృ్తతం చేస్తామని తెలిపింది. అణ్వాయుధాలను తయారు చేయబోమన్న మునుపటి హామీకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. 2018లో అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్న అమెరికా ప్రకటించిన తర్వాత ఇరాన్ చేసిన తాజా ప్రకటనతో ఈ ఒప్పందం అమలు ప్రమాదం పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రంప్ తలకు రూ.575 కోట్లు
ఇరాన్ జనరల్ సులేమానీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలకు ఇరాన్ వెలకట్టింది. ఆయన్ను చంపిన వారికి దాదాపు రూ.575 కోట్ల భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది. ఇరాన్‌లోని 8 కోట్ల మంది పౌరుల నుంచి ఒక్కో అమెరికా డాలర్(సుమారు రూ.71.79) చొప్పున రూ.575 కోట్లు చందాగా వసూలు చేసి ట్రంప్‌ను చంపిన వారికి అందజేస్తామని తెలిపింది.

క్రొయేషియా అధ్యక్ష ఎన్నికల్లో మిలనోవిక్ విజయం
క్రొయేషియా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో క్రొయేషియా మాజీ ప్రధాని, సోషల్ డెమోక్రట్ పార్టీ నేత జోరన్ మిలనోవిక్ విజయం సాధించారు. జనవరి 6న వెల్లడైన ఫలితాల ప్రకారం.. మిలనోవిక్‌కు 52.7 శాతం ఓట్లు వచ్చాయి. ఆయన సమీప రాజకీయ ప్రత్యర్థి, సిట్టింగ్ ప్రెసిడెంట్ కొలిండా గ్రాబర్ కిటారోవిక్‌కు 47.3శాతం ఓట్లు వచ్చాయి. మితవాద భావజాలమున్న కిటారోవిక్ కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 40 లక్షలకు పైగా జనాభా కలిగిన క్రొయేషియా 1991లో స్వతంత్య్ర రాజ్యంగా ఆవిర్భవించింది.


కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో-2020 ప్రారంభం
అమెరికాలోని లాస్ వెగాస్‌లో జనవరి 7న ‘2020 కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) ప్రారంభమైంది. పలు దిగ్గజ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలు తమ కొంగొత్త ఉత్పత్తులను సీఈఎస్‌లో ప్రదర్శనకు ఉంచాయి.
శాంసంగ్ డిజిటల్ అవతార్
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ సీఈఎస్‌లో కృత్రిమ మేథతో (ఏఐ)తో పనిచేసే ‘డిజిటల్ మనిషి(డిజిటల్ అవతార్)ని ఆవిష్కరించింది. నియోన్ అనే ఈ టెక్నాలజీతో డిజిటల్ అవతార్‌లను సృష్టించవచ్చని, డిస్‌ప్లేలు లేదా వీడియో గేమ్స్‌లో ఉపయోగించవచ్చని శాంసంగ్ తెలిపింది. డిజిటల్ అవతార్ మనుషుల్లాగే సంభాషించడం, భావాలను వ్యక్తపర్చడం వంటివి చేయగలదని పేర్కొంది.
ఏవీటీఆర్ కాన్సెప్ట్ కారు
హాలీవుడ్ సినిమా అవతార్ ప్రేరణతో రూపొందించిన ఏవీటీఆర్ కాన్సెప్ట్ కారును మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించింది. ఈ అటానమస్ వాహనంలో స్టీరింగ్ వీల్, పెడల్స్ వంటివి ఉండవు. సెంటర్ కన్సోల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.
ఎయిర్ ట్యాక్సీలను ఎస్-ఏ1
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కొత్తగా రూపొందిస్తున్న ఎయిర్ ట్యాక్సీలను ఎస్-ఏ1 పేరిట ఆవిష్కరించింది. విద్యుత్‌తో నడిచే ఈ ఎయిర్ ట్యాక్సీ గరిష్టంగా గంటకూ 290 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. సుమారు 100 కి.మీ. దూరంలో, అరగంట ప్రయాణం ఉండే ప్రాంతాలకు నడిపే ట్యాక్సీ సర్వీసుల కోసం వీటిని వినియోగించేందుకు హ్యుందాయ్‌తో ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ ఒప్పందం కుదుర్చుకుంది.

యూఎస్ మిలటరీ స్థావరాలపై ఇరాన్ దాడి
ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జనవరి 7న క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా సైనికులు, సంకీర్ణ దళాలు ఉన్న అల్ అసద్, ఇర్బిల్ మిలటరీ స్థావరాలపై ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో 80 మంది అమెరికా సైనికులు చనిపోయారని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని అమెరికా చంపినందుకు ప్రతీకారంగానే ఈ క్షిపణి దాడి జరిగిందని ఇరాన్ అధికార టీవీ పేర్కొంది. దాడిలో ఇరాకీ సైనికులకు గాయాలు కాలేదని ఇరాక్ మిలటరీ వెల్లడించింది.
తాజా దాడి అమెరికాకు చెంపపెట్టులాంటిదని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. ‘అమెరికాకు భయపడి వెనక్కువెళ్లబోం అని ఈ దాడి ద్వారా స్పష్టం చేశామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ స్పష్టం చేశారు.
కొంత నష్టం : ట్రంప్
ఇరాన్ క్షిపణి దాడిలో తమ సైనికులెవరూ చనిపోలేదని, తమ మిలటరీ స్థావరాలకు కొంత నష్టం మాత్రం వాటిల్లిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 8న వెల్లడించారు. శాంతిని కోరుకునే అందరితో శాంతియుత సంబంధాలనే కోరుకుంటామన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థను నిర్మూలించేందుకు కలసిరావాలని ఇరాన్‌ను కోరారు. దీంతో, తీవ్ర స్థాయికి చేరిన ఉద్రిక్తతలు కొంతమేరకు చల్లబడ్డాయి.


ఇరాన్‌లో కూలిన ఉక్రెయిన్ పౌర విమానం
అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఇరాన్‌లో ఓ విమానం కుప్పకూలింది. ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్ కి చెందిన పౌర విమానం బోయింగ్ 737 టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే కూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 176 మంది మృతి చెందారు. ఈ విమానం టెహ్రాన్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. విమాన ప్రమాదంలో మృతి చెందినవారిలో ఇరాన్‌కి చెందినవారు 82 మంది, కెనడా దేశస్తులు 63 మంది ఉన్నారు.
కూలిపోయిందా ? కూల్చేశారా ?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ విమానాన్ని కూల్చివేశారన్న ప్రచారం సాగుతోంది. ఇరాన్ దేశానికి చెందిన క్షిపణి పొరపాటున విమానాన్ని కూల్చేసిందని ప్రచారం మొదలైంది.

ఆస్ట్రేలియాలో పదివేల ఒంటెల కాల్చివేత
ఆస్ట్రేలియాని విపరీత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశ దక్షిణ ప్రాంతంలో కరువు కరాళనృత్యం చేస్తోంది. కరువు నెలకొన్న ప్రాంతంలో ఒంటెల సంఖ్య అధికంగా ఉంది. ఇవి అధికంగా నీరు తాగుతున్నాయి. దీని కారణంగా కరువు ప్రాంతంలో తీవ్ర నీటి కోరత నెలకొంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పదివేల ఒంటెలను కాల్చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. శిక్షణ పొందిన షూటర్లతో హెలికాప్టర్ల నుంచి కాల్చడం ద్వారా ఒంటెల సామూహిక హనన కార్యక్రమం చేపట్టనుంది. నీళ్లకోసం వెంపర్లాడుతున్న ఒంటెలు గుంపులుగా మానవ ఆవాసాల వద్దకు వచ్చేస్తున్నాయని, ఫలితంగా అక్కడి గిరిజన తెగల ప్రజలకు ముప్పు ఏర్పడుతోందని ప్రభుత్వం చెబుతోంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియాను కార్చిచ్చు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్చిచ్చు కారణంగా కంగారూలు, కోలాలు, అడవి గొర్రెలు, వివిధ రకాల పక్షులు లక్షలాదిగా ప్రాణాలు కోల్పోయాయి.


జాతీయం

రైల్వేలో అన్నింటికీ ఒకటే హెల్ప్‌లైన్ నంబర్
భారత రైల్వేలో ఇకపై ఒకటే హెల్ప్‌లైన్ నంబర్ ఉండనుంది. ఈ మేరకు అన్ని సేవలకు 139 నంబర్ హెల్ప్‌లైన్‌గా పనిచేస్తుందని రైల్వేశాఖ జనవరి 2న ఓ ప్రకటనలో తెలిపింది. 182 నంబర్ మినహా మిగతా అన్ని హెల్ప్‌లైన్ నంబర్ల బదులు ఇకపై 139 పనిచేయనుంది. ఇది 12 భాషల్లో ఐవీఆర్‌ఎస్ పద్ధతి ద్వారా సేవలందించనుంది. ఇక 182 నంబర్ రైల్వే భద్రత కోసం పనిచేయనుంది.

అయోధ్యపై ప్రత్యేక విభాగం ఏర్పాటు
అయోధ్య వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర హోంశాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన అయోధ్య తీర్పుతో పాటు దాని సంబంధిత వ్యవహారాలను ఈ విభాగమే చూసుకోనుందని కేంద్ర హోంశాఖ జనవరి 2న వెల్లడించింది. అదనపు కార్యదర్శి జ్ఞానేష్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు అధికారులతో ఈ విభాగం పనిచేయనుందని తెలిపింది. జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం హోంశాఖలోని కశ్మీర్, లదాఖ్ వ్యవహారాల విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు.

డీఆర్‌డీఓ యంగ్ సైంటిస్ట్స్ లేబరేటరీస్ ప్రారంభం
ఆధునిక సాంకేతికలను వృద్ధి చేసేందుకు రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) ఏర్పాటు చేసిన ‘డీఆర్‌డీఓ యంగ్ సైంటిస్ట్స్ లేబరేటరీస్(డీవైఎస్‌ఎల్)ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. బెంగళూరులో జనవరి 2న జరిగిన కార్యక్రమంలో ప్రధాని వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ‘మీ సామర్ధ్యం అనంతం. మీరెన్నో చేయగలరు. పరిధిని విసృ్తతం చేసుకోండి. సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకోండి అని చెప్పారు. బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లో ఈ డీవైఎస్‌ఎల్‌లను ఏర్పాటు చేశారు.
సిద్దగంగమఠ్ సందర్శన
కర్ణాటకలోని తుమకూరులో ఉన్న సిద్దగంగమఠ్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. సిద్దగంగమఠ్‌లో గత సంవత్సరం చనిపోయిన శివకుమార స్వామీజీ సమాధి వద్ద ఆయన నివాళులర్పించారు.
6 కోట్ల మంది రైతులకు 12 వేల కోట్లు
తుమకూరులో ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన రెండో దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద కింద 6 కోట్లమంది రైతులకు రూ. 12 వేల కోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు ‘కృషి కర్మన్ పురస్కారాలను ప్రధాని అందజేశారు.

జనవరి 1న శిశు జననాల్లో భారత్‌కు అగ్రస్థానం
2020 జనవరి 1న శిశు జననాల్లో భారత్ అగ్రస్థానంలో, చైనా రెండో స్థానంలో నిలిచాయి. జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా 3,92,078 మంది పిల్లలు పుడితే వారిలో భారత్‌లోనే 67,385 మంది పుట్టినట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన శిశు సంరక్షణ సంస్థ యూనిసెఫ్ జనవరి 2న వెల్లడించింది. మొత్తంగా జన్మించిన 3,92,078 శిశువుల్లో సగం మంది కేవలం ఎనిమిది దేశాల్లోనే జన్మించారని పేర్కొంది.
విరీ చైల్డ్ అలైవ్ ఉద్యమం...
ప్రతీ ఏడాది జనవరి 1న చిన్నారుల జననాన్ని యూనిసెఫ్ ఒక వేడుకగా నిర్వహిస్తుంది. విరీ చైల్డ్ అలైవ్ పేరుతో ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. బిడ్డల్ని సంరక్షించడంలో నర్సులకి శిక్షణ ఇవ్వడానికి వెంటనే పెట్టుబడులు పెట్టడం, తల్లీ బిడ్డలకి సరైన పోషకాహారం, మందులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది.
2020, జనవరి 1న...
తొలి శిశువు జన్మించిన దేశం: ఫిజి
ఆఖరి శిశువు జన్మించిన దేశం: అమెరికా

ఏ దేశంలో ఎంతమంది పుట్టారు

 

దేశం

శిశు జననాల సంఖ్య

భారత్

67,385

చైనా

46,299

నైజీరియా

26,039

పాకిస్తాన్

16,787

ఇండోనేసియా

13,020

అమెరికా

10,452

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో

10,247

ఇథియోపియా

8,493

మరో ఏడేళ్లలో చైనాని దాటేస్తాం
2019 నాటికి చైనా జనాభా 143 కోట్లయితే, భారత్ జనాభా 137 కోట్లుగా ఉంది. ప్రపంచ జనాభాలో చైనా వాటా 19శాతమైతే, భారత్ వాటా 18శాతంగా ఉంది. 2027 నాటికి జనాభాలో చైనాని భారత్ దాటేస్తుందని యూనిసెఫ్ అంచనా వేస్తోంది. ఈ శతాబ్దం చివరినాటికి భారత్ 150 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే, చైనా110 కోట్లతో రెండో స్థానంలో, నైజీరియా 73 కోట్లతో మూడో స్థానంలో ఉండే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, పాకిస్తాన్‌లు ఉంటాయని చెప్పింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 780 కోట్లుగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020, జనవరి 1న శిశు జననాల్లో భారత్‌కు అగ్రస్థానం
ఎవరు : ఐక్యరాజ్యసమితికి చెందిన శిశు సంరక్షణ సంస్థ యూనిసెఫ్
ఎక్కడ : ప్రపంచంలో

107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జనవరి 3న 107వ ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. జనవరి 7 వరకు జరగనున్న ఈ కాంగ్రెస్‌ను ‘సైన్స్, టెక్నాలజీ, గ్రామీణాభివృద్ధిని అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. సదస్సుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్, కర్ణాటక సీఎం యడియూరప్ప, యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎస్.రాజేంద్ర ప్రసాద్, సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.ఎస్.రంగప్ప, వివిధ దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు హాజరయ్యారు.
సైన్స్ కాంగ్రెస్‌లో మోదీ ప్రసంగిస్తూ... ‘సృజనాత్మక ఉత్పత్తులను రూపొందించడం, వాటికి పేటెంట్ సాధించడం, పరిశ్రమ స్థాయిలో వాటిని ఉత్పత్తి చేయడం, అభివృద్ధి సాధించడం (ఇన్నోవేట్, పేటెంట్, ప్రొడ్యూస్, ప్రాస్పర్) అనే నాలుగు మార్గాలు దేశ పురోగతిని శీఘ్రతరం చేస్తాయని యువ శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు

  • శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించే పురోగతి పైననే దేశాభివృద్ధి ఆధారపడి ఉంది.
  • ప్రపంచ సృజనాత్మక సూచీలో భారత్ స్థానం 52కి చేరింది.
  • ప్లాస్టిక్‌కు చవకైన, పర్యావరణహిత ప్రత్యామ్నాయాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది.
  • 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందేందుకు పరిశ్రమల అవసరాలకు తగ్గ పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉంది.
  • మొబైల్‌ఫోన్లు, కంప్యూటర్ల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి విలువైన లోహాలను సమర్థంగా, చౌకగా వెలికితీయగల పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.


గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 111 శిశుమరణాలు
గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో 2019, డిసెంబర్ నెలలో 111 మంది శిశువులు మృత్యువాత పడ్డారు. దీనితో పాటు అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 88 మంది శిశువులు మరణించారు. ఈ విషయాన్ని గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి నితిన్ పటేల్ జనవరి 5న వెల్లడించారు. ప్రజల్లో అవగాహన లేమి, పౌష్ఠికాహారలోపం, చలితీవ్రత ఈ మరణాలకు కారణాలని ఆయన అన్నారు. రెండు దశాబ్దాలతో పోలిస్తే మరణాల సంఖ్య పెరిగిందన్నారు.
శిశుమరణాల గణాంకాలు..
రాజ్‌కోట్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో 2019, డిసెంబర్‌లో 388 మంది శిశువులు చేరగా, వారిలో 111 మంది మరణించారు. అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 2019, డిసెంబర్‌లో 415 మంది శిశువులు చేరగా, వారిలో 88 మంది మరణించారు.

కిర్లోస్కర్ జీవిత కథ యాంత్రిక్ కి యాత్ర ఆవిష్కరణ
కిర్లోస్కర్ బ్రదర్స్ సంస్థ వ్యవస్థాపకుడు లక్ష్మణ్‌రావ్ కిర్లోస్కర్ జీవిత కధ ‘యాంత్రిక్ కి యాత్ర హిందీ వెర్షన్‌ను, కిర్లోస్కర్ బ్రదర్స్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన పోస్టల్ స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో జనవరి 6న జరిగిన కిర్లోస్కర్ బ్రదర్స్ వందో వార్షికోత్సవ కార్యక్రమంలో మోదీ వీటిని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ... అవినీతికి పాల్పడుతున్న కొన్ని సంస్థలపై తీసుకుంటున్న చర్యలను కార్పొరేట్లపై కక్ష సాధింపుగా భావించరాదని స్పష్టం చేశారు.
ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ
దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో... ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో జనవరి 6న జరిగిన ఈ సమావేశంలో ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లు, వృద్ధి.. ఉపాధి కల్పనకు ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్, టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎల్‌అండ్‌టీ అధినేత ఏఎం నాయక్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభమైంది. భారత వ్యవసాయ పరిశోధనల సమాఖ్య (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర జనవరి 6న ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించారు. ఈ సమావేశంలో మహాపాత్ర ప్రసంగిస్తూ... రైతులు తమ సొంత ఖర్చులతో చేపట్టిన పరిశోధనలు, ఆవిష్కరణలను శాస్త్రీయంగా ప్రామాణీకరించేందుకు, కొత్త కొత్త ఆవిష్కరణలను అందరికీ చేరువ చేసేందుకు ఢిల్లీలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు ఆవిష్కరణల ప్రోత్సాహానికి ఫార్మర్స్ ఇన్నోవేషన్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయంలో యువత పాత్ర పెంచేందుకు ఐసీఏఆర్ ‘ఆర్య పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు.

శబరిమలపై ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు
శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం, ముస్లిం, పార్సీ మతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలో 9 మంది జడ్జీలు 2019, జనవరి 13 నుంచి ఆయా వ్యవహారాలపై వాదనలు విననుందని జనవరి 7న సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎంఎం శంతనగౌడర్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ ఆర్‌ఎస్‌రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లు ఉన్నారు. శబరిమల అంశంపై గతంలో వాదనలు విన్న ఏ న్యాయమూర్తి తాజాగా ఏర్పాటైన ధర్మాసనంలో లేరు.
అన్ని వయసుల వారిని శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తూ 2018లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సమీక్షించాలంటూ యువ న్యాయవాదుల అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది.

సీఏఐటీ సమావేశంలో నిర్మలా సీతారామన్
అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) జనవరి 7న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. పన్నుల వ్యవస్థను సులభతరంగా మార్చేందుకు, నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి వేధింపుల్లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. జీఎస్‌టీ రిటర్నుల దాఖలును మరింత మెరుగ్గా మార్చే దిశగా సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

మై టైమ్ ఎట్ సెబీ పుస్తకం విడుదల
మాజీ ఐఏఎఫ్ ఆఫీసర్, సెబీ మాజీ చైర్మన్ యు.కె. సిన్హా రచించిన ‘గోయింగ్ పబ్లిక్: మై టైమ్ ఎట్ సెబీ పుస్తకం విడుదలైంది. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. నియంత్రణ సంస్థలు సొంత ఆదాయ వనరులను కలిగి ఉండాలని, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లపై ఆధారపడ కూడదని సిన్హా తన పుస్తకంలో పేర్కొన్నారు. ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థ కార్యకలాపాలకు ఆర్థిక స్వాతంత్య్రం ప్రాథమిక అవసరమని వివరించారు.

మార్చి 12న వింగ్స్ ఇండియా 2020 సదస్సు
హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ వేదికగా మార్చి 12 - 15 తేదీల మధ్య ‘వింగ్‌‌స ఇండియా 2020సదస్సును నిర్వహించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయించింది. సదస్సు ఏర్పాట్లకు సంబంధించి జనవరి 9న ఢిల్లీలో సన్నాహక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు హాజరుకానున్నారు. దేశ వైమానిక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు వింగ్‌‌స ఇండియా సదస్సు ఉపయోగపడుతుందని కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది.

బొగ్గు గనులు చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1957, బొగ్గు గనులు (స్పెషల్ ప్రొవిజన్స్) చట్టం-2015లో సవరణలు చేస్తూ రూపొందించిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ జనవరి 8న ఆమోదం తెలిపింది. దీంతో బొగ్గుయేతర సంస్థలు కూడా బొగ్గు గనుల బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. అలాగే, అంతిమంగా బొగ్గు వినియోగంపైనా ఆంక్షలు ఉండవు. వాణిజ్య అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తి చేసేందుకు 2018లో ప్రైవేట్ కంపెనీలకూ అనుమతినిచ్చినప్పటికీ.. బొగ్గుపరిశ్రమయేతర సంస్థలను వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించలేదు.
కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు

  • ఉక్కు సంస్థ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ (ఎన్‌ఐఎన్‌ఎల్)లో ఆరు ప్రభుత్వ రంగ సంస్థల వాటాల వ్యూహాత్మక విక్రయానికి ఆమోదం. ఎన్‌ఐఎన్‌ఎల్‌లో ఎంఎంటీసీ, ఎన్‌ఎండీసీ, బీహెచ్‌ఈఎల్, ఎంఈసీవోఎన్, ఐపీఐసీవోఎల్, ఒడిషా మైనింగ్ కార్పొరేషన్‌లకు వాటాలు ఉన్నాయి.
  • గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదకు జాతీయ ప్రాధాన్య హోదా ఇవ్వాలని నిర్ణయం.


ప్రాంతీయం

అనంతపురంలో ఇండోస్పేస్ లాజిస్టిక్ పార్క్
ముంబైకి చెందిన గ్రేడ్-ఏ ఇండస్ట్రియల్, లాజిస్టిక్ పార్క్స్ డెవలపర్ ఇండోస్పేస్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో భారీ లాజిస్టిక్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. 30 ఎకరాల్లో ఈ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జనవరి 2న కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అనంతపురంతో పాటూ గుజరాత్‌లోని బెచరాజీ మండల్ స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్‌లో 40 ఎకరాల్లో, హరియాణాలోని సోహ్న టౌరూలో 50 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్‌లను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు.
ఇండోస్పేస్‌ను సింగపూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఎవర్‌స్టోన్ గ్రూప్ ప్రమోట్ చేస్తుంది. ప్రస్తుతం ఇండోస్పేస్‌కు పంజాబ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి 9 రాష్ట్రాల్లో 3.45 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 34 ఇండస్ట్రియల్, లాజిస్టిక్ పార్క్‌లున్నాయి.

మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఆటోబయోగ్రఫీ ఆవిష్కరణ
మాజీ డీజీపీ హెచ్.జె. దొర ఆటోబయోగ్రఫీ ‘జర్నీ థ్రూ టర్బులెంట్ టైమ్స్ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. దొర తన సర్వీసు కాలంలో ఎదుర్కొన్న క్లిష్టమైన సందర్భాలను వివరిస్తూ ఇతర పోలీసు అధికారులకు స్ఫూర్తినిచ్చేలా ఈ పుస్తకం రాశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జనవరి 2న జరిగిన పుస్తకావిష్కరణలో కేసీఆర్ మాట్లాడుతూ... సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యావిధానం ఉండాలని అభిలషించారు. మంచి సమాజాన్ని నిర్మించే క్రమంలో జీయర్ స్వామి లాంటి ధార్మికవేత్తలు, మాజీ డీజీపీల సలహాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యాసంస్థల్లో నైతిక విలువలు పెంపొందించే బోధనలు ప్రారంభిస్తామని ప్రకటించారు.

ఇయర్ ఆఫ్ ఏఐగా 2020 : మంత్రి కేటీఆర్
ఐటీ రంగంలో కృత్రిమ మేధస్సు వాటా భవిష్యత్‌లో రూ.1,284.2 లక్షల కోట్లకు చేరే అవకాశమున్న నేపథ్యంలో, అవకాశాలను అంది పుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో జనవరి 2న హైదరాబాద్‌లో జరిగిన ఏఐ-2020 లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ.. 2020ని ‘ఇయర్ ఆఫ్ ఏఐగా ప్రకటించారు. రాష్ట్రంలో ఏఐ సాంకేతికత వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
నాస్కామ్ నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుతం 2 బిలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ రంగం వాటా 2025 నాటికి 16 బిలియన్ డాలర్లకు చేరడంతో పాటు, 2021 నాటికి 8 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ తరఫున 2020ని ‘ఇయర్ ఆఫ్ ది ఏఐగా ప్రకటిస్తున్నాం.

  • ఐఐటీ హైదరాబాద్ తరహాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు, ఇతర విద్యా సంస్థల్లోనూ ఏఐని బోధిస్తాం.


ఫ్లెమింగో ఫెస్టివల్-2020 ప్రారంభం
విదేశీ విహంగాల విడిది కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని నేలపట్టులో ‘ఫ్లెమింగో ఫెస్టివల్-2020 జనవరి 3న ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల ప్రారంభకార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు. సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండల కేంద్రాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
విజయవాడ పుస్తక మహోత్సవం ప్రారంభం
31వ విజయవాడ పుస్తక మహోత్సవం ప్రారంభమైంది. విజయవాడ స్వరాజ్ మైదానంలో పది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించారు. పుస్తకాలు భావితరాలకు విజ్ఞాన నిక్షేపాలు వంటివని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. అంతకుముందు తెలుగువారి చరిత్ర పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు.

మహిళా రక్షణ-రోడ్డు భద్రత ఏడాదిగా 2020
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు, పిల్లల రక్షణతో పాటు రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. జనవరి 3న డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... 2020 సంవత్సరాన్ని మహిళా రక్షణ-రోడ్డు భద్రత సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఈచ్ వన్-టీచ్ వన్కార్యక్రమంలో పోలీసు శాఖ పాల్గొంటుందన్నారు. ఒక్కొక్క పోలీసు యూనిట్ కనీసం తమ పరిధిలోని 20 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.


ఏపీ సమగ్రాభివృద్ధిపై బీసీజీ సిఫార్సులు
ఆంధ్రప్రదేశ్ రాజధానితోపాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) జనవరి 3న తన నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించింది. రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రాధాన్యత, సహజ వనరులు, అభివృద్ధి అవకాశాలను విశ్లేషిస్తూ సమగ్రాభివృద్ధికి కీలక సూచనలు చేసింది. న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అందుకు ప్రభుత్వానికి రెండు ఆప్షన్లను సూచించింది. అమరావతి నిర్మాణం ఆర్థికంగా లాభదాయకం కాదని, పైగా రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందని.. అందువల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరవని పేర్కొంది.

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
2,059 వ్యాధులకు చికిత్స అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు ఇండోర్ స్టేడియంలో జనవరి 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ... వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అనేది దేశ ఆరోగ్య చరిత్రలోనే ఒక విప్లవం అని, ఈ దిశగా దేశంలోని 28 రాష్ట్రాలకన్నా మిన్నగా మరో అడుగు ముందుకు వేస్తూ.. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఈ పథకాన్ని వర్తింప చేస్తామని ప్రకటించారు.
సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ 1,059 రోగాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు 2,059కి పెంచుతూ పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నాం.
  • మూడు నెలలపాటు ఈ పైలట్ ప్రాజెక్టు కొనసాగుతుంది. ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిని అధిగమించి ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా ఒక్కో జిల్లాకు విస్తరిస్తూ వెళతాం.
  • ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో అదనంగా 200 రోగాలకు చికిత్సను విస్తరిస్తూ 1,259 వ్యాధులకు ఈ పథకం కింద చికిత్స అందిస్తాం.
  • ఏటా రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తున్నాం. ఈ మేరకు కోటి 42 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం.
  • రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 వేల నుండి 50 వేల మంది ఆశావర్కర్లను గ్రామ సెక్రటేరియట్ పరిధిలోకి తీసుకువచ్చి వారికి 300 - 350 ఇళ్లను కేటాయిస్తాం. ఈ ఇళ్లకు సంబంధించిన ఆరోగ్య బాధ్యతలు వారి చేతిలో పెడతాం.
  • ఇకపై ఆరోగ్యశ్రీలోకి క్యాన్సర్ చికిత్సను కూడా చేరుస్తున్నాం.
  • ఆరోగ్యశ్రీ కార్డులపై క్యూ ఆర్ బార్ కోడ్ ఇస్తున్నాం. కార్డు దారునికి సంబంధించిన మొత్తం మెడికల్ రిపోర్టులన్నీ ఆ కార్డులో నమోదయ్యేలా చర్యలు తీసుకున్నాం.


ఏపీలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు రెండు రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. జనవరి 4, 5 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా 3,636 మందికి పైగా బాలబాలికలను రక్షించారు. రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లలను గుర్తించి.. వారిని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు, అనాథలకు పునరావాసం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో పోలీసులతోపాటు మహిళా శిశు సంక్షేమ, కార్మిక, విద్యా, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, క్రీడా శాఖలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, శిశు సంరక్షణ కమిటీలు కూడా భాగస్వాములయ్యాయి.
ఆపరేషన్ ముస్కాన్ అంటే..
తల్లిదండ్రులు లేక కొందరు, ఇంటి నుంచి పారిపోయి వచ్చినవారు మరికొందరు అనాథల్లా జీవితం గడుపుతుంటారు. ఇలాంటివారిని రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో బహిరంగ ప్రదేశాల్లో గుర్తించడానికి పోలీసు బృందాలు, బాలల స్వచ్ఛంద సంస్థలు చేపట్టే కార్యక్రమాన్నే ఆపరేషన్ ముస్కాన్ అంటారు.
తెలంగాణలో ఆపరేషన్ స్మైల్
తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర పోలీస్ శాఖ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తప్పిపోయిన చిన్నారులను, బాల కార్మికులను గుర్తించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు చేపట్టిన కార్యక్రమమే ఆపరేషన్ స్మైల్.

2020 ఏడాదిలోనే టీ హబ్ 2 : మంత్రి కేటీఆర్
2020 సంవత్సరంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ 2, దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ టీ-వర్క్స్‌ని ప్రారంభించనున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. హైదరాబాద్‌లో జనవరి 6న జరిగిన టీ హబ్ నాలుగో వార్షికోత్సవ సంబరాల్లో మంత్రి ఈ మేరకు తెలిపారు. టెక్నాలజీ రంగంలో 2020 తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం కలిగిన సంవత్సరమని ఆయన పేర్కొన్నారు. ఇన్నోవేషన్ ద్వారా అనేక సవాళ్లకు సమాధానాలు లభిస్తాయని, తెలంగాణ స్టార్టప్ కంపెనీలు ఈ దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

వరంగల్‌లో మహీంద్రా, సైయంట్ సెంటర్లు ప్రారంభం
వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని ఐటీ సెజ్‌లో ఏర్పాటు చేసిన టెక్ మహీంద్రా, సైయంట్ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు జనవరి 7న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సైయంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్ నాని పాల్గొన్నారు.
ప్రారంభోత్సవంలో కేటీఆర్ మాట్లాడుతూ... ‘వరంగల్‌కు తొలుత ఒక్క సైయంట్ కంపెనీ వచ్చింది. ఆ తర్వాత టెక్ మహీంద్రా వచ్చింది. ఒక దాని తర్వాత మరో కంపెనీ వస్తుంది. హైదరాబాద్, వరంగల్ కాదు.. కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మంతో పాటు దశల వారీగా అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తాం అని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టామని, ఇప్పటికీ 12 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చామని, తద్వారా రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 13 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పించామని వివరించారు.

న్యూజిలాండ్ పార్లమెంటరీ కార్యదర్శితో కేటీఆర్ భేటీ
న్యూజిలాండ్ ఎత్నిక్ ఎఫైర్స్ శాఖ పార్లమెంటరీ కార్యదర్శి ప్రియాంక రాధాక్రిష్ణన్‌తో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో జనవరి 8న జరిగిన ఈ సమావేశంలో న్యూజిలాండ్, తెలంగాణలో రాజకీయ వ్యవస్థల పనితీరుపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలసి పనిచేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ రెండో దశను ఏర్పాటు చేస్తున్నామని, విదేశీ స్టార్టప్ వ్యవస్థలతో కలసి పనిచేసేందుకు ఉద్దేశించిన ‘టీ బ్రిడ్‌‌జను బలోపేతం చేస్తామన్నారు.
మా దేశానికి రండి..: తెలంగాణ వ్యవసాయ వర్సిటీతో కలసి పనిచేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ప్రియాంక వెల్లడించారు. తమ దేశంలో తెలంగాణ ఎన్నారైలతో కలసి పనిచేస్తున్నామని, బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించారు.

ద్వైపాక్షికం

సీఏఏపై వివరణ ఇచ్చాం : విదేశాంగ శాఖ
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్ (ఎన్నార్సీ)లకు సంబంధించి ప్రపంచ దేశాలకు వివరణ ఇచ్చామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ జనవరి 2న తెలిపారు. సీఏఏ, ఎన్నార్సీ భారత అంతర్గత వ్యవహారమని వివరించామని పేర్కొన్నారు. వివిధ దేశాల్లోని భారతీయ రాయబారులు, ఇతర హై కమిషన్ అధికారులు ఆయా ప్రభుత్వాలకు, అక్కడి మీడియాకు సీఏఏ, ఎన్నార్సీలకు సంబంధించి అవగాహన కల్పించారని వివరించారు. విదేశీ మీడియా ప్రచారం చేస్తున్నట్లు.. ఎన్నార్సీ చట్టం వల్ల భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఎలాంటి భంగం కలగబోదని చెప్పామన్నారు.

ఆస్ట్రేలియా ప్రధాని భారత పర్యటన వాయిదా
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ భారత పర్యటన వాయిదా పడింది. ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు నేపథ్యంలో భారత్ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు జనవరి 4న మారిసన్ ప్రకటించారు. రానున్న నెలల్లో ఇరు దేశాలకు కుదిరే మరో సమయంలో భేటీ జరుగుందని వెల్లడించారు. 2019, జనవరి 13న నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మారిసన్ భారత్‌కు రావాల్సి ఉంది. భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంది. భారత్‌తో భేటీ అనంతరం ఆయన జపాన్ పర్యటనకు కూడా వెళ్లాల్సి ఉండగా, ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.
23 మంది మృతి
ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకూ 23 మంది పౌరులు మృతి చెందారు. దీని నుంచి పౌరులను కాపాడేందుకు ఆ దేశ ప్రభుత్వం 3 వేల మంది మిలిటరీ రిజర్వ్ బలగాలను రంగంలోకి దించింది. కార్చిచ్చు గురించి ప్రధాని మోదీ జనవరి 3న మారిసన్‌తో మాట్లాడారు.

వ్యూహాత్మక అంశాలపై ట్రంప్, మోదీ చర్చలు
అమెరికా-భారత్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడంతో పాటు, ప్రాంతీయ భద్రతా వ్యవహారాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోదీ ఫోన్‌లో చర్చించారు. ఈ విషయాన్ని జనవరి 6న వైట్‌హౌజ్ వెల్లడించింది. భారత్‌తో ద్వైపాక్షిక అంశాలను బలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తానని ట్రంప్ చెప్పినట్లు పేర్కొంది.
ట్రంప్-మోదీల ఫోన్ కాల్‌పై ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) కూడా స్పందించింది. అమెరికా-భారత్ మైత్రి బలపడటమేగాక, ఇరుదేశాల ప్రయోజనాల దృష్ట్యా కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోదీ పేర్కొన్నారని తెలిపింది. వీరిరువురి ఫోన్ కాల్‌కు ముందు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో జనవరి 5న ఫోన్‌లో మాట్లాడారు.

శాంతికి భారత్ కృషి చేయాలి : ఇరాన్
ఇరాన్-అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ తీసుకునే ఎలాంటి శాంతి చర్యలనైనా ఇరాన్ స్వాగతిస్తుందని భారత్‌లో ఆ దేశ రాయబారి అలీ చెగెనీ పేర్కొన్నారు. ఇరాన్-అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగబోవని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. సులేమానీకి నివాళులర్పించేందుకు ఇరాన్ ఎంబసీలో జనవరి 9న ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో చెగెనీ ఈ మేరకు మాట్లాడారు.
ఇరాక్ వెళ్లకండి : భారత్
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాక్ వెళ్లాలనుకునే పర్యాటకులకు భారత్ జనవరి 9న పర్యాటక సూచన జారీ చేసింది. ‘అంతగా అవసరం లేని ప్రయాణమైతే రద్దు చేసుకోండి అని ఇరాక్ వెళ్లే భారత ప్రయాణీకులకు భారత విదేశాంగ శాఖ సూచించింది. ఇరాక్‌లోని భారతీయులు సైతం జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు అస్సలు చేయవద్దని సూచించింది.

ఆర్థికం

ఆస్తుల వేలానికి ఈ-బిక్రయ్ పోర్టల్ ప్రారంభం
ప్రభుత్వరంగ బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విక్రయానికి వీలుగా అభివృద్ధి చేసిన ఏకీకృత పోర్టల్ ‘ఈ-బిక్రయ్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 2న ప్రారంభించారు. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో పీఎస్‌బీలు రూ.2.3 లక్షల కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. వీటిని మరింత పారదర్శకంగా వేలం వేసి, అదనపు విలువను పొందేందుకు వీలుగా ఈ-బిక్రయ్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ఈ-ఆక్షన్ పోర్టళ్లకు ఇది అనుసంధానంగా వ్యవహరిస్తుంది.

జీడీపీ వృద్ధి 5 శాతం లోపే : ఎన్‌ఎస్‌ఓ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20లో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5 శాతం దిగువనే నమోదవుతుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) అంచనా వేసింది. ఈ మేరకు జనవరి 7న జాతీయ ఆదాయ తొలి ముందస్తు అంచనాలను వెలువరించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటు 6.8 శాతంగా నమోదైంది. జీడీపీ వృద్ధిరేటు 5 శాతం దిగువకు పడిపోతే అది 11 సంవత్సరాల కనిష్టస్థాయి అవుతుంది.
తలసరి ఆదాయ వృద్ధి 6.8 శాతం
భారత్ నెలవారీ తలసరి ఆదాయం 2019-20లో 6.8 శాతం పెరిగి రూ.11,254కు చేరుతున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ అంచనావేసింది. 2018-19లో తలసరి ఆదాయం రూ.10,534గా ఉంది. వార్షికంగా చూస్తే, తలసరి ఆదాయం 6.8 శాతం వృద్ధితో రూ. 1,26,406 నుంచి రూ.1,35,050కి పెరుగుతుంది.

సైన్స్ అండ్ టెక్నాలజీ


చిత్రదుర్గ జిల్లాలో గగన్‌యాన్ శిక్షణ కేంద్రం
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లెకెరెలో గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం అదనపు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) జనవరి 6న తెలిపింది. ‘హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్గా పిలిచే ఈ కేంద్రం నుంచి గగన్‌యాన్‌కు సంబంధించిన కార్యక్రమాలతోపాటు వ్యోమగాములకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. గగన్‌యాన్ ద్వారా 2022 నాటికి ముగ్గురు భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నారు.
భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే 2022 నాటికి లేదా అంతకంటే ముందే సొంత సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయుడిని అంతరిక్షంలోకి పంపుతామని 2018, ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.
గగన్‌యాన్- ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది.
  • ప్రయోగంలో సాంకేతిక సాయం కోసం రష్యా, ఫ్రాన్స్ లతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది.
  • సంస్కృత పదం వ్యోమ్(అంటే అంతరిక్షం అని అర్థం) ఆధారంగా అంతరిక్షంలోకి వెళ్లే భారతీయులను ‘వ్యోమ్‌నాట్స్ అని వ్యవహరిస్తారు.
  • జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా గగన్‌యాన్ ప్రయోగం చేపట్టనున్నారు.
  • ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనాల తర్వాత సొంత పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి మానవుడిని విజయవంతంగా పంపిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది.
  • ఈ ప్రాజెక్టు కోసం రూ.10,000 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది.


డీఎఫ్‌ఆర్‌ఎల్‌లో వ్యోమగాముల ఆహారం తయారు
ఇస్రో 2020 ఏడాది ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గగన్‌యాన్ ప్రయోగంలో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల కోసం మైసూరుకు చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎఫ్‌ఆర్‌ఎల్) పలు రకాల ఆహార పదార్థాలను సిద్ధం చేయనుంది. ఇస్రో, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వంటకాలు తయారు చేయనుంది. ఇడ్లీ సాంబార్, ఎగ్ రోల్స్, వెజ్ రోల్స్, వెజ్ పులావ్‌తో పాటు మాంసాహారాన్ని వండిపెట్టనుంది. 32 ఆహార పదార్థాల జాబితాను ఇస్రోకు పంపించింది. ఈ ఆహారాలు కొన్ని నెలల పాటు పాడవకుండా, తాజాగా, పోషకాలతో ఉంటాయని డీఎప్‌ఆర్‌ఎల్ తెలిపింది.

అవార్డులు

తెలంగాణ విద్యార్థిని అంజలికి ఇన్ఫోసిస్ అవార్డు
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని దారావత్ అంజలి ప్రఖ్యాత ‘ఇన్ఫోసిస్ ఫౌండేషన్-ఇస్కా ట్రావెల్ అవార్డు లభించింది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వార్షిక సమావేశం సందర్భంగా జనవరి 4న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో అంజలికి ఇజ్రాయెల్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి అవార్డు గ్రహీత ప్రొఫెసర్ ఆదా ఈజునాథ్, ఇస్కా అధికారులు ఈ అవార్డును అందజేశారు. కార్యక్రమానికి ప్రముఖ శాస్త్రవేత్త భారతరత్న అవార్డు గ్రహీత సీఎస్.రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ద్వారా ఏటా 10 మంది విద్యార్థులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్-ఇస్కా ట్రావెల్ అవార్డును అందజేస్తారు.

క్రీడలు

హాకీకి సునీతా లక్రా వీడ్కోలు
భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్, డిఫెండర్ సునీతా లక్రా(28) ఆటకు వీడ్కోలు పలికింది. కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఆమె జనవరి 2న ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. గాయం తగ్గాక తిరిగి దేశవాళీ టోర్నీల్లో ఆడనున్నట్లు పేర్కొంది. దీంతో టోక్యోకు వెళ్లే ఒలింపిక్ జట్టుకు లక్రా దూరం కానుంది. 2008లో జాతీయ జట్టులో ప్రవేశించిన లక్రా ఇప్పటివరకూ 139 మ్యాచ్‌లు ఆడింది. 2018లో ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఒలింపిక్స్‌లో కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన లక్రా 2014 ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన జట్టులో సభ్యురాలుగా ఉంది.

టీటీ ర్యాంకింగ్స్ లో మానవ్ ఠక్కర్‌కు అగ్రస్థానం
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) జనవరి 3న విడుదల చేసిన ‘అండర్-21 పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో భారత మానవ్ ఠక్కర్ అగ్రస్థానంలో నిలిచాడు. 2019, డిసెంబర్‌లో జరిగిన నార్త్ అమెరికా ఓపెన్ టోర్నీలో మానవ్ విజేతగా నిలిచాడు. దాంతో తాజా ర్యాంకింగ్‌‌సలో మానవ్ తొమ్మిది స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్‌ను అధిరోహించాడు. గతంలో భారత్ తరఫున అండర్-21 విభాగంలో హర్మీత్ దేశాయ్, సత్యన్, సౌమ్యజిత్ ఘోష్ ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచారు.
రోహిత్ శర్మ పేరుతో క్రికెట్ స్టేడియం
భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరుతో క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ పంచాయతీలోని శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో ఈ స్టేడియానికి జనవరి 3న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రోహిత్ శర్మ, అతడి భార్య రితిక పాల్గొన్నారు. దేశానికి ఉత్తమ క్రీడాకారులను అందించే లక్ష్యంతో స్టేడియం, శిక్షణ కేంద్రం నిర్మించబోతున్నట్లు మిషన్ మార్గదర్శకుడు కమలేష్ పటేల్ తెలిపారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు
అంతర్జాతీయ క్రికెట్‌కు భారత ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు పలికాడు. క్రికెట్లోని అన్ని రకాల ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు జనవరి 4న ఇర్ఫాన్ ప్రకటించాడు. మేటి ఆల్‌రౌండర్‌గా పేరుతెచ్చుకున్న 35 ఏళ్ల పఠాన్ 2003లో ఆస్ట్రేలియాపై అడిలైడ్ టెస్టులో అరంగేట్రం చేశాడు. 2012లో తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఇర్ఫాన్... 2019 ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టి20 క్రికెట్ టోర్నీలో జమ్మూకశ్మీర్ తరఫున చివరిసారిగా దేశవాళీ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టి20 వరల్డ్ కప్‌లో భారత్ విశ్వవిజేతగా అవతరించడంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం ఇర్ఫాన్ క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ గణాంకాలు

వివరాలు

టెస్టులు

వన్డేలు

టి20లు

ఆడిన మ్యాచ్‌లు

29

120

24

చేసిన పరుగులు

1105

1544

172

బ్యాటింగ్ సగటు

31.57

23.39

24.57

బౌలింగ్ ఎకానమీ

3.28

5.26

8.02


మగేశ్ చంద్రన్‌కు హేస్టింగ్‌‌స చెస్ టైటిల్
ఇంగ్లండ్‌లోని హేస్టింగ్‌‌స వేదికగా 95వ ‘హేస్టింగ్‌‌స ఇంటర్నేషనల్ చెస్ టోర్నీలో తమిళనాడుకు చెందిన గ్రాండ్ మాస్టర్ మగేశ్ చంద్రన్ టైటిల్ గెలుచుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి మగేశ్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రొమైన్ ఎడ్యుర్డ్(ఫ్రాన్స్) 7 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, 6.5 పాయింట్లు సాధించిన మరో నలుగురు క్రీడాకారులు మూడో స్థానం పంచుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న మగేశ్ టోర్నీలో అజేయంగా నిలిచాడు. మొత్తం తొమ్మిది రౌండ్లలో 6 గెలిచి, 3 డ్రా చేసుకున్నాడు.

టోక్యో ఒలింపిక్స్‌కు హార్స్ రైడర్ మీర్జా అర్హత
2020 టోక్యో ఒలింపిక్స్ ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడలు) ఈవెంట్‌లో భారత హార్స్ రైడర్ ఫౌద్ మీర్జా అర్హత సాధించాడు. ఈక్వెస్ట్రియన్ స్పోర్‌‌ట్స ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ప్రకటించిన ర్యాంకింగ్‌‌స ప్రకారం ఫౌద్ మీర్జా టోక్యో ఒలింపిక్స్‌కు అధికారికంగా బెర్త్ ఖాయం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ కోసం 2019 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 మధ్య కాలంలో కనబరిచిన ప్రదర్శనను లెక్కలోకి తీసుకున్నారు.
ఫౌద్ మీర్జాకంటే ముందు భారత్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఒలింపిక్స్ ఈక్వెస్ట్రియన్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ఇంతియాజ్ అనీస్... 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో ఐజే లాంబా భారత్ తరఫున ఈక్వెస్ట్రియన్ ఈవెంట్‌లో బరిలోకి దిగారు.

వెయిట్‌లిఫ్టర్ సరబ్‌జిత్‌పై నాలుగేళ్ల నిషేధం
భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ సరబ్‌జిత్ కౌర్ (71 కేజీలు)పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రే రకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో జనవరి 8న ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో జరిగిన మహిళల సీనియర్ జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ సందర్భంగా ఆమె నుంచి రక్తమూత్ర నమూనాల్ని సేకరించి పరీక్షించారు. ఇందులో నిషేధిత ఉత్ప్రేరకాలను సరబ్‌జిత్ తీసుకున్నట్లు తేలింది.

వార్తల్లో వ్యక్తులు

ఏపీ దిశ చట్టం స్పెషల్ ఆఫీసర్లుగా శుక్లా, దీపిక
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన ఏపీ దిశ చట్టం-2019 అమలు కోసం ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జనవరి 2న ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ విభాగంలో ప్రస్తుతం మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరక్టరుగా ఉన్న కృతికా శుక్లాను దిశ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. అలాగే ఐపీఎస్ విభాగంలో కర్నూలు ఏఎస్‌పీగా ఉన్న ఎం.దీపికను గుంటూరు సీఐడీ విభాగంలో ఏడీజీగా బదిలీ చేసి దిశ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు.
అమలుకు రూ.87 కోట్లు కేటాయింపు
దిశ చట్టం అమలు కోసం రూ.87 కోట్లు కేటాయిస్తూ జనవరి 1న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలు, బాలలపై జరిగే క్రూరమైన లైంగిక నేరాల సత్వర విచారణకు వీలుగా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు, మహిళా పోలీసుస్టేషన్ల ఉన్నతీకరణ, ఫోరెన్సిక్ ప్రయోగశాలల బలోపేతం, దిశ కాల్‌సెంటర్, దిశ యాప్‌ల కోసం ఈ నిధులు మంజూరు చేసింది. అందులో రూ.23.52 కోట్లతో మంగళగిరిలో ఉన్న రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాల, విశాఖపట్నం, తిరుపతిలో ఉన్న ప్రాంతీయ ఫోరెన్సిక్ ప్రయోగశాలల్లో డీఎన్‌ఏ, సైబర్ విభాగాలను ఏర్పాటు చేస్తారు.

ఎన్‌ఎంసీ తొలి చైర్మన్‌గా డాక్టర్ సురేశ్ చంద్ర శర్మ
నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) తొలి చైర్మన్‌గా ఢిల్లీ ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్)లో చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ) విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ సురేశ్ చంద్ర శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు జనవరి 2న కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శర్మ మూడేళ్ల పాటు కానీ లేదా తనకు 70 ఏళ్ల వయసు వచ్చేవరకు కానీ ఆ పదవిలో ఉంటారు. ఎన్‌ఎంసీకి ఒక చైర్ పర్సన్, 10 మంది ఎక్స్ అఫిషియొ సభ్యులు ఉంటారు.
వైద్య విద్య నియంత్రణ సంస్థ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో ఎన్‌ఎంసీను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలు రావడంతో 2018లో ఎంసీఐని రద్దు చేశారు.

తైవాన్ సైన్యాధ్యక్షుడు షెన్ యి దుర్మరణం
తైవాన్‌లో జరిగిన సైనిక హెలికాప్టర్ ప్రమాదం కారణంగా తైవాన్ సైన్యాధ్యక్షుడు షెన్ యి-మింగ్(62)తో సహా మరో ఎనిమిది మంది సైనికాధికారులు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదు మంది గాయాల పాలయ్యారు. తైవాన్‌కు ఈశాన్య ప్రాంతంలోని సైనికులను స్వయంగా కలసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు జనవరి 1న సైన్యాధ్యక్షుడితో పాటు మరో 12 మంది అధికారులు హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. ఈ క్రమంలో రాజధాని తైపీకి సమీపంలోని కొండల్లో హెలికాఫ్టర్ అదృశ్యమైంది. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా హెలికాఫ్టర్ కూలిన ప్రదేశాన్ని జనవరి 2న గుర్తించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయాలతో బయటడినట్లు ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీగా సీతారామాంజనేయులు

ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డెరైక్టర్ జనరల్(డీజీ)గా పి.సీతారామాంజనేయులు నియమితులయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సెక్రటరీ, రవాణా శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతల్లో ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జనవరి 4న ఉత్తర్వులు జారీ చేశారు. సీతారామాంజనేయులు ప్రస్తుతం రవాణాశాఖ కమిషనర్‌గా ఉన్నారు. కాగా, ఇప్పటివరకు ఏసీబీ డీజీగా ఉన్న కుమార్ విశ్వజిత్‌ను డీజీపీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అంతర్జాతీయం


బ్రెగ్జిట్‌కు బ్రిటన్ పార్లమెంటు ఆమోదం
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. హౌజ్ ఆఫ్ కామన్స్ లో జనవరి 9న జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్ బిల్లుకు అనుకూలంగా 330 ఓట్లు, వ్యతిరేకంగా 231 ఓట్లు వచ్చాయి. దీంతో 2020 జనవరి 31న ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు అవకాశం కలిగింది. ఈయూ నుంచి వేరుపడ్తున్న తొలి దేశంగా బ్రిటన్ నిలవనుంది. ఇక బ్రెగ్జిట్ బిల్లు హౌజ్ ఆఫ్ లార్డ్స్, యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే, అది లాంఛనమేనని భావిస్తున్నారు.
వాదోపవాదాలు..
బ్రెగ్జిట్‌పై తొలి నుంచి వాదోపవాదాలు కొనసాగాయి. ఈయూ నుంచి విడిపోతే బ్రిటన్ సామాన్య దేశంగా మిగిలిపోతుందని, వాణిజ్యపరంగా నష్టపోతుందని పలువురు వాదించగా.. బ్రెగ్జిట్‌తో బ్రిటన్‌కు లాభమేనని, గతవైభవం సాధించేందుకు ఇదే మార్గమని మరి కొందరు వాదించారు.
విమానాన్ని పొరపాటున కూల్చేశాం : ఇరాన్
ఉక్రెయిన్ విమానాన్ని తాము పొరపాటున కూల్చేశామని ఇరాన్ తెలిపింది. మానవ తప్పిదం కారణంగా పేలిన క్షిపణులు బోయింగ్ 737ను ఢీకొన్నాయని, ఫలితంగా అది కుప్పకూలిపోయి 176 మంది మరణాలకు కారణమైందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ జనవరి 11న ప్రకటించారు. ఈ సంఘటన క్షమించరాని తప్పిదం అని అంగీకరించారు. తాము జరిపిన సైనిక విచారణలో తప్పిదం విషయం తెలిసిందని చెప్పారు. ఇరాన్ ఒప్పుకోలుపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ.. బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేయగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెన్‌స్కీ బాధ్యులను శిక్షించాలని, మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని కోరారు.
2020, జనవరి 8న టెహ్రాన్‌లోని ఎయిర్‌పోర్ట్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు బయలుదేరిన ఉక్రెయిన్ ప్రయాణికుల విమానం టేకాఫ్ తీసుకున్న రెండు నిమిషాల్లో కూలడం, అందులోని 176 మంది మరణించడం తెల్సిందే. అయితే ఈ ప్రమాదానికి తమకు సంబంధం లేదని ఇరాన్ ఇన్నిరోజులూ చెప్పింది.

ఖతార్ ఎమిర్‌తో ఇరాన్ అధ్యక్షుడు భేటీ
ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానితో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ భేటీ అయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జనవరి 13 జరిగిన ఈ సమావేశంలో ప్రాంతీయంగా నెలకొన్న సంక్షోభం, ఉద్రిక్తతల గురించి ఇరువురు నేతలు చర్చించారు. అమెరికాతో ఉద్రిక్తతలు తగ్గాలనే తాము కోరుకుంటున్నామని రౌహానీ ప్రకటించారు. అయితే, అగ్రరాజ్యంతో చర్చలు మాత్రం అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసిన తరువాతేనని స్పష్టం చేశారు. ‘ఉద్రిక్తతలు తగ్గేందుకు, చర్చలు జరిగేందుకు అంతా కృషి చేయాలి. అదొక్కటే ఈ సంక్షోభానికి పరిష్కారం అని ఖతార్ ఎమిర్ వ్యాఖ్యానించారు. ఖతార్ అమెరికాకు, ఇరాన్‌కు నమ్మకమైన మిత్రదేశం. ఈ ప్రాంతంలో అమెరికా అతి పెద్ద మిలటరీ బేస్ ఖతార్‌లోనే ఉంది.
అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి
ఇరాక్‌లోని అమెరికా సైనికులున్న స్థావరం లక్ష్యంగా ఇరాన్ మళ్లీ దాడికి దిగింది. బాగ్దాద్‌కు 80 కి.మీ.ల దూరంలోని అల్ బలాద్ వైమానిక దళ స్థావరంపై జనవరి 13న 8 ‘కాట్యూషా తరహా రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడిలో ఇరాక్ సైన్యానికి చెందిన ఇద్దరు అధికారులు, ఇద్దరు ఎయిర్‌మెన్ గాయపడ్డారు. అల్ బలాద్ ఇరాక్ ఎఫ్ 16 యుద్ధ విమానాల ప్రధాన కేంద్రం. ఇక్కడ అమెరికా వైమానిక దళానికి చెందిన చిన్న బృందం, కొందరు అమెరికా కాంట్రాక్టర్లు ఉన్నారు.


జాతీయం


రాజకీయం-దనబలం సదస్సు ప్రారంభం
హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) ప్రాంగణంలో ‘రాజకీయాల్లో ధనబలం(మనీ పవర్ ఇన్ పాలిటిక్స్)అంశంపై ఏర్పాటు చేసిన రెండ్రోజుల సదస్సును ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు జనవరి 9న ప్రారంభించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్, ఐఎస్‌బీల ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. సదస్సులో వెంకయ్య మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా పంచాయతీ నుంచి లోక్‌సభ వరకు ఒక వారం వ్యవధిలో ఎన్నికలు నిర్వహించేలా చూస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ఏడాదంతా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో వీటిపైనే పార్టీలు దృష్టి పెట్టడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందన్నారు.

ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఇంటర్నెట్ ప్రజల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ-బిజినెస్ నిర్వహించడం ఇటీవల కాలంలో ఇంటర్నెట్ ద్వారా ఎక్కువగా జరుగుతోందని, ఆ సేవల్ని నిరవధికంగా నిలిపివేయకూడదని స్పష్టం చేసింది.
జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత ఇంటర్నెట్ తదితరాలపై విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
‘జమ్మూకశ్మీర్-ఇంటర్నెట్ పిటిషన్లను విచారించిన జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం జనవరి 10న తీర్పు వెలువరించింది. కశ్మీర్‌లో ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షల్ని వారంలోగా సమీక్షించాలని కశ్మీర్ పాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది. అత్యవసర సేవలైన ఆసుపత్రులు, విద్యాసంస్థలతో పాటుగా ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఈ బ్యాంకింగ్ రంగంలో ఇంటర్నెట్‌ను తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించింది.
ఆర్టికల్ 19(1)
భావప్రకటనా స్వేచ్ఛ, ఏదైనా వృత్తిని చేపట్టే స్వేచ్ఛ, ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యాపార లావాదేవీలన్నింటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1), ఆర్టికల్ 19(1)(జీ) రక్షణ కల్పిస్తోందని జస్టిస్ ఎన్వీ రమణ తన 130 పేజీల తీర్పులో పేర్కొన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలు
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 2020, జనవరి 10న అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మత వివక్ష ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, సిఖ్, జైన్, పార్శీ, క్రిస్టియన్, బౌద్ధ మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు.
దేశవ్యాప్తంగా ఆందోళనలు
పౌరసత్వ సవరణ బిల్లు-2019కు 2019, డిసెంబర్ 12న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దాంతో ఈ బిల్లు పౌరసత్వ (సవరణ) చట్టంగా మారింది. అయితే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ చట్టంలో ముస్లింల పట్ల వివక్ష ఉందని పేర్కొంటూ ఆందోళనలు జరుగుతున్నాయి.

హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో భారత్‌కు 84వ స్థానం
హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ జనవరి 7న విడుదల చేసిన ‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్(హెచ్‌పీఐ)-2020లో భారత పాస్‌పోర్టుకు 84వ స్థానం లభించింది. భారత్ 58 స్కోరుతో మౌరిటానియా, తజకిస్థాన్ దేశాలతో 84వ ర్యాంకును పంచుకుంది. భారత పాస్‌పోర్ట్‌తో ముందస్తు వీసా లేకుండా 58 దేశాల్లో పర్యటించొచ్చని ఈ స్కోరు సూచిస్తుంది.
హెచ్‌పీఐ-2020లో జపాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్‌పోర్టుతో ఏకంగా 191 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించొచ్చు. ఈ జాబితాలో సింగపూర్ (190 దేశాల్లో పర్యటించే వీలు).. జర్మనీ, దక్షిణ కొరియా (189), ఫిన్లాండ్, ఇటలీ (188), డెన్మార్క్, లగ్జెంబర్గ్, స్పెయిన్ (187) టాప్-5లో నిలిచాయి. అఫ్గానిస్థాన్ పాస్‌పోర్టు చిట్టచివరి స్థానంలో ఉంది. ఇక అమెరికా, బ్రిటన్ ఎనిమిదో ర్యాంకు దక్కించుకున్నాయి.


వాయుసేనకు 200 జెట్ విమానాలు
భారత వైమానిక దళంలోకి మరో 200 యుద్ధ విమానాలను చేర్చనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ జనవరి 12న వెల్లడించారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారుచేసే 83 ఎల్‌సీఏ తేజస్ మార్క్ 1ఏ విమానాల కాంట్రాక్టు తుది దశలో ఉందన్నారు. మొత్తంగా 200 విమానాలను తీసుకొనే ప్రక్రియ సాగుతోందన్నారు. ఎల్‌సీఏ మార్క్ 1ఏ విమానాల డిజైన్ పూర్తయినందున ఉత్పత్తిని ఏడాదికి 16కి పెంచుతుందన్నారు.

బేళూరు మఠంలో యువజన దినోత్సవం
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న కోల్‌కతాలో రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయం బేళూరు మఠంలో జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వివాదాస్పదం కావడం వల్లే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని, పాకిస్తాన్‌లో మైనార్టీలపై జరుగుతున్న మతపరమైన హింస అన్ని దేశాలకు తెలిసి వచ్చిందన్నారు. పాకిస్తాన్ 70 ఏళ్లుగా తమ దేశం లో మైనార్టీలపై సాగిస్తున్న హింసాకాండకు ఆ దేశమే సమాధానమివ్వాలని అన్నారు. సీఏఏ ఎవరి పౌరసత్వాన్ని తీసుకోదని, ఆ చట్టం పౌరసత్వాన్ని ఇస్తుందని అన్నారు.

కోల్‌కతా పోర్టు ట్రస్టు పేరు మార్పు
కోల్‌కతా పోర్టు ట్రస్టు 150 వసంతాలు పూర్తి చేసుకున్న జనవరి 12న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కోల్‌కతా పోర్టు ట్రస్ట్ పేరుని జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టుగా మారుస్తున్నట్టు ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు.
కరెన్సీ బిల్డింగ్ ప్రారంభం
కోల్‌కతాలో పునర్నిర్మించిన బ్రిటిష్ కాలంనాటి మూడంతస్తుల కరెన్సీ బిల్డింగ్‌తో పాటు బెల్వెడెరె హౌస్, మెట్‌కాఫ్ హాల్, విక్టోరియా మెమోరియల్ హాల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 11 ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... దేశాన్ని వారసత్వ పర్యాటక కేంద్రంగా మారుస్తామని, ప్రపంచానికి మన ఘనతను చాటుతామని అన్నారు. దేశంలోని కొన్ని పురాతన మ్యూజియంలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. డీమ్డ్ వర్సిటీ హోదాతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్ష
కేరళలోని శబరిమల ఆలయంతోపాటు వేర్వేరు మతాల్లో, ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించి ఏయే అంశాలపై చర్చించాలో నిర్ణయించేందుకు 2020, జనవరి 17న సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా దేశ అత్యున్నత న్యాయస్థానం నలుగురు సీనియర్ న్యాయవాదులను జనవరి 13న ఆదేశించింది. ఇదే సమయంలో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేది లేదని స్పష్టం చేసింది.
‘‘శబరిమల కేసులో తీర్పును సమీక్షించబోవడం లేదు. గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రస్తావించిన అంశాలను పరిగణిస్తున్నాం అని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం తెలిపింది. మతపరమైన వ్యవహారాల్లో న్యాయస్థాన జోక్యం ఎంతవరకూ ఉండాలన్న దానిపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం కొన్ని అంశాలను లేవనెత్తిందని, వాటిపై మాత్రమే తాము విచారణ చేపడతామని తెలిపింది. ప్రార్థన స్థలాల్లో మహిళలు, బాలికల ప్రవేశంపై నిషేధం ఒక్క శబరిమలకు మాత్రమే పరిమితం కాలేదని గతంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పరిశీలనకు ఇవి..: మసీదుల్లో మహిళల ప్రవేశం, దావూదీ బోహ్రా తెగల్లో మహిళల జననాంగాల విచ్చిత్తి, పార్శీ మహిళను పెళ్లాడిన పార్శీయేతర పురుషులకు వారి ప్రార్థన స్థలంలో ప్రవేశంపై నిషేధం వంటి పలు అంశాలపై దాఖలైన పిటిషన్లను వేరుగా విచారించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీలతో కూడిన నలుగురు సీనియర్ న్యాయవాదులు సమావేశమై ఏయే అంశాలపై తాము విచారణ జరపాలో సూచించాలని ఆదేశాలు జారీ చేసింది.

డ్రోన్ల రిజిస్ట్రేషన్‌పై విమానయాన శాఖ ఆదేశాలు
దేశంలో డ్రోన్లను కలిగి ఉన్న వ్యక్తులందరూ 2020, జనవరి 31లోగా స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకోవాలని కేంద్ర విమానయాన శాఖ జనవరి 13న తెలిపింది. నిర్దేశిత గడువులోగా రిజిస్టర్ చేసుకోని డ్రోన్ల ఆపరేటర్లపై ఐపీసీ సెక్షన్, ఎయిర్‌క్రాఫ్ట్ చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆన్‌లైన్ విధానంలో డ్రోన్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. డీజీసీఏ నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇరాన్ సైనిక దళ కమాండర్ ఖాసీం సులేమానీపై అమెరికా డ్రోన్ సాయంతో హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రోన్ ఆపరేటర్లకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

ప్రభుత్వ సంస్థల్లో ఇక నుంచి యోగా బ్రేక్ ...
వృత్తి నిపుణుల్లో పని ఒత్తిడిని తగ్గించడానికి రూపొందించిన 5 నిమిషాల యోగా విరామం (వై-బ్రేక్) త్వరలోనే ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో అమల్లోకి రానుంది. ఈ యోగా బ్రేక్‌లో 5 నిమిషాల్లో పూర్తి చేయగల కొన్ని తేలికై న వ్యాయామాలుంటాయి. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా విద్యాలయం, యోగా నిపుణుల సాయంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఈ వై-బ్రేక్ ప్రొటోకాల్ ట్రయల్స్‌ను జనవరి 13న ప్రారంభించింది. ఇందులో పాల్గొనడానికి టాటా కెమికల్స్, యాక్సిస్ బ్యాంక్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్ తదితర 15 సంస్థలు ఆసక్తి చూపించాయని ఓ అధికారి తెలిపారు. ఈ వై-బ్రేక్ అనేది యోగా కోర్సు కాదని, కానీ కోర్సుకు సంక్షిప్త ప్రారంభ మాడ్యూల్ అని పేర్కొన్నారు. యోగా ప్రొటోకాల్స్ తయారీ ప్రక్రియ 3 నెలల క్రితమే తయారైందని తెలిపారు. వై-బ్రేక్ అభ్యాసంలో భాగంగా ఒక బుక్‌లెట్ తయారు చేశామని, పనిస్థలాల్లో ఎలా ఉండాలో దానికి సంబంధించిన స్థితులతో కూడిన వీడియో చిత్రాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.


ప్రాంతీయం

జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభమైంది. చిత్తూరులో జనవరి 9న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది.
అమ్మఒడి ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ... రాష్ట్రంలో అమ్మఒడి పథకం ద్వారా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని అన్నారు. పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని చెప్పారు. 14 ఏళ్ల లోపు పిల్లలకు విద్య ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ పేర్కొన్నప్పటికీ, పేదరికం కారణంగా చాలా మందికి పిల్లలను చదివించే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పేదింటి తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకే అమ్మఒడిని తీసుకొచ్చామన్నారు.
ముఖ్యమంత్రి ప్రసంగం-ముఖ్యాంశాలు

  • అమ్మఒడి పథకం కింద దాదాపు 42,12,186 లక్షల మంది తల్లులు, 81,72,224 లక్షల మంది పిల్లలకు మేలు చేకూరుతుంది.
  • ఈ పథకానికి రూ.6,456 కోట్లు కేటాయించాం.
  • ఈ పథకంలో విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఏడాది మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి 75 శాతం హాజరు తప్పనిసరి.
  • రాబోయే జూన్‌లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేశాం.
  • విద్యార్థులకు మంచి చదువుతోపాటు పౌష్టికాహారం కూడా ముఖ్యమే. అందుకే మధ్యాహ్న భోజనం మెనూలో మార్పు తేవాలని సంకల్పించాం. సంక్రాంతి సెలవుల తర్వాత నుంచి కొత్త మెనూ అమలు చేస్తాం.
  • మెనూ మార్పు ద్వారా దాదాపు రూ.200 కోట్లు అదనపు భారం పడుతుంది.
  • రాష్ట్రంలో చదువుల విప్లవం కోసం 45 వేల పాఠశాలు, 471 జూనియర్ కళాశాలలు, 3,287 హాస్టళ్లు, 148 డిగ్రీ కళాశాలల్లో నాడు-నేడు ద్వారా మార్పు తెస్తాం.

ఇంగ్లాండ్ సంస్థలతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం
ఇంగ్లాండ్‌కు చెందిన నేషనల్ హెల్త్ సిస్టమ్స్, హెల్త్ ఎడ్యుకేషన్ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం...రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు ఇంగ్లాండ్ సంస్థలు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఇవ్వనున్నాయి.
ఈ మేరకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదనరెడ్డి, ఎండీ ఆర్జా శ్రీకాంత్ గ్లోబల్ లెర్నర్స్ ప్రోగ్రామ్ శిక్షణకు సంబంధించిన మెటీరియల్, పోస్టర్లను తాజాగా విడుదల చేశారు.

హునర్ హాట్ ప్రదర్శన ప్రారంభం
హైదరాబాద్‌లో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ‘హునర్ హాట్ప్రదర్శన ప్రారంభమైంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ జనవరి 12న ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా నక్వీ మాట్లాడుతూ... పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) దేశమంతటా వర్తిస్తుందని, భారత్‌లో అంతర్భాగమైన రాష్ట్రాలన్నీ ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. దేశంలోని ముస్లింలకు ఈ చట్టం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవని, అన్ని మతాల ప్రజలకు భద్రత ఉంటుందని స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జనవరి 13న జరిగిన ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. ఈ భేటీ వివరాలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల కార్యాలయాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. సమావేశంలో ప్రధానంగా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు సాగాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూళ్లలో పేర్కొన్న సంస్థల ఆస్తుల విభజనను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించారు.

ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రద్దు
ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను రద్దు చేస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజానివేదనలు, పెన్షన్ల శాఖ జనవరి 14న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థన మేరకు ఈ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ 26 అక్టోబరు 1989న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు సమ్మతి పొందిన తరువాత చేసిన అభ్యర్థన మేరకు నాటి గెజిట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

ద్వైపాక్షికం


జమ్మూకశ్మీర్‌లో15 దేశాల రాయబారులు
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ సహా భారత్‌లోని 15 దేశాల రాయబారులు జనవరి 9న పర్యటించారు. బంగ్లాదేశ్, వియత్నాం, నార్వే, మాల్దీవ్‌‌స, దక్షిణ కొరియా, మొరాకొ, నైజీరియా తదితర దేశాల రాయబారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కొందరు రాజకీయ నేతలు, సైన్యాధికారులు, పౌరసమాజ ప్రతినిధులతో వారు సమావేశమయ్యారు. వారికి లెఫ్ట్‌నెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ కశ్మీర్ పరిస్థితులను వివరించారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం తెల్సిందే.

ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సంభాషణ
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారని భారత ప్రధానమంత్రి కార్యాలయం జనవరి 10న తెలిపింది. ఈ ఫోన్ కాల్‌లో పలు ద్వైపాక్షిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చినట్లు వెల్లడించింది. భారత్-ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడేలా చేసేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ చెప్పినట్లు పేర్కొంది. రక్షణ రంగం, పౌర అణుశక్తి, మెరైన్ భద్రత వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పెంచుకునేందుకు వారు అంగీకరించినట్లు తెలిపింది.

ఆర్థికం


ప్రముఖ ఆర్థికవేత్తలతో ప్రధాని మోదీ భేటీ
దాదాపు 40 మంది పైగా ఆర్థికవేత్తలు, ప్రైవేట్ ఈక్విటీ.. వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, వ్యాపార దిగ్గజాలు, వ్యవసాయ రంగ నిపుణులు మొదలైన వారితో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో జనవరి 9న జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక వృద్ధి, స్టార్టప్స్, నవకల్పనలు తదితర అంశాలపై విసృ్తత చర్చలు జరిపారు. సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ పాల్గొన్నారు.
తాజా భేటీలో మోదీ మాట్లాడుతూ... దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకునే సత్తా ఎకానమీకి పుష్కలంగా ఉందని తెలిపారు. 2024 నాటికి దేశ ఎకానమీ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని ధీమా వ్యక్తం చేశారు. ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్ల ఎకానమీగా ఎదగాలనే లక్ష్యం అకస్మాత్తుగా పుట్టుకొచ్చినది కాదని.. దేశ సామర్థ్యంపై అవగాహనతోనే దీన్ని నిర్దేశించుకున్నామని పేర్కొన్నారు. అన్ని వర్గాలు సమష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమేనన్నారు.
మోదీతో నోబెల్ బహుమతి గ్రహీత టాలర్ భేటీ
ప్రధాని మోదీతో ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ టాలర్ జనవరి 9న భేటీ అయ్యారు. వ్యక్తుల నడవడిక, నిర్ణయాలపై ప్రభావం చూపే ఆర్థిక ప్రవర్తన సిద్ధాంతం (నడ్‌‌జ థియరీ)పై ఆయనతో చర్చించారు.

ప్రపంచబ్యాంక్ గ్లోబల్ ఎకనమిక్ నివేదిక విడుదల
ప్రపంచబ్యాంక్ జనవరి 9న ‘‘గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, భారత జీడీపీ వృద్ధిరేటుకి సంబంధించిన అంశాలను ఈ నివేదికలో ప్రస్తావించింది.
గ్లోబల్ ఎకనమిక్ నివేదికలోని అంశాలు

  • 2019-2020 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 5 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. అయితే 2020-2021లో వృద్ధిరేటు 5.8 శాతానికి రికవరీ అయ్యే అవకాశం ఉంది.
  • 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధి 2.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది.
  • అమెరికా వృద్ధిరేటు 2020లో 1.8 శాతంగా నమోదుకావచ్చు.
  • యూరో ప్రాంతంలో 2020లో వృద్ధి ఒకశాతానికి తగ్గిస్తున్నాం. ఈ ప్రాంతంలో బలహీన పారిశ్రామిక క్రియాశీలత దీనికి ఒక కారణం.
  • 2022లో దక్షిణాసియా వృద్ధిరేటు 6 శాతంగా ఉండవచ్చు.
  • బంగ్లాదేశ్‌లో వృద్ధిరేటు 7 శాతంగా ఉండే వీలుంది. అయితే పాక్‌లో ఈ రేటు 3 శాతం లేదా అంతకన్నా తక్కువగా ఉండే వీలుంది.
  • వాణిజ్య యుద్ధం, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి సవాళ్లతో ప్రపంచ ఆర్థిక వృద్ధితీరుకు కొంత ఇబ్బందులూ ఉన్నాయి.
  • భారత్‌ను ప్రత్యేకంగా చూస్తే, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల కఠిన రుణ పరిస్థితులు దేశీయ డిమాండ్‌ను బలహీనతకు కారణాల్లో ఒకటి.


సైన్స్ అండ్ టెక్నాలజీ


యుద్ధనౌకపై తేజస్ ల్యాండింగ్ విజయవంతం
భారత నేవీ కోసం సిద్ధమవుతున్న తేజస్ ‘ప్రయోగదశ విమానం.. యుద్ధవిమాన వాహకనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై జనవరి 11న తేజస్ యుద్ధ విమానాన్ని ల్యాండింగ్ చేయించినట్లు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) వెల్లడించింది. దీంతో యుద్ధ విమాన వాహక నౌకలపై యుద్ధ విమానాలను దించగల అతికొన్ని దేశాల జాబితాలో భారత్ చేరింది. ఈ నావికాదళ తేజస్‌ను డీఆర్‌డీవో, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), ఏర్‌క్రాఫ్ట్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సీఎస్‌ఐఆర్ తదితర సంస్థలు కలసి అభివృద్ధి చేశాయి.


మలేరియా కారక సూక్ష్మజీవిపై కొత్త పద్ధతి ఆవిష్కణ
మలేరియా కారక పరాన్నజీవిని మరింత సులువుగా అర్థం చేసుకునేందుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. మలేరియా వ్యాధి నియంత్రణకు ఈ పరాన్నజీవి పనితీరును అర్థం చేసుకోవడం ముఖ్యం కాగా.. మన ఎర్ర రక్తకణాల్లోకి చేరి డీఎన్‌ఏను వాడుకునే దీని జన్యువులను తెలుసుకోవాలంటే 4 పొరలను దాటాల్సి ఉంటుంది. ఈ పొరలన్నింటినీ తొలగించి లోపలి పరాన్నజీవి పనితీరును అర్థం చేసుకునేందుకు ప్రస్తుతం ఎలక్ట్రోపోరేషన్ అనే ఖరీదైన పద్ధతిని వాడుతున్నారు. డాక్టర్ పూరన్‌సింగ్ సిజ్‌వాలీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ సమస్య పరిష్కారానికి మలేరియా కారక ప్లాస్మోడియం ఫాల్సీపరంపై పరిశోధనలు చేపట్టింది. లైజ్-రీ సీల్ అని పిలుస్తున్న ఈ పద్ధతి ద్వారా ప్లాస్మోడియం ఫాల్సిపరం కణాల్లోకి బయటి నుంచి జన్యువులను జొప్పించడం సులువవుతుంది. ఈ పరాన్న జీవి.. డీఎన్‌ఏలతో కూడిన ఎర్ర రక్తకణాల్లోకి చేరిపోయి అక్కడ ఉన్న డీఎన్‌ఏలోకి తనదైన జన్యువులు చొప్పిస్తుంది.

అత్యంత పురాతన ఘన పదార్థమిదే..
భూమిపైన దొరికిన అత్యంత పురాతనమైన ఘన పదార్థం ఒకదాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. గ్రహశకలం లోపల నిక్షిప్తమై ఉన్న ఈ పదార్థం సౌర కుటుంబం ఏర్పడక ముందు కాలం నాటిది కావడం విశేషం. యాభై ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలో దొరిగిన గ్రహశకలంలో ఈ పదార్థం ఉందని, సుమారు 700 కోట్ల ఏళ్ల క్రితం కొత్త నక్షత్రాలు ఏర్పడిన కాలం నాటి పరిస్థితులకు ఇది సాక్ష్యమని పీఏఎన్‌ఎస్ జర్నల్‌లో ఒక వ్యాసం ప్రచురితమైంది. ఈ పదార్థం నక్షత్రాల నమూనా అని, అసలైన నక్షత్ర ధూళి అని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త, షికాగో వర్శిటీకి చెందిన ఫిలిప్ హెక్ తెలిపారు. భూమ్మీద రాలిపడే గ్రహ శకలాల్లో కేవలం ఐదు శాతం వాటిల్లో ఇలాంటి నక్షత్రధూళి లేదా ప్రీసోలార్ గ్రెయిన్స్ ఉంటుందని హెక్ తెలిపారు. వీటిని గుర్తించేందుకు ముందుగా గ్రహశకలాన్ని పేస్ట్‌లా మారుస్తారని తెలిపారు. యాసిడ్‌లో ఈ పేస్ట్‌ను ముంచినప్పుడు ప్రీ సోలార్ గ్రెయిన్స్ మాత్రమే మిగిలి, మిగిలినదంతా కరిగిపోతుందన్నారు. వీటిని వేరు చేసి పరిశీలించడం ద్వారా ఆ రేణువులు ఏ నక్షత్రం నుంచి వచ్చాయో తెలుస్తుందని చెప్పారు.


అవార్డులు


ప్రపంచ బాల మేధావిగా ఈశ్వర్ శర్మ
ఆధ్యాత్మిక యోగాలో సాధించిన విజయాలకుగానూ పదేళ్ల స్కూల్ విద్యార్థి, బ్రిటిష్ ఇండియన్ ఈశ్వర్ శర్మను ప్రపంచ బాల మేధావి-2020 అవార్డుతో బ్రిటన్ సత్కరించింది. 30 విభిన్న (బైకింగ్, కొరియోగ్రఫీ, ఫిట్‌నెస్, మార్షల్ ఆర్‌‌ట్స తదితర) రంగాల్లో సత్తాచాటిన ప్రపంచంలోని 45 దేశాలకు చెందిన బాల మేధావులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. అందులో ఇంగ్లండ్‌లోని కెంట్ కేంద్రంగా పనిచేస్తున్న ఈశ్వర్ శర్మ యోగాలో అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ‘యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. విద్యార్థులకు యోగా చాలా ముఖ్యం.అని అవార్డు తీసుకుంటున్న సందర్భంగా శర్మ చెప్పాడు.

పెద్దపల్లి జిల్లా స్వచ్ఛత దర్పణ్ అవార్డు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు ‘స్వచ్ఛత దర్పణ్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో జనవరి 12న జరిగిన కార్యక్రమంలో పాణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖాన్, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత సాధించినందుకుగాను జిల్లాకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సమాచారం, విద్య, కమ్యూనికేషన్ (ఐఈసీ), సామాజిక మరుగుదొడ్లు అనే అంశంపై పెద్దపల్లి కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

క్రీడలు


ఖతర్ ఓపెన్ టోర్ని విజేతగా బోపన్న జంట
ఖతర్ ఓపెన్ ఏటీపీ-250 టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్‌‌స) ద్వయం విజేతగా నిలిచింది. ఖతర్ రాజధాని దోహాలో జనవరి 10న జరిగిన డబుల్స్ ఫైనల్లో బోపన్న-కూలాఫ్ జంట 3-6, 6-2, 10-6తో ‘సూపర్ టైబ్రేక్లో ల్యూక్ బామ్‌బ్రిడ్‌‌జ (ఇంగ్లండ్)-శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జోడీని ఓడించింది. టైటిల్ నెగ్గిన బోపన్న జంటకు 76,870 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 54 లక్షల 50 వేలు)తోపాటు 250 ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా 39 ఏళ్ల బోపన్నకు కెరీర్‌లో ఇది 19వ డబుల్స్ టైటిల్.

జస్‌ప్రీత్ బుమ్రాకు పాలీ ఉమ్రిగర్ పురస్కారం
భారత సీనియర్ ఫాస్ట్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్, దిలీప్ సర్దేశాయ్ పురస్కారాలు లభించాయి. ముంబైలో జనవరి 12న జరిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక అవార్డుల వేడుకలో బుమ్రా ఈ అవార్డులను అందుకున్నాడు. 2018-19 సీజన్‌లో కనబరిచిన విశేష ప్రతిభకుగాను బుమ్రాకు ఈ అవార్డులు లభించాయి.
ఉమ్రిగర్ అవార్డు
గత సీజన్‌లో అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్లలో కనబరిచిన ఉత్తమ ప్రదర్శన (మొత్తం 73 వికెట్లు)కు గాను పాలీ ఉమ్రిగర్ అవార్డు ఇస్తారు. ఈ పురస్కారంలో భాగంగా అతనికి ప్రశంసా పత్రం, ట్రోఫీతో పాటు రూ. 15 లక్షల చెక్ అందజేశారు. ఇక దిలీప్ సర్దేశాయ్ పురస్కారాన్ని టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఇస్తారు. దీంతో 34 వికెట్లు తీసిన బుమ్రానే ఈ అవార్డు వరించగా, ట్రోఫీ, రూ. 2 లక్షల చెక్ చేజిక్కించుకున్నాడు.
2018-19 బీసీసీఐ వార్షిక అవార్డులు
కృష్ణమాచారి శ్రీకాంత్: కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం (ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 25 లక్షలు)
అంజుమ్ చోప్రా: బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారం (మహిళ; ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 25 లక్షలు)
జస్‌ప్రీత్ బుమ్రా: పాలీ ఉమ్రిగర్ (ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్; ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 15 లక్షలు), దిలీప్ సర్దేశాయ్ (టెస్టుల్లో అత్యధిక వికెట్లు; ట్రోఫీ, రూ.2లక్షలు)
దిలీప్ దోషి: బీసీసీఐ ప్రత్యేక అవార్డు (ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 15 లక్షలు)
చతేశ్వర్ పుజారా: దిలీప్ సర్దేశాయ్ (టెస్టుల్లో అత్యధిక పరుగులు; ట్రోఫీ, రూ.2లక్షలు)
పూనమ్ యాదవ్: ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ (ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 15 లక్షలు)
స్మృతి మంధాన: మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు (ట్రోఫీ, రూ.2లక్షలు)
జులన్ గోస్వామి: మహిళల వన్డేల్లో అత్యధిక వికెట్లు (ట్రోఫీ, రూ.2లక్షలు)
మయాంక్ అగర్వాల్: అంతర్జాతీయ ఉత్తమ అరంగేట్రం (ట్రోఫీ, రూ.2లక్షలు)
షఫాలీ వర్మ: అంతర్జాతీయ ఉత్తమ అరంగేట్రం (మహిళ; ట్రోఫీ, రూ.2 లక్షలు)
శివమ్ దూబే (ముంబై): లాలా అమర్‌నాథ్ (రంజీ ట్రోఫీలో ఉత్తమ ఆల్‌రౌండర్; ట్రోఫీ, రూ. 5 లక్షలు).
నితీశ్ రాణా(ఢిల్లీ): లాలా అమర్‌నాథ్ (దేశవాళీ వన్డే క్రికెట్‌లో ఉత్తమ ఆల్‌రౌండర్; ట్రోఫీ, రూ. 5 లక్షలు)
మిలింద్ కుమార్ (సిక్కిం): మాధవరావు సింధియా (రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు, రూ. 2.5 లక్షలు).
అశుతోష్ అమన్ (బిహార్): మాధవరావు సింధియా (రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు; ట్రోఫీ, రూ. 2.5 లక్షలు)
విదర్భ: ఉత్తమ దేశవాళీ జట్టు (మెమెంటో).

ఏఎస్‌బీ క్లాసిక్ ఓపెన్ చాంపియన్‌గా సెరెనా
ఏఎస్‌బీ క్లాసిక్ ఓపెన్ టోర్నీలో సింగిల్స్ చాంపియన్‌గా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ నిలిచింది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జనవరి 12న ముగిసిన ఈ టోర్ని ఫైనల్లో సెరెనా 6-3, 6-4తో జెస్సికా పెగులా (అమెరికా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన 38 ఏళ్ల సెరెనాకు 43 వేల డాలర్లు ప్రైజ్‌మనీ (రూ. 30 లక్షల 52 వేలు) లభించింది. ఈ మొత్తాన్ని ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్ధం ఏర్పాటు చేసిన బుష్‌ఫైర్ రిలీఫ్ ఫండ్‌కు సెరెనా విరాళంగా ఇచ్చేసింది.
73వ సింగిల్స్ టైటిల్
సెరెనా కెరీర్‌లో ఇది 73వ సింగిల్స్ టైటిల్. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాక సెరెనా ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే. ఎనిమిది వారాల గర్భవతిగానే 2017 ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొని చాంపియన్‌గా నిలిచిన సెరెనా ఆ తర్వాత ఆటకు విరామం ఇచ్చింది.

ఆంధ్ర రంజీ క్రికెట్‌కు విజయ్ వీడ్కోలు
ఆంధ్ర సీనియర్ పేస్ బౌలర్, 33 ఏళ్ల డేవిడ్ పైడికాల్వ విజయ్ కుమార్ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2006లో బరోడాతో మ్యాచ్ ద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విజయ్... హైదరాబాద్‌తో జనవరి 14న ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర తరఫున రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. కెరీర్‌లో 71 రంజీ మ్యాచ్‌లు ఆడిన విజయ్ మొత్తం 248 వికెట్లు తీశాడు. షాబుద్దీన్ (75 మ్యాచ్‌ల్లో 242 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును విజయ్ బద్దలు కొట్టాడు. హైదరాబాద్‌తో మ్యాచ్ ముగిశాక విజయ్‌ను ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అధికారులు సన్మానించారు. సహచరులు బ్యాట్‌లు ఎత్తి ‘గార్డ్ ఆఫ్ ఆనర్తో గౌరవించారు.

వార్తల్లో వ్యక్తులు


లోక్‌పాల్ పదవికి జస్టిస్ దిలీప్ రాజీనామా
లోక్‌పాల్ సభ్యత్వ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జస్టిస్ దిలీప్ బి.బొసాలే జనవరి 9న వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2020, జనవరి 12 నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని చెప్పారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ దిలీప్ 2019 మార్చి 27న లోక్‌పాల్ జ్యుడీషియల్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌పాల్ సభ్యులుగా ఎంపికై న వారి పదవీకాలం ఐదేళ్ల పాటు లేదా 70 ఏళ్ల వయసు వరకు కొనసాగనుంది.

హర్ గోవింద్ ఖొరానా పరిశోధక విభాగం ఏర్పాటు
ప్రఖ్యాత భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త హర్ గోవింద్ ఖొరానా పేరుతో పాకిస్తాన్‌లో పరిశోధక విభాగం ఏర్పాటుకానుంది. ఖొరానా పేరిట ప్రత్యేక పరిశోధక విభాగాన్ని(రీసెర్చ్ చైర్) ఏర్పాటు చేయనున్నట్లు లాహోర్‌లోని గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ(జీసీయూ) జనవరి 9న ప్రకటించింది. ఖొరానా 1922లో అవిభక్త భారత్‌లోని రాయ్‌పుర్ గ్రామం (ప్రస్తుతం పాక్‌లో ఉంది)లో జన్మించారు. 1968లో వైద్యరంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.

ఏపీ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా రావు రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య నియమితులయ్యారు. వీరి నియామకానికి జనవరి 10న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ నలుగురి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరుకోనుంది. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి జనవరి 13న ప్రమాణం చేయించనున్నారు.
రావు రఘునందన్‌రావు
1964 జూన్ 30న జన్మించిన రావు రఘునందన్‌రావు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1988లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1993 నుంచి 94 వరకు ఏజీపీగా పనిచేశారు. 1995లో అడ్వొకేట్ జనరల్‌కు సహకరించేందుకు స్పెషల్ ఏజీపీగా నియమితులయ్యారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లకు న్యాయవాదిగా ఉన్నారు. ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ సీనియర్ న్యాయవాదుల ప్యానెల్‌లో చోటు దక్కించుకున్నారు. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
బట్టు దేవానంద్
కృష్ణా జిల్లాకి చెందిన దేవానంద్ 1966 ఏప్రిల్ 14న జన్మించారు. గుడివాడ ఏజీకే పాఠశాలలో ఎస్‌ఎస్‌సీ, ఏఎన్‌ఆర్ కాలేజీలో ఇంటర్, బీఏ, ఆంధ్రా యూనివర్సిటీలో బీఎల్ చదివారు. 1989లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1996 నుంచి 2000 వరకు హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేశారు. 2004 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు.
నైనాల జయసూర్య
నైనాల జయసూర్య పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 1968లో జన్మించారు. విజయవాడలోని వెలగపూడి దుర్గాబాయి సిద్ధార్థ కాలేజీ ఆఫ్ లాలో ఎల్‌ఎల్‌బీ చదివారు. 1992లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2003-04లో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరించారు. 2009-14 మధ్య హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీఎస్‌టీసీ, ఎస్‌టీసీ, హుడా తదితర ప్రభుత్వ రంగ సంస్థల తరఫున కేసులు వాదించారు. బీహెచ్‌ఈఎల్, ఆప్కో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్యానల్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
దొనడి రమేశ్
1965 జూన్ 27న చిత్తూరు జిల్లా సోమల మండలం కామనపల్లిలో రమేశ్ జన్మించారు. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్, బీకాం, నెల్లూరు వీఆర్ లా కాలేజీలో బీఎల్ చదివారు. 1990లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2000-2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2006-13 మధ్య కాలంలో హైకోర్టులో రాజీవ్ విద్యా మిషన్, సర్వ శిక్షాఅభియాన్‌కు న్యాయవాదిగా వ్యవహరించారు. 2014 నుంచి 2019 వరకు హైకోర్టులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఒమన్ సుల్తాన్ బిన్ సయీద్ కన్నుమూత
ఆధునిక అరబ్ ప్రపంచంలో అత్యధిక కాలం పాలించిన ఒమన్ రాజు ఖుబాస్ బిన్ సయీద్ (79) జనవరి 10 కన్నుమూశారు. 1970 నుంచి పాలించిన ఆయన కేన్సర్‌తో బాధపడినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈయనకు పెళ్లి కాలేదు. దీంతో ఆయన వారసుడు ఎవరనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఒమన్ రాజ్యాంగం ప్రకారం రాజు సింహాసనాన్ని వదలిన మూడు రోజుల్లోగా కొత్త రాజు దాన్ని అధిష్టించాలి. బిన్ సయీద్‌కు వారసులు లేకపోవడంతో రాజ కుటుంబంలో సభ్యుడైన ‘ముస్లిం, యుక్త వయస్సు వచ్చిన వారు, హేతుబద్ధవాది, ఒమన్ ముస్లిం తల్లిదండ్రులకు జన్మించిన వ్యక్తిని తదుపరి రాజుగా ఎన్నుకోవాల్సి ఉంది.

సీఆర్‌పీఎఫ్ డీజీగా ఎ.పి.మహేశ్వరి
సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) డీజీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎ.పి.మహేశ్వరి నియమితులయ్యారు. 1984 బ్యాచ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ మహేశ్వరి ప్రస్తుతం హోంమంత్రిత్వ శాఖలో (అంతర్గత భద్రత) ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అతను ఫిబ్రవరి 28, 2021 వరకు ఈ పదవిలో ఉంటారు. 2019, డిసెంబర్ 31న భట్నాగర్ పదవీ విరమణ చేసినప్పటినుంచీ డీజీ పోస్టు ఖాళీగా ఉంది.

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మరణ శిక్ష రద్దు
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణ శిక్ష విధిస్తూ ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును లాహోర్ హైకోర్టు కొట్టివేసింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటును, ఆ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ ముషారఫ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జనవరి 13న లాహోర్ హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పులో ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు.. అన్నీ చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది.
2013లో నాటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ముషారఫ్ కేసు నమోదు చేసింది. ఆరేళ్ల పాటు ప్రత్యేక కోర్టు విచారణ జరిపి 2019, డిసెంబర్‌లో ముషారఫ్‌కు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. ఈ తీర్పును లాహోర్ హైకోర్టులోని జస్టిస్ సయ్యద్ మజహర్ అలీ అక్బర్ నఖ్వీ, జస్టిస్ మొహ్మద్ అమీర్ భట్టీ, జస్టిస్ చౌధరి మసూద్ జహంగీర్‌ల త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది.

ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా రావు రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జనవరి 13న జరిగిన కార్యక్రమంలో వీరిచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి వేర్వేరుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. ఈ నలుగురి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరింది. వీరిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 10న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.