<b> అక్టోబర్ కరెంట్‌ అఫైర్స్‌ </b>

అక్టోబర్ కరెంట్‌ అఫైర్స్‌

అక్టోబర్ 2020 అంతర్జాతీయం

హెచ్-1బీపై నిషేధం ఎత్తివేయాలని అమెరికా కోర్టు తీర్పు
అమెరికాలో హెచ్-1బీ సహా ఇతర వీసాలన్నింటిపైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయాలని అమెరికా కోర్టు తీర్పు చెప్పింది. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ రాజ్యాంగబద్ధంగా తనకు సంక్రమించిన అధికారాలను మీరి ప్రవర్తించారని పేర్కొంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో 2020, జూన్‌లో హెచ్-1బీ, హెచ్-2బీ, ఎల్ వీసాలన్నింటిపైన ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ వివిధ ఐటీ కంపెనీలు, తయారీ సంస్థలు కోర్టుకెక్కాయి. ఈ పిటిషన్లను విచారించిన కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ వైట్ నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అక్టోబర్ 1న తీర్పు వెలువరించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. దీంతో భారతీయ ఐటీ నిపుణులకు అత్యంత ప్రయోజనం చేకూరనుంది.
ట్రంప్‌కు కరోనా...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(74), ఆయన భార్య మెలానియా ట్రంప్‌నకు కరోనా సోకింది. ఈ విషయాన్ని అక్టోబర్ 2న ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఏ దేశానికి చెందిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రద్దయ్యాయి?
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను రద్దు చేస్తున్నట్లు కిర్గిస్థాన్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశ రాజధాని బిష్కేక్‌లో ఫలితాలకు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. పలు నగరాల్లో ఫలితాలకు వ్యతిరేకంగా ప్రదర్శకులు నిరసనలు తెలుపుతూ పలు ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ ఎన్నికలు జరపాలని ప్రతిపక్ష సమర్ధకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో వందలాది మంది గాయపడ్డారు. దేశంలో ఉద్రిక్తతల నివారణకు ఫలితాలను రద్దు చేసామని ఎన్నికల సంఘం అధ్యక్షుడు నుర్జహాన్ షైల్డబెకోవా చెప్పారు.

క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశానికి వేదికైన నగరం?
చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఏర్పడిన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల చతుర్భుజ కూటమి (క్వాడ్రిలేటరల్ కోయెలిషన్) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం 2020, అక్టోబర్ 6న జపాన్ రాజధాని టోక్యోలో ప్రారంభమైంది. సమావేశంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు వరుసగా జైశంకర్, మైక్ పాంపియో, మరిసె పేన్, తొషిమిత్సు మొటెగి పాల్గొన్నారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు

  • చైనా విస్తరణవాదంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో స్వేచ్ఛ, నిజాయితీ, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ఉమ్మడిగా పనిచేయాలని భారత్ సహా నాలుగు క్వాడ్ దేశాలు పునరుద్ఘాటించాయి.
  • క్వాడ్ నిజమైన భద్రతా చట్రంఅని అమెరికా పేర్కొంది.
  • ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని అన్ని దేశాలకు ఆర్థిక, భద్రతాపరమైన అంశాల్లో తమ చట్టబద్ధ, కీలక ప్రయోజనాలను కాపాడుకోవడానికే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని భారత్ పేర్కొంది.
  • ఇండో-పసిఫిక్ విధానానికి క్రమంగా మద్దతు పెరుగుతుండటం సంతృప్తికరమైన అంశమని జైశంకర్ చెప్పారు.
  • క్వాడ్ వైఖరి మూడో దేశం ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందని చైనా ఆరోపించింది.

అక్టోబర్ 2020 జాతీయం

మోటార్ వాహనాల చట్టంలో కొత్తగా చేర్చిన సెక్షన్? దాని ఉద్దేశం?
రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించే మానవతావాదులకు భద్రత కల్పించే ఉద్దేశంతో మోటార్ వాహనాల(సవరణ) చట్టం-2019లో కొత్తగా సెక్షన్ 134ఏ ను కేంద్ర ప్రభుత్వం చేర్చింది. దీని ప్రకారం.. రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు సహాయం అందించే వారిని వ్యక్తిగత వివరాలు ఇవ్వాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడానికి వీల్లేదు. సహాయం అందించే వారు పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. విచారణ పేరిట వారిని ఎవరూ వేధించరు.
పంట వ్యర్థాల డీకంపోజ్‌కు కొత్త విధానం
పంట కోత తర్వాత పొలంలో మిగిలిన పంట వ్యర్థాలను పొలాల్లోనే డీకొంపోజ్ చేయడానికి పూసా అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్ నూతన సాంకేతికతని అభివృద్ధిపరిచిందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఢిల్లీ, దాని ఇరుగుపొరుగు రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతో ఆయా రాష్ట్రాలు దట్టమైన కాలుష్యంతో నిండిపోయేవి.

దేశంలో వీవీఐపీల ప్రయాణం కోసం తయారు చేసిన ప్రత్యేక విమానం?
అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం తరహాలోనే మన దేశంలో వీవీఐపీలు ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్ ఇండియా వన్ అమెరికా నుంచి భారత్‌కి చేరుకుంది. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ కలిగిన ఈ బోయింగ్-777 విమానం అమెరికాలోని టెక్సాస్ నుంచి అక్టోబర్ 1న ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ విమానంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య మాత్రమే ప్రయాణిస్తారు.
విమానంపై అశోక చక్రం...
వీవీఐపీలు ప్రయాణించడానికి వీలుగా డిజైన్ చేసి , క్షిపణి దాడుల్ని తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసి ఆధునీకరించడం కోసం రెండు విమానాల్ని డల్లాస్(అమెరికా)లో బోయింగ్ సంస్థకి పంపారు. వీటిలో ఒకటి భారత్‌కు వచ్చింది. ఈ విమానంపై భారత్ అనే అక్షరాలు, అశోక చక్రం ఉన్నాయి. 2020, జూలైలోనే ఈ విమానాలు భారత్‌కు చేరుకోవాల్సి ఉండగా కరోనా వైరస్, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. గడిచిన 25 సంవత్సరాలుగా భారత ప్రధానమంత్రి ఎయిర్‌ఇండియా వన్ కాల్ సైన్‌తో బోయింగ్ 747 విమానాన్ని ఉపయోగిస్తున్నారు.
ఎయిర్ ఇండియా వన్ ప్రత్యేకతలు...

  • ఎయిర్ ఇండియా వన్ విమానంలో భద్రతా వ్యవస్థ అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌కి ఏ మాత్రం తీసిపోదు.
  • ఈ విమానానికి క్షిపణి దాడుల్ని ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ ఉంది. లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రేర్డ్ కౌంటర్‌మెజర్స్ (ఎల్‌ఏఐఆర్‌సీఎం), సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ (ఎస్‌పీఎస్)ను అమర్చారు.
  • అమెరికా అధ్యక్ష విమానం తర్వాత మన ఎయిర్ ఇండియా వన్‌లోనే ఎస్‌పీఎస్‌ను అమర్చారు. ఈ రక్షణ వ్యవస్థతో శత్రువుల రాడార్ ఫ్రీక్వెన్సీని జామ్ చెయ్యగలదు. క్షిపణుల్ని దారి మళ్లించగలదు.
  • అమెరికా నుంచి భారత్ మధ్య ప్రయాణం ఎక్కడా ఆగకుండా చేయవచ్చు. ఒకసారి ఇంధనం నింపితే ఏకబిగిన 17 గంటలు ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం వాడుతున్న విమానంలో పది గంటల తరువాత మళ్లీ ఇంధనం నింపవలసివస్తుంది.
  • కొత్త విమానం గంటకు 900 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
  • విమానంలో ప్రధాని కార్యాలయం, సమావేశాల నిర్వహణకు పెద్ద హాలు ఉన్నాయి. ఈ లోహ విహంగం ఫూర్తి స్థాయి ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ మాదిరి పనిచేస్తుంది.
  • ఈ రెండు విమానాల తయారీకి రూ.8,400 కోట్లు ఖర్చు అయింది.
  • ఈ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడపరు. భారత వాయుసేనకి చెందిన పైలట్లు నడుపుతారు.
  • ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్)కు ఈ రెండు విమానాల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించారు.


వైశ్వక్ భారతీయ వైజ్ఞానిక్(వైభవ్) వర్చువల్ సదస్సు
భారత్‌లోని, విదేశాల్లోని విద్యావేత్తలు, పరిశోధకులు పాల్గొనే వైశ్వక్ భారతీయ వైజ్ఞానిక్(వైభవ్) వర్చువల్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 2న ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సదస్సులో సుమారు 55 విదేశాల్లోని 3 వేల మంది భారతీయ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, భారత్ లోని సుమారు 10 వేల మంది సైంటిస్ట్‌లు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ... శాస్త్ర రంగంలో భారత్‌కు ఘనమైన చరిత్ర ఉంది. దురదృష్టవశాత్తూ ఆధునిక కాలానికి ముందంతా చీకటి యుగమని ప్రస్తుత తరానికి అబద్ధాలు నూరిపోశారు అనిఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ స్టార్ట్‌అప్‌లకు సహకారం అందించాలని విదేశాల్లోని భారతీయులను కోరారు.

భారతీయుల సగటు ఆయుఃప్రమాణం ఎన్ని సంవత్సరాలు?
సెంట్రల్ సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ తాజగా విడుదల చేసిన నివేదిక ప్రకారం... భారతీయుల సగటు ఆయుఃప్రమాణం 69.40 ఏళ్లుగా ఉంది. 2014-2018 సంవత్సరాలకు సంబంధించి నిర్వహించిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్) ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
నివేదికలోని ప్రధాన అంశాలు...

  • భారతీయుల సగటు ఆయుఃప్రమాణం 69.40 ఏళ్లు. మహిళల సగటు ఆయుఃప్రమాణం 70.70 ఏళ్లు కాగా.. పురుషుల ఆయుఃప్రమాణం 68.20 ఏళ్లు.
  • ఆంధ్రప్రదేశ్‌లో పౌరుల సగటు జీవిత కాలం 70 ఏళ్లు. మహిళల్లో సగటు జీవిత కాలం 71.40 ఏళ్లు కాగా.. పురుషుల సగటు జీవిత కాలం 68.70 ఏళ్లు.
  • ప్రజల ఆయుఃప్రమాణంలో దేశంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీలో పౌరుల సగటు జీవిత కాలం 75.30 ఏళ్లు. కాగా, మహిళల్లో 77 ఏళ్లు, పురుషుల్లో 73.80 ఏళ్లుగా ఉంది.
  • రెండో స్థానంలో కేరళ.. మూడో స్థానంలో జమ్మూ-కశ్మీర్ నిలవగా.. ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో ఉంది.
  • కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పట్టణ ప్రాంత మహిళల కంటే.. గ్రామీణ ప్రాంత మహిళల జీవిత కాలం ఎక్కువ.
  • మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల మహిళల జీవిత కాలం అధికంగా ఉంది.
  • దేశంలో ఆహార భద్రత, వైద్య, ఆరోగ్య సేవలు విస్తరిస్తుండటంతో ప్రజల జీవిత కాలం పెరుగుతూ వస్తోంది.
  • 1970-75లో సగటు భారతీయుని జీవిత కాలం 49.70 ఏళ్లుగా ఉండేది. 2014-18 నాటికి అది 69.40 ఏళ్లకు పెరగడం విశేషం.
  • 1970-90లలో భారతీయుల సగటు జీవిత కాలం దాదాపు మూడేళ్లు పెరిగింది. కాగా 2014-18లో 0.40 ఏళ్లు పెరిగింది.


లద్దాఖ్‌లో గల్వాన్ వీరుల స్మారకం ప్రారంభం
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడి మరణించిన 20 మంది అమర వీరుల స్మారకార్థం లద్దాఖ్‌లో భారత ఆర్మీ.. ఓ స్మారకాన్ని నిర్మించిందని ఆర్మీ అధికారులు అక్టోబర్ 3న వెల్లడించారు. లద్దాఖ్‌లోని 120వ పోస్ట్‌లో ఈ స్మారకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ స్మారకంపై 20 మంది సైనికుల పేర్లను లిఖించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ మీద కూడా వీరి పేర్లను లిఖించేందుకు రక్షణ శాఖ సన్నాహాలు చేస్తోంది.
రుణాలపై చక్రవడ్డీ మాఫీ...
వ్యక్తిగత రుణగ్రహీతలు, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు భారీ ఊరట లభించింది. కోవిడ్ నేపథ్యంలో ప్రకటించిన వాయిదాల చెల్లింపుపై మారటోరియంలో ఆయా రుణాల వడ్డీపై వడ్డీ(చక్రవడ్డీ)ని మాఫీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. రూ.2 కోట్ల వరకు రుణాలపై మారటోరియం విధించిన ఆరు నెలల కాలానికి ఈ రద్దు వర్తింపజేయనున్నట్లు సుప్రీంకోర్టుకు అక్టోబర్ 3న తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో 2020, మార్చి 1 మొదలు ఆగస్టు 31వరకు చెల్లించాల్సిన రుణ వాయిదాలపై ఆర్‌బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే.

ప్రపంచంలో అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గాన్ని ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు?
హిమాలయ పర్వత సానువుల్లో నిర్మించిన, ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గం అటల్ టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని రోహ్‌తాంగ్‌లో అక్టోబర్ 3న ప్రారంభించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి, లద్దాఖ్‌లోని లేహ్ మధ్య 46 కి.మీ. దూరాన్ని ఈ సొరంగ మార్గం తగ్గిస్తుంది. 9.02 కి.మీ.ల పొడవైన ఈ టన్నెల్ వల్ల ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గిపోతుంది. దేశ రక్షణలో అత్యంత వ్యూహాత్మకమైన ఈ సొరంగ మార్గాన్ని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య, ఎన్నో సవాళ్లనెదుర్కొని నిర్మించింది. సొరంగం ప్రారంభం సందర్భంగా మోదీ మాట్లాడుతూ... కేవలం సైనిక అవసరాలే కాదు, లేహ్, లద్దాఖ్ ప్రాంత ప్రజల బతుకు అవసరాలు కూడా ఈ సొరంగం తీరుస్తుంది అని పేర్కొన్నారు.
అటల్ టన్నెల్‌గా పేరు మార్పు
2000 సంవత్సరం జూన్ 3న వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ సొరంగ మార్గాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 2002 మే 26న ఈ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆరేళ్లలో దీనిని పూర్తి చెయ్యాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో నిర్మాణం సాగలేదు. మొదట్లో దీనిని రోహ్‌తాంగ్ సొరంగం అని పిలిచేవారు. 2019లో దీనికి అటల్ సొరంగం అని పేరు మార్చారు. సొరంగం పూర్తి చేయడానికి పదేళ్లు పట్టింది.
అటల్ టన్నెల్ విశేషాలు...

  • సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తున పీర్ పంజాల్ పర్వత శ్రేణిలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగమిది. నిర్మాణ వ్యయం రూ.3,300 కోట్లు.
  • ఒకటే ట్యూబ్‌లో, డబుల్ లేన్‌తో ఈ సొరంగాన్ని నిర్మించారు. రోజూ 3వేల కార్లు , 1500 లారీలు రాకపోకలు సాగిం చేలా నిర్మించారు. దీంట్లో వాహనాల గరిష్టవేగం గంటకు 80 కి.మీ.
  • సరిహద్దుల్లో రక్షణ పరంగా ఇది అత్యంత వ్యూహాత్మకమైనది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా మిలటరీ సామగ్రిని తరలించడానికి ఈ సొరంగం బాగా ఉపయోగపడుతుంది.
  • భారీగా మంచు కురవడం వల్ల ఏడాదిలో ఆరునెలలు లేహ్ ప్రాంతవాసులకి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. ఈ సొరంగ మార్గంతో అక్కడ ప్రజలు కూడా ప్రయాణించే అవకాశం వచ్చింది.

విద్యార్థుల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు కేంద్రం చేపట్టిన కార్యక్రమం పేరు?
కోవిడ్ 19 ప్రభావం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులపై పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థుల్లో మానసిక, శారీరక ఇబ్బందులను తొలగించి మనోస్థైర్యాన్ని నింపేందుకు మనోదర్పణ్ కార్యక్రమం ద్వారా వయో దశలను అనుసరించి సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి అక్టోబర్ 4న ఏపీ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ కె.వెట్రిసెల్వి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు కొన్ని సూచనలు చేశారు.
వీఎంఆర్‌డీఏ తొలి చైర్మన్ కన్నుమూత
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ (59) అక్టోబర్ 4న విశాఖపట్నంలో కన్నుమూశారు. 1961 ఫిబ్రవరి 1న జన్మించిన ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీఎంఆర్‌డీఏ తొలి చైర్మన్‌గా పనిచేసిన ఆయన ఇటీవల కరోనా వైరస్‌ను జయించారు.

రెయిజ్ 2020 సదస్సులో ప్రధానంగా ఏ అంశంపై చర్చించారు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై చర్చించేందుకు నిర్వహించిన రెయిజ్ 2020 వర్చువల్ సదస్సునుద్దేశించి అక్టోబర్ 5న ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా వాడుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వ్యవసాయం, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, విపత్తు సహాయ చర్యలు.. తదితర విషయాల్లో ఏఐ కీలక పాత్ర పోషించనుందన్నారు. యువత కోసం బాధ్యతాయత కృత్రిమ మేధ కార్యక్రమాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా 11 వేల మంది విద్యార్థులు బేసిక్ కోర్స్‌ను పూర్తి చేశారని, వారిప్పుడు సొంతంగా ఏఐ ప్రాజెక్టులను రూపొందిస్తున్నారని తెలిపారు.
సదస్సు సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ... ఏఐలో అగ్రగామి దేశంగా ఎదిగేందుకు, దేశ ప్రజలందరికీ ఏఐ ప్రయోజనాలు అందించేందుకు కావల్సిన సాధన సంపత్తి భారత్ దగ్గరుందని పేర్కొన్నారు.

దేశంలో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల్లో ఎంత శాతం తిరిగి వినియోగంలోకి వస్తోంది?
పర్యావరణ నిర్వహణ సేవల్లో ఉన్న హైదరాబాద్ కంపెనీ రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అక్టోబర్ 5న ఓ యూనిట్‌ను ప్రారంభించింది. న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ భాగస్వామ్యంతో కంపెనీ దీనిని ఏర్పాటు చేసింది. అయిదు ఎకరాల్లో అత్యాధునికంగా స్థాపించిన ఈ కేంద్రంలో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను తిరిగి వినియోగంలోకి తెస్తారు. రోజుకు 300 టన్నుల వ్యర్థాలను రీసైకిల్ చేసే సామర్థ్యం ఉంది. 90 శాతంపైగా వ్యర్థాలను పునర్ వినియోగంలోకి తేవొచ్చని కంపెనీ తెలిపింది. దేశంలో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల్లో 1 శాతమే తిరిగి వినియోగంలోకి వస్తోందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్(సీఎస్‌ఈ) ఇటీవలి అధ్యయనంలో తేలింది.

అక్టోబర్ 2020 రాష్ట్రీయం

ఇటీవల పునఃప్రారంభమైన బాపు మ్యూజియం ఏ జిల్లాలో ఉంది?
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడలో 10 ఏళ్లుగా మూతపడి ఉన్న బాపు మ్యూజియం పునఃప్రారంభమైంది. రూ.8 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ మ్యూజియాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 1న ప్రారంభించారు. మ్యూజియం వద్ద భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహాన్ని సీఎం పునః ప్రతిష్టించారు. అనంతరం మ్యూజియంను పరిశీలించిన ఆయన సందర్శకుల పుస్తకంలో Impressive Collection of Artifacts (కళాఖండాల అద్భుతమైన సేకరణ) అని రాశారు.
దేశంలోనే మొదటిసారిగా...
మ్యూజియం ప్రారంభం సందర్భంగా సీఎం మాట్లాడుతూ... దేశంలోనే మొదటిసారిగా మ్యూజియాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రదర్శిత వస్తువులు ఒక యాప్ ద్వారా తమ చరిత్రను తామే చెప్పుకునే విధంగా మ్యూజియాన్ని రూపుదిద్దడం భావితరాలకు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తుంది అని అన్నారు. ఆదిమ మానవ యుగం నుండి నేటి ఆధునిక యుగం వరకు 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1,500 పురాతన వస్తువులకు సాంకేతికతను మేళవించి ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఒక్కో గ్యాలరీలో ఒక్కో ప్రత్యేకత..
తొలి చారిత్రక యుగ గ్యాలరీ: ఇందులో 10 లక్షల సంవత్సరాల నుంచి క్రీ.శ 2వ శతాబ్ధం వరకు ఉన్న పురాతన వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. వీటిలో ఆదిమ మానవుడు ఉపయోగించిన రాతి పని ముట్లు, 12 కాళ్ల మట్టి శవ పేటిక, మట్టి బొమ్మలు కుండ పెంకులు సున్నపు ప్రతిమలు, పూసలు, ఫలకాలు అత్యంత అరుదైనవి.
బుద్ధ జైన గ్యాలరీ: ఇందులో బౌద్ధ, జైన రాతి, కాంస్య ప్రతిమలను ప్రదర్శనకు పెట్టారు.
హిందూ శిల్ప కళా గ్యాలరీ: దీనిలో వివిధ హిందూ దేవతల రాతి, కాంస్య ప్రతిమలు ఉంచారు.
నాణెములు-శాసనముల గ్యాలరీ: క్రీ.శ 6వ శతాబ్ధం నుంచి క్రీ.శ 20వ శతాబ్ధం వరకు ఉన్న వివిధ రాజ వంశముల సీసపు, రాగి, ఇత్తడి, వెండి, బంగారు నాణెములను ప్రదర్శనకు పెట్టారు.

గిరిజనులకు అటవీ భూములపై హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంను ప్రారంభించిన రాష్ట్రం?
ఏళ్ల నాటి గిరిపుత్రుల కలలను నెరవేరుస్తూ గిరిజనులకు అటవీ భూములపై హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. అక్టోబర్ 2న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు గిరిజన మహిళలకు స్వయంగా క్యాంపు కార్యాలయంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను అందజేశారు. మొత్తం 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3.12 లక్షల ఎకరాలపై హక్కు పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించారు.
కురుపాంలో గిరిజన కళాశాల...
విశాఖ జిల్లా పాడేరులో వైద్య కళాశాల, ఐటీడీఏ పరిధిలో వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు, విజయనగరం జిల్లా కురుపాంలో ఏర్పాటు చేయనున్న గిరిజన ఇంజనీరింగ్ కళాశాలకు ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిలాఫలకాలనును ఆవిష్కరించారు.
సీఎం ప్రసంగం-ప్రధానాంశాలు

  • రాష్ట్రంలో దాదాపు 6 శాతం ఉన్న గిరిజనుల ఆదాయం పెంచేందుకు, వారిని రైతులుగా చేసి మంచి జరిగేలా కార్యక్రమాలను చేపడుతున్నాం.
  • దాదాపు 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3.12 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తున్నాం.
  • ఈ కార్యక్రమం నెల రోజులు కొనసాగుతుంది. హక్కుల పత్రాల పంపిణీ, దాంతో పాటు రైతు భరోసా సొమ్ము ఇస్తాం. గిరిజనులను రైతులుగా చేసి, వారికి మంచి జరిగేలా చేయాలన్నదే మా లక్ష్యం.
  • గిరిజనులందరికీ కనీసం 2 ఎకరాల భూమి ఇవ్వాలన్న తాపత్రయంతో, ఆ అక్క చెల్లెమ్మలకు ఇవాళ్టి నుంచి పత్రాలు ఇస్తున్నాం.
  • పట్టాలు పొందిన అక్క చెల్లెమ్మలకు భూమి అభివృద్ధి మాత్రమే కాకుండా, నీటి సదుపాయం, తోటల పెంపకానికి సహాయం చేస్తున్నాం.
  • గిరిజనుల ఆదాయం పెంచడంతో పాటు, అడవుల్లో మరింత పచ్చదనం పెరిగేలా చర్యలు చేపడుతున్నాం.
  • పాడేరులో దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో వైద్య కళాశాల నిర్మాణ పనులు మొదలు పెడుతున్నాం.

ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన మనం-మన పరిశుభ్రత కార్యక్రమం ఉద్దేశం?
పట్టణాల్లో మాదిరిగానే గ్రామాల్లోనూ రోజూ ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణతోపాటు పూర్తి స్థాయి పారిశుధ్య నిర్వహణకు ఉద్దేశించిన మనం- మన పరిశుభ్రత రెండో దశ కార్యక్రమాన్ని అక్టోబర్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రెండో దశలో భాగంగా 4,740 గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి దశలో మండలానికి రెండేసి గ్రామాల చొప్పున 1,320 గ్రామాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
ప్రధాన లక్ష్యాలు...
కేంద్రం నిర్దేశించిన ప్రమాణాల మేరకు మనం-మన పరిశుభ్రతను అమలు చేసే గ్రామాల్లో రోడ్లపై మురుగునీరు పారకుండా పూర్తి స్థాయిలో డ్రైనేజీని మెరుగుపరచడం, గ్రామంలో అందరూ మరుగుదొడ్లను వినియోగించేలా చేయడం, కనీసం 80 శాతం గ్రామాన్ని పూర్తి పరిశుభ్రంగా కనిపించేలా చూడటం ప్రధాన లక్ష్యాలు.

2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ఫార్మా దిగ్గజం?
గ్రిన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా మంబాపూర్-నల్లవెల్లిలో విస్తరించిన 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఫార్మా దిగ్గజం హెటిరో డ్రగ్‌‌స సంస్థ అక్టోబర్ 5న దత్తత తీసుకుంది. ఇందులో భాగంగా రూ.5 కోట్ల చెక్కును హెటిరో చైర్మన్ డాక్టర్ పార్థసారథిరెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి అందించారు. ఈ సందర్భంగా మంబాపూర్ అటవీ ప్రాంతంలో తెలంగాణ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పార్థసారథిరెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్ అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటారు. మంబాపూర్ అడవిలో కొద్ది ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి చేయనున్నారు.

వైఎస్సార్ జలకళ పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు
వైఎస్సార్ జలకళ పథకం అమలు తీరు తెన్నులను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో ఐదుగురు అధికారుల కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ చైర్మన్‌గా, వాటర్‌షెడ్‌‌స డెరైక్టర్ కమిటీ మెంబర్ కన్వీనర్‌గా, ఏపీడీసీఎల్ డెరైక్టర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ, భూగర్భ జలశాఖ డెరైక్టర్లను కమిటీలో సభ్యులుగా నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అక్టోబర్ 5న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకంలో భాగంగా రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు తవ్వించడంతో పాటు మోటార్లు, పంపుసెట్లు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయనుంది.

అక్టోబర్ 2020 ఎకానమీ

ఎస్‌బీఐతో ఒప్పందం చేసుకున్న దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీ?
చిన్నస్థాయి రిటైలర్లు మరింత సులువుగా రుణాలను పొందేందుకు బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తో దేశంలోనే అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ గూడ్‌‌స (ఎఫ్‌ఎంసీజీ) సంస్థ హిందుస్తాన్ యునిలీవర్‌తో (హెచ్‌యూఎల్) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా తన శిఖర్ యాప్‌ను వినియోగించే హెచ్‌యూఎల్ రిటైలర్లు ఇకపై ఎస్‌బీఐ యోనో యాప్ నుంచి సులువుగా రుణ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ ఒప్పంద విషయాన్ని అక్టోబర్ 1న ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్ ప్రకటించాయి. ప్రస్తుతం ఎస్‌బీఐ చైర్మన్‌గా రజ్‌నీష్ కుమార్హెచ్‌యూఎల్ చైర్మన్‌గా సంజీవ్ మెహతా ఉన్నారు.

హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ లో వార్‌బర్‌‌గ పింకస్ పెట్టుబడులు
హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీలో అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, వార్‌బర్‌‌గ పింకస్ రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. వార్‌బర్‌‌గ పింకస్‌కు చెందిన ఆరంజ్ క్లోవ్ ఇన్వెస్ట్‌మెంట్స్ బీవీ ఈ పెట్టుబడులు పెట్టనున్నదని, ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ అక్టోబర్ 2న తెలిపింది. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ లో 25 శాతం వాటా కోసం వార్‌బర్‌‌గ పింకస్ ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతోందని సమాచారం.
ధనలక్ష్మీ బ్యాంకు నిర్వహణకు కమిటీ
ధనలక్ష్మీ బ్యాంకు నిర్వహణకుగాను ఆర్‌బీఐ ముగ్గురు సభ్యులతో ఒక మధ్యంతర కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా సుబ్రమణియ అయ్యర్, సభ్యులుగా జీ రాజగోపాలన్ నాయర్, పీకే విజయకుమార్ వ్యవహరిస్తారని ఆర్‌బీఐ తెలిపింది. ధనలక్ష్మీ బ్యాంకు ప్రస్తుత ఎండీ, సీఈవో సునీల్ గుర్‌బక్సానీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల ఏజీఎంలో వాటాదారులు ఓటు వేసిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆర్‌ఆర్‌వీఎల్‌లో జీఐసీ, టీపీజీ పెట్టుబడులు
రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన రిటైల్ వ్యాపార దిగ్గజ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో (ఆర్‌ఆర్‌వీఎల్) మరో రెండు అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అక్టోబర్ 3న ప్రకటించింది.
రిలయన్స్ తెలిపిన వివరాల ప్రకారం...

  • ఆర్‌ఆర్‌వీఎల్‌లో అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జీఐసీ రూ.5,512.5 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా ఆర్‌ఆర్‌వీఎల్‌లో 1.22 శాతం వాటాను జీఐసీ చేజిక్కించుకోనుంది. డీల్‌లో భాగంగా ఆర్‌ఆర్‌వీఎల్‌ను రూ.4.285 లక్షల కోట్లుగా విలువ కట్టారు.
  • మరో అంతర్జాతీయ సంస్థ టీపీజీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో రూ.1,837.5 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా ఆర్‌ఆర్‌వీఎల్‌లో 0.41 శాతం వాటాను టీపీజీ దక్కించుకోనుంది. 2020 ఏడాది ప్రారంభంలో ప్రారంభంలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో టీపీజీ రూ.4,546.8 కోట్లు పెట్టుబడి చేసింది.

ప్రైపెవేట్ రంగంలో రెండో అతిపెద్ద పోర్ట్ కేపీసీఎల్‌ను కొనుగోలు చేసిన సంస్థ?
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉన్న కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ (కేపీసీఎల్)ను అదానీ పోర్‌‌ట్స అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీఎస్‌ఈజెడ్) కొనుగోలు చేసింది. రూ. 12,000 కోట్ల వేల్యుయేషన్‌తో కేపీసీఎల్ కొనుగోలు ప్రక్రియ పూర్తయి్యందని అక్టోబర్ 5న ఏపీఎస్‌ఈజెడ్ తెలిపింది. దీనితో సీవీఆర్ గ్రూప్ సహా ఇతర ఇన్వెస్టర్ల నుంచి నియంత్రణ హక్కులతో 75 శాతం వాటాలు ఏపీఎస్‌ఈజెడ్‌కు లభించినట్లవుతుందని పేర్కొంది. దేశీయంగా ప్రైవేట్ రంగంలో రెండో అతిపెద్ద పోర్ట్ అయిన కేపీసీఎల్ ఇప్పుడు ఏపీఎస్‌ఈజెడ్‌లో భాగం కావడం మాకు సంతోషకరమైన అంశం. అని ఏపీఎస్‌ఈజెడ్ సీఈవో కరణ్ అదానీ తెలిపారు.

ఎంఎస్‌ఎంఈ ప్రేరణ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ రంగ బ్యాంకు?
ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ల వృద్ధికి తనవంతు ప్రోత్సాహక సహకారాలను అందించనుంది. ఇందుకు సంబంధించి ఎంఎస్‌ఎంఈ ప్రేరణ పేరుతో ప్రత్యేక ఆన్‌లైన్ వ్యాపార పర్యవేక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. చెన్నైలోని బ్యాంక్ కార్పొరేట్ సెంటర్‌లో అక్టోబర్ 7న ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రధాన ధ్యేయం...
నైపుణ్యంలో మెరుగుదల, సామర్థ్యం పెంపు ద్వారా పరిశ్రమల సాధికారత పటిష్టం ఎంఎస్‌ఎంఈ ప్రేరణ ప్రధాన ధ్యేయమని ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. పూర్ణత అండ్ కంపెనీ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమానికి డిజైన్ చేసినట్లు తెలిపింది. స్థానిక భాషల్లో ఈ కార్యక్రమం అందుబాటులో ఉందని పేర్కొంది.

రియల్ టైమ్ ఆర్థిక లావాదేవీల నిర్వహణలో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
రియల్ టైమ్ ఆర్థిక లావాదేవీల నిర్వహణలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానం దక్కించుకుంది. రోజుకు 4.1 కోట్ల పైచిలుకు లావాదేవీలు నమోదు చేసింది. 2019 ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపు. అంతర్జాతీయంగా బ్యాంకులు, వ్యాపార సంస్థలకు టెక్నాలజీ సేవలు అందించే ఎఫ్‌ఐఎస్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
24 దేశాల్లో...
ఎలాంటి జాప్యం లేకుండా చెల్లింపుల లావాదేవీలు క్షణాల్లో పూర్తయ్యే ప్రక్రియను రియల్-టైమ్‌గా వ్యవహరిస్తారు. భారత్, అమెరికా, చైనా, ఆస్ట్రేలియా తదితర 24 దేశాల్లో ఇలాంటి చెల్లింపుల విధానానికి సంబంధించి ఎఫ్‌ఐఎస్ సర్వీసులు అందిస్తోంది.
వృద్ధి రేటు ప్రకారం చూస్తే...
ఎఫ్‌ఐఎస్ నివేదిక ప్రకారం... వార్షికంగా ఆరు దేశాల్లో రియల్-టైమ్ చెల్లింపుల లావాదేవీలు రెట్టింపయ్యాయి. విలువపరంగా చూస్తే నాలుగు దేశాల్లో రెండు రెట్లు పెరిగాయి. వృద్ధి రేటు ప్రకారం చూస్తే మాత్రం 657 శాతం వృద్ధితో బహ్రెయిన్, ఘనా (488 శాతం), ఫిలిప్పీన్స్ (309 శాతం) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

సెప్టెంబర్ 2020 ద్వైపాక్షిక సంబంధాలు

నవంబర్‌లో గిల్గిత్ అసెంబ్లీ ఎన్నికలు: పాకిస్తాన్
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని గిల్గిత్- బాల్టిస్తాన్ అసెంబ్లీకి 2020, నవంబర్ 15వ తేదీన ఎన్నికలు జరపనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. 2017 ఎన్నికల చట్టం ప్రకారం గిల్గిత్ - బాల్టిస్తాన్ శాసన సభకు నవంబర్ 15న ఎన్నికలు జరుగుతాయని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ సెప్టెంబర్ 24న నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సైన్యం ఆక్రమించుకున్న గిల్గిత్- బాల్టిస్తాన్ ప్రాంతంలో ప్రస్తుతమున్న పరిస్థితులను మార్చేందుకు చేసే ఎలాంటి ప్రయత్నం కూడా న్యాయపరంగా చెల్లుబాటు కాదని పేర్కొంది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లతోపాటు గిల్గిత్-బాల్టిస్తాన్ భారత్‌లో అంతర్భాగంగా ఉన్నాయనీ, ఎప్పటికీ ఉంటాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.

డెన్మార్క్ ప్రధానితో భారత ప్రధాని సమావేశం
డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్ ఫ్రెడరిక్సన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 28న వర్చువల్ విధానంలో ద్వైపాక్షిక సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... గ్లోబల్ సప్లయ్ చైన్ కేవలం ఒకే ఒక్క వనరుపైనే అధికంగా ఆధారపడి ఉండటం ఎంత ప్రమాదకరమో కోవిడ్ తెలియజెప్పిందని అన్నారు. సప్లయ్ చైన్‌ను ఒకే దేశానికి బదులు అనేక దేశాలకు విస్తరించుకునే క్రమంలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలతో భారత్ పనిచేస్తోందనీ, భావసారూప్యం గల దేశాలను ఆహ్వానిస్తోందని మోదీ వివరించారు.
3.68 బిలియన్ డాలర్ల వాణిజ్యం...
అధికార గణాంకాల ప్రకారం.. భారత్-డెన్మార్క్ ద్వైపాక్షిక వాణిజ్యం 2016-2019 సంవత్సరాల్లో 2.82 బిలియన్ డాలర్ల నుంచి 3.68 బిలియన్ డాలర్లకు పెరిగింది. సుమారు 200 డెన్మార్క్ కంపెనీలు దేశంలో నౌకాయానం, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. డెన్మార్క్ కంపెనీల్లో 5వేల మంది భారతీయ నిపుణులు పనిచేస్తున్నారు.

కరోనా టీకా తయారీకి వాషింగ్టన్ వర్సిటీతో ఒప్పందం చేసుకున్న భారత ఫార్మా?
ముక్కు ద్వారా అందించే కరోనా టీకా తయారీకి సంబంధించి అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సెప్టెంబర్ 23న భారత్ బయోటెక్ వెల్లడించింది. టీకా లెసైన్సింగ్‌కు సంబంధించిన ఈ ఒప్పందం ప్రకారం... భారత్ బయోటెక్ అమెరికా, జపాన్, యూరప్ దేశాలు మినహా మిగిలిన దేశాల్లో టీకాను పంపిణీ చేసే హక్కులు కలిగి ఉంటుంది. హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో ఉన్న కంపెనీ కేంద్రంలో ఈ టీకా ఉత్పత్తి జరగనుంది. కనీసం వంద కోట్ల డోసులు తయారు చేయాలన్నది తమ లక్ష్యమని కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు.

రూ.14.91 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీ?
రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ సెప్టెంబర్ 10న మరో రికార్డ్ ఘనత సాధించింది. రిలయన్స్ అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్‌లో 40 శాతం వరకూ వాటాను అంతర్జాతీయ ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్‌కు విక్రయించనున్నదన్న వార్తల కారణంగా... రిలయన్స్ షేర్ ఇంట్రాడేలో 8.4 శాతం లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.2,344ను తాకింది. చివరకు 7 శాతం లాభంతో రూ.2,315 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.14.91 లక్షల కోట్లకు(20,000 కోట్ల డాలర్లు) ఎగసింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీ ఇదే. ఒక్క సెప్టెంబర్ 10వ తేదీనే రిలయన్స్ రూ.97,000 కోట్ల మేర మార్కెట్‌క్యాప్ పెరిగింది.

ఐదు అంశాల్లో భారత్, చైనా ఏకాభిప్రాయం
తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట నెలకొన్న తీవ్రస్థాయి ఉద్రిక్తతలను తొలగించే దిశగా భారత్, చైనా ముందడుగు వేశాయి. రష్యా రాజధాని మాస్కోలో సెప్టెంబర్ 11న జరిగిన రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఇందుకు సంబంధించి ఐదు అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాయి. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొనేందుకు మాస్కో వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి.. సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపు లక్ష్యంగా అక్కడ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఐదు అంశాలు...

  • సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ
  • సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేలా చర్యలు చేపట్టకపోవడం
  • వాస్తవాధీన రేఖ వెంట శాంతి, సంయమనం నెలకొనడం
  • రెండు దేశాల సరిహద్దు భద్రత దళాలు చర్చలు కొనసాగించడం
  • సైనిక బలగాల మధ్య దూరం పాటించడం

రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష..
చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సెప్టెంబర్ 11న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ సరఫరాకై ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం చేసుకున్న భారత సంస్థ?
కోవిడ్-19ను అరికట్టడానికి రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ మూడవ దశ ఔషధ పరీక్షలతోపాటు పంపిణీకై హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, రష్యన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఆర్‌డీఐఎఫ్ సరఫరా చేయనుంది. పరీక్షలు విజయవంతం అయి, వ్యాక్సిన్ నమోదు ప్రక్రియ పూర్తి అయితే.. 2020 ఏడాది చివరి నుంచే దేశంలో వ్యాక్సిన్ల డెలివరీ ఉండే అవకాశం ఉందని రెడ్డీస్ సెప్టెంబర్ 16న ప్రకటించింది.
హ్యూమన్ ఎడినోవైరస్ ప్లాట్‌ఫాంపై...
రష్యాకు చెందిన గమలేయ నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. హ్యూమన్ ఎడినోవైరస్ డ్యూయల్ వెక్టర్ ప్లాట్‌ఫాంపై ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశామని, ఇది సురక్షితమైందని ఆర్‌డీఐఎఫ్ సీఈవో కిరిల్ దిమిత్రీవ్ తెలిపారు. రష్యాలో 25 ఏళ్లుగా డాక్టర్ రెడ్డీస్‌కు సుస్థిర, గౌరవప్రద స్థానం ఉందని వ్యాఖ్యానించారు.

భారత్‌లో ఏకే-47 తయారీకి కేంద్రం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?
భారత్‌లో ఏకే- 47 203 రైఫిల్స్ ఉత్పత్తికి సంబంధించి భారత్, రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజా రష్యా పర్యటనలో ఈ ఒప్పందం కుదిరిందని సెప్టెంబర్ 2న రష్యా మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించి భారత్, రష్యా సంయుక్తంగా ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ జాయింట్ వెంచర్(జేవీ)లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(భారత సంస్థ), కల్నోషికోవ్ కన్సెర్న్(రష్యా సంస్థ), రోసోబోరోనెక్స్‌పోర్ట్(రష్యా సంస్థ)లు భాగస్వాములుగా ఉంటాయి. జేవీలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి 50.5 శాతం వాటా, కన్సెర్న్‌కు 42 శాతం వాటా, రోసోబోరోనెక్స్‌పోర్ట్‌కు 7.5 శాతం వాటా ఉంది.
ఒప్పందం విశేషాలు...

  • ఏకే- 47 రైఫిల్స్‌లో 203 మోడల్ ఆధునికమైన వెర్షన్.
  • ఉత్తరప్రదేశ్‌లోని కొర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ ఏకే- 47లను ఉత్పత్తి చేయనున్నారు.
  • ప్రస్తుతం భారత ఆర్మీ వాడుతున్న ఇన్‌సాస్ 5.56 x45 ఎంఎం అసాల్ట్ రైఫిల్ స్థానంలో ఈ ఏకే- 47 -203 7.62×39 ఎంఎం రైఫిల్స్‌ను ప్రవేశపెడతారు.
  • భారత ఆర్మీకి దాదాపు 7.7 లక్షల ఏకే- 47 203లు అవసరం పడతాయని అంచనా.
  • లక్ష రైఫిల్స్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. మిగతావి దేశీయంగా తయారు చేసేలా ఒప్పందం కుదిరింది.
  • ఒక్కోరైఫిల్ ఖరీదు దాదాపు 1100 యూఎస్ డాలర్లు.
  • ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇన్సాస్ రైఫిళ్లను 1996 నుంచి వినియోగిస్తున్నారు.
  • ఇన్సాస్ రైఫిళ్లతో హిమాలయ మంచు ప్రాంతాల్లో జామ్ కావడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే ఆర్మీకి ఏకే- 47 203 మోడల్ రైఫిళ్లను అందించాలని నిర్ణయించారు.


రష్యా రక్షణమంత్రితో రాజ్‌నాథ్ చర్చలు
రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయగుతో ఫలప్రదవంతమైన చర్చలు జరిగాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 3న వెల్లడించారు. రక్షణ, వ్యూహాత్మక సహకారం సహా పలు అంశాలను చర్చించినట్లు తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశాల కోసం రాజ్‌నాథ్ మూడురోజుల రష్యా పర్యటనకు వెళ్లారు.
ఏ రెండు దేశాల భాగస్వామ్య మండలిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు?
అమెరికా- భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని (యూఎస్- ఇండియా స్ట్రాటెజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్) ఉద్దేశించి సెప్టెంబర్ 3న వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారత్ అత్యుత్తమ గమ్యస్థానమని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.
ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • దేశంలో నెలకొన్న రాజకీయ సుస్ధిరత, విధాన కొనసాగింపు భారత్‌ను పెట్టుబడిదారులకు అత్యుత్తమ కేంద్రంగా రూపొందించింది.
  • ప్రజాస్వామ్యానికి, బహుళత్వానికి భారత్ కట్టుబడి ఉంది.
  • ప్రస్తుత కరోనా ముప్పు పరిస్థితిని ఎదుర్కొనేందుకు వినూత్నంగా, మానవ సంక్షేమం కేంద్రంగా ఆలోచించాలి.
  • కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా రికార్డు సమయంలో దేశంలో వైద్య వసతులను సమకూర్చుకోగలిగాం.
  • కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఉద్యమంలా ప్రచారం చేసిన తొలి దేశాల్లో భారత్ ఒకటి.


భారత్, చైనా రక్షణ మంత్రుల సమావేశం
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో భారత, చైనా రక్షణ మంత్రుల మధ్య కీలక భేటీ జరిగింది. రష్యా రాజధాని మాస్కోలో సెప్టెంబర్ 4న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చైనా రక్షణ మంత్రి వీ ఫెన్‌ఘీ సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తొలగించే దిశగా చోటు చేసుకున్న కీలక ముందడుగుగా భావిస్తున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో 2020, మే నెలలో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు ప్రారంభమైన తరువాత ఇరు దేశాల మధ్య కీలక మంత్రిత్వ స్థాయి ముఖాముఖి చర్చలు జరగడం ఇదే ప్రథమం. గతంలో విదేశాంగ మంత్రి జై శంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ఫోన్‌లో చర్చించారు. కానీ, వారిద్దరి మధ్య ముఖాముఖీ భేటీ జరగలేదు. ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్‌నాథ్, వీ ఫెన్‌ఘీ రష్యాకు వెళ్లిన విషయం తెలిసిందే.
మరో దఫా మిలిటరీ చర్చలు
భారత్- చైనాల మధ్య మరోదఫా మిలిటరీ చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్‌లో సెప్టెంబర్ 4న బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో పురోగతి ఏంటనేది వెంటనే తెలియరాలేదు.

ఇంద్రనేవీ పేరుతో నేవీ విన్యాసాలు నిర్వహించిన దేశాలు?
ఇంద్రనేవీ-2020 పేరుతో భారత్, రష్యా నావికాదళాలు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. భవిష్యత్ ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ, పరస్పర రక్షణ ఒప్పందాలు పటిష్టం చేయడంలో భాగంగా బంగాళాఖాతం సముద్రంలో సెప్టెంబర్ 4, 5 తేదీల్లో ఈ విన్యాసాలను నిర్వహించారు. ఈ విన్యాసాల్లో భారత్ నావికాదళానికి చెందిన క్షిపణి విధ్వంసక నౌకలు రన్‌విజయ్‌శక్తి, ఆర్‌యూఎఫ్‌ఎన్ నౌకలు పాల్గొన్నాయి. క్రాస్‌డెక్ ఫ్లయింగ్, ఫైరింగ్, తదితర విన్యాసాలు విజయవంతంగా నిర్వహించారు. ఇంద్ర పేరుతో 2003 ఏడాది నుంచి భారత్, రష్యాలు నేవీ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా 11వ ఎడిషన్ విన్యాసాలను విజయవంతంగా పూర్తి చేశాయి. భారత్-చైనా సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్-రష్యా నౌకలు తమ యుద్ధప్రావీణ్యం పరీక్షించుకోవడం ప్రాధాన్యత సంతరించకుంది.

ఇరాన్ రక్షణ మంత్రి హటామితో రాజ్‌నాథ్ చర్చలు
ఇరాన్ రక్షణ మంత్రి జనరల్ అమీర్ హటామితో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో సెప్టెంబర్ 5న జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ భద్రతతోపాటు అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. రాజ్‌నాథ్ రష్యాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని ఇరాన్‌కు వచ్చారు.
పాక్ చెరలో 19మంది భారతీయులు
అక్రమ ప్రవేశం, గూఢచర్యం నేరాలపై రెండు నెలల క్రితం 19మంది భారతీయులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసి వివిధ జైళ్లలో ఉంచామని పాకిస్తాన్ అధికారులు తెలిపారు. అలాగే ఇద్దరు బంగ్లాదేశీయులను అరెస్టు చేశామని, 2020, నవంబర్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టేదాకా వీరు జైల్లోనే ఉంటారని సెప్టెంబర్ 7న పేర్కొన్నారు.
ఖల్సా ఉగ్రవాదులు అరెస్టు..
సిక్కు ఉగ్రవాద సంస్థ బబ్బర్‌ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన ఇద్దరిని సెప్టెంబర్ 7న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని భూపేందర్ అలియాస్ దిలావర్ సింగ్, కుల్వంత్ సింగ్‌గా గుర్తించారు.

45 ఏళ్ల తరువాత చైనా సరిహద్దుల్లో కాల్పులు
సరిహద్దుల్లో తరచుగా ఉద్రిక్తతలు సృష్టిస్తూ.. భారత్‌ను కవ్విస్తున్న చైనా మరోసారి తెంపరితనం చూపింది. సెప్టెంబర్ 7న తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సు సరిహద్దుల్లో భారత దళాలకు హెచ్చరికగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) గాలిలో కాల్పులు జరిపి దుస్సాహసానికి తెగబడింది. సరిహద్దు ఘర్షణల సమయంలో కాల్పులకు పాల్పడకూడదన్న ఒప్పందాన్ని ఉల్లంఘించింది. 1975 నాటి ఘర్షణల అనంతరం చైనా సరిహద్దుల్లో కాల్పుల ఘటన చోటుచేసుకోవడం ఇదే ప్రథమం. పీఎల్‌ఏ గాలిలో కాల్పులు జరిపాయని, సరిహద్దుల్లోని భారత్ పోస్ట్‌ను స్వాధీనం చేసుకునేందుకు విఫలయత్నం చేశాయని సెప్టెంబర్ 8న భారతీయ సైన్యం ప్రకటించింది. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను దాటి వచ్చి భారత దళాలే కాల్పులు జరిపాయన్న చైనా ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. చైనా బలగాలే కాల్పులు జరిపాయని స్పష్టం చేసింది.
ఆర్టికల్ 6 ప్రకారం...
1988లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు 3,500 కి.మీ పొడవునా ఉన్న భారత్-చైనా సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం పరస్పరం విశ్వాసం పాదుకొల్పే చర్యలుకు తొలుత శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 1993, 1996, 2005, 2012, 2013లో పలు ఒప్పందాలు జరిగాయి. 1996లో జరిగిన ఒప్పందంలో ఆర్టికల్ 6 ప్రకారం ఇరుపక్షాలు వాస్తవాధీన రేఖ వెంబడి 2 కి.మీ. వరకు కాల్పులు, పేలుళ్లకు పాల్పడకూడదు. స్వీయనియంత్రణ పాటిస్తూ సమస్యను శాంతి యుతంగా చర్చించుకోవాలి.

ఏ ప్రాంతంలోని సరిహద్దుల్లో సైన్యం సొరంగ మార్గాన్ని గుర్తించింది?
జమ్మూలోని సాంబా సెక్టార్‌లో గాలార్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ వైపు వెళుతున్న 170 మీటర్ల పొడవైన ఒక సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్‌ఎఫ్) కనుగొన్నాయి. 25 అడుగుల లోతు, 20 అడుగుల పొడవు, 3-4 అడుగుల వెడల్పున ఈ సొరంగ మార్గం ఉందని ఆగస్టు 29న సైన్యాధికారులు వెల్లడించారు. భారత్‌లోకి చొరబాట్లు, నార్కోటిక్ డ్రగ్‌‌స, ఆయుధాలు రవాణా చేయడం కోసమే పాకిస్తాన్ దీనిని నిర్మించిందని పేర్కొన్నారు. సరిహద్దుల నుంచి భారత్ భూభాగం వైపు 50 మీటర్ల దూరంలో ఈ సొరంగమార్గం ఉంది. ప్రస్తుతం బీఎస్‌ఎఫ్ డెరైక్టర్ జనరల్ రాకేశ్ ఆస్తానా ఉన్నారు.
చుషుల్‌లో చర్చలు...
సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌లో తాజాగా నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారత్, చైనా మరో దఫా సైనిక చర్చలు చేపట్టాయి. సరిహద్దులో భారత్ వైపున్న చుషుల్‌లో సెప్టెంబర్ 1న బ్రిగేడ్ కమాండర్ స్థాయి అధికారుల చర్చలు ప్రారంభమయ్యాయి. పాంగాంగ్ సరస్సు వద్ద యథాతథ స్థితిని కొనసాగించాలన్న నిర్ణయానికి తూట్లు పొడుస్తూ ఆగస్టు 31న చైనా మిలిటరీ దుస్సాహసానికి దిగింది. పెద్ద సంఖ్యలో చైనా బలగాలు భారత్ వైపునకు చొచ్చుకొని వచ్చి దురాక్రమణకు యత్నించాయి.
అందుకే వివాదాలు: చైనా మంత్రి
భారత్, చైనా సరిహద్దులో ఒకవైపు ఉద్రిక్తతలు నెలకొనగా మరోవైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా సరిహద్దుల్ని ఇంకా నిర్ణయించలేదని, అందుకే ఎప్పుడూ సమస్యలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు.

అక్టోబర్ 2020 సైన్స్ & టెక్నాలజీ

యాంటీ ట్యాంక్ గెడైడ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
లేజర్ కిరణాలతో నడిచే యాంటీ ట్యాంక్ గెడైడ్ క్షిపణి (ఏటీజీఎం) ప్రయోగం మరోసారి విజయవంతమైంది. మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని కేకే రేంజ్‌లో అక్టోబర్ 1న చేపట్టిన ఈ ప్రయోగంలో దూరంగా ఉన్న లక్ష్యాన్ని ఏటీజీఎం సమర్థంగా ఛేదించిందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) తెలిపింది. 2020, సెప్టెంబర్ 22న ఏటీజీఎంతో నిర్వహించిన తొలి పరీక్ష కూడా సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
120 ఎంఎం రైఫిల్డ్ గన్ ద్వారా...
ఏటీజీఎం టాండెమ్ హీట్ వార్‌హెడ్ సాయంతో పేలుళ్లకూ లొంగని విధంగా తయారైన వాహనాలపై దాడి చేస్తుంది.

  • 1.5 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

ప్రస్తుతం దీన్ని ఎంబీటీ అర్జున్ ట్యాంకులోని 120 ఎంఎం రైఫిల్డ్ గన్ ద్వారా పరీక్షిస్తున్నారు.

శౌర్య క్షిపణి పరీక్ష విజయవంతం
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చేపట్టిన హైపర్ సోనిక్ మిసైల్ శౌర్య పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ కాంప్లెక్స్ 4 నుంచి అక్టోబర్ 3న ఈ ప్రయోగం జరిగింది. ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించగల ఈ క్షిపణి 10 మీటర్ల పొడవు, 74 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉండి, 6.2 టన్నుల బరువు ఉంటుంది. 700 నుంచి 1,000 కిలోమీటర్ల దూరాల్లోని లక్ష్యాలను ఛేదించగలదు. 200 నుంచి 1,00 కేజీల పేలోడ్ ను తీసుకెళ్లగలదు. అణు సామర్థ్యం గల ఈ క్షిపణిని పూర్తి దేశీయ పరిజ్ఙానంతో అభివృద్ధి చేశారు.

స్మార్ట్ వ్యవస్థ పరీక్ష విజయవంతం
దేశీయంగానే అభివృద్ధి చేసిన సూపర్‌సానిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో(స్మార్ట్) వ్యవస్థను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. శత్రు దేశాల సబ్‌మెరైన్లను మెరుపు వేగంతో ధ్వంసం చేసే ఈ అత్యాధునిక టార్పెడో పరీక్షను ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఉన్న ఉన్న ఏపీజే అబ్దుల్‌కలాం ఐలాండ్(వీలర్ ఐలాండ్)లో అక్టోబర్ 5న నిర్వహించారు. స్మార్ట్తో భారత నావికాదళం సామర్థ్యం మరింత పెరిగిందని రక్షణ శాఖ తెలియజేసింది. యాంటీ-సబ్‌మెరైన్ యుద్ధ తంత్రంలో ఇదొక కీలక మలుపు అని డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
రెండు ఆయుధ వ్యవస్థల అనుసంధానమే...
సూపర్ సోనిక్ క్షిపణులు, టార్పెడోలు.. ఈ రెండు ఆయుధ వ్యవస్థలను అనుసంధానం చేసి అత్యంత శక్తిమంతమైన టార్పెడోను రూపొందించారు. ఈ వ్యవస్థలో ఓ క్షిపణి తక్కువ బరువుండే టార్పెడోను మోసుకెళుతుంది. ఇది లక్ష్యానికి సమీపం వరకు గాలిలో అతి తక్కువ ఎత్తులో దూసుకెళ్లి, సబ్‌మెరైన్ దగ్గరకు వెళ్లగానే టార్పెడోను నీటిలోకి వదులుతుంది. తర్వాత క్షణాల్లో అది శత్రువుల సబ్‌మెరైన్‌ను ధ్వంసం చేస్తుంది. టార్పెడో రేంజ్ కంటే ఎక్కువ దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించేందుకు స్మార్ట్ను రూపొందించారు. యుద్ధ నౌకలు, తీరంలోని ట్రక్‌ల నుంచి కూడా దీనిని ప్రయోగించవచ్చు.
600 కి.మీ.పైగా దూరం...
ప్రపంచంలో ఇప్పటి వరకు టార్పెడో ప్రయాణించే గరిష్ఠ దూరం సుమారు 50 కి.మీ. రాకెట్‌కు అనుసంధానించిన టార్పెడోలు 150 కి.మీ వరకు వెళతాయి. స్మార్ట్ విధానంలో 600 కి.మీ.పైగా టార్పెడో దూసుకెళుతుంది. క్షిపణులు మోసుకెళ్లే టార్పెడో వ్యవస్థలు అమెరికా, రష్యా, చైనా వద్ద కూడా ఉన్నాయి. అమెరికా ఉపయోగించే ఆస్‌రాక్ వ్యవస్థలో టార్పెడో 25 కి.మీపైగా దూరం ప్రయాణిస్తుంది.

దేశీ డెవలపర్ల కోసం మినీ యాప్ స్టోర్ ఆవిష్కరించిన సంస్థ?
కొద్ది రోజుల క్రితం నిబంధనల ఉల్లంఘన పేరుతో తమ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించిన టెక్ దిగ్గజం గూగుల్‌తో తలపడేందుకు దేశీ ఈ-కామర్స్ చెల్లింపుల సంస్థ పేటీఎం సిద్ధమయి్యంది. ఇందులో భాగంగా తాజాగా దేశీ డెవలపర్ల కోసం ఆండ్రాయిడ్ మినీ యాప్ స్టోర్‌ను అక్టోబర్ 5న ఆవిష్కరించింది. తమ యాప్‌లో అంతర్గతంగా మినీ-యాప్స్‌ను లిస్టింగ్ చేయడానికి ఎటువంటి చార్జీలు ఉండబోవని తెలిపింది. ప్రస్తుతం ఈ యాప్ స్టోర్ బీటా వెర్షన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు పేర్కొంది.
పేటీఎం వ్యవస్థాపకుడు ఎవరు?
ప్రతీ భారతీయ యాప్ డెవలపర్‌కూ సాధికారత కల్పించేలా పేటీఎం మినీ యాప్ స్టోర్ ఆవిష్కరించడం సంతోషకరమైన విషయం అని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు.

అక్టోబర్ 2020 అవార్డ్స్

సీఎస్‌ఐఆర్ రూరల్ డెవలప్‌మెంట్ అవార్డు విజేత?
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్త(ఐఐసీటీ) డాక్టర్ ఎస్.శ్రీధర్‌కు సీఎస్‌ఐఆర్ అవార్డ్ ఫర్ ఎస్ అండ్ టీ ఇన్నోవేషన్స్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్(సీఏఐఆర్‌డీ) అవార్డు లభించింది. ఐఐసీటీలోని ప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీధర్ 2017కిగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో తాగునీటి శుద్ధి కోసం శ్రీధర్ అభివృద్ధి చేసిన నానోఫిల్ట్రేషన్ రివర్స్ ఆస్మాసిస్ యంత్రాలను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఫ్లోరోసిస్ నివారణకు శ్రీధర్ చేసిన కృషి ప్రశంసలు అందుకుంది.

ఎంపీ సంతోష్‌కుమార్‌కు గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం
గ్రీన్ చాలెంజ్ ద్వారా పచ్చదనం పెంపు కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం వరించింది. మహాత్మా గాంధీ 150వ జన్మదినం సందర్భంగా గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ (జీ కాట్) ప్రతినిధులు ఈ అవార్డును అక్టోబర్ 1న సంతోష్‌కుమార్‌కు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు హరితహారంలో భాగంగా చేపట్టిన గ్రీన్ చాలెంజ్‌కు దేశ, విదేశాల నుంచి మద్దతు లభించిందని ఎంపీ సంతోష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ అవార్డును సీఎం కేసీఆర్‌కు అంకితం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

స్వచ్ఛ భారత్‌లో ఏపీకి మూడు జాతీయ అవార్డులు
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పారిశుధ్య కార్యక్రమాలు అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో మూడు అవార్డులు దక్కించుకుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మొత్తం మూడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా మూడింటిలోనూ ఏపీ అవార్డులు సాధించింది.
కార్యక్రమాల అమలును పరిశీలించి...
స్వచ్ఛ భారత్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 2019, నవంబర్ 1 నుంచి 2020, సెప్టెంబర్ 15 వరకు మూడు విడతల్లో మూడు వేర్వేరు కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది.
ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌లో రెండో స్థానం...
ఎక్కువ గ్రామాల్లో కమ్యూనిటీ మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంతోపాటు వాటి రోజువారీ నిర్వహణ సమర్థవంతంగా కొనసాగిస్తున్నందుకు స్వచ్ఛ సుందర్ సముదాయిక్ శౌచాలయ్ (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్) కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కించుకుంది.
  • గ్రామాల్లో చెత్త, ఇతర వ్యర్థాలు నివాస ప్రాంతాల మధ్య లేకుండా పరిశుభ్రంగా ఉంచడంలో అమలు చేసిన కార్యక్రమాలకు గందగీ ముక్త్ భారత్ (జీఎంబీ), సముదాయిక్ శౌచాలయ్ అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) కేటగిరీల్లో మూడో స్థానం సాధించింది.


2020 ఏడాదికి కౌశలాచార్య అవార్డును కేంద్రం ఏ సంస్థకు ప్రదానం చేసింది?
కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక కౌశలాచార్య అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ)కు ప్రదానం చేసింది. ఉపాధి-శిక్షణ అనే అంశంలో విశేష కృషి చేసినందుకు గాను ఏపీఎస్‌ఆర్టీసీకి ఈ అవార్డు దక్కింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) కౌశలాచార్య అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు కింద ప్రశంసా పత్రం, మెమెంటోను అందిస్తారు.
ప్రొఫెసర్ సతీష్‌ధవన్ పుస్తకావిష్కరణ
ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ అక్టోబర్ 5న బెంగళూరులోని అంతరిక్ష ప్రధాన కార్యాలయంలో ప్రొఫెసర్ సతీష్ ధవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రొఫెసర్ సతీష్ ధవన్‌పై ప్రచురించిన ఇన్ గ్లోరియస్ మెమొరీ ఆఫ్ ప్రొఫెసర్ సతీష్‌ధవన్ అనే పుస్తకాన్ని శివన్ ఆవిష్కరించారు.

2020 ఏడాదికి వెద్యశాస్త్ర నోబెల్ అవార్డును గెలుచుకున్న శాస్ర్తవేత్తలు?
హెపటైటిస్ - సీ వైరస్‌ను గుర్తించినందుకు అమెరికన్ శాస్త్రవేత్తలు హార్వీ జే.ఆల్టర్, ఛార్లెస్ ఎం. రైస్‌లతోపాటు బ్రిటిష్ శాస్త్రవేత్త మైకేల్ హౌటన్‌లకు 2020 ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు లభించింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా రక్తం ద్వారా వ్యాపించే హెపటైటిస్ గురించి ప్రపంచానికి తెలిసిందని, హెపటైటిస్ ఏ, బీల ద్వారా ఈ విషయం తెలియరాలేదని నోబెల్ కమిటీ అక్టోబర్ 5న స్టాక్ హోమ్‌లో అవార్డును ప్రకటించిన సందర్భంగా వ్యాఖ్యానించింది. వీరి పరిశోధనల ఫలితంగా హెపటైటిస్-సీ గుర్తింపులకు కొత్త రక్త పరీక్షలు, వైద్యానికి కొత్త మందులు అందుబాటులోకి వచ్చి లక్షల మంది ప్రాణాలు నిలిచాయని తెలిపింది. అవార్డు కింద బంగారు పతకం, కోటి స్వీడిష్ క్రోనార్లు (రూ.8.22 కోట్లు) నగదు లభిస్తుంది. అవార్డు గ్రహీతలు ముగ్గురూ నగదు బహుమతిని సమానంగా పంచుకుంటారు.
ఏమిటీ హెపటైటిస్-సీ
హెపటైటిస్-సీ వైరస్ కారణంగా కాలేయానికి వచ్చే ఆరోగ్య సమస్య పేరిది. రక్తం, వీర్యం, శరీర ద్రవాల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది. అకస్మాత్తుగా కనిపించి కొన్ని వారాల్లో తగ్గిపోవడం ఒకరకమైన హెపటైటిస్-సీ వ్యాధి లక్షణమైతే...కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీసి కేన్సర్‌కు, కొన్ని సందర్భాల్లో మరణాలకూ దారితీసే క్రానిక్ హెపటైటిస్-సీ రెండో రకం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఏటా అరవై లక్షల నుంచి కోటి కొత్త కేసులు నమోదవుతూంటాయి. అంతేకాకుండా.. ఏడాదికి 4 లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంటోంది ఈ మహమ్మారి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. 95 శాతం మందికి ఈ వ్యాధి సోకినట్లు కూడా తెలియకపోవడం.
ఎవరికి సోకే అవకాశం?
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ హెపటైటిస్-సీ వ్యాధి ప్రభావం ఉన్నప్పటికీ అమెరికా, యూరప్‌లలో కొంచెం ఎక్కువ కేసులు నమోదవుతూంటాయి. సురక్షితం కాని శృంగారం, స్టెరిలైజ్ చేయని ఇంజెక్షన్లను వాడటం, మాదక ద్రవ్యాల వాడకం (ఇంజెక్షన్ల రూపంలో) ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే అవకాశమూ ఉంటుంది. వైరస్‌ను గుర్తించిన తరువాత చికిత్స ప్రారంభిస్తే 3 నుంచి ఆరు నెలల్లో 90 శాతం మందికి నయమయ్యే అవకాశం ఉంది. ఈ నిశ్శబ్ధ మహమ్మారిపై ప్రజల్లో అవగాహనను పెంచేందుకు ఏటా జూలై 28న వరల్డ్ హెపటైటిస్-సీ డేగా జరుపుకుంటారు.

2020 ఏడాదికి భౌతికశాస్త్ర నోబెల్ గెలుచుకున్న శాస్త్రవేత్తలు?
కాంతిని కూడా తనలో లయం చేసుకోగల అపారశక్తి కేంద్రం కృష్ణబిలంపై మన అవగాహనను మరింత పెంచిన బ్రిటిష్ శాస్త్రవేత్త రోజర్ పెన్‌రోజ్, జర్మనీకి చెందిన రైన్‌హార్డ్ గెంజెల్, అమెరికన్ శాస్త్రవేత్త ఆండ్రియా గేజ్‌లకు 2020 ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డు దక్కింది. అవార్డు కింద అందే నగదు బహుమతిలో సగం పెన్‌రోజ్‌కు దక్కనుండగా మిగిలిన సగం మొత్తాన్ని గెంజెల్, గేజ్‌లు చెరిసగం పంచుకుంటారని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 6న ప్రకటించింది.
వాస్తవిక ప్రపంచంలోనూ భాగం...
కృష్ణబిలం ఏర్పడటం ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి ప్రబల ఉదాహరణ అని గుర్తించినందుకు పెన్‌రోజ్‌కు అవార్డు లభించింది. మన పాలపుంత మధ్యలో అతి భారయుతమైన, తక్కువ ప్రాంతాన్ని ఆక్రమించిన ఖగోళ వస్తువును గుర్తించి నందుకుగాను రైన్‌హార్డ్ గెంజెల్, ఆండ్రియా గేజ్‌లకు అవార్డు దక్కింది. ఒకప్పుడు కేవలం కాల్పినిక కథలకు మాత్రమే పరిమితమైన కృష్ణ బిలాలు వాస్తవిక ప్రపంచంలోనూ భాగమని ఈ ముగ్గురి పరిశోధనలు స్పష్టంగా తెలియజేశాయని అకాడమీ సెక్రటరీ జనరల్ గోరన్ కే హాన్సన్ పేర్కొన్నారు.
సూర్యుడికి 40 లక్షల రెట్లు...
బ్రిటన్ శాస్త్రవేత్త రోజర్ పెన్‌రోజ్ గణిత శాస్త్రం ఆధారంగా కృష్ణ బిలాలు ఏర్పడే అవకాశాలను రూఢి చేశారు. గెంజెల్, గేజ్‌లు ఇరువురు మన పాలపుంత మధ్యభాగంలో దుమ్ముతో కూడిన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ పలు నక్షత్రాలు తిరుగుతున్నప్పటికీ వర్ణించేందుకు వీలుకాని సంఘటనలు ఏవో చోటు చేసుకుంటున్నట్లు తెలుసుకున్నారు. తదుపరి పరిశోధనల ద్వారా ఆ ప్రాంతం ఓ భారీ కృష్ణబిలమని మన సూర్యుడికి 40 లక్షల రెట్లు ఎక్కువ బరువు ఉందని గుర్తించారు.
విశ్వంలో అతి పెద్ద కృష్ణబిలం పేరు?

  • విశాల విశ్వంలో అక్కడక్కడ ఉండే అదృశ్య ప్రాంతాలు. కంటికి కనిపించవు సరికదా.. చుట్టూఉన్న ఖగోళ వస్తువులన్నింటినీ తమలోకి ఆకర్షించుకుంటూ ఉంటాయి. ఇవి ఎంతటి శక్తిమంతమైనవి అంటే... విశ్వంలోనే అత్యంత వేగంగా ప్రయాణించగల కాంతిని కూడా తమలో కలిపేసుకోగలవు.
  • సూర్యుడి లాంటి భారీ నక్షత్రాలు తమలోని ఇంధనం మొత్తాన్ని ఖర్చు పెట్టేసిన తరువాత తమలో తాము కుప్పకూలిపోతూ కృష్ణబిలాలుగా మారతాయని అంచనా.
  • పాలపుంతలతోపాటే కృష్ణబిలాలు కూడా ఏర్పడతాయని శాస్త్రవేత్తల అంచనా.
  • కృష్ణబిలాల్లోకి ప్రవేశించిన పదార్థం ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఐన్‌స్టీన్ తరువాత అంతటి వాడుగా ప్రఖ్యాతి పొందిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంచనా ప్రకారం... కృష్ణబిలాల్లోకి ప్రవేశించిన పదార్థం అన్ని వైపుల నుంచి లాగబడుతుంది. దీన్నే హాకింగ్ స్పాగెటిఫికేషన్ అని పిలిచారు. కృష్ణ బిలానికి ఆవల ఏముందో కూడా ఎవరికీ తెలియదు.
  • 1960లో జాన్ ఆర్చీబాల్డ్ వీలర్ కృష్ణ బిలాలకు ఆ పేరు పెట్టారు.
  • ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించిన తొట్టతొలి కృష్ణబిలం పేరు సైగ్నస్ ఎక్స్-1.
  • సూర్యుడు.. ఇంధనమంతా ఖర్చయిపోయి కుప్పకూలిపోయినా కృష్ణబిలంగా మారేంత పెద్దది కాదు.
  • భూమికి అతిదగ్గరగా ఉన్న కృష్ణబిలం పేరు వీ616 మోనోసెరోటిస్. దాదాపు మూడు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇది.
  • విశ్వంలో అతి పెద్ద కృష్ణబిలం ఎన్‌జీసీ 4889. నిద్రాణంగా ఉన్న ఈ కృష్ణబిలం ఎప్పుడు చైతన్యవంతమై చుట్టూ ఉన్న దుమ్ము ధూళి, కాంతులను లయం చేసుకుంటుందో ఎవరికీ తెలియదు.
  • సౌర కుటుంబం ఉన్న పాలపుంత మధ్యలో ఉన్న అతి భారీ కృష్ణబిలం పేరు సాగిటరియస్ -ఏ. 40 లక్షల సూర్యుళ్లు ఒక్కదగ్గర చేరితే ఉండేంత బరువు ఉంటుంది ఇది. భూమికి 27 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

2020 ఏడాదికి రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి గెలుచుకున్న శాస్త్రవేత్తలు?
జన్యువులను మనకు అవసరమైన రీతిలో కచ్చితంగా కత్తిరించేందుకు క్రిస్పర్ క్యాస్-9 అనే నూతన పద్ధతి(జెనెటిక్ సిజర్స్)ని ఆవిష్కరించిన ఫ్రాన్స్ శాస్త్రవేత్త ఎమ్మాన్యుల్ షార్పెంటైర్, అమెరికన్ శాస్త్రవేత్త జెన్నిఫర్ ఏ డౌడ్నాలకు 2020 ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 7న స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. అవార్డులో భాగంగా ఒక బంగారు పతకం, కోటి క్రోనార్లు (రూ.8.23 కోట్లు) నగదు అందిస్తారు. నగదును 51 ఏళ్ల షార్పెంటైర్, 56 డౌడ్నా చెరిసగం పంచుకోనున్నారు. రసాయన శాస్త్ర నోబెల్‌ను ఇద్దరు మహిళలు పంచుకోవడం ఇదే తొలిసారి.
క్రిస్పర్ క్యాస్-9...
జన్యు సంబంధిత వ్యాధుల చికిత్సతోపాటు అనేక ఇతర ప్రయోజనాలు కలిగిన ఈ పద్ధతిని క్రిస్పర్ క్యాస్-9 అని పిలుస్తారు. ఎయిడ్‌‌స తదితర వ్యాధులకు కారణమైన జన్యువులను సులువుగా తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. షార్పెంటైర్, డౌడ్నాల పరిశోధనల ఫలితంగా జన్యుక్రమంలోని లోపాలను సులువుగా సరిదిద్దవచ్చునని, అయితే ఈ టెక్నాలజీని చాలా జాగరుకతతో ఉపయోగించాల్సి ఉంటుందని రసాయన శాస్త్ర నోబెల్ కమిటీ అధ్యక్షులు క్లేస్ గుస్తాఫ్‌సన్ హెచ్చరించారు.
క్రిస్పర్ క్యాస్-9 కథ ఇదీ...
పరిణామ క్రమంలో వైరస్‌ల దాడి నుంచి రక్షించుకునేందుకు బ్యాక్టీరియా ఓ శక్తిమంతమైన పరిజ్ఞానాన్ని తన సొంతం చేసుకుంది. దీన్నే క్రిస్పర్ అని పిలుస్తారు. వైరస్ దాడి చేసినప్పుడు దాన్ని జన్యుక్రమంలో బాగా గుర్తించగలిగే కొంత భాగాన్ని బ్యాక్టీరియా తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. భవిష్యత్తులో అదే వైరస్ మళ్లీ దాడి చేస్తే.. ఈ మెమరీ కార్డు సాయంతో గుర్తించేందుకన్నమాట. ఒకసారి గుర్తించిందనుకోండి.. తనలోని మెమరీ కార్డుకు ఓ ఎంజైమ్ (క్యాస్ 9)ను జత చేసి కొత్తగా దాడి చేసిన వైరస్‌పైకి ప్రయోగిస్తుంది. ఇది కాస్తా... వైరస్ జన్యుక్రమంలోకి చేరిపోవడమే కాకుండా.. దాన్ని ముక్కలుగా కత్తిరిస్తుంది.
మనిషికి విపరీతమైన హాని కలిగించే స్ట్రెప్టోకాకస్ పయోజీన్స్ బ్యాక్టీరియాపై పరిశోధనలు చేస్తున్న క్రమంలో ఎమ్మాన్యుల్ షార్పెంటైర్ అందులో అప్పటివరకూ గుర్తించని ఓ అణువు ఉన్నట్లు గుర్తించారు. ఈ ట్రాకర్‌ఆర్‌ఎన్‌ఏ పురాతన బ్యాక్టీరియా రోగ నిరోధక వ్యవస్థలో భాగమని తెలిసింది. దీనిపై 2011లో షార్పెంటైర్ తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. అదే ఏడాది ఆర్‌ఎన్‌ఏపై అనుభవమున్న జెన్నిఫర్‌తో కలిసి పరిశోధనలు చేపట్టారు. ఇరువురూ ఆ ప్రక్రియను కృత్రిమంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేసి విజయం సాధించారు. సులువుగా పనిచేసేలా, ఏ రకమైన జన్యుపదార్థంతోనైనా పనిచేసేలా మార్చారు. అవసరమైతే మనుషులతోపాటు జంతువులు, మొక్కల జన్యువుల్లోనూ మార్పులు చేసేలా అన్నమాట. డీఎన్‌ఏ పోగులను అవసరమైనట్లుగా కత్తిరించడంతోపాటు జోడించే శక్తినీ ఈ పద్ధతికి వీరు చేర్చారు. 2012లో క్రిస్పర్ క్యాస్-9 పద్ధతిని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించగా.. శాస్త్రవేత్తలు ఇప్పటికే దీనిద్వారా ఎన్నో అద్భుతమైన ఫలితాలు రాబట్టగలిగారు.
ప్రయోజనాలు ఇవీ...

  • ఎయిడ్స్ తదితర వ్యాధులకు కారణమైన జన్యువులను సులువుగా తొలగించేందుకు ఈ క్రిస్పర్‌క్యాస్-9 ఉపయోగపడుతుంది.
  • మలేరియా వంటి వ్యాధులను నిరోధించగల జన్యువులను దోమల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవచ్చు.
  • చైనాలో పాడిపశువుల్లో కండరాలు, వెంట్రుకల ఎదుగుదలను నిరోధించే జన్యువులను క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా తొలగించి ఎక్కువ మాంసం, బొచ్చు పెరిగే గొర్రెలను అభివృద్ధి చేశారు.
  • కేన్సర్‌కు సరికొత్త చికిత్స కల్పించేందుకు క్రిస్పర్ క్యాస్-9 పరిజ్ఞానాన్ని వాడుకునే ప్రయత్నం జరుగుతోంది. రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాల్లో మార్పులు చేయడం ద్వారా అవి కేన్సర్ కణాలను మరింత సమర్థంగా గుర్తించడంతోపాటు, నాశనం చేసేలా చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.
  • కరవు కాటకాలను, చీడపీడలను తట్టుకోగల సరికొత్త వంగడాల సృష్టికి క్రిస్పర్ క్యాస్-9 బాగా ఉపయోగపడుతుంది.
  • ఒక రకమైన ఈస్ట్‌లో జన్యుపరమైన మార్పులు చేసి అవి చక్కెరలను హైడ్రోకార్బన్లుగా మార్చేలా చేయవచ్చు. ఈ హైడ్రోకార్బన్లతో ప్లాస్టిక్‌ను తయారు చేయవచ్చు.
  • మానవ జన్యుక్రమాల్లోనూ మార్పులు చేసేందుకు ఈ టెక్నాలజీని వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ దీనిపై పలు దేశాల్లో నిషేధం కొనసాగుతోంది. యూకేలో మానవ పిండాలపై మాత్రమే ప్రయోగాలు చేయవచ్చు.

అక్టోబర్ 2020 స్పోర్ట్స్

విండీస్ మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితులైన బౌలింగ్ దిగ్గజం?
రాబోయే రెండు ప్రపంచకప్ (వన్డే, టి20)లకు సన్నద్ధం... జట్టును మెరుగుపర్చడం కోసం బౌలింగ్ దిగ్గజం కోట్నీ వాల్ష్‌ను 2022 వరకు వెస్టిండీస్ మహిళల జట్టు హెడ్ కోచ్‌గా నియమించారు. గతంలో వాల్ష్ బంగ్లాదేశ్ పురుషుల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. 2020 ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో జరిగిన టి20 మహిళల ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ అమ్మాయిల బృందానికి తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించాడు. 57 ఏళ్ల వాల్ష్ టెస్టు క్రికెట్లో 519 వికెట్లు తీసిన కరీబియన్ బౌలర్‌గా ఘనత వహించాడు. వన్డేల్లో 227 వికెట్లు తీసిన వాల్ష్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో కూడా స్థానం దక్కించుకున్నాడు.

ఫార్ములావన్ నుంచి వైదొలుగనున్నట్లు ప్రకటించిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ?
అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్‌ఐఏ)-ఫార్ములావన్ నుంచి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా వైదొలగనుంది. ప్రఖ్యాత రెడ్‌బుల్, ఆల్ఫాటౌరీ జట్లకు ఇంజిన్లను సరఫరా చేస్తోన్న జపాన్ కంపెనీ హోండా... 2021 సీజన్ ముగింపు నాటికి ఫార్ములావన్ (ఎఫ్1) నుంచి వైదొలగనున్నట్లు అక్టోబర్ 2న ప్రకటించింది. పర్యావరణానికి కీలకమైన కార్బన్ న్యూట్రాలిటీని 2050 నాటికి సాధించాలనే లక్ష్యానికి కట్టుబడినందువల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టకహిరో హాచిగో వెల్లడించారు.
ఏథెన్స్ మారథాన్ రద్దు
కరోనా వైరస్ విజృంభణ కారణంగా.. ఎంతో చరిత్ర ఉన్న ఏథెన్స్ మారథాన్‌ను 2020 ఏడాది నిర్వహించడం లేదని గీస్ ట్రాక్ సమాఖ్య (జీటీఎఫ్) తెలిపింది. షేడ్యూల్ ప్రకారం నవంబర్ 8న ఈ పరుగు జరగాల్సి ఉంది.

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో తొలిసారి సెమీఫైనల్ చేరిన క్వాలిఫయర్?
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్ దశకు చేరిన తొలి క్వాలిఫయర్‌గా అర్జెంటీనాకి చెందిన నదియా పొడొరోస్కా రికార్డు నెలకొల్పింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో అక్టోబర్ 6న జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 131వ ర్యాంకర్ పొడొరోస్కా 79 నిమిషాల్లో 6-2, 6-4తో మూడో సీడ్, ప్రపంచ ఐదో ర్యాంకర్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది. ఈ క్రమంలో 23 ఏళ్ల పొడొరోస్కా ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి క్వాలిఫయర్‌గా నిలిచింది. అలాగే 2004 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి అర్జెంటీనా క్రీడాకారిణిగా నిలిచింది. చివరిసారి అర్జెంటీనా తరఫున 2004లో పౌలా సురెజ్ ఈ ఘనత సాధించింది.

అక్టోబర్ 2020 వ్యక్తులు

నాగాలాండ్ మాజీ గవర్నర్ అశ్వనీ కుమార్ కన్నుమూత
సీబీఐ మాజీ డెరైక్టర్, నాగాలాండ్ మాజీ గవర్నర్, అశ్వనీ కుమార్ (69) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిమ్లాలోని ఆయన స్వగృహంలో అక్టోబర్ 7న ఉరి వేసుకొని మరణించారని అధికారులు చెప్పారు. ఆయన గదిలో సూసైడ్ నోట్ లభించింది. జీవితంపై విరక్తి చెందినట్లు సూసైడ్ నోట్‌లో రాశారు. 1973 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అశ్వనీ కుమార్ 2008లో సీబీఐ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసు విచారణకు నేతృత్వం వహించారు. 2013లో అప్పటి యూపీఏ హయాంలో నాగాలాండ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.

20 ఏళ్ల పరిపూర్ణ ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో ప్రభుత్వాధినేతగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. పదమూడు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఏడు సంవత్సరాలు ప్రధానిగా, మొత్తం 20 ఏళ్ళ పాటు ఎన్నికైన ప్రభుత్వాధినేతగా మోదీ రికార్డు సృష్టించారు. 2001, అక్టోబర్ 7న మోదీ మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోదీ విజయవంతంగా 6941 రోజులు పూర్తి చేసుకున్నారని బీజేపీ పేర్కొంది.

ఎస్‌బీఐ నూతన చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నూతన చైర్మన్‌గా ఎస్‌బీఐ సీనియర్ మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న దినేష్ కుమార్ ఖరా నియమితులయ్యారు. ప్రస్తుతం ఎస్‌బీఐ చైర్మన్‌గా ఉన్న రజనీష్‌కుమార్ మూడేళ్ల పదవీ కాలం అక్టోబర్ 6న ముగిసిపోయింది. దీంతో రజనీష్ స్థానంలో ఖరాను మూడేళ్ల కాలానికి లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నియమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఢిల్లీ వర్సిటీ పూర్వ విద్యార్థి...
దినేష్ ఖరా 2016 ఆగస్ట్‌లో ఎస్‌బీఐ ఎండీగా మూడేళ్ల కాలానికి తొలుత నియమితులయ్యారు. ఆయన పనితీరు ఆశాజనకంగా ఉండడంతో రెండేళ్ల పొడిగింపు పొందారు. ఎస్‌బీఐ గ్లోబల్ బ్యాంకింగ్ డివిజన్ హెడ్‌గానూ పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ఫాకుల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ పూర్వ విద్యార్థి అయిన ఖరా.. 1984లో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ అధికారిగా చేరి ప్రతిభ ఆధారంగా పదోన్నతులను పొందారు.