జీఎస్‌కే, సనోఫీ పేశ్చర్‌లతో యూఎస్ ఒప్పందంకరోనా వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్ ను సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్, ఉత్పత్తి, సరఫరా కోసం 2.1 బిలియన్ డాలర్లు(రూ.15,725 కోట్లు) వెచ్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రముఖ ఫార్మా సంస్థలు గ్లాక్సోస్మిత్‌క్లైన్(జీఎస్‌కే), సనోఫీ పేశ్చర్‌లతో ఒప్పందం చేసుకుంది. జీఎస్‌కే(బ్రిటన్), సనోఫీ(ఫ్రాన్స్) సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ 2020 ఏడాది చివరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమెరికాకు 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా చేస్తామని జీఎస్‌కే, సనోఫీ ప్రకటించాయి.
తొలి శునకం మృతి..అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ బారినపడ్డ మొదటి శునకం బడ్డీ జూలై 31న మృతి చెందింది. జర్మన్ షెఫర్డ్ డాగ్ అయిన బడ్డీకి 2020, జూన్ లో కరోనా సోకింది.
29 వేల చైనా యాప్‌ల తొలగింపుచైనీస్ యాప్ స్టోర్ నుంచి ఆగస్టు 1న అకస్మాత్తుగా 29,800 యాప్‌లను స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ యాపిల్ తొలగించింది. ఇందులో 26 వేలకు పైగా గేమ్ యాప్‌లే కావడం గమనార్హం. లైసెన్స్ గేమ్ యాప్‌లపై చైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నందునే యాపిల్ ఇలా చేసినట్లు క్విమై అనే పరిశోధన సంస్థ తెలిపింది. చైనా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ ప్రభుత్వ నిబంధనలకు లోబడే చాలాకాలంలో పనిచేస్తున్నాయి.
టిక్‌టాక్‌ను నిషేధిస్తాం: ట్రంప్చైనాతో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన కంపెనీలపై అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కొరడా ఝళిపించారు. చైనాకే చెందిన వీడియో యాప్ టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధించనున్నట్లు ట్రంప్ జూలై 31న ప్రకటించారు. అమెరికన్ల వ్యక్తిగత గోప్యత, భద్రతకు ప్రమాదకరంగా మారిందంటూ టిక్‌టాక్‌పై విదేశాంగ మంత్రి మైక్ పాంపియో విమర్శలు చేస్తున్నారు.
కోవిడ్‌కు చికిత్స లేకపోవచ్చు: డబ్ల్యూహెచ్వోకరోనా వైరస్ టీకా రూపకల్పనకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ సులభమైన పరిష్కారం ఏదీ ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వ్యాఖ్యానించింది. అందుకే, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, భౌతికదూరం, మాస్క్ ధరించడం వంటి ప్రాథమిక అంశాలపైనే ప్రభుత్వాలు, పౌరులు దృష్టి పెట్టాలని సూచించింది.ప్రస్తుతానికైతే ఈ మహమ్మారిని రూపుమాపే సులువైన అద్భుత చికిత్సేదీ లేదు..ఎప్పటికీ రాకపోవచ్చు కూడా..అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెసియస్ ఆగస్టు 3న తెలిపారు.
టీకా సంపన్న దేశాలకే..లండన్ కి చెందిన ఎయిర్‌ఫీనిటీ సంస్థ అంచనా ప్రకారం... 130 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, జపాన్ లు ఇప్పటికే కొనుగోలు చేశాయి. ప్రపంచం మొత్తానికి సరిపడిన వ్యాక్సిన్ లను తక్షణం సరఫరా చేయడం కష్టంతో కూడుకున్నపనేనని ఆ సంస్థ తెలిపింది.2009లో స్వైన్ ఫ్లూ ప్రబలినప్పుడు కూడా సంపన్న దేశాలు భారీ స్థాయిలో టీకా సరఫరాను తమ అదీనంలో ఉంచుకోవడం పేదదేశాలను ఆందోళనలోకి నెట్టింది.
టిక్‌టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చర్చలువివాదాస్పద వీడియో యాప్ టిక్‌టాక్ అమెరికా విభాగం కొనుగోలు వార్తలను టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ధ్రువీకరించింది. దీనికి సంబంధించి టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. మరోవైపు టిక్‌టాక్ యాప్‌నకు సంబంధించిన భద్రత, సెన్సార్‌షిప్ తదితర అంశాలపై నెలకొన్న ఆందోళన విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చర్చించారు. ఈ మేరకు ఆగస్టు 3న ఒక ప్రకటన విడుదల చేసింది.
మూడేళ్లలోనే...2017లో బైట్‌డ్యాన్స్ సంస్థ ప్రారంభించిన టిక్‌టాక్ వీడియో సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. బైట్‌డ్యాన్స్ ఆ తర్వాత మ్యూజికల్‌డాట్‌ఎల్‌వై అనే వీడియో సర్వీస్ ను కూడా కొనుగోలు చేసి టిక్‌టాక్‌తో కలిపింది. మ్యూజికల్‌డాట్‌ఎల్‌వై అమెరికా, యూరప్‌లో బాగా పేరొందింది. బైట్‌డ్యాన్స్ కు చైనా యూజర్ల కోసం డూయిన్ పేరుతో ఇలాంటిదే మరో సర్వీసు ఉంది. చైనాకు చెందిన యాప్ కావడంతో యూజర్ల డేటాను ఆ దేశానికి చేరవేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో భారత్‌లో ఇప్పటికే దీన్ని నిషేధించారు. తాజాగా టిక్‌టాక్‌ను అమెరికాలో త్వరలోనే నిషేధిస్తానంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
లెబనాన్ రాజధాని బీరుట్ లో భారీ పేలుడులెబనాన్ రాజధాని బీరుట్ నగరంలో ఆగస్టు 4న భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా 135 మృతి చెందగా, 5,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. పేలుడుతో బీరుట్ పోర్ట్ పరిసర ప్రాంతాలు బూడిద, వ్యర్థాలతో నిండిపోయాయి. పెద్దసంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాలు నేలమట్టమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
అమ్మోనియం నైట్రేట్..2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు లెబనాన్ మంత్రి మొహమ్మద్ ఫహ్మీ తెలిపారు. బీరుట్ పోర్ట్‌లోని ఓ గోదాములో దీన్ని నిల్వ చేశారు. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడుతో విషపూరితమైన నైట్రోజన్డయాక్సైడ్ గ్యాస్ విడుదలైంది. దీన్ని పీల్చడం వల్ల చాలామంది శ్వాస ఆడక ప్రాణాలొదిలారు.
ఆహార సంక్షోభం..చాలా చిన్న దేశమైన లెబనాన్ లో ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలింది. సూమారు 10 లక్షల మందికి పైగా సిరియా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. విదేశాల నుంచి నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల దిగుమతికి బీరూట్ పోర్ట్ అత్యంత కీలకం. తాజా పేలుడు వల్ల ఈ ఓడరేవు చాలావరకు నామరూపాల్లేకుండా పోయింది. దిగుమతులన్నీ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశంలో ఇకపై ఆహార సంక్షోభం తప్పదని వాదన వినిపిస్తోంది.
ఆదుకోండి..ఆర్థిక సంక్షోభంతోపాటు బీరుట్‌లో పేలుడు వల్ల తాము కష్టాల్లో కూరుకుపోయామని, ప్రపంచ దేశాలు, మిత్ర దేశాలు వెంటనే స్పందించి, ఆదుకోవాలని లెబనాన్ ప్రధానమంత్రి హసన్ దియాబ్ విజ్ఞప్తి చేశారు.
ఆగస్టు 2020 జాతీయం
వార్‌మెమొరియల్‌పై గల్వాన్ అమరులుతూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్లోయలో చైనా సైన్యంతో పోరాడి, వీరమరణం పొందిన 20 మంది అమరజవాన్ల పేర్లను ఢిల్లీలోని నేషనల్ వార్‌మెమొరియల్‌పై లిఖించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పేర్లు చేర్చడానికి కొద్ది నెలల సమయం పట్టనున్నట్టు తెలిపారు. ఐదు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా జూన్ 15వ తేదీన గల్వాన్లోయలో చైనా సైనికులతో భీకర పోరాటం జరిగింది. ఈ పోరాటంలో బిహార్ రెజిమెంట్ 16కి చెందిన కల్నల్ బి.సంతోష్ బాబుతో సహా 20 మంది సైనికులు అసువులు బాశారు. చైనా వైపు ఈ ఘర్షణలో ఎంత మంది చనిపోయారనేది ప్రకటించలేదు. అమెరికా నిఘా వర్గాల ప్రకారం 35 మంది చైనా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది.
అదనపు బలగాలు...చైనాతో ఉన్న సరిహద్దుల వెంబడి అదనంగా మరో 35 వేల మందిని నియమించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. భారత్ చైనా సరిహద్దులు 3,488 కిలోమీటర్ల పొడవు ఉండగా వాస్తవా«దీన రేఖ వెంబడి సరిహద్దులను కాపాడుకునేందుకు భారత్ ఇప్పటికే భారీగా ఖర్చు పెడుతోంది.
భారత్‌లో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదుభారత్లో కరోనా వైరస్‌ను హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా నియంత్రించలేమని వెల్లడైంది. భారత్‌లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో నివసించే జనాభాలో కరోనా వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీలు బాగా అభివృద్ధి చెందినప్పటికీ అవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయని వెల్లడించింది. టీకా కార్యక్రమం ద్వారా మాత్రమే ఇమ్యూనిటీని సాధించగలమని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి రాజేష్ భూషణ్ జూలై 30న వెల్లడించారు.
ఆగస్ట్ 15లోగా రష్యా టీకా..2020, ఆగస్ట్ 10 లేదా ఆగస్ట్ 12వ తేదీలోగా విడుదల చేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. గామాలెయ ఇన్స్టిట్యూట్ రూపొందించిన ఈ టీకాకు సాధ్యమైనంత త్వరగా అనుమతి ఇవ్వాలని రష్యా భావిస్తోందని ఈ మొత్తం ప్రక్రియతో సంబంధమున్న అధికారిని ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్‌ఒక కథనం ప్రచురించింది. ఆగస్ట్ 15లోగా ప్రజల వినియోగానికి అనుమతి లభించవచ్చని అధికార మీడియా ప్రకటించింది. మరోవైపు, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న టీకాను ఉత్పత్తి చేసేందుకు ఆ్రస్టాజెనెకాతో రష్యాకు చెందిన ఆర్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. ఆక్స్‌ఫర్డ్ టీకా పరిశోధనలను దొంగిలించేందుకు రష్యా హ్యాకర్లు ప్రయతి్నస్తున్నారని బ్రిటన్, కెనడా, అమెరికా ఆరోపిస్తుండగా ఈ ఒప్పందం కుదిరింది.
భారత్ లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్బ్రిటన్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ పై మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)కు అనుమతి ఇవ్వాలని కోవిడ్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ జూలై 31న డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. హ్యూమన్ ట్రయల్స్ అనుమతి కోరుతూ సీరమ్ సంస్థ నిపుణుల కమిటీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో 1,600 మందిపై ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ను పరీక్షిస్తామని సీరమ్ కంపెనీ తెలిపింది. ఇందులో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ కూడా ఉంది.
పొగాకు నుంచి వ్యాక్సిన్పొగాకు ఆకుల నుంచి సంగ్రహించిన ప్రొటీన్తో వ్యాక్సిన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్రిటిష్ అమెరికన్ పొగాకు సంస్థ లూసీ స్ట్రైక్స్ సిగరెట్స్ తెలిపింది. ఆ కంపెనీకి చెందిన కెంటకీ బయో ప్రాసెసింగ్ తయారు చేస్తున్న వాక్సిన్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొంది.
క్రెడాయ్ ఆవాస్ యాప్ ఆవిష్కరణరియల్టీ సంస్థలు–క్రెడాయ్, నరెడ్కో నివాసిత గృహ ప్రాజెక్టుల మార్కెటింగ్ కోసం రూపొందించిన డిజిటల్ వేదికలను కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి జూలై 31న ఆవిష్కరించారు. క్రెడాయ్ ఆవాస్ యాప్‌తోపాటు.. నరెడ్కో అభివృద్ధి చేసిన హౌసింగ్ ఫర్ ఆల్ డాట్ కామ్ పోర్టల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రారంభించారు.
డిజిటలీకరణకు మోడల్‌గా బెంగళూరుభారత్లో డిజిటలీకరణ ప్రక్రియకు బెంగళూరు సరైన నమూనాగా నిలవగలదని సీమెన్స్ ఏజీ సంస్థ జూలై 31న వెల్లడించింది. మొబిలిటీ, అవకాశాలు తదితర అంశాల ప్రాతిపదికన ఈ నగరాన్ని ఎంచుకున్నట్లు అట్లాస్ ఆఫ్ డిజిటలైజేషన్ నివేదికలో వివరించింది. ప్రపంచవ్యాప్తంగా 9 నగరాలు రూపాంతరం చెందిన తీరును నివేదికలో విశ్లేషించింది. బెంగళూరు సహా బెర్లిన్, బ్యూనస్ ఎయిర్స్, లండన్, సింగపూర్, దుబాయ్, జొహానెస్‌బర్గ్, లాస్‌ఏంజెలిస్, తైపీ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.
2జీ రహిత భారత్: ముకేశ్ అంబానీఎప్పుడో పాతికేళ్ల క్రితం ప్రారంభించిన 2జీ టెలిఫోనీ సర్వీసులను ఇక నిలిపివేయాల్సిన సమయం వచ్చిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధానపరంగా తగు నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా తొలి మొబైల్ ఫోన్ కాల్ చేసి పాతికేళ్లయిన (సిల్వర్ జూబ్లీ) సందర్భంగా జూలై 31 నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డేటా వినియోగానికి భారీ అవకాశాలు ఉన్నందున.. కనెక్టివిటీని మెరుగుపర్చడంపై టెలికం పరిశ్రమ దృష్టి పెట్టాలని టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ సూచించారు.
ఫారెక్స్ నిల్వల రికార్డు...ముంబై: భారత్ విదేశీ మారకపు నిల్వలు తాజాగా జూలై 24వ తేదీతో ముగిసిన వారంలో అంతకుముందు వారం (జూలై 17వ తేదీతో ముగిసిన)తో పోల్చి 5 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తంగా 522.63 బిలియన్ డాలర్లకు ఎగశాయి. పసిడి నిల్వల విలువలు పెరగడం, దిగుమతులు అంతగా లేకపోవడంతో తగ్గిన విదేశీ మారక వినియోగం వంటి అంశాలు ఫారెక్స్ రికార్డులకు కారణం.
లిపులేఖ్ పాస్ లో చైనా మోహరింపులుతూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారక ముందే మరోవైపు నుంచి డ్రాగన్ దేశం చైనా దురాక్రమణకు సిద్ధమైంది. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో లిపులేఖ్ పాస్‌లో సైనికుల్ని మోహరించింది. వెయ్యి మందికి పైగా చైనా సైనికులు లిపులేఖ్‌లో మోహరించినట్టుగా భారత్ మిలటరీ తెలిపింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు లద్దాఖ్‌లో సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు దోవల్, చైనా విదేశాంగ మంత్రి చాంగ్ యీ మధ్య జరిగిన చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చినా చైనా మాట నిలబడలేదు. లిపులేఖ్ పాస్, ఉత్తర సిక్కింలో కొన్ని ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా లిబరేషన్ ఆర్మీ సైన్యం తిష్ట వేసిందని భారత ఆర్మీ తెలిపింది.. చైనా ఆగడాలను దీటుగా ఎదుర్కోవడానికి భారత్ కూడా సన్నాహాలు చేస్తోంది. హిమాలయాల్లో గడ్డకట్టే చలిని తట్టుకోవడానికి భారతీయ సైన్యానికి దుస్తులు, టెంట్లను అమెరికా, రష్యా, యూరప్ నుంచి కొనుగోలు చేయనుంది.
ఏమిటీ లిపులేఖ్ పాస్?హిందువులకి అత్యంత సాహసోపేతమైన యాత్ర మానస సరోవరానికి వెళ్లే మార్గంలో లిపులేఖ్ పాస్ ఉంది. 1992లో చైనాతో వాణిజ్య సంబంధాల కోసం ఈ లిపులేఖ్ మార్గంలో తొలిసారిగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి ప్రతీ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు వాణిజ్య కార్యకలాపాల కోసం ఈ మార్గాన్ని తెరిచి ఉంచుతారు. ఆ సమయంలో సరిహద్దులకి రెండు వైపులా ఉండే ఆదివాసీలు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో హిమాలయాల వరకు భారత్ 80కి.మీ. రోడ్డుని నిర్మించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో లిపులేఖ్ పాస్ తరచూ వార్తల్లోకెక్కుతోంది. ఇప్పుడు చైనా ఈ మార్గంపైనే కన్నేసింది.
ఎన్ఈపీలో చైనీస్ కు దక్కని చోటుకేంద్ర కేబినెట్ జూలై 29న ఆమోదించిన నూతన జాతీయ విద్యావిధానం-2020 (ఎన్‌ఈపీ-2020)లో చైనా భాష చైనీస్ కు చోటు దక్కలేదు. ఎన్‌ఈపీ-2020 ప్రకారం... సెకండరీ స్కూలులో సాధారణంగా ప్రతీ విద్యార్థికి వారికి ఆసక్తి ఉన్న విదేశీ భాషను నేర్చుకునే అవకాశం ఉంటుంది. వేర్వేరు దేశాల్లో సంస్కృతులు, ఆయా దేశాల్లో సామాజిక స్థితిగతులపై జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం ఈ విదేశీ భాషల కేటగిరీని ప్రవేశపెట్టారు. 2019 ఏడాది విడుదల చేసిన ఎన్ఈపీ ముసాయిదా ప్రతిలో ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, జపనీస్‌తో పాటుగా చైనీస్ భాష ఉంది. కానీ కేంద్రం తాజాగా ఆమోదించిన తుది ప్రతిలో చైనీస్‌ను తొలగించినట్టు జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, రమేష్ పోఖ్రియాల్ విడుదల చేసిన ఎన్ఈపీలో రష్యన్, పోర్చుగీస్, థాయ్ భాషలకు చోటు దక్కింది.
నాలుగో ఎడిషన్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆగస్టు 1న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నాలుగో ఎడిషన్ ను నిర్వహించింది. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు విద్యార్థులు పరిష్కార మార్గాలు చూపడమే దీని ఉద్దేశం. 2020 ఏడాది 243 సమస్యల పరిష్కారానికి 10 వేల మందికిపైగా పోటీపడ్డారు. విజేతలకు నగదు బహుమతి అందజేశారు. హ్యాకథాన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.... ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్లు కాదు.. ఉద్యోగాలు ఇచ్చేవాళ్లను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన విద్యా విధానం–2020ని ప్రకటించిందన్నారు. దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం సంకంల్పించిందన్నారు.
కరోనాపై నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ ఏర్పాటుదేశవ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సమగ్ర సమాచారంతో ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్ణయించింది. దీనిద్వారా వారికి అందిస్తున్న చికిత్సను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, మరింత చికిత్స అందించేందుకు వీలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ, ఢిల్లీ ఎయిమ్స్ భాగస్వామ్యంతో నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీని ఐసీఎంఆర్ ఏర్పాటు చేయనుంది. ఆసుపత్రుల్లోని బాధితుల సమాచారాన్ని 15 జాతీయ స్థాయి సంస్థలు సేకరించి, రిజిస్ట్రీకి అందజేస్తాయి.
కరోనా అందరికీ సోకదు: ఐఐపీహెచ్కరోనా సోకిన వ్యక్తి ఉన్న కుటుంబంలో అందరికీ ఆ వైరస్ సోకుతుందని చెప్పలేమని తాజా అధ్యయనంలో తేలింది. కోవిడ్–19 నిర్ధారణ అయిన వ్యక్తి ఉన్న కుటుంబంలోని దాదాపు 80 శాతం నుంచి 90 శాతం సభ్యులకు ఆ వైరస్ సోకకపోవచ్చని గుజరాత్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అందుకు కారణం వారిలో ఆ వైరస్ నిరోధక శక్తి పెరగడమే కావచ్చని స్పష్టమైంది.
ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెనజమ్మూకశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన పనులు 2021 ఏడాదికి పూర్తికానున్నాయి. కశ్మీర్‌ను మిగతాదేశంతో కలిపే ఈ వారధిపై 2022 డిసెంబర్‌లో మొట్టమొదటి రైలు ప్రయాణం చేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ప్రత్యక్ష పర్యవేక్షణతో ఏడాదిగా పనులు వేగవంతం అయ్యాయన్నారు.
వంతెన విశేషాలు...
- 359 మీటర్ల ఎత్తులో 467 మీటర్ల పొడవైన ఈ వారధి ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే వంతెన.
- - గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా వంతెన డిజైన్ చేశారు.
- ఈ రైల్వే మార్గంలో ఉధంపూర్–కాట్రా(25 కిలోమీటర్లు) సెక్షన్, బనిహాల్–క్వాజిగుండ్ (18 కి.మీ.)సెక్షన్, క్వాజిగుండ్–బారాముల్లా (118 కి.మీ.) సెక్షన్ ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
- ప్రస్తుతం 111 కిలోమీటర్ల పొడవైన కాట్రా–బనిహాల్ సెక్షన్ లో పనులు కొనసాగుతున్నాయి.
- 2018 వరకు ప్రాజెక్టు అంచనా వ్యయంలో 27 శాతమే ఖర్చు కాగా ఆ తర్వాత 54 శాతం మేర వెచ్చించారు.
వృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగస్వామ్యందేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం శరవేగంగా వృద్ధి చెందుతోందని, దీనివల్ల దేశీయ ఆర్థిక వృద్ధిరేటు 2035 నాటికి ఏటా 1.3 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. ఈ మేరకు టూవర్డ్స్ రెస్పాన్సిబుల్ – ఏఐ ఫర్ ఆల్ పేరిట నీతి ఆయోగ్ ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. కొన్ని కీలకమైన పరిశోధనలు చేయడానికి కేంద్రం ఫండింగ్ చేస్తుండటమే కాకుండా, విశ్వవిద్యాలయాల కరికులమ్‌లో కూడా ఏఐని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఏఐ వినియోగం వల్ల ఆటోమేషన్ పెరిగి చాలా రంగాల ఉద్యోగాలపై వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఎన్ఎండీసీ సారథిగా సుమిత్ దేవ్మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ నూతన సీఎండీగా సుమిత్ దేవ్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ఎన్.బైజేంద్ర కుమార్ పదవీ విరమణ చేశారు. నూతన బాధ్యతలు చేపట్టే ముందు వరకు సుమిత్ దేవ్ ఎన్ఎండీసీలో డైరెక్టర్‌గా (పర్సనల్) ఉ న్నారు. కంపెనీలో 2015లో కమర్షియల్ విభాగం జీఎంగా చేరారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరి 25 ఏళ్లు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తించారు.
ద్విభాషా విధానాన్నే కొనసాగిస్తాం: సీఎం పళనిస్వామిజాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)–2020లో కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులోని ఏఐఏడీఎంకే ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో అమలవుతున్న ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆగస్టు 3న ప్రకటించారు. రాష్ట్రంలో 8 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ద్విభాషా విధానం నుంచి వైదొలిగేది లేదని స్పష్టం చేశారు. 5వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరపాలని ఎన్ఈపీ ప్రతిపాదించింది. అయితే, హిందీ, సంస్కృతాలను తమపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే నేత ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు.
డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ ముసాయిదా రూపకల్పన2025 నాటికి రక్షణ ఉత్పత్తుల టర్నోవర్ రూ. 1.75 లక్షల కోట్లకు చేరాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తిగా మారే సామర్ధ్యం ఈ రంగానికి ఉందని భావిస్తోంది. దీనికి సంబంధించిన డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ పాలసీ–2020 ముసాయిదాను రక్షణ శాఖ రూపొందించింది. అందులో, రానున్న ఐదేళ్లలో అంతరిక్ష రక్షణ రంగ ఉత్పత్తులు, సేవల ఎగుమతుల లక్ష్యమే రూ. 35 వేల కోట్లని అందులో పేర్కొంది.
కుల్‌భూషణ్‌కు భారత్ లాయర్మరణ శిక్ష ఎదుర్కొంటూ పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ తరఫున లాయర్‌ను నియమించేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు భారత్‌కు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు భారత్ అధికారులకు అవకాశమివ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను 2020, సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. జాధవ్ కేసులో పాక్ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై విచారణ జరిపేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు ఇద్దరు సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
దేశంలో ఉత్తమ వర్శిటీగా ఢిల్లీ విశ్వవిద్యాలయంఇండియా టుడే–మార్కెటింగ్ అండ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్(ఎండీఆర్‌ఏ) ప్రకటించిన ర్యాంకింగ్స్ ప్రకారం... దేశంలో అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్ యూ) మొదటిస్థానంలో నిలిచింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) ద్వితీయ స్థానం సంపాదించింది. కీర్తి, పాలన, అకడమిక్, రీసెర్చ్ ఎక్స్‌లెన్స్, ఇ్రన్ఫాస్ట్రక్చర్ అండ్ లివింగ్ ఎక్స్‌పీరియన్స్, పర్సనాలిటీ, నాయకత్వ అభివృద్ధి, కెరియర్ పురోగతి, ప్లేస్‌మెంట్ వంటి అంశాలలో సాధించిన ప్రగతి ఆధారంగా తాజా ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు.
130 విశ్వవిద్యాలయాలకు...ఇండియా టుడే ఉత్తమ విశ్వవిద్యాలయాల సర్వే కోసం దేశంలోని 995 విశ్వవిద్యాలయాల జాబితాను రూపొందించింది. దేశంలోని 30 నగరాల్లో సర్వేను నిర్వహించారు. చివరకు 130 విశ్వవిద్యాలయాలకు ర్యాంక్‌లను కేటాయించారు. పరిశోధకులు, గణాంక వేత్తలు, విశ్లేషకులు, సర్వే బృందాలతో కూడిన పెద్ద బృందం ఈ ప్రాజెక్టుపై 2019 డిసెంబర్ నుంచి 2020 జూలై వరకు పనిచేసి ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.
దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
సాధారణ ప్రయాణికుల రైలు తరహాలో నిర్ధారిత వేళల ప్రకారం నడిచే (టైంటేబుల్డ్) సరుకు రవాణా ఎక్స్‌ప్రెస్‌ను భారతీయ రైల్వే తొలిసారి పట్టాలెక్కించింది. హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే నిర్వహించే ఈ రైలు ఆగస్టు 5న సనత్‌నగర్(హైదరాబాద్) స్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రతి బుధవారం సనత్‌నగర్ స్టేషన్ లో బయలుదేరే ఈ సరుకు రవాణా రైలు శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్ స్టేషన్ కు చేరుకుంటుంది. గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ సరుకు రవాణా రైలును ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా నడిపించనున్నారు.
నిర్ధారిత వేళల్లో...
సాధారణంగా ఒక రేక్ (రైలు బోగీలన్నీ కలిపి)కు సరిపడా సరుకు ఉంటేనే సరుకు రవాణా రైలును నడుపుతారు. ముందస్తు బుకింగ్స్ ఆధారంగా ఈ రైళ్లు నడుస్తుంటాయి. దానికి భిన్నంగా సరుకు ఉన్నా లేకున్నా, ప్రయాణికుల రైళ్ల తరహాలో నిర్ధారిత వేళల్లో ఈ రైలు బయలుదేరుతుంది. కనిష్టంగా 60 టన్నుల సరుకైనా బుక్ చేసుకునే సదుపాయం రైల్వే కల్పిచింది.
రామ మందిర నిర్మాణానికి భూమిపూజ
అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించాడని భక్తులు విశ్వసించే ప్రదేశంలో భవ్యమైన రామ మందిరం శ్రీ రామ జన్మభూమి మందిర్ నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. సుముహూర్త సమయమైన మధ్యాహ్నం 12.44 గంటలకు శంకుస్థాపన జరిపారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ సంత్ నృత్య గోపాల్ దాస్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఉత్సవ వాతావరణం నెలకొంది.
తొలి ప్రధాని మోదీనే...
భూమి పూజ సందర్భంగా సియా(సీతా)వర్ రామచంద్రజీ కీ జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ... రామ్‌లల్లా ఆలయం భారతదేశ ఘన సంస్కృతికి ప్రతీకగా, మానవాళికిస్ఫూర్తిప్రదాయినిగానిలుస్తుందన్నారు. రాళ్లపై శ్రీ రామ అని రాసి రామసేతు నిర్మించిన తీరుగానే.. దేశంలోని మూల మూలల నుంచి రామ మందిర నిర్మాణం కోసం ఇటుకలు వచ్చాయని వ్యాఖ్యానించారు. భూమి పూజ కంటే ముందుగా హనుమాన్ గఢీలోని ఆంజనేయుడి దేవాలయాన్ని సందర్శించారు. అయోధ్యలో రామ జన్మభూమిని, హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయేనని యూపీ ప్రభుత్వం తెలిపింది. భూమి పూజను పురస్కరించుకుని ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్‌ను మోదీ ఆవిష్కరించారు.
నాగర శైలిలో..
ఐదు గుమ్మటాలు.. 161 అడుగుల ఎత్తయిన గోపురంతో అలరారనున్న రామ మందిరం నాగరశైలిలో నిర్మాణం కానుంది. మూడు అంతస్తుల ఈ మందిర నిర్మాణానికి మూడున్నరేళ్ల సమయం పడుతుందని అంచనా. 1990లో సిద్ధమైన మందిర డిజైన్ లో తాజాగా పలు మార్పులు చేశారు. మందిర నిర్మాణానికి ఆర్కిటెక్ట్ అశీష్ సోంపుర డిజైన్ ఇచ్చారు. దేవాలయ నిర్మాణ శైలుల్లో నాగరఅనేది ఒకటి కాగా, ద్రావిడ, బాసర్ అనేవి మిగతావి. రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మందిరాన్ని నిర్మిస్తున్నారు
1528 నుంచి 2019 తీర్పు వరకు...
కొన్ని దశాబ్దాలుగా అయోధ్య భూ వివాదం దేశంలో రాజకీయ, చారిత్రక, సామాజిక మతపరమైన చర్చగా కొనసాగుతూ వచ్చింది. హిందూ, ముస్లింల మధ్య దశాబ్దాల వివాదానికి కారణం హిందువుల ఆరాధ్య దైవం రాముడి జన్మభూమిగా భావించే ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని భూమికి సంబంధించింది. అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో ఒకప్పుడు హిందూ దేవాలయం ఉండేదని, ఆ తరువాత దాన్ని పడగొట్టి బాబ్రీ మసీదు నిర్మాణం జరిగినట్టు కొందరి విశ్వాసం. అయితే మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశాల మేరకు 1528వ సంవత్సరంలో మీర్ బఖీ ఇక్కడ మసీదు నిర్మించారని, అందువల్ల ఆ స్థలం తమదేననిముస్లింలు వాదిస్తూ వచ్చారు.
యాజమాన్య హక్కుల కోసం
ఈ దేవాలయం కూల్చి వేత, దాని స్థానంలో మసీదు నిర్మాణం ఈ రెండు వర్గాల మధ్య వివాదానికి తెరతీసింది. 1949లో హిందువులు రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చి మసీదులో పెట్టడాన్ని కొందరు ముస్లింలుచూసినట్లు కొందరి వాదన. అప్పటి నుంచి ఈ స్థలంపై యాజమాన్యపు హక్కులు మావంటే మావని ఇరు వర్గాలు వాదిస్తూవచ్చాయి. ఫలితంగా ప్రభుత్వం ఈ స్థలాన్ని పూర్తిగా మూసివేసింది. ఈ స్థలాన్ని అప్పగించాలని కోరుతూ 1959, డిసెంబర్ 17న నిర్మోహిఅఖారాకోర్టుకెళ్ళింది. ఇదే స్థలంపై యాజమాన్య హక్కుల కోసం డిసెంబర్ 18, 1961న సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్‌కూడా కోర్టుని ఆశ్రయించింది. ఈ వివాదం ఇరువర్గాల మధ్య కొన్ని దశాబ్దాల పాటు ఘర్షణాత్మక పరిస్థితులకు దారితీసింది.
బాబ్రీ మసీదు కూల్చివేత
తరువాత డిసెంబర్ 6, 1992న హిందూ కరసేవకులు బాబ్రీ మసీదుని కూల్చి వేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా మతకలహాలకు దారితీసింది. 2,000 మందికి పైగా చనిపోయారు. ఆ తరువాతి కాలంలో ఈ అంశం పై ఇరువర్గాలు దేశంలోని పలుకోర్టులను ఆశ్రయించాయి. ఇదిలా ఉండగా, అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందు వులు, ముస్లింలు, నిర్మోహిఅఖారాల మధ్య విభజన చేయాలని అలహాబాద్ హైకోర్టు సెప్టెంబర్ 30, 2010న ఆదేశాలిచ్చింది. ఈ తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా, అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు ఈ కేసుపై 2016లో తిరిగి విచారణ ప్రారంభించింది. ఈ వివాదం అత్యంత సున్నితమైందని, దీన్ని కోర్టు వెలుపల తేల్చు కోవాలని సుప్రీంకోర్టు 2017లో చెప్పింది. అయితే, అది కార్యరూపం దాల్చలేదు.
సుప్రీంకోర్టు తీర్పు..
సుప్రీంకోర్టు 2018లో ఈ కేసు విచారణకు ఐదు గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనం ఆగస్టు 6, 2019 నుంచి అక్టోబర్ 16 వరకు రోజువారీ వాదనలు చేపట్టింది. తుది తీర్పుని నవంబర్ 9న వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంపై యాజమాన్య హక్కులు రామజన్మభూమి ట్రస్ట్‌కి చెందుతాయని ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. అలాగే అయోధ్యలోనే ప్రత్యామ్నాయంగా ముస్లింలకు మసీదు నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మూడు నెలల్లోపు ట్రస్ట్ ఏర్పాటు చేసి, నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తేల్చిచెప్పింది.
ఆగస్టు 2020 రాష్ట్రీయం
యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ క్లబ్ ప్రారంభంప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని(జూలై 30) పురస్కరించుకుని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్లు సంయుక్తంగా జూలై 30న యాంటీ హ్యూమన్ట్రాఫికింగ్ క్లబ్‌ను ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీజీపీ గౌతమ్ సవాంగ్ వెబినార్‌లో ప్రసంగిస్తూ.. మానవ అక్రమ రవాణా రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా... ప్రతి జిల్లాలో యాంటీ హ్యూమన్ట్రాఫికింగ్ యూనిట్ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.
రెడ్‌రోప్ స్వచ్ఛంద సంస్థ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ల సహకారంతో ఏపీ మహిళా కమిషన్జూలై 30న నిర్వహించిన వెబినార్‌లో ఏపీ మహిళా కమిషన్చైర్‌పర్సన్వాసిరెడ్డి పద్మ ప్రసంగించారు. మరోవైపు చైల్డ్ లైన్–1098, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో బాలలను, మహిళలను అప్రమత్తం చేస్తూ రూపొందించిన పోస్టర్‌ను, చైల్డ్‌లైన్–1098 లోగోతో కోవిడ్ మాస్క్‌లను ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ పీవీ సునీల్‌కుమార్ ఆవిష్కరించారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేతకృష్ణా నదీ జలాలను మళ్లిస్తూ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనుల విషయంలో కేంద్ర జలసంఘం అనుమతి లేకుండా ముందుకెళ్లొద్దని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనా«థ్‌దాస్‌కు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా జూలై 30న లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని మళ్లించేందుకు ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పునర్విభజన చట్టానికి విరుద్ధమైందని తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిస్పందించిన బోర్డు, ఏపీకి ఈ లేఖ రాసింది.
పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకి గవర్నర్ ఆమోదంఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జూలై 31న ఆమోదించడంతో అవి చట్టాలుగా మారాయి. ఆ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి జి.మనోహర్‌రెడ్డి జూలై 31న వేర్వేరుగా గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేశారు. దీంతో మూడు రాజధానుల ఏర్పాటు సాకారం కానుంది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించాలని ప్రభుత్వం ఆ రెండు బిల్లులకు రూపకల్పన చేసింది.
ఆమోదం పొందక పోయినా...
- ఆర్టికల్ 197(1)(బి) ప్రకారం దిగువ సభ ఆమోదించిన ఒక బిల్లు ఎగువ సభకు వెళ్లి ఆమోదం పొందక పోయినా, నిలిచి పోయినా మూడు నెలల నిర్ణీత వ్యవధి దాటితే మళ్లీ శాసనసభ చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రకారం రెండోసారి జూన్ 16న సమావేశమైన శాసనసభ మరోసారి ఈ బిల్లులను ఆమోదించి పంపింది.
- ఆర్టికల్ 197(2)(బి) ప్రకారం ఇలా రెండోసారి కూడా ఎగువ సభ ఆమోదం పొందకుండా ఒక బిల్లు నిలిచి పోతే, 30 రోజుల వ్యవధి కనుక దాటితే ఆ బిల్లును ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు. ప్రస్తుతం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల విషయంలో కూడా అదే జరిగింది.
- నిబంధనల మేరకు శాసన వ్యవస్థ ఈ బిల్లులను ఆమోదించడంతో జూలై 18న గవర్నర్ వద్దకు పంపారు. గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించడంతో మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
సీఆర్‌డీఏ స్థానంలో ఏఎంఆర్‌డీఏ ఏర్పాటు
సీఆర్‌డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) రద్దు బిల్లును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జూలై 31న ఆమోదించడంతో ఇక ఆ సంస్థ కనుమరుగుకానుంది. ఆ స్థానంలో ఏఎంఆర్‌డీఏ (అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఏర్పాటు కానుంది. సీఆర్‌డీఏ కార్యకలాపాలన్నీ ఇకపై ఏఎంఆర్‌డీఏ నిర్వహిస్తుంది. సీఆర్‌డీఏ ఉద్యోగులంతా ఏఎంఆర్‌డీఏ ఉద్యోగులుగా మారతారు.
- భూసమీకరణ సహా రాజధాని వ్యవహారాలన్నీ ఈ సంస్థే నిర్వహిస్తుంది. సీఆర్‌డీఏ చేసుకున్న అగ్రిమెంట్లు, కాంట్రాక్టులన్నీ ఇకపై ఏఎంఆర్‌డీఏ కిందకు వస్తాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పుడు సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న ప్రాంతమంతా ఏఎంఆర్‌డీఏ కిందకు వస్తుంది. రాజధాని ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఏఎంఆర్‌డీఏ కృషి చేస్తుంది.
- 2014 డిసెంబర్‌లో టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం ద్వారా సీఆర్‌డీఏ ఏర్పాటైంది.
- అప్పటివరకూ ఉన్న వీజీటీఎం ఉడా (విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) స్థానంలో సీఆర్‌డీఏను ఏర్పాటు చేశారు.
- వీజీటీఎం ఉడా 2014లో సీఆర్‌డీఏగా మారగా ఇప్పుడు ఏఎంఆర్‌డీఏగా కొత్తరూపం దాల్చనుంది.
విద్యావారధి వాహనాలు ప్రారంభంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్‌సీఈఆరీ్ట), రాష్ట్ర విద్యా పరిపాలన శిక్షణా సంస్థ (సీమ్యాట్) సంయుక్తంగా రూపకల్పన చేసిన విద్యావారధి వాహనాలు ప్రారంభమయ్యాయి. సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో జూలై 31న జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఈ వాహనాలను ప్రారంభించారు. కోవిడ్-19 నేపథ్యంలో విద్యాసంస్థలు తెరవలేని పరిస్థితి ఉన్నందున విద్యా సంవత్సరాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో భాగంగా ప్రభుత్వం ఆన్ లైన్, డిజిటల్, మొబైల్ వాహనాల రూపకల్పన చేసింది. పాఠశాలలు పున:ప్రారంభమయ్యేంతవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశాలు విద్యావారధి మొబైల్ వ్యాను టీవీ తెరల ద్వారా బోధిస్తారు.
టెక్సాస్‌తో వర్సిటీతో టిటా భాగస్వామ్యంఆన్ లైన్ వేదికగా జరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) నడుం బిగించింది. డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ (యూటీడీ) సాయంతో, డిజిథాన్భాగస్వామ్యంతో సైబర్ రెడీ ప్రోగ్రామ్‌పేరిట సైబర్ సెక్యూరిటీపై నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఆస్తులను కాపాడే లక్ష్యంతో 2022 నాటికి 10 వేల మందికి శిక్షణ ఇవ్వాలని టిటా లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ శిక్షణ పొందిన వారికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సర్టిఫికెట్‌ను యూటీడీ, డిజిథాన్ టిటా వెల్లడించింది.
ఓజోనిట్ ఆవిష్కరణకరోనా వైరస్ నివారణ, నియంత్రణ కోసం వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) అధ్యాపకులు ఓజోనిట్‌అనే నూతన పరికరాన్ని ఆవిష్కరించారు. నిట్ వరంగల్ ఫిజిక్స్ విభాగాధిపతి డి.దినకర్ సారథ్యంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.హరనాథ్, పీహెచ్‌డీ స్కాలర్ పి.చందర్‌రావు సంయుక్తంగా ఈ ఓజోనిట్ పరికరాన్ని ఆవిష్కరించారు. మల్టిపుల్ స్టెరిలైజేషన్ గా రూపొందించిన ఈ పరికరం ఇళ్లలో ఉపయోగించే ఫ్రిజ్ మాదిరిగా ఉంటుంది. ఈ పరికరం దానిలో ఉంచిన వస్తువులపై ఉన్న వైరస్, ఫంగస్, బ్యాక్టీరియాలను అరగంటలో హతం చేస్తుంది.
ఏపీలో ఇంధన పొదుపుపై బీఈఈ అధ్యయనంసూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల్లో ఇంధన పొదుపు సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఏపీలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. జాతీయ స్థాయిలో చేపట్టే.. అంతర్జాతీయ ఇంధన పొదుపు సాంకేతికతకు ఈ అధ్యయనం కీలకం కానుంది. రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ. చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
- విద్యుత్ వినియోగం అధికంగా ఉండే గ్లాస్, రిఫ్రాక్టరీ పరిశ్రమలను అధ్యయనం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌ను బీఈఈ ఎంపిక చేసింది. ఈ అధ్యయన బాధ్యతను ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్–టెరీకు అప్పగించింది.
- అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఈ జాబితా ప్రకారం మన రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని రిఫ్రాక్టరీ పరిశ్రమల్లో ఏడాది పాటు టెరీ అధ్యయనం చేస్తుంది. ఇందులో వెల్లడైన అంశాల ఆధారంగా జాతీయ స్థాయిలో ఎంఎస్‌ఎంఈల కోసం బీఈఈ ఒక రోడ్ మ్యాప్ రూపొందిస్తుంది.
- రాష్ట్రంలో విద్యుత్ పొదుపుకు అపార అవకాశాలున్నాయని టెరీ గతంలో నిర్వహించిన ఓ సర్వేలో గుర్తించింది. దీంతో అన్ని స్థాయిల్లోనూ అత్యాధునిక సాంకేతికత, పొదుపు చేయగల విద్యుత్ ఉపకరణాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఇంధన పొదుపు సంస్థ
- కృషి చేస్తోంది.
- ఎంఎస్‌ఎంఈ రంగంలో నూతన ఎనర్జీ ఎఫిషియన్సీ సాంకేతికత అమలు చేస్తున్న ఇంధన శాఖకు రాష్ట్ర పరిశ్రమల శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నదని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్రంలో చేపట్టే అధ్యయనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆయన ఆదేశించారు.
రక్షణ కోసం తొలిసారిగా పక్షుల వినియోగంఅడవుల్లోని మావోయిస్టు దళాల కదలికలను గుర్తించేందుకు పోలీసులు ఉపగ్రహాల చిత్రాలు, డ్రోన్లు వాడేవారు. నిత్యం దండకారణ్యంలో తిరుగాడే మావోలు కూడా ఇప్పుడు డ్రోన్లు వాడుతూ పోలీసుల కదలికలను తెలుసుకుంటూ వారి కంటపడకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎత్తుకు పైఎత్తు వేసేలా మావోలు, ఇతర సంఘ విద్రోహకశక్తుల డ్రోన్లను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు పలు గద్దలు, డేగలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు హోంశాఖ చేసిన ప్రతిపాదనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
దేశంలోనే తొలిసారి...పోలీసు శాఖలోని వివిధ విభాగాలకుతోడు అశ్వ, జాగిల దళాలు పోలీసుల విధినిర్వహణకు ఎంతో దోహదపడుతున్నాయి. ఈ రెండింటినీ పోలీసులు ప్రత్యేక దళాలుగా చూస్తారు. ఇప్పుడు గరుడదళం చేరింది. గరుడదళాన్ని వినియోగించడం దేశంలోనే ఇదే తొలిసారి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రెయినింగ్ అకాడమీ(ఐఐటీఏ)లో ఈ గరుడ దళానికి శిక్షణ ఇవ్వనున్నారు. నెదర్లాండ్స్ పోలీసులు తొలిసారిగా డ్రోన్లను పట్టుకోవడంలో డేగ, గద్దలకు శిక్షణ ఇచ్చారు.
మూడు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందంమహిళల స్వయం సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ఇటీవలే గుజరాత్‌కు చెందిన అమూల్‌తో ఒప్పందం చేసుకోగా..తాజాగా ఆగస్టు 3న మరో మూడు ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటును మహిళలందరూ సద్వినియోగం చేసుకునేలా ఈ కంపెనీలు సహకరిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా ఈ కంపెనీలు వారికి తోడ్పాటునందిస్తాయి. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ప్రభుత్వం పేర్కొంది.
మూడు కంపెనీలు ఇవే...గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో ఆగస్టు 3న రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలను చేసుకుంది. సెర్ప్ సీఈఓ రాజాబాబు, ఆయా కంపెనీల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ప్రొక్టర్ అండ్ గాంబిల్ సీనియర్ మేనేజర్ జోసెఫ్ వక్కీ, ఐటీసీ డివిజనల్ సీఈఓ రజనీకాంత్ కాయ్, హెచ్‌యూఎల్ జీఎస్‌ఎం చట్ల రామకృష్ణారెడ్డి వేర్వేరుగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.ఈ కార్యక్రమంలో హెచ్‌యూఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా, ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరి, ప్రోక్టర్ అండ్ గాంబిల్ సీఈఓ, ఎండీ మధుసూదన్ గోపాలన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
మహిళల రక్షణ కోసం ఈ–రక్షాబంధన్మహిళలపై సైబర్ నేరాల నిరోధానికి చర్యలు తీసుకోవడంతో పాటు వేధింపులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పిచేందుకు రూపొందించిన ఈ–రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. రాఖీ పండుగను పురస్కరించుకుని ఆగస్టు 3న సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ–రక్షాబంధన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని.. రాష్ట్ర చరిత్రలో మహిళలకు ఇంత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వంలేదని అన్నారు.
మరో కార్యక్రమం...
- 4s4u.ap.police.gov.in అనే పోర్టల్‌ను కూడా సీఎం ప్రారంభించారు.
- రాబోయే నెలరోజులపాటు ఈ వెబ్ చానల్లో వివిధ నిపుణులతో మహిళలకు అవగాహన కల్పిస్తారు.
- స్మార్ట్‌ఫోన్ వల్ల మంచి ఏంటి? చెడు ఏంటి? నష్టాలేంటి? వేధింపులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అవగాహన కలిగిస్తారు.
- సైబర్, వైట్‌కాలర్ నేరాలు.. తదితర అంశాలనూ వివరిస్తారు.
- ఏయే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఏ యాప్‌లవల్ల ఇబ్బందులు వస్తాయన్న వాటి గురించి కూడా చెబుతారు.
- నేరం జరిగినప్పుడు ఎక్కడ? ఎలా? ఫిర్యాదు చేయాలో తెలియజేస్తారు.
ఐఎస్‌బీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందంకరోనా నేపథ్యంలో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడంతోపాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)తో ఆగస్టు 5న ఒప్పందం కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమక్షంలో ఏపీ ఈడీబీసీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐఎస్‌బీ డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ సంతకాలు చేయడం ద్వారా వర్చువల్ ఒప్పందం జరిగింది.
పబ్లిక్ పాలసీ ల్యాబ్ ఏర్పాటు...
- ఏపీని అభివృద్ధి పథంవైపు నడిపేందుకు ఐఎస్‌బీతో కలిసి పబ్లిక్ పాలసీ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు.
- ఐఎస్‌బీ ఒప్పందంతో పారిశ్రామిక, నైపుణ్య, పెట్టుబడి రంగాలలో సంస్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాలవలవన్ తెలిపారు.
సచివాలయం కొత్త భవన నిర్మాణానికి ఆమోదంతెలంగాణ రాష్ట్ర సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ర్ట కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన డిజైన్లను ఆమోదించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆగస్టు 5న ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా సమావేశమై ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టీఎస్–బీపాస్ పాలసీని కూడా మంత్రివర్గం ఆమోదించింది.
కేబినెట్ నిర్ణయాలు..
- కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు నిర్వహించాలి. ఇందుకోసం దూరదర్శన్ ను వినియోగించుకోవాలి
- గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పాత విద్యుత్ బిల్లుల బకాయిలను వన్ టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా చెల్లించే వెసులుబాటు ఇవ్వాలి
- ప్రభుత్వ శాఖలకు చెందిన పనికిరాని పాత వాహనాలను అమ్మేయడానికి ఆమోదం
- దుమ్ముగూడెం బ్యారేజికి సీతమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్‌కు నృసింహ స్వామి రిజర్వాయర్, తుపాకులగూడం బ్యారేజికి సమ్మక్క బ్యారేజిగా నామకరణం చేస్తూ తీర్మానం
- కోవిడ్ నిబంధనల నేపథ్యంలో 2020 ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలి
తెలంగాణలో నూతన ఉద్యోగ విధానంతెలంగాణలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించే నూతన విధానాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆగస్టు 5న ఆమోదించింది. ఈ నూతన విధానంలో భాగంగా... స్థానిక మానవ వనరులకు ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పించే పరిశ్రమలకు జీఎస్టీలో రాయితీ, విద్యుత్ చార్జీల్లో ప్రోత్సాహకాలు, పుణ్యాభివృద్ధి శిక్షణ కోసం కొంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. సెమీ స్కిల్డ్ కేటగిరీలో 70 శాతం, స్కిల్డ్ కేటగిరీలో 60 శాతం స్థానికుల కు ఉపాధి కల్పించే పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలిస్తారు. టీఎస్‌ఐపాస్‌లో భాగంగా టీ ప్రైడ్, టీ ఐడియాలో భాగంగా పరిశ్రమలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు, ప్రోత్సాహకాలిస్తోంది.
కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు...
- టీఎస్‌ఐపాస్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతుండటంతో స్థానికులకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించేలా పరిశ్రమలశాఖ రూపొందించిన ముసాయిదాను కేబినెట్ ఆమోదించింది.
- వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం, తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
హైదరాబాద్ గ్రిడ్ పాలసీకి ఆమోదంతెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలు ఒకేచోట కాకుండా నగరం నలువైపులా విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐటీ పరిశ్రమల కారిడార్‌గా పేరొందిన పశ్చిమ ప్రాంతంలో మినహా ఇతర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు పెట్టేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రతిపాదిత హైదరాబాద్ గ్రిడ్ పాలసీని కేబినెట్ ఆగస్టు 5న ఆమోదించింది. 2019–20లో హైదరాబాద్ 18 శాతం వృద్ధి రేటుతో రూ.1,18,000 కోట్ల ఐటీ ఎగుమతులను సాధించగా, ఇందులో 90 శాతం పశ్చిమ కారిడార్ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, వీటి పరిసర ప్రాంతాల నుంచే వచ్చాయి.
ఆగస్టు 2020 ఎకానమీ
భారత్‌కు ఏఐఐబీ 3 బిలియన్ డాలర్ల రుణం
లోకి వివిధ మౌలిక ప్రాజెక్టులకు వచ్చే ఏడాది కాలంలో 3 బిలియన్ డాలర్ల రుణాలు అందించడానికి సంబంధించిన ప్రణాళికలను బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న ఆసియన్ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో ఢిల్లీ–మీరట్ ర్యాపిడ్ రైల్ , ముంబై మెట్రో రైల్, ముంబై అర్బన్ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు, చెన్నై పెరిఫిరల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు, హరియాణా బైపాస్ లింక్ రైల్వే ఉన్నాయని బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ డీజే పాండ్యన్ఒక ఇంటర్వూ్యలో తెలిపారు.
మెత్తం రుణాల్లో 25 శాతం..ఏఐఐబీ ఇచ్చిన మొత్తం రుణాల్లో 25 శాతంతో భారత్ అతిపెద్ద రుణ గ్రహీతగా ఉందని ఈ సందర్భంగా పాండ్యన్తెలిపారు. 2020 జూలై 16 నాటికి 24 దేశాల్లోకి 87ప్రాజెక్టులకు 19.6 బిలియన్డాలర్ల రుణాలను ఏఐఐబీ ఆమోదించినట్లు వెల్లడించారు. 2016లో ఏఐఐబీ ప్రారంభమైననాటి నుంచీ భారత్‌లోకి 17 ప్రాజెక్టులకు 4.3 బిలియన్డాలర్ల రుణాలను ఆమోదించినట్లు చెప్పారు.
టీవీలపై నియంత్రణ..కలర్ టీవీల దిగుమతులపై నియంత్రణలు విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పలు రకాల టీవీలను దిగుమతి చేసుకోవాలంటే తప్పకుండా కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారీన్ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నుంచి లైసెన్స్ పొందాలి.
దేశంలో 21 యూనికార్న్ స్టార్టప్లుదేశీయంగా యూనికార్న్ హోదా పొందిన (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గలవి) స్టార్టప్‌లు 21 ఉన్నాయి. ఈ విషయాన్ని హురున్ గ్లోబల్ యూనికార్న్ జాబితా వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం.. భారత సంతతికి చెందిన వారు విదేశాల్లో తీర్చిదిద్దిన యూనికార్న్‌ల సంఖ్య 40కి పైగా ఉంటుందని హురున్ రిపోర్ట్ చైర్మన్ రూపర్ట్ హుగ్‌వర్ఫ్ తెలిపారు.
జాబితాలోని ముఖ్యాంశాలు..
- 21 దేశీ యూనికార్న్‌ల విలువ సుమారు 73.2 బిలియన్ డాలర్లుగా ఉంది. వీటిలో 11 సంస్థల్లో చైనాకు చెందిన ముగ్గురు ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఉన్నాయి.
- ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతీయులు స్థాపించిన యూనికార్న్‌ల విలువ 99.6 బిలియన్ డాలర్ల పైగా ఉంటుంది.
- యూనికార్న్‌ల సంఖ్యాపరంగా అమెరికా, చైనా, బ్రిటన్ తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉంది.
- చైనాతో పోలిస్తే భారత్‌లో యూనికార్న్‌ల సంఖ్య పదో వంతు మాత్రమే. చైనాలో ఏకంగా 227 స్టార్టప్‌లు ఈ హోదా సాధించాయి.
- సగటున ఒక స్టార్టప్ సంస్థ యూనికార్న్‌గా ఎదగడానికి భారత్‌లో ఏడేళ్లు పడుతోంది. అదే చైనాలో 5.5 సంవత్సరాలు, అమెరికాలో 6.5 ఏళ్లు పడుతోంది.
- చైనాకు చెందిన ఆలీబాబా 5 సంస్థల్లో, టెన్సెంట్ 3 సంస్థల్లో, డీఎస్‌టీ గ్లోబల్ 3 భారతీయ స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేశాయి.
- దేశీయంగా 21 యూనికార్న్‌లలో పేటీఎం, ఓయో రూమ్స్, బైజూస్, ఓలా క్యాబ్స్ మొదలైనవి ఉన్నాయి. 8 దిగ్గజ స్టార్టప్‌లకు కేంద్రమైన బెంగళూరు .. యూనికార్న్‌ల రాజధానిగా నిలుస్తోంది.
ఆగస్టు 2020 ద్వైపాక్షిక సంబంధాలు
మారిషస్ కోర్టు భవన ప్రారంభోత్సవంలో మోదీ
మారిషస్ రాజధాని పోర్ట్ లూయీస్‌లో నిర్మించిన మారిషస్ సుప్రీంకోర్టు నూతన భవనాన్ని జూలై 30న మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తో కలిసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆన్లైన్విధానంలో ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... ఇతర దేశాలతో భారత దేశ ప్రగతికాముక సంబంధాలు విశ్వ మానవాళి సంక్షేమం లక్ష్యంగా కొనసాగేవని స్పష్టం చేశారు. భారత్, మారిషస్ దేశాల మధ్య సహకారానికి ఈ భవనం ఉదాహరణగా నిలుస్తుందన్నారు.
భారత్ భాగస్వామ్యం...
అఫ్గానిస్తాన్పార్లమెంట్ భవన నిర్మాణంలో, నైగర్‌లో మహాత్మాగాంధీ కన్వెన్షన్సెంటర్ నిర్మాణంలో, నేపాల్‌లో ఎమర్జెన్సీ అండ్ ట్రామా సెంటర్ ఏర్పాటులో, శ్రీలంకకు ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్‌ల రూపకల్పనలో, మాల్దీవుల్లో క్రికెట్ క్రీడ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం భారతీయులందరికీ గర్వకారణమని మోదీ తెలిపారు. సుప్రీంకోర్టు భవన నిర్మాణంలో భారత్ అందించిన సహకారానికి మారిషస్ ప్రధాని జగన్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
పాకిస్తాన్ నూతన మ్యాప్ ఆవిష్కరణ
నేపాల్ తరహాలోనే తరహాలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)తోపాటు జమ్మూకశ్మీర్‌ను తమలో కలిపేసుకుంటూ పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త మ్యాప్ రూపొందించింది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఆగస్టు 5 నాటికి ఏడాది కానుంది. అంతకంటే ఒక్కరోజు ముందు ఆగస్టు 4న పాక్ నూతన మ్యాప్ ను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ కొత్త మ్యాప్‌నకు పాక్ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.గుజరాత్‌లోని జునాగఢ్, మనవదర్, సర్ క్రీక్‌లను కూడా ఈ పటంలో చేర్చారు. అంతేకాకుండా నియంత్రణ రేఖను(ఎల్‌ఎసీ)ని కారాకోరం పాస్ దాకా పొడిగించారు. సియాచిన్ ను పూర్తిగా పాక్‌లో అంతర్భాగంగా మార్చేశారు.
పాక్ చర్య హాస్యాస్పదం
కొత్త మ్యాప్ అంటూ పాకిస్తాన్ సాగిస్తున్న ప్రచారం అసంబద్ధమైన చర్య అని భారత ప్రభుత్వ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. పాక్ ఎత్తుగడ హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పాక్ చర్యలకు చట్టబద్ధత గానీ, అంతర్జాతీయ సమాజం నుంచి ఆమోదం గానీ లేవని స్పష్టం చేశారు.
ఆగస్టు 2020 సైన్స్ & టెక్నాలజీ
స్మార్ట్‌ఫోన్ల నుంచి బ్యాంకింగ్ తదితర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు బ్లాక్‌రాక్ పేరుతో ఓ మాల్‌వేర్ చలామణిలో ఉందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్.ఇన్) జూలై 30న హెచ్చరించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని దాదాపు 337 అప్లికేషన్ల నుంచి ఈ మాల్‌వేర్ సమాచారాన్ని సేకరించగలదని, ఈమెయిల్, ఈకామర్స్, సోషల్‌మీడియా, బ్యాంకింగ్ ఆప్స్ కూడా ఇందులో ఉన్నాయని పేర్కొంది. బ్లాక్‌రాక్‌ను క్సెరెక్స్ బ్యాంకింగ్ మాల్‌వేర్ సోర్స్‌కోడ్ ఆధారంగా తయారు చేశారని ఈ క్సెరెక్స్ అనేది లోకిబోట్ ఆండ్రాయిడ్ ట్రోజాన్అని సెర్ట్ తెలిపింది. ఈ ట్రోజన్వైరస్ ఇప్పటికే ప్రపంచమంతా చక్కర్లు కొడుతోందని వివరించింది.
అరుణ గ్రహానికి నాసా రోవర్ పెర్సెవరెన్స్అరుణ గ్రహంపై జీవనం ఆనవాళ్లను గుర్తించే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఓ రోవర్‌ను ప్రయోగించింది. కేప్‌కేనర్వాల్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 30న అట్లాస్–5 రాకెట్ ద్వారా 6 చక్రాలతో కారు పరిమాణంలో ఉన్న పెర్‌సెవరెన్స్ రోవర్‌ను నింగిలోకి ప్రయోగించింది. కెమెరాలు, మైక్రోఫోన్లు, లేజర్లు, డ్రిల్స్ వంటి అత్యాధునిక పరికరాలతో పాటు మినీ హెలికాప్టర్‌ను రోవర్‌లో అమర్చారు. రోవర్ సహాయంతో అరుణ గ్రహ నమూనాలను మళ్లీ భూమ్మీదకు తీసుకు రావాలని నాసా ప్రయత్నం చేస్తోంది. పెర్‌సెవరెన్స్2021, ఫిబ్రవరి 18న అరుణ గ్రహంపైకి చేరుకుంటుంది.
చైనా సొంత నేవిగేషన్ వ్యవస్థ ప్రారంభంఅమెరికాకు చెందిన ప్రఖ్యాత నేవిగేష వ్యవస్థ అయిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్)కు దీటుగా చైనా సొంతంగా బేడో–3 నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (బీడీఎస్)ను ప్రారంభించింది. చైనా తన మిలటరీకి, ముఖ్యంగా క్షిపణి ప్రయోగాల ప్రత్యేక నేవిగేషన్ అవసరాలను బీడీఎస్ తీర్చనుంది.ప్రపంచంలో ఎన్నో దేశాలకు సొంతంగా నేవిగేషన్ వ్యవస్థలున్నప్పటికీ అమెరికాకు చెందిన గ్లోబల్ పొజిషినింగ్ సిస్టమ్ (జీపీఎస్)ని ఎక్కువ మంది వినియోగిస్తారు. రష్యాకు గ్లోనాస్, యూరోపియన్ యూనియన్ కి గెలిలీయో జీపీఎస్ వ్యవస్థలున్నాయి. భారత్ కూడా సొంతంగా నావిక్ పేరుతో ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్‌ఎన్ఎస్‌ఎస్)ను అభివృద్ధి చేస్తోంది. పాకిస్తాన్ వంటి దేశాలు చైనా బీడీఎస్ వ్యవస్థనే వినియోగిస్తున్నాయి.
ప్రజ్ఞాన్ రోవర్ క్షేమం: సుబ్రమణియన్భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి దశలో చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొని నాశనమైందని భావిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్.. నిజానికి ధ్వంసం కాలేదని చెన్నైకి చెందిన టెకీ షణ్ముగ సుబ్రమణియన్ వాదిస్తున్నారు. అందుకు సాక్ష్యాలుగా కొన్ని ఫొటోలతో ట్వీట్లు చేశారు.
సుబ్రయణియన్ వాదన ప్రకారం...
- ల్యాండర్ నుంచి విడివడిన ప్రజ్ఞాన్ కొద్ది మీటర్ల దూరం దొర్లుకుంటూ వెళ్లి నిలిచిపోయింది.
- ప్రస్తుతం అది చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా ఉంది.
- చంద్రుడి ఉపరితలంపై కూలిపోయిన తరువాత కూడా ల్యాండర్‌కు భూమి నుంచి సందేశాలు అంది ఉండవచ్చు. అయితే, అది మళ్లీ తిరిగి సమాధానం ఇవ్వలేకపోయి ఉండవచ్చు
- రోవర్ ఇంకా పనిచేస్తూ ఉందని కచ్చితంగా చెప్పలేము.
గతంలో మూన్ ల్యాండర్ విక్రమ్ శకలాలను కూడా సుబ్రమణియన్ గుర్తించారు. ఆ విషయాన్ని నాసా కూడా నిర్ధారించింది. సుబ్రమణియన్ అందజేసిన సమాచారానికి సంబంధించిన ఆధారాలను పరీక్షిస్తున్నామని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. 2019, సెప్టెంబర్ లో ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలిన విషయం తెలిసిందే.
సాన్స్ పేరుతో ఐఐసీటీ సరికొత్త మాస్క్
చిన్న చిన్న తుంపర్లను సైతం అడ్డుకోగలిగే సరికొత్త మాస్క్ ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు రూపొందించారు. సాన్స్ పేరు గల ఈ మాస్కు అత్యధిక నాణ్యతతో పాటు 2 కంటే ఎక్కు వ పొరలు కలిగి ఉంటుంది. దీన్ని చౌక ధరకే తయారు చేయొచ్చు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ మాస్క్ లను పెద్దఎత్తున పంచేందుకు దేశంలోనే ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా తన ఫౌండేషన్ ద్వా రా ముందుకొచ్చింది. ఈ మాస్కుల తయారీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ శైలజ తెలిపారు.
టీ కణాలపై అధ్యయనం..
యాంటీబాడీస్ లేనివారిలో టీ–కణాలుంటాయని, అవి కరోనా నుంచి కోలుకున్న బాధితులను కాపాడు తాయని అంతర్జాతీయ అధ్యయనం తేల్చి చెప్పింది. యూకేలోని కరోలిన్ స్కా, కార్డిఫ్ యూనివర్సిటీలు కలిసి చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. తక్కువ లక్షణాలతో కరోనా నుంచి రికవరీ అయిన రోగులపై టీ సెల్ ఆధారిత రోగనిరోధక శక్తి గురించి చేసిన ఈ పరిశోధన వివరాలు మెడారిక్స్‌ఐవీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఒకసారి కరోనా వచ్చిన వారికి మళ్లీ వైరస్ వచ్చినట్లు పరిశోధనలో ఎక్కడా గుర్తించలేదు.
ఆగస్టు 2020 అవార్డ్స్
గణిత మేథావి శకుంతలాదేవికి గిన్నిస్ సర్టిఫికెట్
అత్యంత వేగవంతమైన మానవ కంప్యూటర్‌గా ఖ్యాతి గడించి

న భారత గణిత మేథావి శకుంతలాదేవికి దాదాపు 4 దశాబ్దాల తర్వాత గిన్నిస్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. లండన్ లో జూలై 30న జరిగిన ఒక కార్యక్రమంలో గిన్నిస్ ప్రతినిధులు శకుంతలాదేవి కుమార్తె అనుపమా బెనర్జీకి గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్‌ను అందజేశారు. 1980లో లండన్ఇంపీరియల్ కాలేజీలో జరిగిన ప్రదర్శనలో 13 అంకెల రెండు సంఖ్యలను అత్యంతవేగంగా కేవలం 28 సెకన్లలోనే గుణించిన శకుంతలాదేవి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అయితే, అప్పటి నిబంధనల ప్రకారం ఆమెకు గిన్నిస్ సంస్థ ధ్రువీకరణ పత్రం అందజేయలేదు. ఆమె 2013లో బెంగళూరులో చనిపోయారు.
బయోపిక్...
అరుణ్ మేనన్దర్శకత్వంలో శకుంతలాదేవి బయోపిక్ రూపొందింది. బాలీవుడ్ నటి విద్యాబాలన్ప్రధాన పాత్ర పోషించిన శకుంతలాదేవి సినిమా అమెజాన్ప్రైమ్‌లో జూలై 31న విడుదలైంది.
రామ్‌కో సిమెంట్స్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డు
రామ్‌కో సిమెంట్స్ అలత్తియూర్ (తమిళనాడు) యూనిట్‌కు గోల్డెన్ పీకాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డు, 2020 లభించింది. వార్షిక గోల్డెన్ పీకాక్ అవార్డులకు 344 కంపెనీల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నిర్వహణ, సాంకేతికత, శిక్షణా వ్యవహారాలు ప్రత్యేకించి జీవిత సమతౌల్యతకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు, సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాలకుగాను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు రామ్‌కో సిమెంట్స్ అలత్తియూర్ విభాగం ఎంపికయ్యింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ వెంకటాచలయ్య నేతృత్వంలోని జ్యూరీ అవార్డుకు సంబంధించి ట్రోఫీ, ప్రశంశాపత్రాన్ని యూనిట్‌కు ప్రదానం చేసింది.
ఆగస్టు 2020 స్పోర్ట్స్
వరల్డ్ కప్ సూపర్‌లీగ్‌లో తొలి గెలుపు
కొత్తగా మొదలైన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో వన్డే ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జూలై 30న ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐర్లాండ్ 44.4 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్ 27.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది.
యూఎస్ ఓపెన్నుంచి వైదొలగిన బార్టీ
యూఎస్ ఓపెన్టెన్నిస్ గ్రాండ్‌స్లామ్–2020 నుంచి మహిళల ప్రపంచ నంబర్ వన్, ఆ్రస్టేలియా టెన్నిస్ ప్లేయర్ యాష్లే బార్టీ వైదొలిగింది. కరోనా విజృంభణ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జూలై 30న బార్టీ ప్రకటించింది. అలాగే సిన్సినాటి మాస్టర్స్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు తెలిపింది. యూఎస్ ఓపెన్ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 13 మధ్య జరగనుంది.
జాతీయ క్రీడా పురస్కారాల ప్యానల్ నియామకం
జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీని జూలై 31న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నియమించింది. 12 మంది సభ్యుల ఈ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ముకుందకమ్ శర్మ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కమిటీలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్, దీపా మలిక్, మాజీ టీటీ ప్లేయర్ మోనాలిసా బరువా మెహతా, భారత మాజీ బాక్సర్ వెంకటేశన్ దేవరాజన్, సాయ్ డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రదాన్, సంయుక్త కార్యదర్శి ఎల్‌ఎస్ సింగ్, టాప్స్ సీఈవో రాజేశ్ రాజగోపాలన్, క్రీడా వ్యాఖ్యాత మనీశ్ బతావియా, క్రీడా పాత్రికేయులు అలోక్ సిన్హా, నీరూ భాటియా సభ్యులుగా ఉన్నారు.
స్క్వాష్ టోర్నీ నుంచి వైదొలగిన భారత్
మహిళల ప్రపంచ టీమ్ స్క్వాష్ చాంపియన్ షిప్ నుంచి భారత్ వైదొలగింది. ఈ విషయాన్ని భారత స్క్వాష్ రాకెట్స్ సమాఖ్య (ఎస్‌ఆర్‌ఎఫ్‌ఐ) కార్యదర్శి సైరస్ పొంచా ఆగస్టు 3న వెల్లడించారు. షెడ్యూలు ప్రకారం మలేసియాలోని కౌలాలంపూర్‌లో 2020, డిసెంబర్ 15 నుంచి 20 వరకు ఈ చాంపియన్ షిప్ జరగాల్సి ఉంది. అయితే కరోనా లాక్‌డౌన్ వల్ల తమ ప్లేయర్లకు సరైన ప్రాక్టీస్ లేదని... దాంతో పాటు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధాజ్ఞలు ఇంకా కొనసాగుతుండటం, ప్లేయర్ల ఆరోగ్య భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని వైదొలగినట్లు పొంచా తెలిపారు. మరోవైపు చైనా వేదికగా 2020, జూన్ లో జరగాల్సిన ఆసియా జూనియర్ చాంపియషిప్‌ను ఆసియా స్క్వాష్ సమాఖ్య రద్దు చేసిన విషయం తెలిసిందే.
హామిల్టన్‌కు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్
2020 ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌లోని నాలుగో రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఇంగ్లండ్‌లోని సిల్వర్‌స్టోన్‌లో ఆగస్టు 2న జరిగిన ఈ రేసును పోల్ పొజిషన్‌తో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నిర్ణీత 52 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, ముందుగా గంటా 28 నిమిషాల 01.283 సెకన్లలో ముగించాడు. ఈ రేసులో మాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, చార్లెస్ లెక్‌లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. తాజా గెలుపుతో హామిల్టన్ రికార్డుస్థాయిలో ఏడోసారి (2008, 2014, 2015, 2016, 2017, 2019, 2020) బ్రిటిష్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే సొంతగడ్డపై అత్యధిక ఎఫ్1 టైటిల్స్ గెలిచిన తొలి డ్రైవర్‌గా హామిల్టన్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్‌లో ఇది 87వ ఎఫ్1 టైటిల్.
యూఎస్ ఓపెన్‌కు కిరియోస్ దూరం
ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో తాను బరిలోకి దిగడంలేదని ఆస్ట్రేలియా వివాదాస్పద ఆటగాడు, ప్రపంచ 40వ ర్యాంకర్ నిక్ కిరియోస్ తెలిపాడు. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి సంఘీభావంగానే తానీ నిర్ణయం తీసుకున్నాని పేర్కొన్నాడు. ఇటీవలే మహిళల ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) కూడా కరోనా కారణంగా ఈ మెగా ఈవెంట్‌కు దూరంగా ఉంటున్నానని ప్రకటించింది.
యూఏఈలో ఐపీఎల్–13వ సీజన్
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కారణంగా యూఏఈ వేదికగా ఐపీఎల్-13వ సీజన్ జరుపుతామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జా స్టేడియాల్లో ఐపీఎల్–13వ సీజన్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఐపీఎల్ పాలకమండలి వివరాల ప్రకారం... ఐపీఎల్ సీజన్ 2020, సెప్టెంబర్ 19న మొదలై నవంబర్ 10న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఐపీఎల్ విదేశీ గడ్డపై జరగడం ఇదే తొలిసారి కాదు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండుసార్లు (2009లో పూర్తిగా దక్షిణాఫ్రికాలో, 2014లో మరోసారి పాక్షికంగా యూఏఈలో) ఐపీఎల్ మ్యాచ్‌లు దేశం బయట జరిగాయి.
యూఎస్ ఓపెన్ కు రాఫెల్ నాదల్ దూరం
2020, ఆగస్టు 31 నుంచి అమెరికాలోని న్యూయార్క్‌లో ప్రారంభం కావాల్సిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొనడంలేదని పురుషుల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ ఆగస్టు 5న వెల్లడించాడు. అమెరికాలో ఇంకా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెరీర్‌లో 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన 34 ఏళ్ల నాదల్ పేర్కొన్నాడు. ఫెడరర్, నాదల్ గైర్హాజరీలో ప్రపంచ నంబర్‌వన్నొవాక్ జొకోవిచ్‌కు యూఎస్ ఓపెన్ రూపంలో కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచేందుకు సువర్ణావకాశం లభించనుంది. నిర్వాహకులు వెల్లడించిన తాజా జాబితా ప్రకారం ప్రపంచ ర్యాంకింగ్స్‌లోని టాప్–10 ఆటగాళ్లలో ఏడుగురు తమ ఎంట్రీలను ఖరారు చేశారు. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్యాష్లేబార్టీమినహా టాప్–10లోని తొమ్మిది మంది ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు.
ఆగస్టు 2020 వ్యక్తులు
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జూలై 30న ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు తీర్పు మేరకు ఆయనను తిరిగి ఆ పదవిలో నియమిస్తున్నట్లు తొలుత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ను జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవు పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) తుది తీర్పుకు లోబడి ఈ నియామకం కొనసాగుతుందని గవర్నర్ ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఏపీ శాండ్ కార్పొరేషన్ ఎండీగా హరినారాయణ్
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న హరినారాయణ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ శాండ్ కార్పొరేషన్మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. శాండ్ కార్పొరేషన్ఎండీగా తక్షణమే బాధ్యతలు చేపట్టాలని, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని హరినారాయణ్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జూలై 30న ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రాన్స్ కో జేఎండీగా కె.శ్రీధర్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కె.శ్రీధర్‌రెడ్డిని బదిలీ చేస్తూ, ఏపీ ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ)గా ప్రభుత్వం ఆయన్ను నియమించింది. డిప్యూటేషన్విధానంలో శ్రీధర్‌రెడ్డిని ట్రాన్స్ కో జేఎండీగా నియమించింది.
మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు(60) అనారోగ్యంతో కన్నుమూశారు. విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 1న తుదిశ్వాస విడిచారు. కోవిడ్–19 వైరస్‌తోపాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మధుమేహం ఆయన ఆరోగ్యాన్ని కుంగదీశాయి. మాణిక్యాలరావు స్వయం సేవక్‌గా రాష్ట్రీయ స్వయం సేవక్‌లో చురుగ్గా పనిచేస్తూ 1989లో భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ కేబినెట్‌లో ఆయన దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్ కన్నుమూత
రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) మాజీ నేత అమర్‌సింగ్(64) కన్నుమూశారు. 2011లో ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరో కిడ్నీ మార్పిడి కోసం 8 నెలల క్రితం సింగపూర్‌లోని ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి ఆగస్టు 1న తుదిశ్వాస విడిచారు. 1956 జనవరి 27న ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో జన్మించిన అమర్ సింగ్ యూపీ నుంచి రాజ్యసభకు తొలిసారిగా 1996లో ఎన్నికయ్యారు. 2003, 2016లో రాజ్యసభ సభ్యుడయ్యారు. 1996 నుంచి 2010లో బహిష్కరణకు గురయ్యే వరకు ఆయన ఎస్‌పీలో కీలక నేతగా కొనసాగారు. ఓటుకు నోటు కుంభకోణంలో 2011లో అరెస్టయ్యారు. 2016లో ఎస్‌పీ మద్దతుతోనే స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికైన అమర్ సింగ్ 2016లో తిరిగి ఎస్‌పీ చేరి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆ తర్వాత ఎస్‌పీ పగ్గాలు చేపట్టిన అఖిలేశ్ యాదవ్ 2017లో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆజంగఢ్‌లో ఉన్న తమ పూర్వీ కుల ఆస్తులను ఆర్‌ఎస్‌ఎస్‌కు విరాళంగా అందజేస్తానని అమర్ సింగ్ ప్రకటించారు.
హౌజ్ ఆఫ్ లార్డ్స్ సభకు బోథమ్ ఎన్నిక
ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ బోథమ్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ పార్లమెంట్ హౌజ్ ఆఫ్ లార్డ్స్ సభలో సభ్యునిగా 64 ఏళ్ల బోథమ్ ఎన్నికయ్యాడు. తాజాగా 36 మందిని ప్రభుత్వం ఈ సభకు ఎంపిక చేయగా అందులో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బోథమ్‌కు కూడా చోటు దక్కింది. 2011లో ఇంగ్లండ్ మహిళల కెప్టెన్ రాచెల్ ఫ్లింట్ తర్వాత ఈ గౌరవం పొందిన తొలి క్రికెటర్ బోథమ్ కావడం విశేషం. ఇంగ్లండ్ తరఫున 1977–1992 మధ్య కాలంలో 102 టెస్టులు ఆడిన బోథమ్...1981లో ఆసీస్‌ను ఓడించి యాషెస్ సిరీస్ దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.
భారత్-చైనా మధ్య ఐదో దఫా చర్చలు
వాస్తవాదీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనా భూభాగం వైపు భారత్–చైనా సీనియర్ సైనిక కమాండర్ల మధ్య ఆగస్టు 2న 11 గంటలపాటు సుదీర్ఘంగా ఐదో దఫా చర్చలు జరిగాయి. చర్చల్లో భారత్ తరపు బృందానికి లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించారు. తూర్పు లద్ధాఖ్‌లోని పాన్ గాంగ్ త్సో నుంచి సాధ్యమైనంత త్వరగా చైనా సైనికులు వెనక్కి తగ్గితేనే సరిహద్దుల్లో శాంతి సాధ్యమని భారత అధికారులు స్పష్టం చేశారు. మే 5వ తేదీ ముందు నాటి పరిస్థితిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరో రెండు వివాదాస్పద ప్రాంతాల్లో తిష్టవేసిన చైనా బలగాలు సైతం వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేసింది.
కరోనాతో యూపీ మంత్రి కమల్‌రాణి మృతి
యూపీ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమల్‌రాణి (62)ని కరోనా పొట్టన పెట్టుకుంది. ఆమె ఆగస్టు 2న లక్నోలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. రాష్ట్రంలో కరోనా వల్ల ఒక మం త్రి మరణించడం ఇదే తొలిసారి. యూపీ కేబినెట్‌లో ఆమె ఏకైక మహిళ. కమల్‌రాణికి జూలై 18న పరీక్షలు చేయ గా, కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె డయాబెటిస్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా
కరోనా మహమ్మారి బారిన పడిన ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, కర్ణాటక సీఎం యెడియూరప్ప తాజాగా కరోనా బారినపడ్డారు. తనలో కరోనా వైరస్ ప్రా«థమిక లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(55) ఆగస్టు 2న ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు.
ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా లక్ష్మీనరసింహం
ఏపీసీఆర్‌డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ఏఎంఆర్‌డీఏ)ని ప్రభుత్వం 11 మందితో ఏర్పాటు చేసింది. చైర్‌పర్సన్ గా పర్యావరణ మండలిలో సభ్యునిగా పనిచేసిన లేదా పట్టణ గవర్నెన్స్, ప్లానింగ్, రవాణా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన వ్యక్తిని నియమించనుంది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇప్పటి వరకు ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌గా ఉన్న పి.లక్ష్మీనరసింహంను ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా నియమిస్తూ శ్యామలరావు మరో జీవో జారీ చేశారు.
ఏఎంఆర్‌డీఏలో సభ్యులు..
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి – డిప్యూటీ చైర్‌పర్సన్
ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి – సభ్యుడు
ఏఎంఆర్‌డీఏ కమిషనర్ –సభ్య కన్వీనర్
గుంటూరు జిల్లా కలెక్టర్ –సభ్యుడు
కృష్ణా జిల్లా కలెక్టర్ – సభ్యుడు
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ –సభ్యుడు
రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ –సభ్యుడు
ఏపీ ట్రాన్స్ కో ఎస్‌ఈ –సభ్యుడు
ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ –సభ్యుడు
రహదారులు భవనాల శాఖ ఎస్‌ఈ (గుంటూరు) –సభ్యుడు
రహదారులు భవనాల శాఖ ఎస్‌ఈ (విజయవాడ) –సభ్యుడు
ఎస్‌బీఐ కార్డ్ సీఈఓగా అశ్వనీ తివారీ
దేశంలో రెండవ అతిపెద్ద క్రెడిట్ కార్డ్ ఇష్యూయర్ ఎస్‌బీఐ కార్డ్ ఎండీ అండ్ సీఈఓగా అశ్వనీ తివారీ బాధ్యతలు స్వీకరించారు. 2020, జూలై 31వ తేదీన బాధ్యతలు విరమించిన హర్‌దయాల్ ప్రసాద్ స్థానంలో తివారీ ఆగస్టు 4న కొత్త బాధ్యతలను చేపట్టారు. ఈ కొత్త బాధ్యతలకు ముందు ఆయన 2017 ఏప్రిల్ నుంచీ న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఎస్‌బీఐ యూఎస్ ఆపరేషన్స్ హెడ్‌గా పనిచేశారు. ఎస్‌బీఐ (కాలిఫోర్నియా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల వైస్ చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు.
అమెరికన్లకే ఉద్యోగాలు...
అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను ఆదేశిస్తూ ఆగస్టు 4న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. విదేశీయులు, ముఖ్యంగా హెచ్1బీ వీసాదారులకు ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగావకాశాలు కల్పించకూడదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త చీఫ్ శశిధర్ జగ్‌దీశన్
ప్రైవేటు రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం–హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఈఓ అండ్ ఎండీ)గా శశిధర్ జగ్‌దీశన్ నియమితులయ్యారు. ఆదిత్యపురి స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త చీఫ్ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదముద్ర పడినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆగస్టు 4న తెలిపింది. 2020, అక్టోబర్ 27 నుంచి మూడేళ్లపాటు జగ్‌దీశన్ ఈ బాధ్యతల్లో ఉంటారు.
25 సంవత్సరాలుగా...
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో గత 25 సంవత్సరాలుగా జగ్‌దీశన్ వివిధ కీలక బాధ్యతలను నిర్వహించారు. జర్మన్ బ్యాంక్ డాయిష్ బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1996లో జగ్‌దీశన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫైనాన్స్ శాఖలో మేనేజర్‌గా చేరారు. 1999లో ఫైనాన్స్ విభాగం బిజినెస్ హెడ్ అయ్యారు. 2008లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. తరువాత బ్యాంక్ అన్ని విభాగాల అత్యుత్తమ నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి చేంజ్ ఏజెంట్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ బాధ్యతలతోపాటు ఫైనాన్స్, మానవ వనరులు, న్యాయ, సెక్రటేరియల్, అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, కార్పొరేట్ సామాజిక బాధ్యతల వంటి కీలక విభాగాలు ఆయన కనుసన్నల్లో ఉన్నాయి. ఇండియన్ బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న కొద్ది మందిలో 55 సంవత్సరాల జగ్‌దీశన్ ఒకరు.
ప్రజా గాయకుడు వంగపండు కన్నుమూత
ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు(77) ఇకలేరు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వైకేఎం నగర్‌లో ఆగస్టు 4న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా వంగపండు అంత్యక్రియలను పూర్తి చేశారు. పదునైన పదాలకు సొంపైన బాణీలతో స్వయంగా కాలికి గజ్జె కట్టి ఆడి పాడే వంగపండు శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం నుంచి ఉద్భవించిన వాగ్గేయకారుడు. విజయనగరం జిల్లా, పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో జగన్నాథం, చినతల్లి దంపతులకు 1943 జూన్ లో వంగపండు జన్మించారు. తన రచనలతో, పాటలతో ప్రజలను చైతన్యం చేశారు. 1972లో నాటి పీపుల్స్ వార్ సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించి 400కి పైగా జానపద గీతాలనురచించారు.