మార్చి కరెంట్‌ అఫైర్స్‌

మార్చి కరెంట్‌ అఫైర్స్‌

మార్చి 2020 అంతర్జాతీయం

హజ్ యాత్రపై కోవిడ్ వైరస్ ప్రభావం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్ 19 వైరస్ ప్రభావం హజ్ యాత్రపై పడింది. కోవిడ్ వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారిని 2020 ఏడాది జరగబోయే హజ్ యాత్రకు అనుమతించబోమని సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ దేశాల నుంచి మక్కాకు వచ్చే యాత్రికులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సౌదీ విదేశీ వ్యవహారాల శాఖ ఫిబ్రవరి 27న తెలిపింది. వారిని మక్కాలోకి అనుమతించబోమని పేర్కొంది. కేవలం ఉమ్రా యాత్రికులనే కాకుండా మదీనాను సందర్శించే వారిని సైతం అనుమతించబోమని వివరించింది. అయితే ఈ ఆంక్షలు ఎప్పటివరకు కొనసాగుతాయనే దానిపై మాత్రం సౌదీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.

అమెరికా- తాలిబన్ మధ్య శాంతి ఒప్పందం

అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న అఫ్గానిస్తాన్‌లో శాంతిస్థాపనకు దారులు తెరుచుకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఉగ్రసంస్థ తాలిబన్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమక్షంలో ఫిబ్రవరి 29న ఖతార్ రాజధాని దోహాలోని ఓ హోటల్‌లో ఈ ఒప్పందం కుదిరింది. అమెరికా ప్రతినిధి జల్మే ఖలీల్‌జాద్, తాలిబన్ నేత ముల్లా బరాదర్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పంద కార్యక్రమానికి భారత్, పాక్ సహా పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.
భారత్ నంచి కుమరన్...
అఫ్గాన్ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్న భారత్, మొదటిసారిగా దోహా చర్చలకు తన రాయబారి పి.కుమరన్‌ను పంపింది. శాంతి ఒప్పందం నేపథ్యంలో భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రీంగ్లా కూడా అఫ్గాన్‌లో రెండు రోజులు(ఫిబ్రవరి 28,29) పర్యటించారు.
శాంతి ఒప్పందం ప్రకారం..

  • ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో ఉన్న 13 వేల మంది తమ సైనికులను వచ్చే 3-4 నెలల్లో 8,600కు అమెరికా తగ్గించుకోనుంది. మిగతా బలగాలను కూడా 14 నెలల్లో దఫాలుగా ఉపసంహరించు కుంటుంది. అయితే, ఒప్పందంలో అంగీకరించిన షరతులను తాలిబన్లు అమలు చేసే తీరును బట్టి మాత్రమే ఈ ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది.
  • తాలిబన్లు అమెరికాతోపాటు దాని మిత్ర దేశాలపై అఫ్గాన్ కేంద్రంగా చేసుకుని ఎలాంటి దాడులకు ప్రయత్నించరాదు.
  • అఫ్గాన్ ప్రభుత్వ జైళ్లలో ఉన్న సుమారు 5 వేల మంది తాలిబన్లను విడుదల చేయాలి.
  • తాలిబన్, అఫ్గాన్ ప్రభుత్వం మధ్య మధ్యవర్తిత్వం నెరిపేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేకంగా దోహాలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. ఒప్పందంలోని అంశాల అమలుకు ఈ విభాగమే జవాబుదారీగా ఉంటుంది.

మార్చి 10న ఓస్లో చర్చలు..
2020, మార్చి 10వ తేదీ నుంచి నార్వే రాజధాని ఓస్లోలో జరిగే చర్చల్లో అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్, ఇతర గ్రూపులు, మహిళా ప్రతినిధులు ముఖాముఖి పాల్గొననున్నారు. 2001 తర్వాత తాలిబన్లతో అఫ్గాన్‌లోని ఎన్నికై న ప్రభుత్వం చర్చలు జరపడం ఇదే ప్రథమం కానుంది. చర్చల్లో అమెరికా ప్రతినిధులు ఉన్నప్పటికీ అఫ్గాన్ పక్షాల మధ్య చర్చలు సాగేందుకు సాయపడటమే వారి లక్ష్యంగా ఉండనుంది.
తాలిబన్లను విడుదల చేయం: ఘనీ
అమెరికా-తాలిబన్ల శాంతి ఒప్పందంపై మార్చి 1న అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ స్పందించారు. జైళ్లలో ఉన్న తాలిబన్లను తక్షణమే విడుదల చేయడం కుదిరే పని కాదని తేల్చి చెప్పారు. ఓస్లో చర్చల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు తాలిబన్లను విడుదల చేయలేమని స్పష్టం చేశారు. అఫ్గాన్ అధికార యంత్రాంగంతో చర్చలు జరగకుండా తాము తాలిబన్లను జైళ్ల నుంచి ఎందుకు విడుదల చేయాలని ప్రశ్నించారు.

శ్రీలంక పార్లమెంటు రద్దు
శ్రీలంక అధ్యక్షుడు గొతబయ రాజపక్స ఆ దేశ పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు మార్చి 2న ప్రకటించారు. పార్లమెంట్‌కు 2020, ఏప్రిల్ 25న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 2020, మే 14వ తేదీన కొత్త పార్లమెంటు సమావేశమవుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్‌కు ఇంకా ఆరు నెలల గడువు ఉండగానే గొతబయ ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక పార్లమెంటును రద్దు చేయడానికి కనీసం నాలుగున్నరేళ్ల పాలన సాగాల్సి ఉంటుంది.

లక్సంబర్గ్‌లో ఉచిత రవాణా విధానం
ఐరోపా దేశమైన లక్సంబర్గ్‌లో ఉచిత రవాణా విధానంను ప్రవేశపెట్టారు. 2020, ఫిబ్రవరి 29 నుంచి లక్సంబర్గ్‌లో ఉచిత ప్రజా రవాణా అమల్లోకి వచ్చింది. దీంతో ప్రపంచంలో ఉచిత ప్రజా రవాణాను అమల్లోకి తెచ్చిన తొలి దేశంగా లక్సంబర్గ్ నిలిచింది. వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు 2018, డిసెంబర్ 6న లక్సంబర్గ్ ప్రభుత్వం ఉచిత రవాణా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం తాజాగా అమల్లోకి వచ్చింది. 2013లో తలిన్, ఎస్తోనియా దేశాలు రాజధాని నగరాల్లో ఉచిత రవాణా విధానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రజా రవాణా ఉచితం చేయడం వల్ల ప్రభుత్వం నడిపే రైళ్లు, ట్రామ్‌లు, బస్సుల్లో టికెట్ కొనాల్సిన పని ఉండదు.

తాలిబన్ అగ్రనేత బరాదర్‌తో ట్రంప్ చర్చలు
తాలిబన్ల అగ్రనేత, తాలిబన్ సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 4న ఫోన్ చేసి మాట్లాడారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అరగంట పాటు సంభాషణ నడిచిందని తాలిబన్ తెలిపింది. అమెరికా, తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరేందుకు అఫ్గానిస్తాన్‌లో హింసాత్మక ఘటనలు తగ్గడమే కారణమని, ఇదే పరిస్థితి కొనసాగాలని ట్రంప్ స్పష్టం చేసినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది.
చర్చలపై నీలినీడలు: అఫ్గానిస్తాన్ బలగాలను రక్షించే ఉద్దేశంతో అమెరికా మార్చి 4న తాలిబన్‌పై వైమానిక దాడులకు దిగడంతో 2020, మార్చి 10వ తేదీన ఓస్లోలో ప్రభుత్వానికి, ఇతరులకు మధ్య చర్చలు జరిగే అంశం డోలాయమానంలో పడింది. బరాదర్‌తో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే హెల్మాండ్‌లో వైమానిక దాడులు జరిగాయి.

మార్చి 2020 జాతీయం

ఎయిర్ పవర్ సదస్సులో ఐఏఎఫ్ చీఫ్ బదౌరియా

సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఫిబ్రవరి 28న నిర్వహించిన ‘ఎయిర్ పవర్ ఇన్ నో వార్ నో పీస్ సినారియో’ సదస్సులో ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా ప్రసంగించారు. ‘36 రఫేల్ యుద్ధ విమానాలు మన అవసరాలకు సరిపోవు. మనం దేశీయంగా తయారు చేసిన అస్త్ర క్షిపణిని ఎస్‌యూ 30, మిగ్ 29 వంటి ఇతర ఫైటర్ జెట్‌పై ఉపయోగించగలగాలి. అప్పుడే మన వైమానిక శక్తి మరింత పెరుగుతుంది’ అని ఆయన అన్నారు. అయితే, ఇతర క్షిపణులను ప్రయోగించగల యుద్ధ విమానాలను దేశీయంగా ఉత్పత్తి చేసుకోవాల్సి ఉందన్నారు.

సామాజిక న్యాయ శిబిరంలో ప్రధాని మోదీ

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(అలహాబాద్)లో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు సహాయపడే ఉపకరణాల పంపిణీ కార్యక్రమం సామాజిక న్యాయ శిబిరంలో ఫిబ్రవరి 29న ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సుగమ్య భారత్ తఅభియాన్ పథకంలో భాగంగా విమానాశ్రయాల్లో, 700కి పైగా రైల్వే స్టేషన్లలో దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ప్రస్తుతం దేశంలో 2.50 కోట్ల మందికి పైగా దివ్యాంగులుంటే, 10 కోట్ల మందికి పైగా సీనియర్ సిటిజన్లు ఉన్నారు.

బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన
ఉత్తరప్రదేశ్‌లో 296కి.మీ.ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. చిత్రకూట్, బాందా, హమీర్‌పూర్, జలాన్ జిల్లాల మీదుగా మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ని కలుపుతూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే సాగుతుంది.

గిన్నిస్ రికార్డుల్లోకి

అలహాబాద్‌లో త్రివేణి సంగమం వద్ద పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సామాజిక న్యాయ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది. ఈ మెగా క్యాంప్‌లో 56 వేలకు పైగా వివిధ రకాల ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేశారు. 26 వేల మంది లబ్ధిదారులు వాటిని అందుకున్నారు. హియరింగ్ ఎయిడ్‌లు, కృత్రిమ పాదాలు, బ్యాటరీతో నడిచే త్రిచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ పరికరాలకే రూ.19 కోట్లకు పైగా ఖర్చు అయింది. మొత్తం మూడు రికార్డులను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 28న 1.8 కి.మీ. పొడవునా 300 మంది దివ్యాంగులు కూర్చున్న త్రిచక్ర వాహనాల పెరేడ్ గిన్నిస్ రికార్డుని సొంతం చేసుకుంది. ఒకే వేదికపై నుంచి భారీ స్థాయిలో పరికరాల పంపిణీ, ఆ తర్వాత వీల్ చైర్ల పెరేడ్ కూడా గిన్నిస్ రికార్డులకెక్కింది.

రాజర్‌హాట్‌లో ఎన్‌ఎస్‌జీ కాంప్లెక్స్ ప్రారంభం

కోల్‌కతా సమీపంలోని రాజర్‌హాట్‌లో జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) 29వ స్పెషల్ కంపోసిట్ గ్రూప్ (ఎస్‌సీజీ) కాంప్లెక్స్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మార్చి 1న ప్రారంభించారు. అలాగే మానేసర్, హైదరాబాద్, చెన్నై, ముంబైలోని ఎన్‌ఎస్‌జీ భవనాల్ని కూడా కోల్‌కతా నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎన్‌ఎస్‌జీ అంటే ఉగ్ర వ్యతిరేక దళంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని అన్నారు. 10 వేల ఏళ్ల చరిత్రలో భారత్ ఎలాంటి దాడులూ జరపలేదని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. ఎవరైనా తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించినా.. జవాన్లు, ప్రజల మీద దాడులకు యత్నించినా.. భారత్ గట్టిగా బదులిస్తుందని పేర్కొన్నారు.

ఐడియాస్ ఫర్ ఇండియా కాంక్లేవ్ ప్రారంభం

ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం భారతదేశం వైపు చూస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో ‘ఐడియాస్ ఫర్ ఇండియా-2020’పాలసీ కాంక్లేవ్ కార్యక్రమాన్ని ఆయన మార్చి 1న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతోందన్నారు.

శ్రీసిటీ సీఎఫ్‌ఓ నాగరాజన్‌కు అవార్డు

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన వార్షిక సీఎఫ్‌ఓ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో శ్రీసిటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) ఆర్.నాగరాజన్ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు. ‘టాప్ 100 సీనియర్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ ఇన్ ఇండియా’ అవార్డును రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు అరవింద్ మాయారామ్ చేతుల మీదుగా ఆయన స్వీకరించారు. దేశంలో అత్యంత ప్రభావశీల కంపెనీలలో సీనియర్ ఫైనాన్స్ లీడర్లను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సీఎఫ్‌ఓ ఇండియా కాంక్లేవ్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఇది 10వ కాంక్లేవ్.

మిలాన్ -2020 విన్యాసాలు వాయిదా

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) తర్వాత నౌకాదళ విన్యాసాల్లో కీలకమైన మిలాన్ -2020ని వాయిదా వేస్తున్నట్లు భారత నౌకాదళం మార్చి 3న ప్రకటించింది. మిలాన్ -2020లో భాగంగా వివిధ దేశాల సైనిక బృందాలు రాకపోకలు సాగించనున్న కారణంగా కోవిడ్ 19 వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.
మిలాన్-2020 విన్యాసాల్ని విశాఖపట్నంలో 2020, మార్చి 18 నుంచి 28 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత నౌకాదళం దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలకు ఆహ్వానాలు పంపించింది. ఇందులో ఇప్పటికే 30 దేశాలు తాము పాల్గొంటున్నట్లు అంగీకారం తెలిపాయి. మిగిలిన దేశాలూ వచ్చే అవకాశముంది. అయితే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మిలాన్‌ని వాయిదా వేస్తే మంచిదని రక్షణ శాఖ నిర్ణయించింది.

పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టుకు ఐరాస

పౌరసత్వ సవరణ చట్టం 2019 (సీఏఏ) రాజ్యాంగబద్ధతపై జరుపుతున్న విచారణలో అమికస్ క్యూరీగా తాము చేరతామని భారత సుప్రీంకోర్టును ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం సంప్రదించింది. సీఏఏపై విచారణలో అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలు, నియమాలు, ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని ఐక్యరాజ్య సమతి మానవ హక్కుల హై కమిషనర్ మైకేల్ బాచెలెట్ జెరియా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఏఏపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు జెరియా మార్చి 2న జెనీవాలోని భారత దౌత్యకార్యాలయానికి సమాచారం అందించారని, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ మార్చి 3న తెలిపారు.
ఐరాస మానవ హక్కుల విభాగం నిర్ణయంపై స్పందించిన భారత్.. ఆ చట్టం తమ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. ఈ విషయంలో విదేశీ సంస్థల జోక్యానికి తావులేదని తెలిపింది.

కోపరేటివ్ బ్యాంకుల పటిష్టతకు బిల్లు

డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా కోపరేటివ్ బ్యాంకులను ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో మార్చి 3న ‘బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టింది. ఉభయసభల ఆమోదం అనంతరం ఇది చట్టంగా అమల్లోకి రానుంది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) తరహా సంక్షోభాలు భవిష్యత్తులో జరగకుండా చూసేందుకు ఈ బిల్లు తక్షణావసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభకు తెలిపారు.
ఈ బిల్లుతో కోపరేటివ్ బ్యాంకులు ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోకి వచ్చినప్పటికీ.. పాలనాపరమైన అంశాల పర్యవేక్షణ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్‌‌స పరిధిలోనే ఉండనుంది. సరైన నియంత్రణ, మెరుగైన నిర్వహణ ద్వారా కోపరేటివ్ బ్యాంకులను వాణిజ్య బ్యాంకుల మాదిరిగా పటిష్టం చేయడం బిల్లు లక్ష్యం.

ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు

చైనాలో కోవిడ్ 19 (కరోనా వైరస్) ప్రబలిన నేపథ్యంలో దేశీయంగా ఔషధాల లభ్యతకు సమస్యలు లేకుండా చూడటంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 26 యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), ఔషధాల ఎగుమతులపై మార్చి 3న ఆంక్షలు విధించింది. పారాసెటమల్, విటమిన్ బీ1, బీ12 మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. తాజా ఆంక్షలతో ఇకపై వీటి ఎగుమతుల కోసం డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. తదుపరి ఆదేశాలిచ్చే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని డీజీఎఫ్‌టీ వెల్లడించింది.

పూసా కృషి విజ్ఞాన్ మేళా 2020 ముగింపు
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మార్చి 1న మొదలైన ‘పూసా కృషి విజ్ఞాన్ మేళా 2020’ మార్చి 3న ముగిసింది. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాష్‌చౌదరి వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం హస్తవరానికి చెందిన ఆదర్శరైతు ఆకేపాటి వరప్రసాద్‌రెడ్డి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) ‘సృజనాత్మక రైతు’ అవార్డును మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. వినూత్న పద్దతుల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగుచేసి అధిక దిగుబడులు సాధిస్తున్నందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఆకేపాటికి ఈ జాతీయ పురస్కారం లభించడం ఇది రెండవసారి. దేశవ్యాప్తంగా మొత్తం 47 మంది రైతులు ఐఏఆర్‌ఐ జాతీయస్థాయి అవార్డులకు ఎంపికయ్యారు.

రెండో దశ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభం

రెండో దశ స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణం) ప్రారంభమైంది. న్యూఢిల్లీలో మార్చి 4న జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ మిషన్‌ను ప్రారంభించారు. రూ.1,40,881 కోట్లతో చేపట్టిన రెండో దశ మిషన్‌ను 2020-21 నుంచి 2024-25 మధ్య అమలు చేస్తారు. రెండో దశ మిషన్ ద్వారా దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను చేపడతారు. ‘గత ఐదేళ్లలో మొదటి దశ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా టాయిలెట్ల నిర్వహణ, వాడకంలో సాధించిన లక్ష్యాలపై రెండో దశ స్వచ్ఛ భారత్ మిషన్ దృష్టి సారిస్తుంది’అని మంత్రి షెకావత్ తెలిపారు.

ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ. 446 కోట్లు
గత ఐదేళ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు రూ. 446.52 కోట్లు ఖర్చు చేసినట్లు విదేశాంగ శాఖ మార్చి 4న తెలిపింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు 2015-16లో రూ. 121.85 కోట్లు, 2016-17లో రూ. 78.52 కోట్లు, 2017-18లో రూ. 99.90 కోట్లు ఖర్చయింది. అలాగే 2018-19లో 100.02 కోట్లు, 2019-20లో 46.23 కోట్లు ఖర్చు చేశారు.

కంపెనీల చట్టం సవరణకు కేబినెట్ ఆమోదం

దేశీ కంపెనీలు విదేశీ ఎక్స్చేంజీల్లో నేరుగా లిస్టయ్యే ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇందుకు అనుగుణంగా కంపెనీల చట్టం, 2013కి సవరణలు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మార్చి 4న జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తంగా కంపెనీల చట్టంలో 72 సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కొన్ని భారతీయ సంస్థల షేర్లు విదేశీ ఎక్స్చేంజీల్లో ట్రేడవుతున్నప్పటికీ.. అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో లిస్టయి ఉంటున్నాయి.

పెట్టుబడులకు ఆస్కారం

నేరుగా విదేశాల్లో లిస్టింగ్ అవకాశం లభించిన పక్షంలో ఆయా సంస్థలు విసృ్తత స్థాయిలో నిధులు సమీకరించుకునేందుకు మరిన్ని మార్గాలు లభించడంతో పాటు.. దేశంలోకి మరింతగా పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉండగలదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.

వివాద్ సే విశ్వాస్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ‘వివాద్ సే విశ్వాస్ బిల్లు 2020’కు మార్చి 4న లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు ప్రకారం... 2020 జనవరి 31 నాటికి పలు అప్పిలేట్ ఫోరమ్‌ల వద్ద నమోదై, అపరిష్కృతంగా ఉన్న కేసులు, రుణ రికవరీ ట్రిబ్యునల్స్‌లో (డీఆర్‌టీ) ఉన్న పెండింగ్ కేసులు వివాద్ సే విశ్వాస్ పథకం పథకం పరిధిలోకి వస్తాయి. పన్ను చెల్లింపులు రూ.5 కోట్లలోపు ఉన్న సోదా కేసులకే ఇది వర్తిస్తుంది.
పథకాన్ని ఎంచుకున్న వారు.. 2020, మార్చి 31లోగా వివాదాస్పద పన్ను మొత్తం కడితే వడ్డీ నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. గడువు నాటికి చెల్లించలేకపోతే, మార్చి తర్వాత జూన్ 30 వరకు మరో విడత గడువు లభిస్తుంది. కానీ, మార్చి 31లోపు చెల్లించాల్సిన దానితో పోలిస్తే ఆ తర్వాత 10 శాతం అదనంగా చెల్లించాలి. 2019 నవంబర్ దాకా గణాంకాల ప్రకారం.. వివాదాల్లో చిక్కుబడిన ప్రత్యక్ష పన్ను బకాయీలు సుమారు రూ. 9.32 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2020-21 బడ్జెట్‌లో వివాద్ సే విశ్వాస్ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టారు.

ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా గెర్సాయిన్

ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా చమోలీ జిల్లాలోని గెర్సాయిన్ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ మార్చి 4న రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. చమోలి జిల్లాను వేసవి రాజధానిగా ప్రకటించాలని స్థానికులు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే గెర్సాయిన్ (భరాదిసైన్)ను వేసవి రాజధానిగా ప్రకటించాలంటూ బీజేపీ ఎన్నికల తీర్మానం కూడా చేసింది. మరోవైపు గెర్సాయిన్‌ను రాష్ట్ర వేసవి రాజధానిగా ప్రకటించాలని కర్ణప్రయాగ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ నేగి ఇటీవల ముఖ్యమంత్రితో సమావేశం సందర్భంగా డిమాండ్ చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

క్రిప్టోకరెన్సీపై ఆర్‌బీఐ నిషేధం సరికాదు: సుప్రీం

వివాదాస్పద క్రిప్టోకరెన్సీ అంశంపై భారత సుప్రీంకోర్టు మార్చి 4న కీలక తీర్పునిచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.. ఈ కరెన్సీలకు సంబంధించిన సేవలను అందించవచ్చని పేర్కొంది. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ 2018లో జారీ చేసిన సర్క్యులర్‌ను కోర్టు కొట్టివేసింది. క్రిప్టోకరెన్సీలపై ఆర్‌బీఐ ’నిషేధా’న్ని సవాల్ చేస్తూ.. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎంఏఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలపై రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ సరికాదని జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్ సారథ్యంలోని త్రిసభ్య బెంచ్ ఉత్తర్వులిచ్చింది.

మార్చి 2020 రాష్ట్రీయం

జూలై 8న వైఎస్సార్ చిరునవ్వు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ఉచితంగా దంత వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ‘డాక్టర్ వైఎస్సార్ చిరునవ్వు కార్యక్రమాన్ని 2020, జూలై 8న ప్రారంభం కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫిబ్రవరి 27న అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ చిరునవ్వు ద్వారా ప్రతి విద్యార్థికి టూత్‌పేస్ట్, బ్రష్‌ను ఉచితంగా ఇవ్వాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో దంత వైద్య పరీక్షలు జరగాలని, 60 లక్షల మంది చిన్నారులను స్క్రీనింగ్ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పారు.


సచివాలయాల్లో విలేజ్ క్లినిక్‌లు

రాష్ట్రంలో ప్రతి రెండు వేల జనాభాను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా విలేజ్ క్లినిక్‌ను అందుబాటులో ఉంచాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ అందుబాటులో ఉండాలన్నారు. విలేజ్ క్లినిక్ అనేది రెఫరల్ పాయింట్‌లా ఉండాలని, ప్రతి రోగికి ప్రాథమిక వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికొక బోధనాసుపత్రి ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

జైలులో స్కిల్ డెవలప్‌మెంట్ యూనిట్ ఏర్పాటు

దేశంలోనే తొలిసారిగా కడప కేంద్ర కారాగారంలో రూ.4.70 కోట్ల వ్యయంతో స్కిల్ డెవలప్‌మెంట్ మాడ్యులర్ ఫర్నిచర్ యూనిట్ నెలకొల్పుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. కడప కేంద్ర కారాగారంలో ఫిబ్రవరి 28న ఆమె ఈ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. స్విట్జర్లాండ్‌లో తప్ప మరెక్కడాలేని మాడ్యులర్ ఫర్నిచర్ యూనిట్‌ను కడప కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఖైదీలలో పరివర్తన కోసం చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఈ యూనిట్ నెలకొల్పుతున్నామన్నారు. రాబోయే నాలుగు నెలల్లో ఈ యూనిట్ పూర్తవుతుందన్నారు. ఖైదీల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

తెలంగాణలో తొలి కోవిడ్ 19 కేసు నమోదు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రవేశించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో తొలి కోవిడ్ 19 కేసు నమోదైంది. దుబాయ్ నుంచి బెంగళూరు ద్వారా నగరానికి వచ్చిన 24 ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కు ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అయితే ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందొద్దని, ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందని, వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చే సూచనలు, సలహాలను పాటించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. దేశంలో ఢిల్లీ, హైదరాబాద్‌లలో ఒక్కో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైందని మార్చి 2న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పు

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను చట్ట విరుద్ధంగా ప్రకటించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని, అలా జరగడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్ 28న ప్రభుత్వం జారీ చేసిన జీవో 176ను రద్దు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మార్చి 2న తీర్పు వెలువరించింది.

కోవిడ్ 19 కట్టడికి 100 కోట్లు కేటాయింపు

తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిన కోవిడ్19 మహమ్మారి మరింత విస్తరించకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మార్చి 3న వెల్లడించారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులు, కంటోన్మెంట్‌లోని మిలిటరీ ఆస్పత్రితోపాటు వికారాబాద్‌లోని టీబీ ఆస్పత్రిలోనూ ప్రత్యేక వార్డులను సిద్ధం చేసినట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ప్రైవేటు మెడికల్ అనుబంధ ఆసుపత్రుల్లో 3 వేల పడకలను అందుబాటులో ఉంచాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వాటిలో కొన్నింటిని సాధారణ ఐసొలేషన్ కోసం, కొన్నింటిని ప్రత్యేక చికిత్స కోసం ముందు జాగ్రత్తగా తీసుకున్నట్లు వివరించారు.

26 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీకి ఏపీ కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో 2020 ఏడాది ఉగాది రోజున సుమారు 26 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్‌పీఆర్‌లోని కొన్ని అంశాల్లో మార్పులు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన మార్చి 4న సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు

  • ఏటా 6 లక్షలకుపైగా ఇళ్ల చొప్పున వచ్చే నాలుగేళ్లలో 26 లక్షల ఇళ్లు నిర్మించాలని.. వీటికి వైఎస్సార్ జగనన్న కాలనీలుగా పేరు పెట్టాలని నిర్ణయం.
  • నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్)పై మైనార్టీ వర్గాల ప్రజల్లో అభద్రతాభావం తొలగించాలంటే 2010 నాటి జనాభా గణన ప్రశ్నావళికే పరిమితం కావాలని.. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న ఎన్‌పీఆర్ ప్రశ్నల నమూనాలో మార్పు చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం. అలా మార్పు చేసే వరకు ఎన్‌పీఆర్ ప్రక్రియను అభయన్స్ లో ఉంచాలని నిర్ణయం.
  • పీపీపీ విధానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృది పనులను జీఎమ్మార్ ఎయిర్‌పోర్‌‌ట్స లిమిటెడ్ సంస్థకు అప్పగించేందుకు ఆమోదం.
  • తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో తొండంగి మండలం కోన గ్రామం వద్ద పోర్టు నిర్మాణం కోసం 9 నెలల కాల వ్యవధిని పొడిగింపు. ఆ మేరకు కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌కు అనుమతికి నిర్ణయం.
  • కాకినాడ ఎస్‌ఈజెడ్ లిమిటెడ్‌లో 49 శాతం ఈక్విటీని అదానీ పోర్టు అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్‌కు బదిలీ చేస్తూ చేసుకున్న ఒప్పందానికి ఆమోదం.
  • రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నంలలో పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
  • ఏపీ జెన్‌కో, ఏపీపీడీసీఎల్ చెరో రూ.1,000 కోట్లు చొప్పున, మొత్తంగా రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది.

మార్చి 2020 ఎకానమీ

భారత జీడీపీ వృద్ధి రేటు 4.9 శాతమే: ఫిచ్

భారత జీడీపీ వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరానికి 5.1 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను 4.9 శాతానికి తగ్గిస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ మార్చి 2న ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనాలను కూడా గతంలో వేసిన 5.9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. దేశీయంగా డిమాండ్ బలహీనంగా ఉండడం, కరోనా వైరస్ కారణంగా సరఫరా పరంగా అడ్డంకులతో తయారీ రంగం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్టు ఫిచ్ పేర్కొంది.
5.1 శాతానికి కుదింపు: ఓఈసీడీ

కోవిడ్ 19(కరోనా వైరస్) రిస్క్ కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాలను 5.1 శాతానికి కుదించినట్లు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) తెలిపింది. గతంలో ఇది 6.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక మార్కెట్లు, పర్యాటక రంగం, సరఫరా వ్యవస్థల్లో సమస్యలు మొదలైన అంశాల వల్ల జీ20 దేశాల వృద్ధి రేటు మందగించవచ్చని తెలిపింది.

మహిళలకు రూ. 17వేల కోట్ల రుణాలు

స్టాండప్ ఇండియా పథకం కింద రుణాలు పొందిన వారిలో దాదాపు 81 శాతం మంది మహిళలు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. నాలుగేళ్ల వ్యవధిలో వారు రూ. 16,712 కోట్ల రుణాలు పొందినట్లు వివరించింది. ‘2020 ఫిబవ్రరి 17 నాటికి స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఖాతాదారుల్లో 81 శాతం మంది మహిళలు ఉన్నారు. 73,155 ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. మహిళలు సాధికారతతో మరింత మెరుగైన జీవితాన్ని సాగించేందుకు, వ్యాపారవేత్తలుగా తమ ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు ఈ పథకం తోడ్పడింది’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.

2016 ఏప్రిల్ 5న ప్రారంభం.

ప్రతి బ్యాంకు శాఖ పరిధిలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కొత్తగా సంస్థను ప్రారంభించేందుకు.. కనీసం ఒక్కరికైనా రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా రుణాలిచ్చే ఉద్దేశంతో 2016 ఏప్రిల్ 5న స్టాండప్ ఇండియా స్కీమ్‌ను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది.

బ్యాంకుల విలీన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం

ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ మార్చి 4న ఆమోదముద్ర వేసింది. బ్యాంకుల విలీన నిర్ణయం 2020, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. భారీ స్థాయికి చేరడం ద్వారా మెగా బ్యాంకులు.. ఇటు దేశీయంగాను, అటు అంతర్జాతీయంగాను మరింతగా పోటీపడగలవని, వ్యయాలు తగ్గించుకోగలవని ఆమె పేర్కొన్నారు. తాజా విలీనంతో ప్రభుత్వ రంగంలో ఏడు భారీ బ్యాంకులు, అయిదు చిన్న స్థాయి బ్యాంకులు మిగలనున్నాయి. మరోవైపు, ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ప్రవాస భారతీయులు (ఎన్నారై) 100 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అనుమతులివ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
కన్సాలిడేషన్ ప్రణాళిక ప్రకారం ఆంధ్రా బ్యాంకు.. కార్పొరేషన్ బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయనున్నారు. అలాగే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్.. యునెటైడ్ బ్యాంక్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంకులో, సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో, అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులో కలపనున్నారు.

మార్చి 2020 ద్వైపాక్షిక సంబంధాలు

భారత్‌లో యూఎస్‌ఐడీఎఫ్‌సీ కార్యాలయం

భారత్‌తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి యునెటైడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (యూఎస్‌ఐడీఎఫ్‌సీ) కార్యాలయాన్ని భారత్‌లో ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడి సీనియర్ సలహాదారు ఇవాంకా ట్రంప్ వెల్లడించారు. ఆర్థికపరమైన సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ఈ కార్యాలయం పనిచేస్తుందన్నారు.

భారత్‌తో బలపడిన బంధం

భారత్ వంటి అద్భుతమైన దేశంలో తన పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో అనూహ్యమైన పురోగతిని సాధించామని చెప్పారు. భారత్‌తో ఎన్నో వాణిజ్య కార్యకలాపాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. భారత్ పర్యటన ముగించుకొని అమెరికా చేరుకున్న ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

నమస్తే ట్రంప్ టీవీ వీక్షకులు 4.60 కోట్లు

భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని 4.60 కోట్ల మంది టీవీల ద్వారా తిలకించారు. ఫిబ్రవరి 24వ తేదీన అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతెరాలో జరిగిన ఈ కార్యక్రమాన్ని 180 టీవీ చానెళ్లు ప్రసారం చేశాయని బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్‌సీ) తెలిపింది. దేశవ్యాప్తంగా 4.60 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారని, 1,169 కోట్ల వ్యూయింగ్ మినిట్స్ నమోదైనట్లు పేర్కొంది. నమస్తే ట్రంప్ కార్యక్రమంలో భాగంగా 1.25 లక్షల మంది హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి ట్రంప్, మోదీ ప్రసంగించారు.

యూకే విద్యార్థి వీసాల్లో భారత్‌కు తొలిస్థానం

బ్రిటన్ విద్యార్థి వీసా పొందిన విదేశీయుల్లో భారతీయులు తొలిస్థానంలో నిలిచారు. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్(ఓఎన్‌ఎస్) ఈ విషయాన్ని వెల్లడించింది. ఓఎన్‌ఎస్ తాజాగా వెలువరించిన గణాంకాల ప్రకారం 2019లో 37,500 మంది భారతీయ విద్యార్థులకు టయర్-4(విద్యార్థి) వీసాలు దక్కాయి. 8 ఏళ్లతో పోలిస్తే ఇదే అత్యధికం. వృత్తి నిపుణులకిచ్చే టయర్-2 వీసాల్లో సగం భారతీయులకే దక్కాయి. ఈ విభాగంలో భారతీయులు 57వేల వీసాలతో టాప్‌లో నిలిచారు. 2019 ఏడాది ఏడాది 5.15 లక్షల మంది భారతీయులకు పర్యాటక వీసా ఇచ్చినట్లు తెలిపింది. అంతకు ముందుతో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువని వివరించింది. మొత్తమ్మీద భారతీయుల వీసా దరఖాస్తులను 95 శాతం వరకు ఆమోదించినట్లు తెలిపింది.

6 అపాచీ, 24 రోమియో హెలికాప్టర్ల కొనుగోలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఫిబ్రవరి 25న ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో కీలక ద్వైపాక్షిక అంశాలపై సమగ్రంగా ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో ప్రధాని మోదీ, ట్రంప్ కూడా పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య ‘అంతర్గత భద్రత, రక్షణ, ఇంధనం, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు’ అనే ఐదు ప్రధాన రంగాల్లో సహకారానికి సంబంధించి చర్చలు జరిగాయి. చర్చల అనంతరం, ఇరు దేశాల మధ్య ముఖ్యమైన రక్షణ ఒప్పందంతో పాటు ఇంధన, ఆరోగ్య రంగాల్లో మూడు ఒప్పందాలు కుదిరాయి.
ఒప్పందం: 1
మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఇరు దేశాల ఆరోగ్య శాఖల మధ్య ఒక ఎంఓయూ కుదిరింది. భారత్‌కు చెందిన సెంట్రల్ డ్రగ్‌‌స స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మధ్య వైద్య ఉత్పత్తుల రక్షణకి సంబంధించి ఎంఓయూపై సంతకాలు జరిగాయి.
ఒప్పందం: 2
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎగ్జాన్ మొబిల్ ఇండియా ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్, చార్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్‌ల మధ్య సహకారానికి సంబంధించి ఒక లెటర్ ఆఫ్ కోఆపరేషన్‌పై సంతకాలు జరిగాయి.
ఒప్పందం: 3
మోదీతో చర్చల అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. 300 కోట్ల డాలర్లకు పైగా విలువైన అత్యాధునిక రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, 260 కోట్ల డాలర్ల విలువైన 24 ఎంహెచ్ -60 రోమియో హెలికాప్టర్లను భారతీయ నౌకాదళం కోసం లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. అలాగే, 80 కోట్ల డాలర్ల విలువైన ఆరు ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్లను ఆర్మీ అవసరాల కోసం ప్రఖ్యాత బోయింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేస్తుంది. సముద్రం అడుగున దాగున్న జలాంతర్గాములను సైతం గుర్తించి దాడి చేయగలగడం రోమియో సత్తా కాగా.. లేజర్ల పర్యవేక్షణలో గుళ్ల వర్షం కురిపించగలగడం అపాచీ ప్రత్యేకత.

అపాచీ ఏహెచ్-64ఈ విశేషాలు

  • తయారీ సంస్థ: బోయింగ్ సంస్థ
  • ప్రయాణించగలిగే సిబ్బంది సంఖ్య: 2
  • పొడవు: 17.7 మీటర్లు; ఎత్తు: 5 మీటర్లు; రోటర్ వ్యాసం: 14.6
  • ఒట్టి హెలికాప్టర్ బరువు: 5170 కిలోలు
  • ఆయుధాలన్నీ ఎక్కించిన తరువాత బరువు: 10,439 కిలోలు
  • నిలువుగా పైకి ఎగబాకే వేగం నిమిషానికి: 2,000 అడుగులు
  • ఇంజిన్ల సంఖ్య: 2 (జనరల్ ఎలక్ట్రిక్ టీ-700 టర్బోషాఫ్ట్)
  • గరిష్ట వేగం: 284 కి.మీ
  • ఆయుధ సంపత్తి: 30 మిల్లీమీటర్ల ఫిరంగి గుళ్లు (1200 రౌండ్లు)
  • క్షిపణుల్లో రకాలు : 16 ట్యాంకు విధ్వంసక క్షిపణులు
  • ఏఐఎం 92 స్ట్రింగర్ మిస్ట్రాల్, క్షిపణులు నాలుగు చొప్పున బిగించుకోవచ్చు. లేదంటే రెండు ఏఐఎం-9 సైడ్ విండర్ క్షిపణులు ఉపయోగించుకోవచ్చు.
  • ఏజీఎం-122 సైడ్ ఆర్మ్ యాంటీ రేడియేషన్ క్షిపణులు రెండు చొప్పున ఏర్పాటు చేసుకోవచ్చు. లేజర్లు, పరారుణ కాంతుల సాయంతో లక్ష్యాలను గుర్తించవచ్చు. ఏ లక్ష్యాలపై గురిపెట్టాలో కూడా నిర్ణయించవచ్చు.

ఎంహెచ్60 రోమియో విశేషాలు

  • తయారీ సంస్థ: లాక్‌హీడ్ మార్టిన్
  • పరిధి: 834 కి.మీ
  • ఎత్తు: 5.1 మీటర్ల్లు; పొడవు: 19.76 మీటర్లు; వెడల్పు: 16.35 మీటర్లు
  • పైకి ఎగబాక గలిగే వేగం సెకనుకు: 8.38 మీటర్లు
  • బరువు దాదాపుగా: 10,350 కిలోలు
  • జలాంతర్గాములను గుర్తించగలదు వెతుకులాట, రక్షణ వంటి కార్యకలాపాలకూ వాడుకోవచ్చు.
  • అత్యాధునిక యుద్ధ వ్యవస్థలన్నీ దీని సొంతం. ఒక్కసారి నింగికి ఎగిరితే 3.30 గంటల సమయం యుద్ధంలో పాల్గొనగలదు.
  • ఎంహెచ్-60 రోమియో హెలికాప్టర్లు అందుబాటులోకి వస్తే...భారత నావికాదళంలోని వెస్ట్‌ల్యాండ్ సీకింగ్ హెలికాప్టర్లు (బ్రిటన్ తయారీ)ల వాడకం ఆగిపోతుంది. దశాబ్దాలుగా సేవలందిస్తున్న సీ కింగ్ నిర్వహణ వ్యయం తడిసి మోపెడు అవుతూండటం దీనికి ఒక కారణం.
. కొరియా, జపాన్ వీసా నిలిపివేత: భారత్
కోవిడ్ 19(కరోనా వైరస్) బారిన పడిన దేశాల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో భారత్ అప్రమత్తమైంది. దక్షిణ కొరియా, జపాన్ దేశాల నుంచి వచ్చే వారి వీసాలను ఫిబ్రవరి 28 నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 13 మంది ఈ వ్యాధితో మరణిస్తే, కేసులు 2 వేలు దాటిపోయాయి. జపాన్ షిప్‌లో ఉన్న ప్రయాణికుల్లో కూడా చాలా మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు 57 దేశాలకు ఈ వ్యాధి వ్యాపించింది. ఇటలీ, ఇరాన్‌లో కూడా కేసులు భారీగా పెరిగాయి.
జెనీవా ఆటో షో రద్దు
కోవిడ్-19 వైరస్(కరోనా) నేపథ్యంలో ఎగ్జిబిషన్ల వంటి కార్యక్రమాలను నిషేధించినట్లు స్విస్ ప్రభుత్వం ఫిబ్రవరి 28న నిషేధాన్ని ప్రకటించింది. ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు 1,000 మందికి మించిన జనసమూహాలు ఉండ కూడదని వెల్లడించింది. దీంతో 2020, మార్చి 5 నుంచి 15 వరకు జరగాల్సిన జెనీవా ఆటో షో రద్దు అయి్యంది. ఇప్పటికే 15 కేసులను స్విస్ ప్రభుత్వం గుర్తించింది.

మార్చి 2020 సైన్స్ & టెక్నాలజీ

హెచ్‌ఏఎల్‌లో అపాచీ తరహా హెలికాప్టర్ల తయారీ

అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్‌కు చెందిన అపాచీ హెలికాప్టర్లకు దీటుగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మధ్య తరహా మిలటరీ హెలికాప్టర్లను తయారు చేయడానికి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) సన్నాహాలు చేస్తోంది. 2027 కల్లా ఈ సైనిక హెలికాప్టర్లను తయారు చేసి భారత అమ్ముల పొదిలో చేర్చడానికి క్షేత్రస్థాయిలో పని ప్రారంభించినట్టు హాల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ మాధవన్ మార్చి 1న వెల్లడించారు. రానున్న సంవత్సరాల్లో భారత్‌లోని త్రివిధ బలగాలకు అవసరమైన హెలికాప్టర్లను తామే రూపొందించడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు.
2023 నాటికి..
ప్రభుత్వం అనుమతినిస్తే 500 యూనిట్లలో హెలికాప్టర్‌కు సంబంధించిన తొలి నమూనా పని 2023 నాటికి పూర్తయ్యేలా హాల్ లక్ష్యంగా నిర్ణయించింది. మి-17 స్థానంలో 10-12 టన్నుల కేటగిరీలో హెలికాప్ట్టర్ల తయారీపై హాల్ దృష్టి పెట్టింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 500 హెలికాప్టర్ల తయారు చేయగలిగితే విదేశాల నుంచి రూ. 4 లక్షల కోట్లకు పైగా విలువైన దిగుమతుల్ని నిరోధించవచ్చునని మాధవన్ వెల్లడించారు. తేజస్ యుద్ధ విమానాల తయారీ తర్వాత హాల్ చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు ఇదే.

-టీఐసీ ఫౌండేషన్‌తో ఎన్‌ఎండీసీ ఎంవోయూ

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఎన్‌ఐసీఈ)ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఐ-టీఐసీ ఫౌండేషన్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. ఐదేళ్ల ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎన్‌ఎండీసీ ఐఐటీ-హైదరాబాద్ ప్రాంగణంలో స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తుందని ఎన్‌ఎండీసీ సీఎండీ ఎన్ బైజేంద్ర కుమార్ మార్చి 2న తెలిపారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, సర్వీసెస్ రంగాల్లో వినూత్న, సరికొత్త సాంకేతికత స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తుందని.. ఐదేళ్ల ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌కు ఎన్‌ఎండీసీ రూ.10 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. తొలి దశలో 15 స్టార్టప్స్‌లకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

300 కోట్ల ఏళ్లకు పూర్వం భూమి జలమయం

దాదాపు 300 కోట్ల సంవత్సరాల కింద భూమి పూర్తిగా నీటితో కప్పి ఉండేదని ఓ తాజా అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ద్వారా భూమిపై ఏక కణజీవులు ఎక్కడ, ఎలా పరిణామం చెందాయో పరిశోధకులు తెలుసుకునే వీలుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘నేచర్ జియోసైన్స్ జర్నల్’లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. పురాతన భూగోళం ఎలా ఉండేదన్న చర్చలకు ఈ అధ్యయనం ద్వారా సమాధానం దొరికినట్లయిందని అమెరికాలోని కొలరాడో వర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ బోస్‌వెల్ వివరించారు. ఆస్ట్రేలియాలోని పనోరమా జిల్లాలో ఉన్న కొండలు, పర్వతాలు ఒకప్పుడు నదీ ప్రవాహాల కారణంగా ఏర్పడి ఉంటాయని అయోవా స్టేట్ వర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాన్సన్ తెలిపారు.

మార్చి 2020 అవార్డ్స్

ఏపీఎస్‌ఆర్టీసీకి స్మార్ట్ మొబిలిటీ ప్రాజెక్టు అవార్డు

స్మార్ట్ సిటీ ఎంపవరింగ్ ఇండియా అవార్డులు-2019లో భాగంగా స్మార్ట్ మొబిలిటీ ప్రాజెక్టు విభాగంలో ఏపీఎస్‌ఆర్టీసీ అవార్డు గెలుచుకుంది. ఏపీఎస్‌ఆర్టీసీలో వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టంను ప్రవేశపెట్టి సమర్థంగా అమలు పరిచినందుకుగాను ఈ అవార్డు లభించింది. ఈ పోటీల్లో మొత్తం దేశంలోని పది ఆర్టీసీలు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో ఏపీఎస్‌ఆర్టీసీ నిలవగా, ద్వితీయ స్థానంలో కేఎస్‌ఆర్టీసీ నిలిచింది. ఢిల్లీలో ఫిబ్రవరి 28న జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పురి చేతుల మీదుగా అధికారులు సుధాకర్, శ్రీనివాసరావులు ఈ అవార్డును అందుకున్నారు.

జాతీయ సైన్స్ దినోత్సవ అవార్డుల ప్రదానం
జాతీయ సైన్స్ దినోత్సవం(ఫిబ్రవరి 28) సందర్భంగా భారతీయ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పరిశోధన పత్రాలను ప్రచురించిన పలువురికి అవార్డులు అందజేశారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఫిబ్రవరి 28న జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులను అందజేశారు. పోస్ట్ డాక్టర్ ఫెలో (పీడీఎఫ్) విభాగంలో తిరుపతి ఐఐఎస్‌ఈఆర్‌కి చెందిన డాక్టర్ హర్షిణి చక్రవర్తి, మద్రాస్ ఐఐటీకి చెందిన డాక్టర్ శిరీష బొడ్డపాటి అవ్సార్ (అగుమెటింగ్ రైటింగ్ స్కిల్స్ ఫర్ అర్టిక్యులేటింగ్ రీసెర్చ్) అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.
పరిశోధనల్లో మహిళలు 15 శాతమే
సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూ... శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు తక్కువ సంఖ్యలో ఉన్నారని వ్యాఖ్యానించారు. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో మహిళలు 15 శాతానికే పరిమితం అయ్యారని పేర్కొన్నారు. దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో లింగ సమానత్వం, అభివృద్ధికి సంబంధించి మూడు కార్యక్రమాలను కోవింద్ ప్రారంభించారు.

మార్చి 2020 స్పోర్ట్స్

దుబాయ్ వేదికగా ఆసియా కప్: బీసీసీఐ

2020, సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్ వేదిక మారింది. ఈ టోర్నీ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉండగా.. పాక్‌లో ఆడలేమంటూ బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో మార్పు అనివార్యమైంది. ఈ టోర్నీ యూఏఈలోని దుబాయ్‌లో జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఫిబ్రవరి 28న వెల్లడించాడు. భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఇరు జట్ల మధ్య 2012-13 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రం తలపడుతున్నాయి.

షూటింగ్ ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన భారత్

సైప్రస్ వేదికగా 2020, మార్చి 4 నుంచి 13 వరకు జరిగే షూటింగ్ ప్రపంచ కప్ నుంచి భారత్ వైదొలిగింది. కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో భారత షూటర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు భారత జాతీయ రైఫిల్ సంఘం ఫిబ్రవరి 28న తెలిపింది. కోవిడ్-19 రోజు రోజుకు విస్తరిస్తున్న తరుణంలో భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని దేశాలకు భారతీయులు ప్రయాణం చేయకుండా ఉంటేనే మంచిదంటూ ఫిబ్రవరి 26న తెలిపింది. ఆ దేశాల జాబితాలో సైప్రస్ ఉండటంతో భారత షూటర్లు షూటింగ్ ప్రపంచ కప్ ఈవెంట్‌కు దూరమయ్యారు.

ఒలింపిక్ చాంపియన్ సున్ యాంగ్‌పై నిషేధం

మూడు సార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, చైనా ఫ్రీ స్టయిల్ స్విమ్మర్ సున్ యాంగ్‌పై కోర్ట్ ఆఫ్ ఆర్బిటరేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) ఫిబ్రవరి 28న ఎనిమిదేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018 సెప్టెంబర్‌లో అతడి నుంచి శాంపిల్స్‌ను సేకరించడానికి వెళ్లిన ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ప్రతినిధులకు సహకరించకుండా... వారు సేకరించిన శాంపిల్స్‌ను నాశనం చేశాడనే అభియోగంతో సీఏఎస్ అతడిపై విచారణ చేపట్టింది. తాజాగా ఆ ఘటనలో సున్ యాంగ్‌ను దోషిగా తేలుస్తూ... అతడిపై ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. 2014లో కూడా సున్ డోపింగ్‌లో పట్టుబడి నిషేధాన్ని ఎదుర్కొన్నాడు.

బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్‌గా సాంటోసో
భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్‌గా ఇండోనేసియాకు చెందిన అగుస్ డ్వి సాంటోసోను ఎంపిక చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 28న నిర్ణయం తీసుకుంది. సాంటోసో టోక్యో ఒలింపిక్స్ ముగిసే వరకు కోచ్‌గా సేవలు అందించనున్నాడు. అతడి పర్యవేక్షణలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధుతో పాటు ఇతర సింగిల్స్ షట్లర్లు కూడా టోక్యో కోసం సిద్ధమవుతారు.ఒలింపిక్స్ వరకు సొంటోసోకు నెలకు 8 వేల డాలర్లు (సుమారు రూ.5.8 లక్షలు ) చెల్లించనున్నారు. భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్‌గా ఉన్న కిమ్ జి హ్యూన్(దక్షిణ కొరియా) 2019, సెప్టెంబర్ 24న తన పదవికి రాజీనామా చేశారు.

ఖేలో ఇండియా చాంపియన్‌గా పంజాబ్ వర్సిటీ
తొలిసారి నిర్వహించిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో పంజాబ్ యూనివర్సిటీ జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో మార్చి 1న ముగిసిన ఈ క్రీడల్లో పంజాబ్ వర్సిటీ మొత్తం 46 పతకాలు సాధించింది. ఇందులో 17 స్వర్ణాలు, 19 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. ముగింపు ఉత్సవానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. మొత్తం పది రోజులపాటు జరిగిన ఈ క్రీడల్లో 64 యూనివర్సిటీలు కనీసం ఒక స్వర్ణమైనా సాధించాయి. 113 యూనివర్సిటీలు కనీసం ఒక కాంస్యమైనా గెలిచాయి.
ఈ క్రీడల్లో ఏపీకి చెందిన నాగార్జున వర్సిటీ నాలుగు పతకాలతో (స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలు) 38వ ర్యాంక్‌లో... ఆంధ్ర వర్సిటీ రెండు పతకాలతో (స్వర్ణం, కాంస్యం) 50వ ర్యాంక్‌లో... కృష్ణా వర్సిటీ రెండు రజతాలతో 72వ ర్యాంక్‌లో... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఒక కాంస్యంతో 97వ ర్యాంక్‌లో నిలిచాయి. తెలంగాణకు చెందిన ఉస్మానియా వర్సిటీ రెండు పతకాలతో (స్వర్ణం, రజతం) 45వ ర్యాంక్‌లో... పాలమూరు వర్సిటీ ఒక రజతంతో 81వ ర్యాంక్‌లో నిలిచాయి.

జకోవిచ్‌కు దుబాయ్ ఓపెన్ చాంపియన్‌షిప్
ప్రపంచ నెం.1, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ కెరీర్‌లో 79వ టైటిల్ సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 29న ముగిసిన దుబాయ్ ఓపెన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ తుదిపోరులో జకోవిచ్ 6-3, 6-4తో స్టెఫానో సిట్సిపాస్(గ్రీస్)పై గెలుపొందాడు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచి.. నాదల్ నుంచి తిరిగి నెం.1 ర్యాంకును సొంతం చేసుకున్న జకోవిచ్ తాజా టైటిల్ ద్వారా తన అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో జకోవిచ్‌కు ఇది వరుసగా 18వ విజయం.

రాఫెల్ నాదల్‌కు మెక్సికో ఓపెన్ టైటిల్
ప్రపంచ రెండో ర్యాంకర్, స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ 2020 ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకున్నాడు. మెక్సికోలోని అకాపుల్కోలో మార్చి 1న ముగిసిన మెక్సికో ఓపెన్ ఏటీపీ-500 టోర్నీలో 33 ఏళ్ల నాదల్ చాంపియన్‌గా నిలిచాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో నాదల్ 6-3, 6-2తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలిచాడు. మెక్సికో ఓపెన్‌ను నాదల్ నెగ్గడం ఇది మూడోసారి. గతంలో నాదల్ 2013, 2015లలో విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా నాదల్ కెరీర్‌లో ఇది 85వ సింగిల్స్ టైటిల్. విజేతగా నిలిచిన నాదల్‌కు 3,72,785 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 69 లక్షలు)తోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

ప్రపంచకప్ ఆర్చరీ టోర్నీకి జ్యోతి సురేఖ

ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ జాతీయ సెలెక్షన్ ట్రయల్స్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసి ఆర్చరీ ప్రపంచకప్‌కు ఎంపికైంది. 2020, మే 11 నుంచి 17 వరకు టర్కీలోని అంటాల్యాలో జరిగే రెండో ప్రపంచకప్‌లో జ్యోతి సురేఖ కాంపౌండ్ విభాగంలో భారత్ తరఫున బరిలోకి దిగనుంది. ప్రపంచకప్‌లలో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం హరియాణాలో మార్చి 2న ముగిసిన సెలక్షన్ ట్రయల్స్‌లో సురేఖ రెండు కొత్త జాతీయ రికార్డులు నమోదు చేయడంతోపాటు టాప్ ర్యాంక్‌లో నిలిచింది.
సెలెక్షన్ ట్రయల్స్‌లో 12/12 పాయింట్లతో సురేఖ నంబర్‌వనగా నిలిచింది. అనంతరం 709/720 స్కోరుతో తన పేరిటే ఉన్న రికార్డును (707/720)ను తిరగరాసింది. డబుల్ ఫిఫ్టీ రౌండ్‌లో 1411/1440 స్కోరుతో తన రికార్డు (1405/1440)ను తానే బద్దలు కొట్టింది. ప్రపంచ రికార్డు (1412)కు చేరువగా వచ్చింది.

క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా సునీల్

టీమిండియా క్రికెట్ జట్టు జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సునీల్ జోషి ఎంపికయ్యాడు. సునీల్‌తోపాటు టీమిండియా మాజీ బౌలర్ హర్విందర్ సింగ్ ఐదుగురు సభ్యుల సెలెక్షన్ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్నాడు. మదన్‌లాల్, ఆర్‌పీ సింగ్, సులక్షణ నాయక్‌తో కూడిన బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) వీరిని ఎంపిక చేయగా... ఈ ఎంపికకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మార్చి 4న ఆమోదముద్ర వేసింది.
ప్రస్తుత సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్(సౌత్ జోన్), ప్యానెల్ సెలెక్లర్ గగన్ ఖోడా(సెంట్రల్ జోన్) పదవీకాలం ముగిసిన నేపథ్యంలో జోన్ల ప్రాతిపదికన కొత్త సెలెక్టర్ల ఎంపిక జరిగింది. ప్రసాద్ స్థానాన్ని సునీల్, ఖోడా స్థానాన్ని హర్విందర్ భర్తీ చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం కొనసాగుతున్న ప్యానెల్ సభ్యులు జతిన్ పరంజపే (వెస్ట్ జోన్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్), శరణ్‌దీప్ సింగ్ (నార్త్ జోన్)తో కలసి పని చేస్తారు.

ఐపీఎల్ ప్రైజ్‌మనీలో తగ్గింపు: బీసీసీఐ

ఖర్చులు తగ్గించే పనిలో భాగంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రైజ్‌మనీ నిధిని సగానికి సగం తగ్గించేసింది. ప్రైజ్‌మనీ తగ్గింపు నిర్ణయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యాలకు బీసీసీఐ తెలియజేసింది. గతంలో ప్రైజ్‌మనీ మొత్తం రూ. 50 కోట్లు కాగా... ఇప్పుడు రూ. 25 కోట్లకు తగ్గింది. దీంతో 2020 ఐపీఎల్ విజేతకు రూ. 20 కోట్లకు బదులుగా రూ. 10 కోట్లు మాత్రమే అందిస్తారు. అలాగే రన్నరప్ జట్టుకు రూ.12 కోట్ల 50 లక్షలకు బదులుగా రూ. 6 కోట్ల 25 లక్షలు దక్కుతుంది. ప్లే-ఆఫ్స్‌కు చేరిన మరో రెండు జట్లకు రూ. 4 కోట్ల 30 లక్షలు (గతంలో రూ.6 కోట్ల 25 లక్షల చొప్పున) అందజేస్తారు. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే ఆయా రాష్ట్ర సంఘాలకు నిర్వహణ వ్యయాన్ని పెంచింది. ఒక్కో మ్యాచ్ నిర్వహణకు రూ. 30 లక్షలు చెల్లించే బోర్డు... ఇకపై రూ.50 లక్షలు చెల్లించనుంది.

మార్చి 2020 వ్యక్తులు

ఫ్రాన్స్ లో భారత రాయబారిగా జావెద్ అష్రాఫ్

ఫ్రాన్స్ లో భారత రాయబారిగా దౌత్యవేత్త జావెద్ అష్రాఫ్ నియమితులయ్యారు. 1991 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీసు అధికారి అయిన జావెద్ ఇంతవరకు సింగపూర్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేశారు. ఫ్రాన్స్ లో భారత రాయబారిగా ఉన్న వినయ్ మోహన్ క్వత్రా నేపాల్ రాయబారిగా నియమితులయ్యారు.

ఢిల్లీలో హింస ఆందోళనకరం

ఢిల్లీలో చెలరేగిన హింసపై అమెరికాకు చెందిన కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం(యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వాల ప్రధాన బాధ్యత విశ్వాసాలతో సంబంధం లేకుండా ప్రజలకు భద్రత కల్పించడం, పూర్తి రక్షణ కల్పించడమేనని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు సరికావని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ పేర్కొన్నారు.

సీఏఏపై బ్రిటన్ పార్లమెంట్‌లో చర్చ

భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రభావంపై బ్రిటన్ పార్లమెంట్‌లోని ఎగువ సభ(హౌస్ ఆఫ్ లార్డ్స్)లో చర్చ జరిగింది. ఈ చట్టం అమలు, మైనారిటీల హక్కులపై ఆందోళనను వివరించేందుకు భారత్‌కు ప్రతినిధి వర్గాన్ని పంపాలని కోరింది.

ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ శెట్టర్ కన్నుమూత

ప్రముఖ చరిత్రకారుడు, పరిశోధకుడు డాక్టర్ ఎస్.శెట్టర్ (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 28న బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా హంస సాగరలో జన్మించిన షడక్షరీ శెట్టర్ మైసూరు, ధార్వాడ్, కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయాల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. చరిత్ర, కళలు, పురావస్తు తవ్వకాలు, పర్యాటకం, గ్రాంథిక భాషాంశాలపై 27కు పైగా పరిశోధన గ్రంథాలను రాశారు. వివిధ వర్సిటీల్లో ఆచార్యులుగా సేవలందిస్తూనే 1978-1995 మధ్య కాలంలో భారతీయ కళా చరిత్ర సంస్థకు సంచాలకులుగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
శెట్టర్ ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసర్చ్ అధ్యక్షునిగా, బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ స్టడీస్‌లో ఆచార్యులుగా సేవలందించారు. భారతీయ, కర్ణాటక చరిత్ర అనుసంధాన పరిషత్‌లకు అధ్యక్షులుగా వ్యవహరించారు. మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా)లో విశ్వ సంస్కృత సమ్మేళనం విభాగానికి, బళ్లారి జిల్లా సాహిత్య సమ్మేళనాలకు, అఖిల భారత పురాతన కన్నడ (హళేగన్నడ) సాహిత్య సమ్మేళనాలకు అధ్యక్షులుగా వ్యవహరించారు. కర్ణాటక రాజ్యోత్సవ, కుంద, కేంద్ర సాహిత్య అకాడమి, భాషా సమ్మాన్, మాస్తి, రన్న, 2016 ప్రాచీక కన్నడ వాజ్ఞయ పురస్కారాలను ఆయన అందుకున్నారు.

మలేసియా ప్రధానిగా మొహియుద్దీన్ ప్రమాణం

మలేసియా నూతన ప్రధానమంత్రిగా మొహియుద్దీన్ యాసిన్ మార్చి 1న ప్రమాణం చేశారు. మలేసియా రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా సమక్షంలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. పార్టీ ప్రిబూమి బెర్సాతు మలేసియా (పీపీబీఎం) వ్యవస్థాపకుడైన మొహియుద్దీన్‌కు యునెటైడ్ మలయ్స్ నేషనల్ ఆర్గనైజేషన్ (యూఎంఎన్‌ఓ), ఇతర పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. మొహియుద్దీన్ గతంలో మలేసియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఇప్పటివరకు మలేసియా ప్రధానమంత్రిగా పనిచేసిన మహతీర్ మొహమాద్ 2020, ఫిబ్రవరి 24న తన పదవికి రాజీనామా చేశారు.

ఏపీ సీఎం సలహాదారుగా సుభాష్‌చంద్ర గార్గ్

కేంద్ర ఆర్థిక శాఖలో కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన సుభాష్ చంద్ర గార్గ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనపు నిధులు సమీకరించే విషయంలో ముఖ్యమంత్రి సలహదారునిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన విభాగం (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి పవ్రీణ్ ప్రకాష్ మార్చి 1న ఉత్తర్వులు జారీచేశారు. కేబినేట్ మంత్రి హోదాలో ఆయన రెండేళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. నెలలో కనీసం 15 రోజులు పాటైనా ఆయన ఈ బాధ్యతల్లో పనిచేయాలని.. అలాగే, 7-10 రోజుల పాటు ఆయన రాష్ట్ర రాజధానిలోనే ఉండి పనిచేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నోకియా సీఈఓగా రాజీవ్ సూరి రాజీనామా

ఫిన్లాండ్‌కి చెందిన దిగ్గజ కంపెనీ నోకియా అధ్యక్షుడు, సీఈఓ రాజీవ్ సూరి తన పదవికి రాజీనామా చేశారు. రాజీవ్ సూరి వ్యక్తిగత కారణాల వల్లే తన పదవికి రాజీనామా చేసినట్లు మార్చి 2న కంపెనీ తెలిపింది. కంపెనీ నూతన అధ్యక్షుడు, సీఈవోగా పెక్కా లుండ్‌మార్క్‌ను నోకియా డెరైక్టర్ల బోర్డు నియమించింది. 2020, సెప్టెంబర్ నుంచి పెక్కా బాధ్యతలు చేపట్టనున్నారు. భారత సంతతికి చెందిన రాజీవ్ సూరి గత 25 ఏళ్లుగా నోకియాలో పనిచేశారు. నోకియా అధ్యక్షుడు, సీఈఓగా 2020, ఆగస్టు 31 వరకు సూరి కొనసాగుతారు. ఇక 2021 జనవరి 1 వరకు నోకియా బోర్డులో సలహాదారుగా వ్యవహరిస్తారు.

టర్కీలో భారత రాయబారిగా సంజయ్
టర్కీలో భారత రాయబారిగా సీనియర్ దౌత్యాధికారి సంజయ్ కుమార్ పాండా నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ మార్చి 3న వెల్లడించింది. 1991 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కి చెందిన సంజయ్ ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కో(అమెరికా)లో భారత కాన్సులేట్ జనరల్‌గా పనిచేస్తున్నారు.

పెట్రోలియం శాఖ కార్యదర్శిగా బీఎన్‌రెడ్డి
కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ సంయుక్త కార్యదర్శిగా 1993 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి బీఎన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన మూడేళ్లపాటు పెట్రోలియం శాఖ కొనసాగనున్నారు.